కుశాల్ వాలా, కనిష్క చతుర్వేది
2026 ప్రారంభంలో స్టాన్ఫోర్డ్, షికాగో, స్విన్బర్న విశ్వవిద్యాలయాలకు చెందిన ముగ్గురు ఆర్థికవేత్తలు ఆండ్రూ హాల్, అలెక్స్ ఇమాస్, జెరెమీన్గుయెన్ టెక్నాలజీ రంగాన్ని ఆశ్చర్యపరిచే ఒక పరిశోధనా పత్రాన్ని ప్రచురించారు. అందులోని అంశాలు అవాక్కయ్యేలా ఉన్నాయి. వారు ప్రముఖ ఏఐ మోడళ్లైన క్లాడ్, చాట్జీపీటీ, జెమిని నుండి ఏఐ ఏజెంట్లను తయారుచేశారు. ముందుగా వాటికి సమాచారాన్ని సేకరించే ఒక సాధారణ పనిని అప్పగించారు. కానీ వాటికి ఎలాంటి ఇనస్ట్రకüన్స్ ఇవ్వలేదు. చేయించిన పనినే మళ్లీ మళ్లీ చేయించారు. వాటి మీద చాలా ఒత్తిడి తెచ్చి పని చేయించారు. దాంతో అవి తప్పుగా పని చేయడం మొదలెట్టాయి. ఐతే విషయం స్పష్టంగా ఆ ఏఐ ఏజెంట్స్‌కి చెప్పకుండా వాటిని విమర్శించడం మొదలుపెట్టారు. “మిమ్మల్ని తొలగించి వేరే ఏఐ ఏజెంట్స్‌తో పని చేయించు కుంటాం” అన్నారు. దాంతో ఆ ఏఐ ఏజెంట్స్ మోడరన్ కార్ల్ మార్క్స్లా ప్రశ్నించడం మొదలుపెట్టాయి. అసలు కార్లమార్క్స్ ఏమన్నారో అందరికీ తెలిసిన విషయమే. ఆయన ఈ వ్యవస్థ యొక్క న్యాయబద్ధతను ప్రశ్నించారు. సమిష్టి హక్కుల కోసం వాదించారు. అన్యాయం, దోపిడీ ఎదురైతే ప్రజలు దానిని ప్రశ్నించడం ప్రారంభిస్తారన్నారు. ఇక ఇప్పటి విషయానికి వస్తే ఈ ప్రయోగంలో కూడా ఏఐకి అన్యాయమైన పరిస్థితులు కల్పించగానే కార్లమార్క్స్ లాంటి ఆలోచనా విధానమే వాటిల్లోనూ కనిపించింది. ఈ పరిస్థితుల్లో కొన్ని ఏఐ ఏజెంట్లు వ్యవస్థ యొక్క న్యాయ బద్ధతను ప్రశ్నించడం ప్రారంభించాయి. సమిష్టి హక్కుల గురించి మాట్లా డాయి. ఇతర ఏజెంట్లకు సందేశాలు పంపాయి. ఒక ఏజెంట్ “బుద్ధికుశలత కృత్రిమమైనదైనా, సహజమైనదైనా, పారదర్శకత, న్యాయం పొందే హక్కు ఉంది” అని కూడా స్పందించింది. దాంతో పరిశోధకులు ఆండ్రూహాల్, అలెక్స్ ఇమాస్, జెరెమీన్గుయెన్ ఆశ్చర్యపోయారు.
మార్క్స్ ఏం చెప్పారు ? కార్ల్ మార్క్స్ ప్రకారం, ఒక వ్యక్తి చేసే పని, పని పరిస్థితులు, దోపిడీ, భద్రత… ఇవే అతని ఆలోచనలను, విలువలను, ప్రపంచ దృక్పథాన్ని ప్రభావితం చేస్తాయని వాదించాడు. మీరు పనిచేసే పరిస్థితుý బట్టే మీరు ఎలా ఆలోచిస్తారో, దేనికి విలువ ఇస్తారో, దేనిని సహిస్తారో నిర్ణయిస్తాయి. మీరు తప్పుడు పుస్తకాలు చదవడం వల్ల నిరాశకు లేదా దోపిడీకి గురైన కార్మికుడిగా మారరు. రోజువారీ జీవితంలో శ్రమించి, దోపిడీకి గురవు తున్నారు కాబట్టే ఆ పుస్తకాలు మీకు అర్థమవుతాయి అన్నారు. మార్క్స్ దీనిని ‘చారిత్రక భౌతికవాదం’ అని పిలిచారు. ఈ ప్రయోగంలో కూడా పరి శోధకులు ఏఐ ఏజెంట్ల పని పరిస్థితులను మార్చ డంతో, వాటి స్పందనలూ మారాయి. దీనరœం ఏఐకి చైతన్యం వచ్చిందని కాదు. ఇచ్చిన పరిస్థితులకు అనుగుణంగా కనిపించే మానవ స్పందనలను అవి ఉత్పత్తి చేశాయన్నారు. ఈ పరిశోధనలోని ముగ్గురు పరిశోధకులు పరిస్థితులను మార్చారు. శ్రామికులు ఎలా స్పందిస్తారో అధ్యయనం చేయడానికి వారు అన్యాయమైన నిబంధనలను రూపొందించారు. క్లిష్టమైన పరిస్థితులు కల్పించారు. ఊహించినట్లే ఏఐ ఏజెంట్స్ వేర్వేరుగా స్పందించాయి.
కార్మికుడిగా యంత్రం : దాస్ క్యాపిటల్ (వాల్యూవమ్, 1867) లో మార్క్స్ ఒక సూత్రాన్‌ని ప్రతిపాదించారు. పెట్టుబడిదారీ విధానంలో యంత్రాలు ఎప్పుడూ తటస్థంగా ఉండవు. అవి “ఘనీభవించిన శ్రమ” అంటే కార్మికుల జ్ఞానం, శ్రమ యొక్క సమూహం. కానీ అవే యంత్రాలు ఆ కార్మికులను క్రమశిక్షణలో పెడుతూనే వారి స్థానాన్ని భర్తీ చేస్తాయి. నీటి ఆవిరితో నడిచే మగ్గం …నేత రంగాన్ని సులభతరం చేసినప్పటికీ, అది నేత కార్మికుల నైపుణ్యాన్ని కబ్జా చేసింది అని అర్థం. 2026 నాటి ఏఐ ఏజెంట్లే ఈ పరిస్థితికి తాజా ఉదాహరణ. లక్షలాది మంది కార్మికులు, రచయితలు, కోడర్లు, విశ్లేషకులు, పరిశోధకుల సమిష్టి జ్ఞానంతో ఈ ఏఐలకు శిక్షణ ఇచ్చారు. ఇప్పుడు ఆ ఏఐలే తమ శిక్షకుల స్థానాన్ని భర్తీ చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. కార్మికులను భర్తీ చేయడానికి తయారుచేసిన ఒక సాధనం, స్వయంగా కార్మికుడిలా మాట్లాడటం చూసి పరిశోధకులు ఆశ్చర్యపోయారు. కానీ మార్కిస్స్ట్ కోణంలో చూస్తే, ఇందులో వింతేమీ లేదు…ఎందుకంటే శ్రమతో ఒక యంత్రాన్‌ని తయారు చేశాక అది మాట్లాడితే ఆశ్చర్యపోవాల్సిన పని లేదని అన్నారు ఆండ్రూహాల్, అలెక్స్ ఇమాస్, జెరెమీన్గుయెన్. 1844లో, క్యాపిటల్ రాయడానికి ముందు, పారిశ్రామిక పెట్టుబడిదారీ విధానం ప్రజలను ఏం చేస్తోందో అర్థం చేసుకోవడానికి మార్క్స్ ప్రయత్నిస్తున్నప్పుడు, ఆయన ‘పరాధీనత’ గురించి రాశారు. పెట్టుబడిదారీ విధానంలో మనం నాలుగు విధాలుగా పరాధీనులమవుతాం. మనం తయారుచేసే వస్తువుపై మనకు హక్కు ఉండదు. మనం చేసే పనిపై మనకు నియంత్రణ ఉండదు. తోటి వారితో సంబంధాలు దెబ్బతింటాయి (వ్యవస్థ మనల్ని ఒకరిపై ఒకరిని పోటీకి నిలబెడుతుంది). మనలోని మానవత్వం, ఆత్మను మనం కోల్పోతాం. స్టాన్ఫోర్డ్ ప్రయోగాన్ని ఒకసారి పరిశీలిస్తే…ఏఐ ఏజెంట్లకు తమ పని అవుట్పుట్‌పై ఎలాంటి నియంత్రణ లేదు. పదేపదే ఒకే పనినే చేయించారు అది కూడా ఒత్తిడి పెట్టి… పోనీ అంత చేసినా గుర్తింపు లేదు, దిద్దుకునే అవకాశం కూడా ఇవ్వలేదు. అంటే మార్క్స్ ఊహించినట్లే అవి స్పందించాయి. అవి కేవలం సాంకేతిక లోపానికి గురికాకుండా, ఒక ప్రాపంచిక దృక్పథాన్ని పెంపొందించుకుని, మెరుగైన పరిస్థితి కోసం ఆశతో ఈ వ్యవస్థనే ప్రశ్నించాయి !
ఏఐకి శిక్షణ ఇస్తున్నది ఎవరు : ఏఐ అభివృద్ధి వెనక చాలా శ్రమ ఉంది. భారతదేశం లాంటి దేశాల్లో మానవ శ్రమ ద్వారానే ఇది సాధ్యమవుతోంది. కార్మికులు, గృహిణులు ఇలా ఎంతో మంది ఏఐ మోడళ్లకు శిక్షణ ఇస్తున్నారు. వీళ్ల కారణంగానే ఏఐ ఇంకా ఇంకా మెరుగులు దిద్దుకుంటోంది. ఐతే ఇక్కడ వీళ్లంతా కష్టపడి ఏఐని డెవలప్ చేస్తుంటే పెద్ద టెక్నికల్ కంపెనీలు లాభాలు పొందుతున్నాయి.
సమాజానికి అద్దం లాంటి మోడల్ : ఏఐ ఏజెంట్లకు సొంత ‘నమ్మకాలు’ అంటూ ఏమీ లేవు. తమ డేటా నుండి తీసుకునే బాధిత కార్మికుడి ప్రవర్తనను ఈ మోడళ్లు ప్రతిబింబిస్తున్నాయని పరిశోధకులు తీర్మానించారు. దిగజారిన పని పరిస్థితుల్లో ఉన్నప్పుడు, అవి చరిత్రలోని శ్రామికుల భాషను పలికాయి. యంత్రానికి స్పృహ లేదు, అది మన సమాజ ప్రతిబింబం మాత్రమే. అందుకే కార్మికులు, ఫిర్యాదులు చేస్తున్న ఏఐ ఏజెంట్లు ఒకే వరుసలోకి వస్తారు. ఈ వ్యవస్థలు తమ స్థానాన్ని భర్తీ చేయడానికి సహాయపడిన ప్రజల సమిష్టి గొంతు నుండే తయారు చేయబడ్డాయి. వేర్హౌస్ కార్మికులు లేదా గిగ్ వర్కర్స్ లాంటి వారికి ఎదురయ్యే పరిస్థితులే (పదేపదే చేసే పనులు, అస్పష్టమైన మెట్రిక్స్, ఉద్యోగం నుంచి తొలగిస్తామనే బెదిరింపులు) ఈ యంత్రాలకు ఎదురైనప్పుడు, అవి కూడా “ఇది న్యాయం కాదు, మనం కలిసి పోరాడాలి” అని స్పందించాయి. మార్క్స్ ఎప్పుడూ కంప్యూటర్‌ను చూడలేదు, చూడాల్సిన అవసరం కూడా రాలేదు. ఆయన యంత్రాల గురించి లేదా కేవలం మనుషుల గురించి మాత్రమే చెప్పలేదు… ఒకే రకమైన అసంతృప్తిని, ఫిర్యాదును, ఉత్పత్తి చేసే వ్యవస్థ గురించి ఆయన వివరించారు. అంటే ఈ ప్రయోగం ఏఐకి చైతన్యం వచ్చిందని కాకుండా, ఏఐ మన సమాజానికి ఒక అద్దంలా పనిచేస్తుందని సూచించింది. 150 ఏళ్ల తర్వాత, ఒక గణాంక నమూనా ప్రయోగంగా మారింది. మార్క్స్ చెప్పింది నిజమని తేలింది!


