- దిల్లీలో ఇండియా ఐక్య సంఘటన భారీ ర్యాలీ – జ్ఞానేశ్ రాజీనామా చేయాలని డిమాండ్
- నినాదాలతో హోరెత్తిన దేశ రాజధాని – ప్రతిపక్ష ఎంపీలపైనా పోలీస్ జులుం
- ఈసీ కార్యాలయానికి వెళ్లకుండా అడ్డగింత… అరెస్టులు
- బారికేడ్లపై నిల్చుని రాహుల్ నిరసన – ఆకాశవాణి భవన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత
- 9 గంటల నిరసన అనంతరం రాహుల్, ప్రియాంక అరెస్టు
న్యూఢిల్లీ: ‘ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలి…ఎస్ఐఆర్ రద్దు చేయాలి…ప్రజస్వామ్యాన్ని కాపాడండి’ అంటూ ఇండియా ఐక్యసంఘటన నేతలు, ఎంపీల నినాదాలతో దేశ రాజధాని దిల్లీ హోరెత్తింది. ఎస్ఐఆర్ ప్రక్రియకు సంబంధించి ఎన్నికల సంఘం తీరుకు నిరసనగా మంగళవారం ఇండియా ఐక్యసంఘటన అధ్వర్యంలో ప్రతిపక్ష ఎంపీలు కదం తొక్కారు. పార్లమెంట్ భవనం మకర ద్వారం నుంచి ఎన్నికల సంఘం (ఈసీ) ప్రధాన కార్యాలయం (నిర్వచన్ సదన్) వరకు భారీ ప్రదర్శన చేపట్టారు. సీఈసీ జ్ఞానేశ్ కుమార్ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ దాదాపు 300 మంది ఎంపీలు ర్యాలీగా వెళ్లారు. అయితే ఆకాశవాణి భవన్, నీతి ఆయోగ్ కార్యాలయాల సమీపంలో భద్రతా బలగాలు బారికేడ్లు అడ్డుపెట్టి రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, కేసీ వేణుగోపాల్, అఖిలేశ్ యాదవ్‌తో పాటు ఇతర ఎంపీలను అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అనేకమంది ప్రతిపక్ష నేతలు, ఎంపీలను పోలీసులు అదుపులోకి తీసుకుని వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు. అదుపులోకి తీసుకున్న వారిలో సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు అభిషేక్ బెనర్జీ, కల్యాణ్ బెనర్జీ, డెరిక్ ఓబ్రెయిన్, కాంగ్రెస్ ఎంపీలు ఇమ్రాన్ మసూద్, పి.సంతోశ్, ఎ.రహీం తదితరులు ఉన్నారు. నిరసన తీవ్రతరం కావడంతో కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా కొంతమంది మద్దతుదారులతో కలిసి ఎన్నికల సంఘం ప్రధాన కార్యాలయానికి చేరుకునే ప్రయత్నంలో ఆకాశవాణి భవన్ ప్రాంగణంలోకి ప్రవేశించారు. అంతకుముందు ఎన్నికల సంఘం కార్యాలయం వైపు వెళ్తున్న రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా, ఇతర ఎంపీలను ఆకాశవాణి భవన్, నీతి ఆయోగ్ కార్యాలయాల సమీపంలో పోలీసులు అడ్డుకున్నారు. ముందుకు వెళ్లేందుకు అనుమతించకపోవడంతో నేతలు రోడ్డుపైనే బైఠాయించి నిరసన తెలిపారు. కొద్దిసేపటి తర్వాత రాహుల్ గాంధీ, టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీ పోలీసుల బారికేడ్లపైకి ఎక్కి నిరసన తెలిపారు. దీంతో అక్కడ ఉన్న కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ప్రియాంక గాంధీని అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు బస్సులోకి ఎక్కించినప్పటికీ… ఆమె వెంటనే బస్సు నుంచి దిగి తన సోదరుడు రాహుల్‌తో కలిసి ఆకాశవాణి భవన్ గేటు వద్దకు చేరుకున్నారు. పోలీసులు అడ్డుకున్నప్పటికీ రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, కాంగ్రెస్ ఎంపీ దీపేందర్ హుడా రిసెప్షన్ గేటు నుంచి ఆకాశవాణి భవన్ ప్రాంగణంలోకి ప్రవేశించారు. అనంతరం వారు అక్కడ చెట్టు కింద కూర్చొని నిరసన కొనసాగించారు. రాహుల్‌కు మద్దతుగా కాంగ్రెస్ నాయకులు, యువజన కాంగ్రెస్, ఎన్ఎస్యూఐ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో చేరుకోవడంతో వారిని పోలీసులు అడ్డుకున్నారు. ఆకాశవాణి భవన్ ప్రాంగణాన్ని ఖాళీ చేయడానికి రాహుల్, ప్రియాంక అంగీకరించలేదు. తాము ఎన్నికల సంఘం కార్యాలయానికి వెళ్లాల్సిందేనని పట్టుబట్టారు. డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ సచిన్ శర్మ భారీ సంఖ్యలో పోలీసు సిబ్బందితో అక్కడికి చేరుకుని నిరసన చేస్తున్న ప్రతిపక్ష నేతలను ప్రాంగణం నుంచి బయటకు పంపేందుకు ప్రయత్నించినప్పటికీ పట్టు వీడకుండా నిరసన కొనసాగించారు. ఈ క్రమంలో దాపుగా 9 గంటల నిరసన తర్వాత రాహుల్ గాంధీ, ప్రియాంకాగాంధీ, ఇతర ఎంపీలను పోలీసులు అరెస్ట్ చేశారు. రాత్రి 8.15 సమయంలో పోలీసులు అరెస్ట్ చేసి అక్కడి నుంచి తరలించారు. అరెస్టైన వారిలో చరణ్‌జిత్ సింగ్ చన్నీ, దీపేందర్ హూడా, పవన్ ఖేరా వంటి నేతలు ఉన్నారు.
‘బీజేపీయే సీఈసీ’… ‘ఓటు దొంగ, పదవి వదిలిపెట్టు’
జ్ఞానేశ్ కుమార్‌ను ఆర్ఎస్ఎస్ యూనిఫాంలో చూపించే కటౌట్లను ర్యాలీలో పాల్గొన్న ప్రతిపక్ష ఎంపీలు ప్రదర్శించారు. ‘బీజేపీయే సీఈసీ’, ‘ఓటు దొంగ… పదవి వదిలిపెట్టు’, ‘ప్రజాస్వామ్యం అమ్మకానికి కాదు’ వంటి నినాదాలు చేశారు. రాహుల్ గాంధీ సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్’లో ‘జ్ఞానేశ్.. ఇక అయిపోయింది బ్రో. రాజీనామా చేయాల్సిన సమయం వచ్చింది’ అని పోస్టు చేశారు.
భారీగా బలగాల మోహరింపు
ఇండియా ఐక్యసంఘటన మార్చ్ నేపథ్యంలో పార్లమెంట్ నుంచి నిర్వచన్ సదన్‌కు వెళ్లే మార్గాలన్నింటినీ పోలీసులు అధీనంలోకి తీసుకుని, బారికేడ్లు పెట్టి ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేశారు. ఈసీ కార్యాలయం, మంత్రుల నివాసాల వద్ద పారామిలిటరీ, బీఎస్ఎఫ్, సీఐఎస్ఎఫ్ బలగాలను మోహరించారు. అనేక ప్రాంతాల్లో ఇంటర్నెట్, మొబైల్ డేటా సేవలను సైతం నిలిపివేశారు. పార్లమెంట్, ఎన్నికల సంఘం ప్రధాన కార్యాలయం పరిసరాల్లో భారీగా భద్రతా బలగాలను మోహరించారు. ఎంపీలు రాకముందే భద్రతా సిబ్బంది, బారికేడ్లను ఏర్పాటు చేశారు.
పార్లమెంట్‌లోని మకర ద్వారం వద్ద ప్రతిపక్ష ఎంపీలు సమావేశమై అక్కడి నుంచి నిర్వాచన్ సదన్ వైపు ర్యాలీగా బయలుదేరారు. కాంగ్రెస్, ఎస్పీ, టీఎంసీ, సీపీఐ, సీపీఎం, ఇతర వామపక్షాలు, ఎన్సీ, శివసేన (యూబీటీ), ఆర్జేడీ, ఎన్సీపీ(ఎస్పీ)తో పాటు బిజూ జనతాదళ్ (బీజేడీ) ఎంపీలు కూడా నిరసన ర్యాలీలో పాల్గొన్నారు.


