ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం ఎవరిదైనా చట్టం అందరికీ ఒకేలా అమలుకావాలి. నిస్సాక్షికంగా అమలైనప్పుడే రాజ్యాంగ స్ఫూర్తి, ప్రజల విశ్వాసం నిలుస్తాయి. ప్రతి పౌరుడూ చట్టం ముందు సమానమేనని రాజ్యాంగం ప్రకటించింది. వ్యక్తి ఏ రాజకీయ పార్టీ వాడైనా, ఏ మతాన్ని విశ్వసించినా, అధికారానికి అనుకూలంగా వున్నా, వ్యతిరేకంగా వున్నా చట్టం ఒకేలా అమలు కావాలనేదే రాజ్యాంగ స్ఫూర్తి. ప్రజలు న్యాయవ్యవస్థపై వుంచే విశ్వాసం కూడా ఈ సూత్రంపైనే ఆధారపడి వుంటుంది. అయితే రాష్ట్రంలో ఇటీవల చోటుచేసుకున్న ప్రశ్న రావణ్ అరెస్టు ఉదంతం ఈ రాజ్యాంగ సూత్రాన్నే ప్రశ్నించే పరిస్థితిని తీసుకొచ్చింది. ప్రభుత్వం వెల్లడించిన వివరాల ప్రకారం హిడ్మాకు శ్రద్ధాంజలి ఘటించడం, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌పై విమర్శలు చేయడం, హిందూ మతాన్ని అవమానించే వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో పాటు రాజద్రోహం వంటి తీవ్రమైన సెక్షన్‌లను కూడా కేసులో చేర్చినట్లు తెలుస్తోంది. ఈ ఆరోపణల నిజానిజాలు, కేసులో నేరం రుజువవుతుందా లేదా అనేది న్యాయస్థానం నిర్ణయించాల్సిన అంశం. ప్రశ్న రావణ్ చేసిన వ్యాఖ్యలు చట్టవిరుద్ధమైనవని ప్రభుత్వం భావిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటే అసలు సమస్యే ఉండదు. భావప్రకటనా స్వేచ్ఛ పేరుతో మత విద్వేషాన్ని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినా, హింసను ప్రోత్సహించినా, చట్టాన్ని అతిక్రమించినా చర్యలు తప్పవు. అయితే ఈ ప్రమాణం అందరికీ వర్తిస్తుందా లేక ప్రభుత్వాన్ని విమర్శించే వారిపైనే కఠినంగా, అధికారానికి అనుకూలంగా ఉన్నవారి పైనే ఉదారంగా వ్యవహరిస్తుందా అనేదే ప్రజల్లో వస్తున్న ప్రశ్న. ఒకవేళ మత విశ్వాసాలను అవమానించడం చట్టరీత్యా శిక్షార్హమైన చర్య అయితే ఆ సూత్రం అన్ని మతాలకు సమానంగా వర్తించాలి. చట్టం హిందువును, క్రైస్తవుడిని, ముస్లింను విడిగా చూడదు. రాజ్యాంగం ఏ మతానికీ ప్రత్యేక హోదా ఇవ్వలేదు. మరి చట్టం అమలులో ఈ వ్యత్యాసం ఎందుకు కనిపిస్తోంది ? రాజకీయ విమర్శల విషయంలోనూ ఇదే ప్రశ్న ఎదురవుతోంది. గత ప్రభుత్వ హయాంలో మాజీ సీఎం వైఎస్.జగన్ మోహన్ రెడ్డి, మంత్రులు, ప్రజాప్రతినిధులపై పవన్ కళ్యాణ్ చేసిన విమర్శలు రాష్ట్ర రాజకీయాల్లో చర్చకు దారితీశాయి. అయితే అవి రాజకీయ విమర్శలుగానే పరిగణించారు. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం అడగాల్సిన ప్రశ్న “ఎవరు మాట్లాడారు ?” అనేది కాదు. “ఏం మాట్లాడారు ?” అనేదే. ఇదే సూత్రం అందరికీ వర్తింపజేయాలి. ఒక మతం విషయంలో వెంటనే స్పందించి, మరో మతం విషయంలో మౌనం పాటిస్తే, అది మత సామరస్యాన్ని కాపాడే విధానం అవదు చట్టం యొక్క నిష్పాక్షికతపై అనుమానాలు పెంచడమే అవుతుంది.
అలాగే రాజకీయ విమర్శల విషయంలోనూ ద్వంద్వ ప్రమాణాలకు తావుండకూడదు. చట్టం ఒక వ్యక్తిని లక్ష్యంగా చేసుకునే సాధనం కాదు. సమాజాన్ని రక్షించే వ్యవస్థ. అందుకే “ఈ వ్యక్తి మనవాడు”, “ఆ వ్యక్తి ప్రత్యర్థి” అనే ఆలోచన చట్టం అమలులోకి ప్రవేశించిన క్షణం నుంచే రాజ్యాంగ సమానత్వం బలహీనపడుతుంది. ప్రజాస్వామ్యంలో అధికారాన్ని విమర్శించే హక్కు రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక స్వేచ్ఛల్లో ఒకటి. అదే సమయంలో, ఆ స్వేచ్ఛకు బాధ్యత కూడా తోడుగా ఉంటుంది. విమర్శ పేరుతో వ్యక్తులను అవమానించడం, మతాలను కించపరచడం, సమాజంలో విద్వేషాన్ని రెచ్చగొట్టడం సమర్థనీయం కాదు. కానీ అలాంటి చర్యలపై చట్టం స్పందించే తీరు వ్యక్తిని బట్టి మారకూడదు. నేడు ప్రశ్న రావణ్‌పై అమలవుతున్న చట్టం, రాధామనోహర్ దాస్ , పవన్ కళ్యాణ్ వంటి వారు చేసిన వ్యాఖ్యలపైన ప్రభుత్వం అనుసరించిన ప్రమాణమే అమలవ్వాలి. ఇదే రాజ్యాంగం చెప్పే సమానత్వం. ఇదే ప్రజాస్వామ్యం కోరుకునే న్యాయం. ప్రభుత్వాలు భయంతో కాదు, న్యాయంతో గౌరవాన్ని సంపాదించాలి. ఈ వ్యవహారంలో మరో కీలక అంశం రాజద్రోహం వంటి తీవ్రమైన చట్టాల వినియోగం. దేశ సార్వభౌమత్వాన్ని, రాజ్యాంగ వ్యవస్థను కూలదోయడానికి చేసే కుట్రలు, సాయుధ తిరుగుబాట్లు, దేశ భద్రతకు నిజమైన ముప్పు కలిగించే చర్యల వంటి అసాధారణ పరిస్థితుల కోసం ఉద్దేశించిన చట్టాలను సాధారణ రాజకీయ వ్యాఖ్యలు లేదా వివాదాస్పద ప్రసంగాల సందర్భంలో ప్రయోగిస్తున్నారనే భావన ఏర్పడితే, అది ప్రజాస్వామ్యానికి ఆరోగ్యకరమైన పరిణామం కాదు. అసమ్మతిని అణచివేసిన ఏ వ్యవస్థా శాశ్వతంగా నిలబడలేదు.
ఈ వ్యాసం ప్రశ్న రావణ్‌ను సమర్థించడం లేదు. చట్టం సమానంగా అమలుకావాలని కోరుతోంది. ఒకవేళ ప్రశ్న రావణ్ చట్టాన్ని ఉల్లంఘించి ఉంటే, చట్టప్రకారం చర్యలు తీసుకోవాలి. వ్యక్తిగత రాజకీయ విమర్శలు చేసిన పవన్ కళ్యాణ్ వంటి నేతల విషయంలోనూ చట్టం ఒకే ప్రమాణంతో వ్యవహరించి వుంటే నేడు ఈ ప్రశ్నలు తలెత్తేవి కావు. రావణ్ హిడ్మాకు నివాళులర్పించడాన్ని రాజద్రోహంగా పేర్కొంటున్న ప్రభుత్వం నక్సలిజాన్ని పరోక్షంగానో, ప్రత్యక్షంగానో సమర్ధిస్తూ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల్లో కూడా కనిపిస్తాయి. ప్రజాస్వామ్యంలో న్యాయం అనేది కేవలం శిక్ష విధించడమే కాదు. శిక్ష విధించే విధానంలో సమానత్వాన్ని నిర్ధారించడం కూడా. ఒకే స్వభావం గల చర్యకు ఒకరిపై కఠిన చట్టాలు, మరొకరిపై మౌనం ఇది చట్టంపై ప్రజల విశ్వాసాన్ని బలపరచదు. చట్టం పట్ల గౌరవం పెరగాలంటే చట్టం ఎంపిక చేసుకుని కాకుండా సమానంగా అమలవుతోందనే నమ్మకం ప్రజల్లో కలగాలి. ప్రభుత్వాలు, పాలకులు, రాజకీయ సమీకరణాలు ఎప్పటికప్పుడు మారిపోతాయి. కానీ రాజ్యాంగం మారదు. చట్టం,న్యాయ ప్రమాణాలు మారకూడదు. ఏ ప్రభుత్వం వచ్చినా చట్టం ఒక్కటే అనే విశ్వాసం ప్రజల్లో నిలిచి ఉండాలి. ఒకే నేరానికి ఒకే చట్టం…ఒకే తప్పుకు ఒకే శిక్ష… ఒకే రాజ్యాంగానికి ఒకే న్యాయం. ఇదే ప్రజాస్వామ్యానికి అసలైన అర్థం.
సెల్ : 9705557367
ఒకే చట్టం…ఒకే న్యాయం…అదే ప్రజాస్వామ్యం
- Advertisement -


