Monday, April 21, 2025
Homeకమలానికి కప్పం

కమలానికి కప్పం

. రాజ్యసభ సీటు మళ్లీ బీజేపీకే?
. తమిళనాడు ఎన్నికల పేరుతో గాలం
. ఇప్పటికే ఒక ఎంపీ, ఎమ్మెల్సీ అప్పగింత
. ఇంకెన్ని పదవులిస్తారంటూ టీడీపీ సీనియర్‌ నేతల్లో ఆవేదన

విశాలాంధ్ర బ్యూరో – అమరావతి: వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన రాజ్యసభ స్థానం కూడా బీజేపీ ఖాతాలో పడబోతుం దన్న ప్రచారం సాగుతోంది. దీనిపై టీడీపీ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. త్వరలో తమిళనాడు శాసనసభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆ రాష్ట్రానికి చెందిన బీజేపీ నేత అన్నామలైను ఏపీ కోటాలో రాజ్యసభకు ఎన్నిక చేయాలన్నది బీజేపీ వ్యూహంగా చెపుతున్నారు. దక్షిణాది రాష్ట్రాల్లో బలహీనంగా ఉన్న బీజేపీని బలోపేతం చేసేందుకు ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్‌షా విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. దీనిలో భాగంగానే వారికి ఉన్న ప్రతి చిన్న అవకాశాన్నీ సద్వినియోగం చేసుకుంటున్నారు. ఏపీలో బలమైన పార్టీగా ఉన్న టీడీపీ కేంద్ర ప్రభుత్వంలోనూ భాగస్వామిగా ఉంది. ప్రస్తుతం ఏపీ అప్పుల ఊబిలో కూరుకుపోవడమే గాక, గత పాలన విధ్వంసంతో తీవ్రంగా నష్టపోయింది. ముఖ్యంగా రాష్ట్రానికి అత్యంత కీలకమైన అమరావతి రాజధాని, పోలవరం ప్రాజెక్టులను పూర్తి చేసుకోవాల్సి ఉంది. దీనికి కేంద్ర ప్రభుత్వ సహాయం తప్పనిసరి. దీనిని ఆసరా చేసుకొని బీజేపీ… టీడీపీ ద్వారా జరిగే రాజకీయ లబ్ధిని అందిపుచ్చు కుంటోంది. రాష్ట్రవ్యాప్తంగా ఏ ఒక్క ప్రాంతంలోనూ బీజేపీ సింగిల్‌గా పోటీ చేసి వార్డు మెంబరు కూడా గెలవలేని దయనీయ పరిస్థితి. ఈ విషయం ఆ పార్టీ నేతలతో పాటు రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. అయిన ప్పటికీ గత ఏడాది జరిగిన సార్వ త్రిక ఎన్నికల్లో టీడీపీ, జనసేనతో జరిగిన ఎన్నికల పొత్తును సద్వినియోగం చేసుకుంటూ 11 శాసనసభ, 6 ఎంపీ సీట్లు బీజేపీ తీసుకుంది. వీటిలో మూడు లోక్‌సభ స్థానాల్లో బీజేపీ ఓటమి పాలైంది. వాస్తవానికి బీజేపీ వల్లే ఆ మూడు స్థానాలను టీడీపీ కోల్పోయినట్లు అందరికీ తెలుసు. వైసీపీ అభ్యర్థులను గెలిపించడం కోసమే ఎక్కువ సీట్లు బీజేపీ డిమాండ్‌ చేస్తుందన్న ప్రచారం అప్పట్లో సాగింది. ఏదిఏమైనా అధికారంలోకి రావడం, వైసీపీని ఓడిరచడమే లక్ష్యంగా టీడీపీ అధినేత చంద్రబాబు బీజేపీకి సీట్లు కేటాయింపు వ్యవహారంలో ఉదారంగా వ్యవహరించారు. కేంద్ర ప్రభుత్వం అండ లేకుండా అమరావతి, పోలవరం పూర్తి చేయలేమని, రాష్ట్రాన్ని గాడినపెట్టలేమని భావించారు. ఇదేవిషయాన్ని టీడీపీ సీనియర్‌ నేతలతో చెప్పి సీట్ల సర్దుబాటుకు సహకరించాలని కోరారు. అంతవరకు బాగానే ఉంది. ఆ తర్వాత కూడా బీజేపీ బ్లాక్‌మెయిల్‌ రాజకీయాలకు పాల్పడుతూ… ఖాళీ అయిన ప్రతి స్థానాన్ని తనకు కావాలని మంకుపట్టు పడుతూ కీలక పదవులు తన్నుకుపోతుండడంపై టీడీపీ నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. చివరకు నామినేటెడ్‌ పోస్టుల్లోనూ బీజేపీ వాటా కోరుతోంది. ఇటీవల వైసీపీకి చెందిన ఆర్‌.కృష్ణయ్య ఆ పార్టీకి, ఎంపీ పదవికి రాజీనామా చేసి తెలంగాణ బీజేపీలో చేరారు. ఆయనను వెంటనే ఏపీ కోటా నుంచి ఎన్నుకోవల్సిందిగా బీజేపీ అధిష్ఠానం కోరింది. దీంతో టీడీపీకి వచ్చిన గొప్ప అవకాశం చేజారింది. ఆ తర్వాత ఇటీవల ఎమ్మెల్సీ పదవికీ బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు సోము వీర్రాజును ఆఖరి నిముషంలో తెరపైకి తెచ్చి వత్తిడి తెచ్చారు. దానికీ టీడీపీ అధిష్ఠానం తలొగ్గింది. ఆ పదవి రేసులో అప్పటివరకు తమకు దక్కుతుందని ఆశతో ఎదురుచూసిన టీడీపీ సీనియర్‌ నేతలు తీవ్ర నిరాశ, నిస్ఫృహకు గురయ్యారు. ఇప్పుడు తాజాగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన స్థానాన్ని కూడా బీజేపీ గద్దలా తన్నుకుపోయే పరిస్థితి ఏర్పడిరది. త్వరలో తమిళనాడు శాసనసభ ఎన్నికలు జరగనున్న దృష్ట్యా ఆ రాష్ట్రానికి చెందిన బీజేపీ నేత అన్నామలైను ఏపీ నుంచి రాజ్యసభకు పంపాలని కమలనాథులు సీఎం చంద్రబాబును కోరినట్లు తెలిసింది. ప్రస్తుతం కుటుంబసభ్యులతో విదేశీ ప్రయాణం పూర్తి చేసుకుని దిల్లీకి చేరుకున్న సీఎం చంద్రబాబు మంగళవారం హోంమంత్రి అమిత్‌షాతో భేటీ కానున్నారు. దాదాపు ఈ భేటీలో రాజ్యసభ స్థానంపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని బీజేపీ నేతలు పేర్కొంటుండగా, టీడీపీ అధిష్ఠానం ఉదాసీన వైఖరిపై ఆ పార్టీ శ్రేణుల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. బీజేపీకి ఇలా ఎంతకాలం కప్పం కట్టాలని టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు