. దుష్ట పాలకులను గద్దె దించేది వామపక్షాలే
. ప్రజల్లో చైతన్యం తెచ్చేది లెఫ్ట్ పత్రికలే
. సన్నగిల్లుతున్న జర్నలిస్టుల విశ్వసనీయత: రేవంత్
విశాలాంధ్ర – హైదరాబాద్ : తప్పు చేసే పాలకులను గద్దె దించడంలో కమ్యూనిస్టులు ముందుంటారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో శుక్రవారం ‘‘నవ తెలంగాణ’’ దినపత్రిక 10వ వార్షికోత్సవం జరిగింది. ముఖ్య అతిథిగా విచ్చేసిన సీఎం మాట్లాడుతూ… కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కమ్యూనిస్టులు చేసిన ఉద్యమాలు ఎంతో దోహదపడ్డాయన్నారు. నిరంతరం ప్రజల పక్షాన నిలబడి పనిచేసే పత్రికా సంస్థలు కొన్ని మాత్రమే ఉంటాయని అందులో నవ తెలంగాణ ఒకటని పేర్కొన్నారు. ప్రస్తుతం పత్రికా సంస్థలు తమ విశ్వసనీయతను కోల్పోయే పరిస్థితి తలెత్తుతోందన్నారు. స్వాతంత్య్ర పోరాటంలో దేశ ప్రజలను ఏకతాటిపైకి తీసుకొచ్చేందుకు పత్రికలు ఉపయోగపడ్డాయని గుర్తు చేశారు. నాటి సాయుధ రైతాంగ పోరాటంలో, సామాజిక రుగ్మతలపై ప్రజలలో చైతన్యం తీసుకొచ్చేందుకు కమ్యూనిస్టుల అధ్వర్యంలో నిర్వహించిన పత్రికలు దోహదం చేశాయన్నారు. ఆ వారసత్వాన్ని కొనసాగిస్తూ… పాలకులు ఎవరైనా ప్రజల పక్షం నిలుస్తున్న పత్రికలు కమ్యూనిస్టు పత్రికలన్నారు. నేడు తమ సంపాదనను కాపాడుకోవడానికి, తప్పులను కప్పి పుచ్చుకునేందుకు కొన్ని రాజకీయ పత్రికలు పనిచేస్తున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. దీంతో జర్నలిస్టు అనే పదానికి అర్థం లేకుండా పోతోందని, జర్నలిజం ముసుగులో ఉన్న కొన్ని రాజకీయ పార్టీల పత్రికల తీరును ప్రజలు నిశితంగా గమనించాలని సూచించారు. జర్నలిజంలో ఓనమాలు తెలియనివారు కొంతమంది జర్నలిస్టు ముసుగు వేసుకుని సోషల్ మీడియా పేరుతో తిరుగుతున్నారని, దీన్ని అడ్డుకునేందుకు నిజమైన జర్నలిస్టులు సెమినార్లు నిర్వహించి జర్నలిస్ట్ పదానికి సరైన అర్థాన్ని చెప్పాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు. రాజకీయ నాయకుల విశ్వసనీయతలాగే జర్నలిస్టుల విశ్వసనీయత కూడా వేగంగా సన్నగిల్లుతోందని అభిప్రాయపడ్డారు. అందుకే నిజమైన జర్నలిస్టులు దీనికి ఒక లక్ష్మణ రేఖ గీయాల్సిన పరిస్థితి ఏర్పడిరదని, జర్నలిస్టుల ముసుగు తొడుక్కున్న వారిని మీరే వేరు చేయాల్సిన అవసరం ఉందని, లేకపోతే దేశ భద్రతకే ప్రమాదకరంగా మారే పరిస్థితి ఏర్పడుతుందని హెచ్చరించారు. కమ్యూనిస్టులు ఉప్పు లాంటి వారు… అది లేనిదే వంట రుచి ఉండదని, ప్రజా సమస్యలపై పోరాటంలో ఎర్రజెండా కనిపించిన్నప్పుడే అవి పరిష్కారం అవుతున్నాయన్నారు. ఆనాడైనా… ఈ నాడైనా కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి కమ్యూనిస్టుల సహకారం ఎంతో ఉందన్నారు. భవిష్యత్‌లోనూ ఇలాగే సహకారం కొనసాగాలని, కాంగ్రెస్- కమ్యూనిస్టులు కలిసి పని చేస్తే ప్రజలకు మరింత ప్రయోజనం ఉంటుందన్నారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బి.వి. రాఘవులు, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ, మాజీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి పాల్గొన్నారు.
ఈ-పాస్‌తో సచివాలయంలోకి ప్రవేశం… ప్రభుత్వ నిర్ణయం
రాష్ట్ర ప్రభుత్వం కొత్త విధానానికి శ్రీకారం చుట్టింది. ఈ నెల ఒకటో తేదీ నుంచి సచివాలయానికి సందర్శకుల ప్రవేశానికి విజిటర్ ఈ-పాస్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ అమలులోకి వచ్చింది. గత ప్రభుత్వ హయాంలో సచివాలయానికి సాధారణ ప్రజలు, మీడియా ప్రతినిధులు ప్రవేశానికి అనుమతి లభించలేదు. ప్రస్తుతం అధికారంలో ఉన్న రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజాపాలన సర్కారు అందరికీ సమాన అవకాశాలు కల్పిస్తూ, పారదర్శక పాలనకు పెద్దపీట వేసింది. ప్రజలు… మంత్రులు, అధికారులను కలవాలంటే ఈ-పాస్ ద్వారా సచివాలయంలోకి ప్రవేశించవచ్చు.


