Wednesday, January 14, 2026
Homeవిశ్లేషణకార్మిక వర్గ సైద్ధాంతిక మహోపాధ్యాయుడు ఏంగెల్స్‌

కార్మిక వర్గ సైద్ధాంతిక మహోపాధ్యాయుడు ఏంగెల్స్‌

- Advertisement -

ఎంసీ వెంకటేశ్వర్లు

భూస్వామిక పెట్టుబడి దారీ వర్గాల దోపిడీకి గురై దుర్భర జీవితాలు అనుభవిస్తున్న నిరుపేదలు, రైతన్నలు, శ్రామిక వర్గాల విముక్తికి ‘‘మార్క్సిజం’’ సిద్ధాంత ఆయుధాన్ని అందించిన మహోపా ధ్యాయులు మార్క్స్‌ఏంగెల్స్‌. వారిద్దరి సాన్నిహిత్యం నాలుగు దశాబ్దాలు అవిచ్ఛిన్నంగా కొనసాగింది. స్నేహితులుగా, విప్లవకారులుగా, మార్క్సిస్టు ఆలోచనఆచరణకు నిబద్ధులై వారు చేసిన కృషి ప్రపంచ మానవాళి విముక్తికి మార్గదర్శకంగా నిలిచింది. అందువలన వారిద్దరిని వేరుచేసి చూడటం సాధ్యంకాదు. ఏంగెల్స్‌ ప్రష్యా (నేటి జర్మనీ)లోని బర్మన్‌ నగరంలో 1820 నవంబరు 28న జన్మించారు. ఆయన తత్వవేత్త, రాజకీయ నాయకుడు, మార్క్సిస్టు విప్లవకారుడు. ఏంగెల్స్‌ తండ్రి పారిశ్రామికవేత్త అయినప్పటికీ విద్యార్థిగా ఉన్న రోజుల్లోనే నియంతృత్వ విధానాలు, కార్మికవర్గ దోపిడీ విధానాలను ద్వేషించేవారు. ప్రముఖ తత్వవేత్త, బెర్లిన్‌ విశ్వవిద్యాలయం ఆచార్యులుగా ఉన్న హెగెల్‌ భావాలకు అనుచరుడిగా ఉన్నారు. ఆనాటి పరిస్థితుల్లో హెగెల్‌ తత్వశాస్త్ర భావాలు విప్లవాత్మకంగా ఉన్నా భావవాదంతో కూడుకున్నాయి. బ్రిటన్‌లో పారిశ్రామిక విప్లవం చోటుచేసుకున్న నేపథ్యంలో మార్క్స్‌, ఏంగెల్స్‌ నాటి సామాజిక, ఆర్థిక పరిస్థితులను అధ్యయనం చేయసాగారు. భూమిని స్వాధీనం చేసుకుని, ఆస్తిని కూడబెట్టుకుని వ్యాపారం, పరిశ్రమలు ఏర్పాటు చేసుకున్న యజమానులు సుఖసంతోషాలతో ఉండగా, వారి దగ్గర పనిచేసి ఆకలిదప్పులతో చింపిరి గుడ్డలతో, వ్యాధిగ్రస్థులై జీవచ్ఛవాలుగా బతకడానికి కారణం ఏమిటని మార్క్స్‌, ఏంగెల్స్‌ ఆలోచించారు. అప్పటికే ఏంగెల్స్‌ ప్రకృతిమానవుడు, మానవ సంబంధాలు, సామాజిక పరిణామంపై అధ్యయనం మొదలుపెట్టాడు. మార్క్స్‌తో ప్రత్యక్ష సంబంధం లేకపోయినా ఉత్తరాల ద్వారా పరస్పరం తమ అభిప్రాయాలు పంచుకునేవారు. ఏంగెల్స్‌ 1842లో తన తండ్రి కంపెనీలో గుమాస్తాగా చేరి, లండన్‌లో స్థిరపడ్డారు. పారిశ్రామికవేత్త కుమారుడినని, కంపెనీలో ఉద్యోగం చేస్తున్నానని ఆలోచించకుండా ఇంగ్లాండులో కార్మికవర్గం నివసించే మురికివాడలలో తిరిగి, అక్కడి పరిస్థితులు అధ్యయనం చేశారు. లండన్‌, మాంచెస్టర్‌, యార్క్‌షైర్‌ మురికివాడలలో గృహవసతి లేక మురికికూపాలలో నివసిస్తున్న కార్మికులను ప్రత్యక్షంగా చూశారు. అనారోగ్యంతో, ఆకలితో బాధపడుతున్న చంటి పిల్లల దుస్థితిని చూసి చలించిపోయారు. కార్మికవాడలలో తన అనుభవాలను, ఆనాటి ప్రభుత్వ నివేదికలను, గణాంకాలతో సహా వివరిస్తూ 1845లో ‘ఇంగ్లాండులో కార్మికవర్గం స్థితి’ అనే గ్రంథం రచించి సంచలనం సృష్టించారు. సమాజానికి సంపద సృష్టించే శ్రామికవర్గం దుర్భర జీవితాలు, దరిద్రాన్ని ప్రామాణికంగా, హృదయవిదారకంగా చిత్రించిన ఈ గ్రంథం ప్రపంచ శ్రామికవర్గంపై ప్రగాఢమైన ప్రభావం కలుగజేసింది. సామాజిక, ఉత్పాదకశక్తుల సంబంధాలను లోతుగా పరిశీలించిన ఏంగెల్స్‌, హెగెల్‌ భావవాద ప్రభావం నుంచి బయటపడి భౌతికవాదిగా మారారు.
భౌతికవాద దృక్పథం కలిగిన మార్క్స్‌, ఏంగెల్స్‌ సామాజిక పరిణామక్రమాన్ని చారిత్రక భౌతికవాద దృక్పథంతో విశ్లేషణకు పూనుకున్నారు. శాస్త్రవిజ్ఞానం ఉచ్ఛస్థితికి అభివృద్ధి చెందిన ఈ రోజుల్లో కూడా సత్యసాయి బాబా అడుగుజాడల్లో నడవాలనీ, రామాలయంపై ఎగురుతున్న కాషాయ జెండా శ్రీరాముని సిద్ధాంతాలను ప్రపంచానికి చాటుతుందని దేశ ప్రధాని మోదీ అశాస్త్రీయ భావజాలాన్ని ప్రచారం చేస్తున్నారంటే 160 సంవత్సరాల క్రితం మార్క్స్‌ఏంగెల్స్‌... క్రిస్టియన్‌ మతాచార్యుల నుంచి ఎలాంటి ఒత్తిళ్లను ఎదుర్కొన్నారో అర్ధమవుతుంది. సమాజ పరిణామక్రమంలో భూములు, ఫ్యాక్టరీలు, యంత్రాలు తదితర సొంత ఆస్తులను కూడబెట్టుకుని ఆస్తిపాస్తులులేని అత్యధిక జనాభాను, అత్యల్ప సంఖ్యాకులు దోపిడీ చేయడాన్ని నిర్మూలించి సోషలిస్టు సమాజాన్ని నెలకొల్పాలన్న ధృడ సంకల్పంతో మార్క్స్‌ఎంగెల్స్‌ కృషి చేశారు. సొంత ఆస్తిపై ఏర్పడిన సామాజిక, ఉత్పత్తి సంబంధాలను బద్దలుకొట్టి సోషలిస్టు వ్యవస్థను ఏర్పాటు చేయడంలో కార్మికవర్గం అగ్రభాగాన ఉంటుందని సూత్రీకరించారు. ఆనాటి సామాజిక శాస్త్రవేత్తలు, ఉతారవాదులు, పెట్టుబడిదారీ ఆర్థికవేత్తలు ఒక పక్క, మతాధిపతులు మరో పక్క మార్క్సిస్టు సిద్ధాంతాన్ని, వర్గపోరాట దృక్పథాన్ని వ్యతిరేకిస్తూ పుంఖాను, పుంఖాలుగా రచనలు చేశారు. మార్క్స్‌ను పాలకవర్గాలు ఎక్కడా నివసించకుండా దేశ బహిష్కరణ చేశారు. బూర్జువావర్గ దోపిడీని, పెట్టుబడిదారీ సమాజంలో జరిగే ఘటనలను విమర్శిస్తూ శ్రామికవర్గ ప్రత్యక్ష కార్యాచరణను తోసిపుచ్చే కుహనా విమర్శలను మార్క్స్‌, ఎంగెల్స్‌ ఎండగట్టారు.
సమాజాన్ని అనేక కోణాల నుంచి విశ్లేషించిన తత్వవేత్తలు, ఆర్థికవేత్తలు శ్రామికవర్గ ప్రయోజనాలు, దోపిడీ వర్గాల మధ్య వర్గ వైరుధ్యాలను గుర్తించడంలో వైఫల్యం చెందారు. రాబర్ట్‌ ఒవెన్‌, సెయింట్‌సైమన్‌, ఛార్లెస్‌ పూరియర్‌ లాంటి ఊహాజనిత సోషలిస్టులు, వర్గపోరాటం లేకుండా సోషలిజం తీసుకురాగలమన్న వారి సిద్ధాంతాలను మార్క్స్‌, ఏంగెల్స్‌ తుత్తునియలు చేశారు. పెట్టుబడిదారీ సమాజంలో దోపిడీకి గురవుతున్న అత్యధిక ప్రజానీకానికి, దోపిడీకి పాల్పడుతున్న అత్యల్ప ప్రజానీకానికి మధ్య వైరుధ్యం పరిపక్వమైనప్పుడు సామాజిక విప్లవం వస్తుందని మార్క్స్‌ఏంగెల్స్‌ చేసిన సూత్రీకరణ చరిత్రలో రుజువైంది. రష్యన్‌ అక్టోబరు విప్లవం, చైనా, క్యూబా విప్లవాలు ఇందుకు సజీవ సాక్షులు. మార్క్స్‌`ఏంగెల్స్‌ సిద్ధాంతకర్తలే కాదు. ఆచరణవాదులు కూడా. ఏంగెల్స్‌ 1845, 1847 వరకు బ్రస్సెల్స్‌, పారిస్‌లో నివసిస్తూ అక్కడి కార్మికవర్గంతో ప్రత్యక్ష సంబంధాలు పెట్టుకున్నారు. అక్కడే మార్క్స్‌, ఏంగెల్స్‌ రహస్యంగా పనిచేస్తున్న జర్మన్‌ ‘కమ్యూనిస్టు లీగ్‌’తో సంబంధాలు పెట్టుకుని లీగ్‌ కోరిక మేరకు 1848లో ‘కమ్యూనిస్టు ప్రణాళిక’ను రచించారు. ఆ పుస్తకం నేటికీ ప్రపంచ కమ్యూనిస్టు ఉద్యమానికి, యావత్తు ప్రపంచ కార్మికోద్యమానికి మార్గదర్శిగా ఉన్నది.
ఏంగెల్స్‌ కమ్యూనిస్టు ఉద్యమానికి అంకితమైన మార్క్సిస్టు మేధావి. ప్రపంచ విప్లవోద్యమాలకు ప్రామాణికమైన ‘మార్క్సిజం’ సిద్ధాంతం రూపకల్పనలో మార్క్స్‌ సహచరుడుగా ఏంగెల్స్‌ కృషి చేసినా ఆ ఘనతను మార్క్స్‌కే కట్టబెట్టాడు. అసంపూర్తిగా మిగిలిన మార్క్స్‌ రచన ‘కాపిటల్‌’ను పూరించి, ప్రచురించడంలో ఏంగెల్స్‌ ఔదార్యం కొనియాడదగినది. సోషలిజం ఏ ఒక్క దేశానికో పరిమితమైనది కాదనీ సార్వత్రికమైనదని గుర్తించిన మేధావి. మార్క్స్‌ 1883 మార్చి 14న చనిపోయిన తరువాత ప్రపంచ కార్మికవర్గ ఐక్యతను కాపాడటంలో తనవంతు పాత్ర నిర్వహించారు. యూరోపియన్‌ సోషలిస్టులకు సలహాదారుడిగా, నాయకుడిగా కొనసాగారు. జర్మన్‌, స్పెయిన్‌, రొమేనియా, రష్యా వంటి దేశాల ప్రతినిధులు కూడా ఆయన సలహా కోసం, ఆదేశాల కోసం వస్తుండేవారనీ, వయోవృద్ధుడైన ఏంగెల్స్‌ మహత్తర జ్ఞాననిధిని దారాళంగా వినియోగించుకునే వారని లెనిన్‌ కొనియాడారు. సైద్ధాంతిక అవగాహన, విశేష జీవితానుభవం కలిగిన మహాయోధుడు, శ్రామికవర్గ మహోపాధ్యాయుడు అయిన ఏంగెల్స్‌ 1895 ఆగస్టు 5న లండన్‌లో తుదిశ్వాస విడిచారు. ఆయన సోషలిస్టు సైద్ధాంతిక బీజాలు పెరిగి ప్రపంచాన్ని ఆవరించాయి. నేటికీ కార్మిక, కర్షక, శ్రామికవర్గ విముక్తికి ఆదర్శంగా నిలిచాయి.

శుక్రవారం ఏంగెల్స్‌ 205వ జయంతి

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు