విద్యార్థుల విషయంలో రాజకీయాలు వద్దు : మంత్రి సీతక్క
విశాలాంధ్ర – హైదరాబాద్ : గతంలో ఎపుడు లేని విధంగా 16 సంవత్సరాల తర్వాత ఇందిరమ్మ ప్రభుత్వంలో కాస్మోటిక్ 212శాతం పెంచగా ఇందిరమ్మ రాజ్యంలో ప్రజా ప్రభుత్వంలో డైట్ చార్జెస్ ఏడేళ్ల తర్వాత 40 శాతం పెంచామని మంత్రి సీతక్క స్పష్టం చేశారు. సోమవారం శాసనసభలో జరిగిన డైట్ చార్జీలు, కాస్మోటిక్ చార్జీల పెంపు అమలపై మంత్రి సీతక్క వివరణ ఇచ్చారు. నేను కూడా ఎస్టీ గర్ల్స్ హాస్టల్ ములుగులో చదివానని, కానీ ఆనాడు అవకాశాలు తక్కువగా ఉన్నా ఎంతోమంది పట్టుదలగా చదువుకొని అత్యున్నత స్థానాల్లోకి వచ్చారన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు, ఓసీలలో కూడా పేదలు పెద్ద ఎత్తున హాస్టల్లోకి వస్తున్నారని, సరైన తిండి పౌష్టికాహారం లేకుంటే చదువుకునే టైంలో అర్థాకలితో కడుపు మాడుతుంటే చదువుకోవడం ఇబ్బందిగా ఉంటుందని ఆవేదన వ్యక్తంచేశారు. అందుకే పిల్లలకు మంచి పౌష్టికాహారం ఇవ్వాలన్న ఉద్దేశంతో పెద్ద ఎత్తున డైట్ చార్జీలు కాస్మోటిక్ చార్జీలు పెంచారన్నారు. పిల్లల భవిష్యత్తు మన చేతుల్లో ఉంది కాబట్టి విద్యకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు. విద్యార్థుల దేశ మానవ వనరులు అని కావున వారి జీవితాలను సమున్నతంగా పెంచేందుకు వాళ్ళ నాలెడ్జ్‌ను పెంచేందుకు పూర్తిస్థాయిలో బాధ్యత తీసుకొని చర్యలు చేపడుతున్నట్లు వెల్లడిరచారు. కక్షిత ఆహారం కల్తీ జరిగితే చర్యలు తీసుకుంటున్నామని, మన ఐఏఎస్ ఆఫీసర్లను నైట్ హాల్ట్ చేయిస్తున్నామని, అదేవిధంగా మంత్రులు ఎమ్మెల్యేలు కూడా హాస్టల్లో బస చేస్తున్నా రన్నారు. మంచి విద్య పౌష్టికాహారం అందించేందుకు కృషి చేస్తున్నామని, నాలుగు నెలల కాలంలో 499 కోట్లకుపైగా ఖర్చు చేశామని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం బడి పిల్లలకు స్కాలర్షిప్ లను రద్దు చేసిందని, ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్, నూతన విద్యా విధానమని పెద్దపెద్ద మాటలు చెప్పి విద్యార్థులకు అందే స్కాలర్‌షిప్‌ల విధానాన్ని రద్దు చేసిందని తెలిపారు. విద్యారంగం మీద కేంద్ర ప్రభుత్వ వైఖరి బొట్టుపసే తప్ప బోనం లేదన్నట్టుగా ఉందని దుయ్యబట్టారు. ప్రభుత్వ విద్య బలోపేతం కోసం కేంద్ర ప్రభుత్వం నిధులు పెంచాల్సిన అవసరం ఉందన్నారు. పేద మధ్యతరగతి కుటుంబీకులే ప్రభుత్వం మీద ఆధారపడతారు కాబట్టి కేంద్రం కూడా రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించాలన్నారు. అలాగే దుబ్బాక విద్యార్థి అస్వస్థతకు గురైతే హైదరాబాద్‌లోని నీలోఫర్‌కి తరలించి చికిత్స అందిస్తున్నామని అబ్బాయి కోలుకుంటున్నారని వివరించారు. గతంలో పెద్ద ఎత్తున కలుషిత ఆహార ఘటనలు జరిగాయని, ఈ విషయంలో రాజకీయాలు వద్దు… వాళ్ళ సంరక్షణ ముఖ్యం…. వారిని బలోపేతం చేస్తున్నామన్నారు. ఆశ్రమ పాఠశాలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని, ఆశ్రమ పాఠశాలలను కాలేజీలుగా అప్‌గ్రేడ్ చేస్తున్నట్లు తెలిపారు. మా ప్రభుత్వము అధికారంలోకి వచ్చిన తర్వాత ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ విద్యార్థుల విదేశీ విద్య కోసం 167 కోట్లు చెల్లించామన్నారు. పిల్లలను సరిగా పర్యవేక్షించని సిబ్బంది అధికారులపై చర్యలు ఉంటాయన్నారు. విద్యార్థులకు స్కాలర్షిప్పులు ఈ ప్రభుత్వం ఇవ్వకుంటే బాగుండు అని బిఆర్ఎస్ భావిస్తోందని ఎద్దేవా చేశారు. మేము స్కాలర్షిప్లు ఇవ్వకపోతే రాజకీయాలు చేయాలని బీఆర్ఎస్ చూస్తోందని దుయ్యబట్టారు. కానీ మేము బిఆర్ఎస్కు అవకాశం ఇవ్వమని, విద్యార్థులకు సంబంధించిన స్కాలర్షిప్లు, విదేశీ విద్యా నిధి పూర్తిగా చెల్లిస్తున్నమన్నారు.