. 10 రిజర్వాయర్లను నింపుతూ శ్రీశైలం నుంచి నదీ జలాలు
. నేడు జల హారతి ఇవ్వనున్న సీఎం చంద్రబాబు
విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : ఎట్టకేలకు సీఎం చంద్రబాబు కల నెరవేరింది. తన స్వంత నియోజకవర్గమైన కుప్పానికి కృష్ణా జలాలు తీసుకురావాలన్న సంకల్పం ఆచరణ రూపుదాల్చింది. గత నెల 17న కర్నూలు జిల్లా మల్యాల ఎత్తిపోతల నుంచి నీటిని విడుదల చేయగా, నాటి నుంచి హంద్రీనీవా కాలువల్లో దాదాపు 738 కి.మీ ప్రయాణించిన కృష్ణా జలాలు ప్రస్తుతం కుప్పానికి చేరాయి. తరలి వచ్చిన కృష్ణమ్మతో కుప్పం నియోజకవర్గ ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా పరమ సముద్రంలో సీఎం చంద్రబాబు శనివారం కృష్ణా జలాలకు హారతి ఇచ్చి, నియోజకవర్గ ప్రజలతో సంతోషాన్ని పంచుకోనున్నారు. హంద్రీ నీవాకు ఉమ్మడి రాష్ట్రంలో 1999 జులై 9 చంద్రబాబు శంకుస్థాపన చేశారు. 2014-19 మధ్య దాదాపు రూ.4,183 కోట్లు ఖర్చు పెట్టి చంద్రబాబు ప్రాజెక్టును పరుగులు పెట్టించారు. 2019లో అధికారంలోకి వచ్చిన గత ప్రభుత్వం ఈ ప్రాజెక్టును పక్కనబెట్టింది. మళ్లీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఈ సీజన్లో ఎలాగైనా నీళ్లు ఇవ్వాలన్న లక్ష్యంతో పనుల్లో వేగం పెంచారు. రికార్డు స్థాయిలో కేవలం 100 రోజుల్లోనే మెయిన్ కెనాల్ విస్తరణ, లైనింగ్ పనులు పూర్తి చేసి ప్రధాన కాలువ సామర్థ్యాన్ని 3,850 క్యూసెక్కులకు పెంచారు. హంద్రీనీవా ఆయకట్టులో చిట్ట చివరి జిల్లా చిత్తూరు. చిత్తూరు జిల్లాలో 16 లక్షల ఎకరాల సాగుభూమి ఉన్నా… కేవలం 6 లక్షల ఎకరాలకే నీరు అందుతోంది. మిగిలిన 10 లక్షల ఎకరాలకు నీరిస్తే… రైతన్నకు నీటి కొరతే ఉండదు. హంద్రీనీవా రెండో దశ పనులు పూర్తి చేయడం వల్ల జిల్లాలోని 2.20 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది. ఇప్పటివరకు చిత్తూరు జిల్లాలో సాగు అంతా బోర్లపైనే ఆధారపడి ఉంది. హంద్రీనీవాతో 565 కి.మీ. మేర ఉన్న పుంగనూరు, నీవా, తంబళ్లపల్లి, కుప్పం, చింతపర్తి, ఎల్లుట్ల, వాయల్పాడు, సదుం బ్రాంచ్ కాలువలతో 1,86,500 ఎకరాలకు సాగునీరు అందుతుంది. పీలేరు, పుంగనూరు, చంద్రగిరి, పూతలపట్టు, చిత్తూరు, జీడీ నెల్లూరు నియోజకవర్గాల ప్రజలకు దీంతో ప్రయోజనం కలుగుతుంది. ఈ ప్రాజెక్టు ద్వారా మొత్తంగా 6 లక్షల ఎకరాలకు సాగు నీరుతో పాటు 33 లక్షల మందికి తాగునీరు అందుతోంది. విస్తరించిన కాల్వల ద్వారా పరుగులు పెడుతున్న కృష్ణమ్మ 19 నియోజకవర్గాలను తాకుతూ 10 రిజర్వాయర్లను నింపుతోంది. కర్నూలు జిల్లాలో కృష్ణగిరి, పత్తికొండ, అనంతపురం జిల్లాలో జీడిపల్లి, పెన్నా అహోబిలం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లు నిండాయి. సత్యసాయి జిల్లాలో మారాల, గొల్లపల్లి, చెర్లోపల్లి… అన్నమయ్య జిల్లాలోని శ్రీనివాసాపురం, అడవిపల్లి రిజర్వాయర్లు నిండి గాజుల దిన్నెకు నీరు చేరింది.
215 క్యూసెక్కుల సామర్థ్యంతో కుప్పం బ్రాంచ్ కెనాల్
215 క్యూసెక్కుల సామర్థ్యంతో 123 కి.మీ. పొడవున కుప్పం బ్రాంచ్ కెనాల్ నిర్మించారు. రూ.197 కోట్లతో కాలువ లైనింగ్ పనులు పూర్తి చేశారు. పలమనేరు, కుప్పం నియోజకవర్గాల్లోని 8 మండలాల్లో ఈ కాలువ వెళుతోంది. ఈ కాలువ ద్వారా 4 లక్షల జనాభాకు తాగు నీరు ఇవ్వడమే కాకుండా… 110 చెరువులు నింపడం ద్వారా 6,300 ఎకరాల స్థిరీకరణ జరుగుతుంది. సుమారు 40 టీఎంసీల నీటిని ఒక్క హంద్రీనీవా ప్రాజెక్టు ద్వారా రాయల సీమ జిల్లాలు వినియోగించుకోనున్నాయి. చెరువులన్నీ నింపే కార్యక్రమాన్ని ప్రభుత్వం ఇప్పటికే ప్రారంభించింది. దీంతో సీమలో భూగర్భ జలాలు కూడా పెరగనున్నాయి. ఉద్యాన పంటల ఉత్పత్తులు పెంచేందుకు సాగు నీటి సౌకర్యం ఎంతో దోహదం చేయనుంది. తద్వారా ఈ ప్రాంత రైతులు, ప్రజల జీవన ప్రమాణాలు కూడా పెరగనున్నాయి.


