Friday, January 16, 2026
Homeవిశ్లేషణకౌలురైతు కాడి కిందపెడితే సాగు కష్టమే

కౌలురైతు కాడి కిందపెడితే సాగు కష్టమే

- Advertisement -

రాష్ట్రంలో 80 శాతం పైగా భూమిని సాగుచేస్తున్న కౌలురైతులు కాడి క్రిందపెడితే సాగు జరగటం కష్టం. 2016లో నియమించిన ప్రొఫెసర్‌ రాధాకృష్ణ కమిషన్‌ నివేదిక ప్రకారం, రాష్ట్రంలో కౌలు వ్యవసాయం సాగిస్తున్నవారు 24-25 లక్షలమంది. వీరిలో పూర్తిగా భూమిలేనివారు 6.29 లక్షలమంది. కొంతమేర సొంతభూమి సాగుచేస్తూ మరికొంత భూమి కౌలుకు తీసుకుని సేద్యం చేసేవారు 18.03 లక్షలమంది ఉన్నారు. అయితే రైతు సంఘాలు, వ్యవసాయరంగ నిపుణులు మాత్రం రాష్ట్రంలో 32 లక్షల మందిపైగానే కౌలు వ్యవసాయం చేస్తున్నట్లు అభిప్రాయపడుతున్నారు. 2011లో కౌలు రైతుల ప్రయోజనార్థం ‘‘భూ అధీóకృత సాగుదారుల లైసెన్స్‌డ్‌’’ చట్టాన్ని తీసుకు వచ్చారు. కానీ ఈ చట్టం అసంఖ్యాకంగా వున్న ఎస్సీి, ఎస్టీి, బీసీి, మైనారిటీ వర్గాలకు, పేద కౌలురైతులకు ప్రయోజనం చేకూరలేదు. పాలక ప్రభుత్వాలు వీరిని ఓటుబ్యాంక్‌గా భావిస్తున్నారే తప్ప వారి రక్షణ కోసం నిర్దిష్టమైన చర్యలు తీసుకోలేదు.
లక్షలాదిగా ఉన్న కౌలు రైతులను గుర్తించి కౌలు గుర్తింపు కార్డులు మంజూరు చేసి, బ్యాంకర్ల ద్వారా కౌలు సేద్యం సాగించేందుకు అవసరమైన హామీ లేని రుణాలు అందజేయడం, అన్నదాత సుఖీభవ పథకం, ఇన్‌ సబ్సిడీ, బీమా నష్ట పరిహారాలు, వ్యవసాయ పనిముట్లు, సబ్సిడీ విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు అందించాలన్నది లక్ష్యం. కౌలుచట్టం రూపొందించి దశాబ్దన్నర జరుగుతున్నా నిరుపేద వర్గాలకు చెందిన కౌలురైతుల సాగు సేద్యం నిరంతరం కష్టనష్టాల మధ్య సాగుతుందనటంలో ఏమాత్రం అతిశయోక్తి కాదు. సొంత భూమి కలిగిన రైతులే వ్యవసాయం గిట్టుబాటుకాక, నష్టాలతో సాగు కొనసాగించలేక ‘‘ఆదాయం ఒకటి`వ్యయం రెండు చందం’’గా జీవితం గడుపుతున్నారు. సాగు ఖర్చులు ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతున్నా రైతాంగం పండిరచే పంటకు మద్దతు ధరలు లభించడం లేదు. రైతుల ఆత్మహత్యలు నిత్యకృత్యంగా మారాయి. దేశవ్యాపితంగా ప్రతిరోజూ సగటున 31 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఏ ప్రభుత్వం అధికారం వెలగబెడుతున్నా ‘‘సమగ్ర వ్యవసాయ విధానం’’పై దృష్టి సారించడం లేదు. రైతుల ఆదాయం పెరగకపోగా నష్టాల సేద్యంతో కౌలురైతు విలవిలలాడుతున్నాడు.
దేశవ్యాపితంగా ప్రతిరైతు సగటున రు.74,000 రుణభారం మోస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌ 93 శాతం రైతు కుటుంబాలపై సగటున 2.45 లక్షల రుణభారం ఉంది. ఆరుగాలం శ్రమిస్తున్నా ఆదాయాలు పెరగక అప్పులు తీర్చేదారి లేక రైతులు, కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. నరేంద్రమోదీ 11 సంవత్సరాల పాలనలో ఇప్పటి వరకు 1.20 లక్షల మంది సాగుదారులు కడతేరారు. వ్యవసాయరంగ నిపుణుల అంచనా ప్రకారం సాగుసేద్యం గిట్టుబాటు కాక ప్రతిరోజూ సుమారు 2,000 మంది రైతులు వ్యవసాయాన్ని వదిలి పట్టణాలకు తరలిపోతున్నారు. ఫలితంగా వ్యవసాయానికి కౌలు రైతులే దిక్కవుతున్నారు. అయితే కౌలు రైతులను ఆదుకునేందుకు, ప్రభుత్వ సంక్షేమ పథకాలు, బ్యాంక్‌ రుణాలు, వ్యవసాయ యంత్ర పరికరాలు, కనీసం సాగుకు వినియోగించే ఎద్దులు, ఎడ్లబండ్లు, నాగలి, గొర్రులాంటి పనిముట్లు సైతం పేదవర్గాలకు చెందిన కౌలు రైతులకు అందించి సాగును ప్రోత్సహించడంలో ప్రభుత్వాలు నిర్లక్ష్యం చూపడం అన్యాయం. దేశంలో సుమారు 50శాతం పైగా కౌలురైతులు సాగు చేస్తున్నా కేంద్ర ప్రభుత్వం కౌలుదారుల చట్టం రూపొందించడంలో ఏమాత్రం చొరవ చూపకపోవడం అన్యాయం.
మన రాష్ట్రం 2011లో చట్టం చేసినా కౌలు రైతుల సంక్షేమం పాలకులకు పట్టడంలేదు. కౌలు రైతులందరికీ గుర్తింపుకార్డులు ఇచ్చింది లేదు. గత వైసీపీ ప్రభుత్వం 2011 కౌలు చట్టాన్ని రద్దు చేసి ‘‘ఆంధ్రప్రదేశ్‌ పంట సాగుదారుల చట్టాన్ని’’ తెచ్చింది. భూ యాజమాని లిఖితపూర్వకంగా కౌలు ఒప్పందం పత్రం రాసి ఇస్తేనే గుర్తింపు కార్డులు జారీ చేయాలని నిబంధనలు పొందుపర్చింది. దీంతో కౌలు రైతుల పరిస్థితి ‘‘పెనంమీద నుంచి పొయ్యిలో’’ పడిన చందంగా మారింది. లోభూయిష్ట చట్టాన్ని మార్చాలని, భూ యజమాని అంగీకారం తప్పనిసరి అన్న సవరణ మార్చాలన్న డిమాండ్‌ కౌలు రైతుల్లో పెరిగింది. కౌలు రైతు సంఘాలు, రాజకీయ పార్టీలు మద్దతు ప్రకటించి ఆందోళన తీవ్రతరం చేశాయి. కౌలు రైతులను గుర్తించి సీసీిఆర్సి కార్డుల జారీని సులభతరం చేస్తామంటూ టీడీపీి ఎన్నికల ప్రణాళికలో చేర్చింది. జనసేన అధినేత ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలను ఎన్నికలకు ముందు పరామర్శించి సాయం అందించారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి ఏడాది పూర్తయినా కౌలు రైతుల చట్టంలో మార్పు చేసింది లేదు. వైసీపీ తెచ్చిన చట్టమే అమలు జరుగుతున్నది. భూ యజమానుల దయాదాక్షిణ్యాలపైనే కార్డుల జారీ ప్రక్రియ నడుస్తోంది. కూటమి నేతలు, ప్రభుత్వ రెవెన్యూ, వ్యవసాయ శాఖల అధికారులు కౌలు రైతుల రక్షణ సంక్షేమం కోసం కొత్తగా సమగ్ర చట్టం తెస్తామంటూ సమావేశాలు, సమీక్షలతో కాలయాపన చేస్తున్నారు. మూడు పంట కాలాలు ముగిసినా కౌలురైతుల సమగ్ర చట్టం రూపుదిద్దుకోలేదు. కార్డుల జారీ నత్తనడకన సాగుతోంది.
గతంలో ఏప్రిల్‌, మే మాసాల్లో కౌలు గుర్తింపు కార్డులకోసం గ్రామ సభలద్వారా కార్డుదారుల గుర్తింపు ప్రక్రియ, కార్డుల జారీ జరిగేది. ప్రస్తుత ఖరీఫ్‌ సీజన్‌లో జూన్‌ రెండవ వారంలో కార్డుల జారీ ప్రక్రియ ప్రారంభమైంది. ఇప్పటి వరకు 5.50 లక్షల మందికి మాత్రమే కౌలు గుర్తింపు కార్డులు జారీ అయ్యాయి. అనేక జిల్లాల్లో ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాల్లో సగంమందికి కూడా కార్డులు అందజేయలేదు. తూర్పుగోదావరి జిల్లాలో 1.10 లక్షల మందికి కార్డుల జారీ లక్ష్యం కాగా, ఇచ్చింది 46,595 మందికి మాత్రమే కార్డులు అందాయి. ఎన్టీఆర్‌ జిల్లాలో 56 వేల మందికి కార్డులు ఇవ్వాల్సి వుండగా ఇచ్చింది 37,739, వైఎస్‌ఆర్‌ కడప జిల్లాలో 11 వేల మందికి జారీ కావాలి. ప్రస్తుతానికి ఇచ్చింది 2,919 మాత్రమే. ఇలా అనంతపురం, చిత్తూరు, శ్రీ సత్యసాయి, విశాఖ, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో కార్డుల జారీ ముందుకు సాగటంలో తీవ్ర జాప్యం జరుగుతోంది.
2025 ఆగస్టు 2న రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల వాగ్దానంగా ప్రకటించిన ‘‘అన్నదాత సుఖీభవ’’ సాగుదారుల ఖాతాల్లో జమ చేస్తున్నది. అయితే చట్టంలో మార్పులు జరిగి కార్డుల జారీ ప్రక్రియ పూర్తయిన తరువాత కౌలు రైతులకు పథకం వర్తింపచేస్తామంటున్నది ప్రభుత్వం. కార్డుల జారీ ప్రక్రియ జాప్యం జరిగేకొద్దీ వాస్తవ సాగుదారులైన కౌలు రైతులకు పథక ప్రయోజనందక్కే అవకాశంలేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి కౌలు రైతుల రక్షణకు సమగ్రచట్టం తెచ్చేందుకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలి. కౌలు రైతులు నిరాశ చెంది వ్యవసాయాన్ని వీడకముందే ప్రభుత్వాలు జాగరూకతతో వ్యవహరించాలి. కౌలు రైతులకు సమగ్రచట్టం తేవాలి.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు