సిద్దార్థ రాయ్
ప్రజాస్వామ్యంలో నాల్గవ స్థంభంగా నిలిచిన జర్నలిజం రంగం, నేడు తీవ్రమైన సంక్షోభ దశను ఎదుర్కొంటోంది. ఒకవైపు మీడియా రంగంలో కార్పొరేట్ ప్రభావం పెరుగుతుండగా, మరోవైపు ఉద్యోగ భద్రత లేని డిజిటల్ ప్రపంచం వైపు జర్నలిస్టులు బలవంతంగా వెళ్లాల్సి వస్తోంది. ఇలాంటి సంక్లిష్ట పరిస్థితుల్లో జర్నలిస్టుల హక్కులకు గళంగా నిలిచిన సంస్థ ఏపీయూడబ్ల్యూజే (ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్) 36వ రాష్ట్ర మహాసభలు జూన్ 24, 25, 26 తేదీల్లో ఒంగోలులో జరుగుతున్నాయి. ఈ మహాసభలు కేవలం సభలు కావు. జర్నలిజాన్ని ఒక వృత్తిగా కాదు, ఒక ఉద్యమంగా పరిగణిస్తూ మీడియా కార్మికుల హక్కులకు, జీవన భద్రతకు సంబంధించిన గళాలను ప్రతిధ్వనించే ఒక చారిత్రక వేదికగా నిలవనున్నాయి.
1957లో ప్రారంభమైన ఈ యూనియన్ జర్నలిస్టుల్ని శ్రమజీవులుగా గుర్తిస్తూ, వేతనాల నుంచి పింఛన్ వరకు, కనీస హక్కుల సాధన కోసం అనేక దశాబ్దాలుగా పోరాడుతూ వచ్చింది. మజీథియా వేతన సంఘాల నివేదికలు అమలు చేయించేందుకు ధర్నాలు, సమ్మెలు, చట్టపరమైన చర్యలతో పాటు ప్రభుత్వాలను కదిలించగలిగిన ఉద్యమంగా ఏపీయూడబ్ల్యూజే అభివృద్ధి చెందింది. వెబ్ జర్నలిస్టుల సమస్యలపై ప్రభుత్వానికి స్పష్టమైన విధానాన్ని రూపొందించాలని కోరుతూ, విస్తృత స్థాయిలో చర్చలకు దోహదం చేసిన యూనియన్ ఇదే. జర్నలిస్టుల కోసం బీమా, రెగ్యులరైజేషన్, రిటైర్మెంట్ సంక్షేమ పథకాలు, మహిళా జర్నలిస్టుల రక్షణ వంటి అనేక అంశాలు ఏపీయూడబ్ల్యూజే పోరాట చరిత్రలో కీలక అధ్యాయాలుగా నిలిచాయి. ఒంగోలులో జరుగుతున్న మహాసభలు గతాన్ని గౌరవిస్తూ భవిష్యత్తును నిర్మించే సభలుగా నిలువనున్నాయి. ఈ రాష్ట్ర మహాసభలు జర్నలిజం రంగాన్ని ఓ ఉద్యమ వేదికగా తీర్చిదిద్దే ప్రయత్నానికి నాంది కావాల్సిన అవసరం ఉంది. ఈ సభల్లో అనేక ప్రధాన డిమాండ్లు చర్చకు రావాల్సివుంది. ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులకు గుర్తింపు వాటిలో ఒకటి. ప్రస్తుతం ఎలక్ట్రానిక్ మీడియా విస్తారంగా ఉండి కూడా, అధికారికంగా ‘వర్కింగ్ జర్నలిస్టు’గా గుర్తింపులేకపోవడం వల్ల వారు అనేక హక్కుల నుంచి దూర మయ్యారు. వీరి హక్కులకు చట్టబద్ధత కోసం ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. డిజిటల్ మీడియా ఉద్యోగులకు రక్షణ మరో ప్రధానాంశం. నిరవధిక ఒప్పందాలపై పనిచేస్తున్న డిజిటల్ జర్నలిస్టులు తరచూ ఉద్యోగాలు కోల్పోతున్నారు. రెగ్యులరైజేషన్, కనీస వేతనాల అమలు వంటి అంశాలపై చట్టపరంగా రక్షణ అవసరం. జిల్లా స్థాయిలో సమస్యల పరిష్కార బోర్డులు ఏర్పాటు మరో ముఖ్య సమస్య. జిల్లాల్లో వర్కింగ్ జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కలెక్టర్లు, ఎస్పీలు భాగస్వామ్యంగా ఉండే కమిటీలను నియమించాలని ఏపీయూడబ్ల్యూజే డిమాండ్ చేస్తోంది. మహిళా జర్నలిస్టుల భద్రతకు మార్గదర్శకాలు జారీ చేయాలని కూడా కోరుతోంది. పని ప్రదేశాల్లో లైంగిక వేధింపుల నివారణకు మహిళా జర్నలిస్టులకు ప్రత్యేక హక్కులు కల్పిస్తూ స్టాండిరగ్ కమిటీలను ఏర్పాటు చేయాలని యూనియన్ అభిప్రాయం వ్యక్తం చేస్తోంది. వృద్ధులైన జర్నలిస్టులకు సంక్షేమ పథకాలు అమలుకు కూడా కృషి చేస్తోంది. పింఛన్, ఆరోగ్య బీమా, రిటైర్మెంట్ కార్పస్ ఫండ్ వంటి సంక్షేమ పథకాల అమలు కోసం ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలని డిమాండ్ చేస్తోంది. పత్రికా విద్యకు ప్రామాణికత: జర్నలిజం విద్యను ప్రాక్టికల్ దృష్టితో బలపరిచి, పరిశోధన కేంద్రాలను ఏర్పాటు చేయడం, డిజిటల్ మీడియా నైపుణ్యాలను విద్యా కోర్సుల్లో కలిపే చర్యలు తీసుకోవాలని ఏపీయూడబ్ల్యూజే సూచిస్తోంది. మజీథియా,ఇతర వేతన బోర్డుల నివేదికల అమలులో కొనసాగుతున్న ఆలస్యం జర్నలిస్టుల జీవితాలను గందరగోళంలోకి నెడుతోంది. వీటిని వెంటనే అమలు చేయాలని ఏపీయూడబ్ల్యూజే స్పష్టం చేస్తోంది. డిజిటల్ యుగంలో జర్నలిజం` హక్కుల కోసం నూతన వ్యూహాలు: ఈ మహాసభలు కొత్త మీడియా యుగానికి సంబంధించిన వ్యూహాలను కూడా రూపొందించాల్సిన అవసరం ఉంది. ప్రింట్ మీడియా తగ్గుతున్న నేపథ్యంలో ఆన్‌లైన్ జర్నలిజం వృద్ధి చెందుతోంది. కానీ అక్కడ ఉద్యోగ భద్రత, వేతన పారదర్శకత లేని పరిస్థితులు తీవ్రమయ్యాయి. కార్పొరేట్ ఒత్తిళ్లు స్వేచ్ఛను నాశనం చేస్తున్నాయి. ఈ క్రమంలో వృత్తిపరమైన నైతికతను నిలబెట్టేందుకు యూనియన్ దిశానిర్దేశం చేయాలి.
పత్రికా స్వేచ్ఛను నిలబెట్టాలంటే…జర్నలిస్టుల హక్కులకు బలమైన సంఘటన కావాలి. ఈ మహాసభలు కేవలం పాత విజయాలను గుర్తించే సభలుగా కాకుండా, రేపటి జర్నలిజం కోసం బలమైన వ్యూహాలను రూపొందించేవిగా ఉండాలి. జర్నలిస్టుల జీవితాలు గౌరవప్రదంగా ఉండాలంటే, వృత్తి హక్కులు ప్రాధాన్యం పొందాలి. శ్రమను గౌరవించే మీడియా వేదికలను ఏర్పరచేందుకు రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపేలా ఈ సభలు ఒత్తిడి తేవాలి. ఏపీయూడబ్ల్యూజే చరిత్ర పోరాటాలకు, నిబద్ధతకు, జర్నలిజం విలువలకు నిలువెత్తు సాక్ష్యం. ఇప్పుడు ఒంగోలులో జరుగుతున్న రాష్ట్ర 36వ మహాసభలు ఈ చరిత్రను మరింత బలపరచే అవకాశం ఎంతో ఉంది. జర్నలిస్టులు కేవలం వార్తలు రాసేవాళ్లు కాదు, ప్రజల ఆకాంక్షలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లే సమాజ మిర్రర్లు. అలాంటి గళాలే ఇప్పుడు గట్టిగా వినిపించాల్సిన సమయం ఇది. ఈ మహాసభలు జర్నలిజం స్వేచ్ఛకు, హక్కులకు, భవిష్యత్తుకు ఒక మార్గదర్శి మలుపుగా మిగలాలి.