డీడీయూజీకేవై 2.0తో శిక్షణ
13 వేల మందికి ఉద్యోగావకాశాలు
రాష్ట్రంలో 100 కేంద్రాల్లో కోర్సులు
ఉచిత వసతి, భోజనం, 4 నెలల శిక్షణ
విశాలాంధ్ర బ్యూరో-అమరావతి: గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగ సమస్యకు దీర్ఘకాలిక పరిష్కారం దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. యువతకు నైపుణ్య శిక్షణ అందించి ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు దీన్‌దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ్ కౌశల్య యోజన (డీడీయూజీకేవై)ను మరింత బలోపేతం చేసింది. ఈ పథకాన్ని అమలు చేస్తున్న సీడాప్ (సొసైటీ ఫర్ ఎంప్లాయిమెంట్ జనరేషన్ అండ్ ఎంటర్‌ప్రైజ్ డెవలప్‌మెంట్ ఇన్ ఏపీ) ఈనెల డీడీయూజీకేవై 2.0ను ప్రారంభించి, 13 వేల మందికి శిక్షణతో పాటు ఉపాధి కల్పించాలన్న లక్ష్యాన్ని నిర్దేశించింది. శిక్షణ కాలంలో ఉచితంగా వసతి, భోజనం అందిస్తుంది. రాష్ట్రంలోని 100 శిక్షణ కేంద్రాల్లో ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ ఏజెన్సీల ద్వారా కోర్సులు అమలవుతున్నాయి. ప్రతి కోర్సు 90 రోజులు ఉండగా, సెలవులతో కలిపి నాలుగు నెలల్లో శిక్షణ పూర్తవుతుంది. ఒక్కో అభ్యర్థిపై కేంద్ర నిధులతో కలిపి రాష్ట్ర ప్రభుత్వం సగటున రూ.60 వేల వరకు ఖర్చు చేస్తోంది. సీడాప్ శిక్షణ పొందిన యువతకు దేశ`విదేశాల్లో ఉద్యోగ అవకాశాలు లభించడం విశేషం. హెల్త్‌కేర్, ఎలక్ట్రికల్ రంగాల్లో జర్మనీలో ఉద్యోగాల కోసం ప్రత్యేకంగా జర్మన్ భాష నేర్పుతోంది. తొలుత 191 మందికి భాషా శిక్షణ ఇవ్వగా, వారిలో 67 మంది నర్సులు బీ2 స్థాయి పూర్తి చేశారు. ఇప్పటికే 31 మందికి జర్మనీలో ఉద్యోగాలు రాగా, 12 మంది విధుల్లో చేరారు. మరో 19 మంది ఫిబ్రవరిలో అక్కడికి వెళ్లనున్నారు. ప్రస్తుతం మరో 60 మంది నర్సులు జర్మన్ భాష నేర్చుకుంటున్నారు. అలాగే 17 మంది ఎలక్ట్రిషియన్లు ఏ2 స్థాయి శిక్షణ పూర్తి చేసి జర్మనీలో ఉద్యోగాలు పొందారు. వీరికి నెలకు సగటున రూ.2.6 లక్షల వరకు జీతం అందుతోంది. గత ప్రభుత్వ హయాంలో సీడాప్ ద్వారా శిక్షణ పొందిన వారిలో 75 శాతం మందికి ఉపాధి లభించగా, కూటమి ప్రభుత్వం ఆ శాతాన్ని 77కి పెంచింది. రాష్ట్రంలో ఉద్యోగాల విషయంలో గుంటూరు జిల్లా అగ్రస్థానంలో ఉండగా, కృష్ణా, ఎన్టీఆర్, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, అనంతపురం, ఏలూరు, పశ్చిమ గోదావరి, కాకినాడ జిల్లాల్లోనూ పెద్ద సంఖ్యలో యువతకు ఉపాధి లభించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. శిక్షణ అనంతరం పరీక్షలు నిర్వహించి సర్టిఫికెట్లు అందిస్తున్నారు. ఆపై ఉపాధి కల్పించే బాధ్యతను సంబంధిత ఏజెన్సీలే తీసుకుంటున్నాయి. 2025లో 20,106 మందికి శిక్షణ అందించగా, 10,596 మందికి ఉద్యోగాలు లభించాయి. డీడీయూజీకేవై 1.0లో శిక్షణ పొందిన మరికొందరికి కూడా ఉపాధి కల్పించే ప్రక్రియ కొనసాగుతోంది. ఉద్యోగం వచ్చిన తర్వాత మూడు నెలల పాటు అభ్యర్థుల పనితీరును సీడాప్ ట్రాక్ చేస్తోంది. ఇకపై ఈ కాలాన్ని ఆరు నెలలకు పెంచనున్నారు. అంటే శిక్షణ అనంతరం పొందిన ఉద్యోగంపై ఆరు నెలల పాటు పర్యవేక్షణ ఉంటుంది. శిక్షణ నాణ్యతపై ప్రత్యేక దృష్టి సారించేందుకు సీడాప్ కంట్రోల్ కమాండ్ సెంటర్ ద్వారా అన్ని కేంద్రాలను పర్యవేక్షిస్తోంది. హాజరు కోసం ఎఫ్‌ఆర్‌ఎస్ (ఫేస్ రికగ్నిషన్ సిస్టమ్) విధానాన్ని అమలు చేస్తున్నారు. డీడీయూజీకేవై పథకం కింద 18 నుంచి 35 ఏళ్ల వయస్సు గల గ్రామీణ యువతకు 34 రంగాల్లో శిక్షణ అందిస్తున్నారు. టెన్త్, ఇంటర్మీడియట్, ఐటీఐ, పాలిటెక్నిక్ అర్హతలతో వివిధ కోర్సుల్లో చేరే అవకాశం ఉంది. 8వ తరగతి అర్హతతోనే ఎలక్ట్రానిక్స్ హార్డ్‌వేర్ అసెంబ్లీ ఆపరేటర్, ఆటోమోటివ్ అసెంబ్లీ అసిస్టెంట్ వంటి కోర్సుల్లో శిక్షణ ఇస్తున్నారు. ఇంటర్, పాలిటెక్నిక్ పూర్తిచేసిన వారికి రూఫ్‌టాప్ సోలార్ గ్రిడ్ జూనియర్ ఇంజనీర్, జూనియర్ సాఫ్ట్‌వేర్ డెవలపర్, లాజిస్టిక్స్, టూరిజం, మీడియా-ఎంటర్‌టైన్‌మెంట్, గ్రీన్ ఎనర్జీ, బ్యాంకింగ్ తదితర రంగాల్లో అవకాశాలు ఉన్నాయి. టెన్త్ అర్హతతో హెల్త్‌కేర్, టెలికాం, కాల్ సెంటర్, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో శిక్షణ అందిస్తుండగా, ఐటీఐ అర్హత కలిగిన వారికి ఆటోమోటివ్, ఎలక్ట్రికల్ టెక్నీషియన్ కోర్సులు ఉన్నాయి. గ్రామీణ యువతకు నైపుణ్యాలు, ఉపాధి అందిస్తూ డీడీయూజీకేవై 2.0 రాష్ట్రంలో కొత్త ఆశలు రేకెత్తిస్తోంది.


