Wednesday, February 18, 2026
Homeగ్రీన్‌ హైడ్రోజన్‌ వ్యాలీగా ఏపీ

గ్రీన్‌ హైడ్రోజన్‌ వ్యాలీగా ఏపీ

- Advertisement -

. అమోనియా ఉత్పత్తికి కాకినాడే కేంద్రం
. అనుమతిచ్చిన ఏడాదిలో ప్రాజెక్టు అమలు రికార్డు
. అత్యుత్తమంగా ఏపీ క్లీన్‌-గ్రీన్‌ ఎనర్జీ పాలసీ
. ప్రాజెక్టు శంకుస్థాపనలో సీఎం చంద్రబాబు
. పారిశ్రామికవేత్తల్లో విశ్వాసం నింపుతున్న కూటమి: పవన్‌

విశాలాంధ్ర ` కాకినాడ: గ్రీన్‌ హైడ్రోజన్‌ వ్యాలీగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని తయారు చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద గ్రీన్‌ హైడ్రోజన్‌, గ్రీన్‌ అమోనియా ప్రాజెక్టును కాకినాడలో ఏర్పాటు చేయటం సంతోషకరమని అన్నారు. ఈ ప్రాజెక్టుతో కాకినాడవైపు ప్రపంచం మొత్తం చూస్తుందని వ్యాఖ్యానించారు. 2029-30 నాటికి ఏఎమ్‌ గ్రీన్‌ ప్రాజెక్టు ప్రపంచంలోనే అత్యుత్తమంగా మారాలని ఆకాంక్షించారు. కాకినాడలో గ్రీన్‌కో అనుబంధ సంస్థ ఏఎమ్‌ గ్రీన్‌ ఏర్పాటు చేస్తోన్న గ్రీన్‌ అమోనియా ప్లాంటుకు డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌తో కలిసి శనివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ప్లాంట్‌ నమూనాను పరిశీలించారు. 495 ఎకరాల్లో, రెండు బిలియన్‌ డాలర్ల పెట్టుబడితో ఏర్పాటు చేస్తోన్న ఈ ప్లాంట్‌ పూర్తైతే ఏడాదికి 1.5 మిలియన్‌ మెట్రిక్‌ టన్నుల అమోనియా ఉత్పత్తి కానుందని సంస్థ ప్రతినిధులు వివరించారు.
2027 జూన్‌కు 1.5 ఎంఎంటీ గ్రీన్‌ అమోనియా ఉత్పత్తి ప్రారంభం
ఈ ఏడాది సంక్రాంతి పండుగను ప్రజలు అద్భుతంగా జరుపుకున్నారని, ఇదేసమయంలో ప్రపంచం మొత్తం చూసే ఈ ప్లాంట్‌ శంకుస్థాపన జరగడం సంతోషంగా ఉందని సీఎం చంద్రబాబు చెప్పారు. ‘30 లక్షల మందికిపైగా ఆంధ్రప్రదేశ్‌లోని తమ స్వస్థలాలకు వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు వచ్చారు. హైదరాబాద్‌ నుంచి 3 లక్షల వాహనాల్లో పండుగ కోసం ఏపీకి వచ్చారు. సంక్రాంతి వేడుకల్లో భాగంగా జగ్గన్నతోట ప్రభల తీర్థం ఉత్సవాలు అత్యద్భుతంగా నిర్వహించారు. ఇదే సమయంలో ఏఎం గ్రీన్‌ హైడ్రోజన్‌, గ్రీన్‌ అమోనియా ప్రాజెక్టు నిర్మాణ పనులు ప్రారంభించిన ప్రమోటర్లకు అభినందనలు. గతేడాది గ్రీన్‌ అమోనియా ప్రాజెక్టు ఏర్పాటుకు అనుమతిచ్చాం. సరిగ్గా ఏడాదిలో కార్యరూపం దాల్చింది. 2027 జూన్‌ కల్లా గ్రీన్‌ అమోనియా ఉత్పత్తి ప్రారంభం అవుతుంది. చరిత్ర తిరగ రాయటం తెలుగువాళ్ల వల్లే సాధ్యం. కాకినాడ నుంచి జర్మనీకి గ్రీన్‌ అమోనియా సరఫరా అవుతుంది. గతంలో గ్రే అమోనియా తయారీని నాగార్జునా ఫెర్టిలైజర్స్‌ చేపట్టింది. ఇప్పుడు అదే ప్రాంతంలో గ్రీన్‌ అమోనియాతో పర్యావరణహిత ఉత్పత్తులు తయారవుతాయి. పర్యావరణ సమతుల్యత సాధించటమే లక్ష్యం. అందుకు అనుగుణంగా ప్రణాళికలు జరుగుతున్నాయి’ అని చంద్రబాబు అన్నారు.
160 మెగావాట్ల గ్రీన్‌ ఎనర్జీ ఉత్పత్తి లక్ష్యం
‘ప్రధాని నరేంద్ర మోదీ దేశంలో 500 గిగావాట్ల గ్రీన్‌ ఎనర్జీ ఉత్పత్తి చేయాలని లక్ష్యాన్ని నిర్దేశించారు. ఆయన నిర్ధేశించిన లక్ష్యాన్ని అందిపుచ్చుకుని ఏపీలో 160 మెగావాట్ల గ్రీన్‌ ఎనర్జీ తయారు చేయాలని నిర్ణయించుకున్నాం. సోలార్‌ ప్యానెళ్లు ఇళ్లపై ఏర్పాటు చేసుకుని విద్యుత్‌ ఉత్పత్తి చేస్తూ వినియోగదారులు ముందుకెళుతున్నారు. ఏపీ తీర ప్రాంతంలో 20 పోర్టులు రాబోతున్నాయి. సౌర, పవన, జల విద్యుత్‌, పంప్డ్‌ స్టోరేజీ లాంటి విద్యుత్‌ ఉత్పత్తికి, గ్రీన్‌ హైడ్రోజన్‌, గ్రీన్‌ అమోనియా ఉత్పత్తికి ఏపీ అనుకూలమైన రాష్ట్రం. కాకినాడలో నిర్మిస్తున్న ఈ ప్లాంట్‌ ద్వారా గ్రీన్‌ హైడ్రోజన్‌, అమోనియా, ఇథనాల్‌, గ్రీన్‌ మాలిక్యూల్స్‌ లాంటి ఉత్పత్తులు వస్తాయి. ఇకపై ప్రపంచంలో ఎక్కడైనా గ్రీన్‌ ఎనర్జీ గురించి చర్చ వస్తే… కాకినాడ పేరే వినిపిస్తుంది. గ్రీన్‌ హైడ్రోజన్‌, అమోనియా ద్వారా ప్రపంచ పటంలో కాకినాడ నిలుస్తుంది’ అని ముఖ్యమంత్రి అన్నారు. ‘కాకినాడలోనే 2 గిగావాట్ల సామర్ధ్యం ఉన్న ఎలక్ట్రోలైజర్స్‌ తయారీకి ఏఎమ్‌ గ్రీన్‌ నిర్ణయించటం అభినందనీయం. ఏపీ క్లీన్‌, గ్రీన్‌ ఇంటిగ్రేటెడ్‌ ఎనర్జీ పాలసీ-2024 దేశంలోనే అత్యుత్తమంగా ఉంది’ అని అన్నారు.
ట్రాన్స్‌మిషన్‌ నష్టాలు తగ్గించే ప్రయత్నం
దేశానికి వచ్చిన విదేశీ పెట్టుబడుల్లో 25 శాతం మన రాష్ట్రానికే వచ్చాయని చంద్రబాబు చెప్పారు. దీనికి కారణం ఆంధ్రప్రదేశ్‌పై ఉన్న నమ్మకమన్నారు. రాష్ట్రంలో విద్యుత్‌ కొనుగోలు భారాన్ని రూ.1.19 మేర తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నాం. ఇప్పటికే యూనిట్‌కు 29 పైసల మేర కొనుగోలు భారాన్ని తగ్గించాం. ట్రాన్స్‌మిషన్‌ నష్టాలు కూడా తగ్గిస్తాం. విశాఖకు గిగావాట్‌ సామర్ధ్యంతో ఏఐ డేటా సెంటర్‌ ఏర్పాటు చేసేందుకు గూగుల్‌ సంస్థ ముందుకు వచ్చింది. గ్రీన్‌ హైడ్రోజన్‌ ఉత్పత్తి, క్వాంటం వంటి రంగాలపై దృష్టి సారించి భవిష్యత్‌కు నాంది పలికా. రాష్ట్రంలోకి వచ్చే పెట్టుబడులకు ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుంది’ అని పెట్టుబడిదారులకు ముఖ్యమంత్రి భరోసా ఇచ్చారు.
వేధింపులు ఉండవు: పవన్‌
ప్రభుత్వాలు, పార్టీలు మారినా పరిపాలనా పరమైన విధానాలు మాత్రం స్థిరంగా ఉండాలని ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ అన్నారు. గత పాలకులు రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడిదారులను బెదిరించి, కోర్టుకు ఈడ్చి నానా ఇబ్బందులుపెట్టారని, కూటమి ప్రభుత్వం మాత్రం ప్రతి అడుగులో పెట్టుబడిదారుల్లో విశ్వాసం నింపుతూ… అండగా నిలుస్తుందన్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని తమ ప్రభుత్వం నుంచి పెట్టుబడిదారులకు ఎలాంటి వేధింపులు ఉండవని పవన్‌ స్పష్టం చేశారు. రాష్ట్రంలో పెట్టుబడిదారులకు సానుకూల వాతావరణం కల్పించడంతోపాటు పర్యావరణాన్ని పరిరక్షించుకుంటూ అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్‌ని అగ్రగామిగా నిలిపే దిశగా వడివడిగా అడుగులు వేస్తున్నామని చెప్పారు. పునరుత్పాదక ఇంధన రంగంలో రాష్ట్రాన్ని దేశంలో మొదటి స్థానంలో నిలపడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్నారు. దేశ కాలుష్య రహిత ఇంధన ప్రయాణంలో గ్రీన్‌ అమ్మోనియా ప్రాజెక్టును కీలక మైలురాయిగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్‌, రాష్ట్ర మంత్రులు, పార్లమెంటు సభ్యులు, శానససభ్యులు, ఉన్నతాధికారులు, ఏఎం గ్రీన్‌ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు