Homeచలో సీసీఎల్‌ఏ ముట్ట‌డి ఉద్రిక్తం

చలో సీసీఎల్‌ఏ ముట్ట‌డి ఉద్రిక్తం

- Advertisement -
  • రోడ్డుపై వీఆర్‌ఏల బైఠాయింపు… పోలీసుల దాష్టీకం
  • సమస్యలు పరిష్కరించకుంటే సహాయ నిరాకరణ – వెంకటసుబ్బయ్య హెచ్చరిక

విశాలాంధ్ర-మంగళగిరి: తమ న్యాయమైన సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు సీసీఎల్‌ఏ కార్యాలయానికి వచ్చిన వీఆర్‌ఏలను నేతన్న సర్కిల్ వద్ద పోలీసులు అడ్డుకోవడం దుర్మార్గమని ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్.వెంకటసుబ్బయ్య మండి పడ్డారు. కనీసం అధికారులను కలిసి సమ స్యలు వివరించే అవకాశం ఇవ్వకుండా అడ్డుకోవడాన్ని తీవ్రంగా ఖండించారు. గుంటూరు జిల్లా మంగళగిరి నగర పరిధిలోని చినకాకాని ఎన్నారై వై జంక్షన్-నేతన్న సర్కిల్ వద్ద రెండు రోజులుగా వీఆర్‌ఏలు చేపట్టిన రిలే నిరాహార దీక్షల అనంతరం బుధవారం ‘చలో సీసీఎల్‌ఏ’ ముట్టడికి పిలుపునిచ్చారు. సీసీఎల్‌ఏ కార్యాలయానికి వెళ్లకుండా పోలీసులు అడ్డుకోవడంతో వీఆర్‌ఏలు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. అనంతరం వీఆర్‌ఏల సమస్యలు పరిష్కరించాలని పదిమంది ప్రతినిధుల బృందం సీసీఎల్‌ఏ సంయుక్త కార్యదర్శి టీఎస్ చేతన్కు వినతిపత్రం అందజేసింది. వీఆర్‌ఏల న్యాయమైన సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించి, న్యాయం చేయాలని కోరగా… సెప్టెంబరు 15వ తేదీ లోపు పరిష్కరిస్తామని అధికారులు హామీ ఇచ్చినట్లు తెలిపారు. గడువులోగా పరిష్కరించకపోతే తర్వాత సహాయ నిరాకరణ ఉద్యమానికి దిగుతామని, రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమంలో పాల్గొనేందుకు సిద్ధంగా ఉన్నామని వీఆర్‌ఏలు హెచ్చరించారు.
వెంకటసుబ్బయ్య మాట్లాడుతూ రెవెన్యూ శాఖలో భూముల పాస్పుస్తకాల పంపిణీ, ఆస్తుల నమోదు, ప్రజలకు పాస్పుస్తకాలు చేరవేయడం వంటి విధుల్లో వీఆర్‌ఏలు ప్రధాన పాత్ర పోషిస్తున్నారని తెలిపారు. ఆరు నెలల్లో కొత్త పాస్పుస్తకాలు అందిస్తామని ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో ఆ ప్రక్రియను విజయవంతం చేయడంలో వీఆర్‌ఏల సేవలు కీలకమన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నుంచి అసెంబ్లీ ఎన్నికల వరకు బూత్ స్థాయిలో వివిధ ఎన్నికల విధులను అహర్నిశలు నిర్వహిస్తూ ప్రభుత్వ యంత్రాంగానికి వీఆర్‌ఏలు అండగా నిలుస్తున్నప్పటికీ కనీస వేతనాలు లేకపోవడం శోచనీయమన్నారు. ఎన్నికలకు ముందు డీఏతో పాటు ఇతర సమస్యలు పరిష్కరిస్తామని ప్రభుత్వం ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి, రెవెన్యూ మంత్రి తక్షణమే స్పందించి సమస్యలు పరిష్కరించాలని కోరారు. ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి కొనసాగిస్తే వీఆర్‌ఏ సంఘంతో కలిసి ఏఐటీయూసీ అధ్వర్యంలో ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు.
ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు రావులపల్లి రవీంద్రనాథ్ మాట్లాడుతూ వీఆర్‌ఏల సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించి, తక్షణమే పరిష్కరించాల్సిన ప్రభుత్వం… సమస్యలను చర్చించేందుకు వచ్చిన వీఆర్‌ఏలను పోలీసులతో అడ్డుకోవడం ద్వారా వారి గొంతు నొక్కే ప్రయత్నం చేయడం సరికాదని విమర్శించారు. వీఆర్‌ఏల సమస్యలు పరిష్కరిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ అనేక సందర్భాల్లో హామీలు ఇచ్చినా… ఆచరణలో ఎలాంటి పురోగతి కనిపించడం లేదని రవీంద్రనాథ్ విమర్శించారు. వీఆర్‌ఏలకు కనీస వేతనాలు అమలు చేయడంతో పాటు అర్హులకు ఉద్యోగ భద్రత కల్పించాలని, వారి ప్రధాన సమస్యలపై ప్రభుత్వం వెంటనే చర్చలు జరపాలని డిమాండ్ చేశారు.
వీఆర్‌ఏ అసోసియేషన్ జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ ఎన్.పెద్దన్న మాట్లాడుతూ వీఆర్‌ఏల సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం స్పందించకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని, అవసరమైతే సమ్మెకు దిగుతామని హెచ్చరించారు. తెలంగాణ తరహాలో వీఆర్‌ఏలకు పే స్కేల్ అమలు చేయాలని, 2018లో పెంచిన వేతనాలు సక్రమంగా అమలు చేయాలని కోరారు. నామినీలుగా పని చేస్తున్న వారితో పాటు విధుల్లో మృతి చెందిన వీఆర్‌ఏల కుటుంబాల్లోని అర్హులకు వయోపరిమితితో సంబంధం లేకుండా వన్టైం సెటిల్మెంట్ ద్వారా ఉద్యోగావకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. అర్హులయిన వీఆర్‌ఏలకు వెంటనే 70 శాతం పదోన్నతి కల్పించి, పెండింగ్ సమస్యలు పరిష్కరించాలన్నారు. వీఆర్‌ఏల విధులకు సంబంధం లేని వాచ్మన్, అటెండర్, డ్రైవర్, బీఎల్‌ఓ, ఎన్నికల విధులు, రీసర్వే తదితర పనులు అప్పగించడం సరికాదన్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేసి, బెదిరింపులు, నిర్బంధాలకు స్వస్తి పలకాలని డిమాండ్ చేశారు.
ఏపీ వీఆర్‌ఏ సంఘాల జేఏసీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎం.బాలకాశీ మాట్లాడుతూ వీఆర్‌ఏల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం ఇదే నిర్లక్ష్యం కొనసాగిస్తే సెప్టెంబరులో రాష్ట్ర వ్యాప్తంగా విధులు బహిష్కరించి నిరవధిక సమ్మెలోకి వెళతామని హెచ్చరించారు. వీఆర్వోల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు భూపతిరాజు రవీంద్ర రాజు, ప్రధాన కార్యదర్శి ఎం.అప్పలనాయుడు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడిచినా వీఆర్‌ఏల సమస్యలు పరిష్కారం కాకపోవడంతో వారిలో తీవ్ర అసంతృప్తి నెలకొందని అన్నారు. ఏపీ వీఆర్‌ఏ సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ వైస్ చైర్మన్ వీరభద్రరావు, జి.వెంకటరత్నం, జి.ధైర్యం, టి.సురేశ్, కార్యదర్శులు వివేకానంద, సురేశ్, రాజేశ్, సంగయ్య, రమణ, మహేశ్, మోషే, ఎస్.పెద్దన్న, ఏఐటీయూసీ గుంటూరు జిల్లా ప్రధాన కార్యదర్శి మేడా హనుమంతరావు, కార్యనిర్వహక అధ్యక్షుడు అన్నవరపు ప్రభాకర్, సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి చిన్ని తిరుపతయ్య, ఏఐటీయూసీ నియోజకవర్గ కార్యదర్శి చిన్ని సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు