
పార్టీలకతీతంగా కేంద్ర, రాష్ట్రాలపై ఒత్తిడి పెంచేందుకు ఐక్య ఉద్యమం
- రేపు విజయవాడలో సీపీఐ రౌండ్ టేబుల్ – పార్టీలు, రైతు, ప్రజా సంఘాలకు ఆహ్వానం
- వైసీపీ అధినేత వైఎస్ జగన్తో నేతల భేటీ
విశాలాంధ్ర బ్యూరో`అమరావతి: రాష్ట్రంలో నెలకొన్న తీవ్ర కరవు పరిస్థితుల నేపథ్యంలో భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) అధ్వర్యంలో ఈ నెల 26న విజయవాడ దాసరి భవన్‌లో నిర్వహించ నున్న అఖిలపక్ష రౌండ్ టేబుల్ సమావేశానికి రాజకీయాలకు అతీతంగా హాజరు కావాల్సిందిగా పార్టీలు, రైతు, ప్రజా సంఘాల నేతలను సీపీఐ ప్రతినిధుల బృందం ఆహ్వానించింది. ఈ మేరకు గురువారం తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డిని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.రామకృష్ణ, రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య, కార్యదర్శివర్గ సభ్యులు పి.హరినాథ్‌రెడ్డి, అక్కినేని వనజతో కూడిన ప్రతినిధి బృందం జగన్‌ను ఆహ్వానించింది. కరవు సమస్యలతోపాటు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్), ప్రజా సమస్యలపై పోరాడేందుకు కలిసి రావాలని సీపీఐ నేతల బృందం ఆహ్వానించగా…అందుకు జగన్ సుముఖత వ్యక్తం చేశారు. ఈ సమావేశానికి వైసీపీ రాష్ట్ర సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి హాజరయ్యారు. అంతకుముందు విజయవాడ ఆంధ్రరత్నభవన్‌లో కాంగ్రెస్ నేతలతో సీపీఐ బృందం భేటీ అయింది. పీసీసీ ఉపాధ్యక్షుడు కొలనుకొండ శివాజీ, విజయవాడ నగర కాంగ్రెస్ అధ్యక్షులు నరహరిశెట్టి నరసింహారావు, ఏఐసీసీ సభ్యులు మీసాల రాజేశ్వరరావుతోపాటు కాంగ్రెస్ నేతలు సాయిబాబా, బషీర్ అహ్మద్, మండిపూడి సునీత, ఎం.పరశురామ్ యాదవ్, బుగ్గ రమణతో సీపీఐ బృందం సమావేశమైంది. కరవు, ప్రజా సమస్యలు, కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు, ఎలక్షన్ కమిషన్ వ్యవహార శైలి, పనితీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ… భవిష్యత్తులో ఉమ్మడి పోరాటాలు, స్పష్టమైన కార్యాచరణ ప్రణాళికలు రూపొందించుకోవాల్సిన అవసరముందని ఇరు పార్టీల నాయకులు అబి óప్రాయపడ్డారు. ఆ తర్వాత విజయవాడ ఎంబీ వీకేలో సీపీఎం నేతలతో సీపీఐ బృందం భేటీ అయింది. సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వై.వెంకటేశ్వర్లు(వై.వీ), బలరామ్, కేంద్ర కమిటీ సభ్యులు లోకనాథమ్, డి.రమాదేవితో సీపీఐ బృందం సమావేశమైంది. ఈ నెల 26న జరిగే రౌండ్ టేబుల్కు హాజరు రావాలని సీపీఎం, కాంగ్రెస్ నేతలను ఆహ్వానించింది. ఎల్‌నినో పరిస్థితుల వల్ల తీవ్రంగా నష్టపోతున్న రైతాంగాన్ని ఆదుకోవడానికి, ప్రభుత్వంపై పెద్ద ఎత్తున ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరముందని నేతలు ప్రాథమికంగా చర్చించారు. ఆ తర్వాత కృష్ణాజిల్లా ఉయ్యూరులో మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావును పార్టీ ప్రతినిధుల బృందం కలిసి…సాదరంగా రౌండ్ టేబుల్కు ఆహ్వానించింది.
రౌండ్ టేబుల్కు పార్టీలు, రైతు, ప్రజా సంఘాల నేతలను ఆహ్వానించాం : ఈశ్వరయ్య
జగన్‌ను కలిసిన అనంతరం పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పి.హరినాథ్‌రెడ్డి, అక్కినేని వనజతో కలిసి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య మీడియాతో మాట్లాడారు. సీపీఐ అధ్వర్యంలో రాష్ట్రంలో నెలకొన్న కరవు పరిస్థితులపై ఈ నెల 26వ తేదీ ఉదయం 11 గంటలకు విజయవాడ దాసరి భవన్‌లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించనున్నామని చెప్పారు. కరవు నివారణ చర్యల కోసం రాష్ట్రంలోని పార్టీలు, మిగతా రాజకీయ పార్టీలు, రైతు, ప్రజా సంఘాలను అన్ని కలుపుకుని పెద్దఎత్తున ఆందోళనకు శ్రీకారం చుట్టాలనే నేపథ్యంలో మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్‌ను కూడా సీపీఐ ప్రతినిధి బృందం కలిసిందన్నారు.
ఈ సందర్భంగా రౌండ్ టేబుల్ సమావేశానికి జగన్‌ను ఆహ్వానించామని… అలాగే భవిష్యత్‌లో జరిగే పోరాటాలకు జగన్ సుముఖత వ్యక్తం చేశారని తెలిపారు.
కరవు ఖరీఫ్ సీజన్‌లో రైతులను తీవ్రంగా దెబ్బతీసిందని… ఈ ఏడాది జూన్ నుంచి సెప్టెంబరు వరకు 514 మి.మి.ల సాధారణ వర్షపాతానికి గాను కేవలం 218 మి.మి. మాత్రమే వర్షపాతం నమోదైందని చెబుతున్న ప్రభుత్వం…80 లక్షల ఎకరాల్లో పంట వేయాల్సి ఉండగా… 65 లక్షల ఎకరాల్లో పంటలు వేసినట్లుగా చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. క్షేత్రస్థాయిలో జిల్లాలలోని తమ ప్రతినిధుల బృందం అధికారులను కలిసి తీసుకున్న సమాచారం ప్రకారం 55 లక్షల ఎకరాల్లో అసలు విత్తనాలే వేయలేదని తెలిసిందన్నారు. 26 జిల్లాల్లోనూ వర్షపాతం లోటుగా ఉందని వివరించారు. రాష్ట్రంలో 80 శాతం మేర రైతులు పంటలే చేయలేదన్నారు. ఈ క్రమంలో రాష్ట్రంలో కరవును జాతీయ విపత్తుగా ప్రకటించేందుకు పాలక కూటమి పక్షాలు మినహా అన్ని పక్షాలతో కలిసి ముందుకెళితే తప్ప తప్ప కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను గట్టిగా ఒత్తిడి చేయలేమన్నారు. రెండు రోజుల నుంచి పడుతున్న వర్షాలతో రైతాంగానికి ఒరిగిందేమీ లేదని ఈశ్వరయ్య స్పష్టం చేశారు. బోరు బావుల్లో కొద్దిగా నీరు పెరగవచ్చుగానీ, రైతుల పంటలకు ఎలాంటి దిగుబడి రాదని తెలిపారు. దీంతోపాటు ఓటర్ల జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) పేరుతో రాష్ట్రంలో నిజమైన ఓటర్లను తొలగించారని, కడుపు చేతబట్టుకుని వలసలు వెళ్లిన కూలీల ఓట్లు గల్లంతు చేశారని చెప్పారు. అర్హత ఉన్న ప్రతిఒక్క వ్యక్తికి ఓటు కల్పించేలా చూడాలని అవసరమైతే ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరించాలని తాము ఎన్నికల సంఘం దృష్టికి ఇప్పటికే తీసుకెళ్లామన్నారు. నిజమైన ఓటర్లను తొలగించి బీజేపీకి లబ్ధి చేకూర్చేందుకే కేంద్ర ఎన్నికల కమిషన్ కుట్రలకు పాల్పడుతోందన్నారు. ఎస్‌ఐఆర్తోపాటు ఇతర ప్రజా సమస్యలపైనా భవిష్యత్‌లో జరిగే పోరాటాలకు కలిసి రావాలని జగన్‌ను కోరగా…అందుకు సంసిద్ధతను వ్యక్తం చేసినందుకుగాను సీపీఐ తరపున ధన్యవాదాలు తెలిపారు. విలేకరులు అడిగిన ప్రశ్నలకు ఈశ్వరయ్య బదులిస్తూ… ప్రజా సమస్యలపై పోరాటంలో సీపీఐ ముందు వరుసలో ఉంటుందని, ఇప్పటికే కార్పొరేట్‌లకు కారు చౌకగా భూములు కట్టబెట్టిన వ్యవహారం, విశాఖలో డేటా సెంటర్ ఏర్పాటుపై ఉద్యమించామని చెప్పారు. డీఎస్‌సీ పరీక్షల నిర్వహణలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరించాలని, అక్రమాలు జరిగి ఉంటే బాధ్యులను కఠినంగా శిక్షించాలని ఈశ్వరయ్య డిమాండ్ చేశారు. ఒకవేళ తప్పు జరగలేదని ప్రభుత్వం భావిస్తే… ఆధారాలతో సహా వాస్తవాలను బయటపెట్టి తన నిజాయితీని నిరూపించుకోవాలన్నారు. వాటిపై ప్రశ్నించిన వైసీపీ శ్రేణులు, నాయకులు, నిరుద్యోగులపై లాఠీచార్జీలు చేయడం, భౌతిక దాడులకు పాల్పడటం అప్రజాస్వామికమని తప్పుపట్టారు. దీనిపై దాడి జరిగిన రోజే సీపీఐ తీవ్రంగా ఖండించిందని గుర్తుచేశారు. ఆయా ప్రజా సమస్యలపై ఉద్యమాలకు వైసీపీ కలిసి ముందుకొస్తే పోరాటాలకు తాము సిద్ధమని స్పష్టం చేశారు.


