అసెంబ్లీ వేదికగా సీఎం విజయన్ ప్రకటన
తిరువనంతపురం: భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 300 నిబంధన కింద కేరళను తీవ్ర పేదరిక రహిత రాష్ట్రంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ అసెంబ్లీలో ప్రకటించారు. కేరళ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా శనివారం శాసనసభలో ఈ మేరకు విజయన్ ఓ చారిత్రాత్మక ప్రకటన చేశారు. విజయన్ మాట్లాడుతూ శతాబ్దం క్రితం జరిగిన జాతీయోద్యమం నుంచి పుట్టుకొచ్చిన ఆలోచన నుండే భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడ్డాయని, అయితే స్వాతంత్య్రం వచ్చిన తొలినాళ్లలో దానిని సాధించడానికి దీర్ఘమైన, తీవ్రమైన పోరాటాలు జరిగాయని గుర్తుచేశారు. ఆ పోరాటాల ఫలితమే ఐక్య కేరళ ఏర్పడిరదని, మలయాళీల కల సాకారమైందన్నారు. ప్రతి రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని మనం ఆనందంగా జరుపుకుంటామని, కానీ ఈ సంవత్సరం రాష్ట్ర అవతరణ దినోత్సవం కేరళ ప్రజలకు, ఒక నవ యుగానికి ప్రారంభంలాంటిదని విజయన్ గర్వంగా ప్రకటించారు. కేరళను భారతదేశంలోనే మొట్టమొదటి తీవ్ర పేదరికం లేని రాష్ట్రంగా మార్చడంలో మనం విజయం సాధించామని, ఈరోజు జరుపుకునే రాష్ట్ర అవతర దినోత్సవం చారిత్రాత్మకమన్నారు. ఈ శాసనసభ అనేక చారిత్రాత్మక చట్టాలు, విధాన ప్రకటనలకు సాక్ష్యంగా నిలిచిందని, నవ కేరళ సృష్టిలో మరో మైలురాయిని గుర్తించే సమయంలో అసెంబ్లీ ఇప్పుడు సమావేశమైందన్నారు. 2021లో కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలి మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న కీలక నిర్ణయాల్లో తీవ్ర పేదరికన నిర్మూలన ఒకటి అని విజయన్ గుర్తుచేశారు. శాసనసభ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన అతి ముఖ్యమైన హామీలలో ఒకదాన్ని నెరవేర్చడానికి ఇది నాంది అన్నారు. స్థానిక స్వపరిపాలన శాఖ నాయకత్వంలో కేరళ ఇనిస్టిట్యూట్ ఆఫ్ లోకల్ అడ్మినిస్ట్రేషన్ (కేఐఎల్‌ఏ) సమన్వయంతో కేవలం రెండు నెలల్లో తీవ్ర పేదరికంలో నివశిస్తున్న కుటుంబాలను గుర్తించే ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిందన్నారు. ఈ ప్రయత్నంలో ఎమ్మెల్యేలు, స్థానిక సంస్థల ప్రతినిధులు, కుటుంబశ్రీ కార్మికులు, స్వచ్ఛంద సేవకులు, అధికారులు సహా ఇతరులు కూడా భాగస్వాములయ్యారని తెలిపారు. ఈ ప్రక్రియలో ప్రజాభాగస్వామ్యం కనిపించిందని, మొదటగా వడక్కంచెరి మునిసిపాలిటి, అంచుతెంగు, తిరునెల్లి గ్రామ పంచాయతీలలో దీన్ని పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించామని తెలిపారు. ఆ తరువాత రాష్ట్రం మొత్తానికి విస్తరించామని, సమాజంలో అన్ని వర్గాల నుండి తీసుకున్న సమష్టి అభిప్రాయాలు, సూచనల ద్వారా లబ్ధిదారుల కుటుంబాలను గుర్తించి చారిత్రాత్మక ప్రాజెక్టును ప్రారంభించామని విజయన్ వివరించారు. తీవ్ర పేదరిక రహిత రాష్ట్రంగా కేరళను సీఎం ప్రకటించడంపై ప్రతిపక్షాలు విమర్శించాయి. రాష్ట్ర కాంగ్రెస్ నేతలు ఇది మోసం అని మండిపడ్డారు. ప్రతిపక్ష సభ్యుల ఆరోపణలపై విజయన్ స్పందించారు. ప్రతిపక్షనేత వ్యాఖ్యలు అప్రస్తుతమని విజయన్ తోసిపుచ్చారు. దీనిపై ప్రతిపక్షాలు ఎందుకు భయపడుతున్నాయో అర్థంకావడం లేదని అన్నారు. ఇది చారిత్రాత్మకమైన ప్రకటన అని, ప్రపంచానికి తెలియజేయడానికి అసెంబ్లీలో ప్రకటించామని చెప్పారు.


