Tuesday, November 18, 2025
Homeవిశ్లేషణతెలుగు చిత్రకళా జగత్తులో ధ్రువతార

తెలుగు చిత్రకళా జగత్తులో ధ్రువతార

- Advertisement -

రేగుళ్ళ మల్లికార్జునరావు

చిత్రకళా చరిత్రలో ఒక ధ్రువతారగా వడ్డాది పాపయ్య (1921-1992) ఎప్పటికీ గుర్తుండిపోతారు. ఆయన కేవలం బొమ్మలు గీసేవాడు కాదు, తన కుంచెతో కథలు చెప్పిన కథకుడు, ఒక నిశ్శబ్ద కవి కూడా. ఆయన చిత్రాలు మన భారతీయ సంస్కృతి, పురాణాలు, పల్లెల జీవితం, ప్రకృతి అందాలను అత్యంత సుందరంగా ఆవిష్కరించాయి. పాపయ్య బొమ్మలు గీసే విధానం, రంగులు వాడే పద్ధతి, వాటిని అలంకరించే తీరు వల్ల ఆయనకు ‘కళా తపస్వి’ అనే పేరు వచ్చింది. ఆయన చిత్ర సృజన ఆయనను అమరుడిని చేసింది. చిత్రకళ ఉన్నంతవరకు, చిత్రరచన కొనసాగినంత కాలం ఆయన ప్రతిభ సజీవంగా, కాలాతీతమైనదిగా నిలిచి ఉంటుంది. వడ్డాది పాపయ్య శ్రీకాకుళంలో పవిత్రమైన నాగావళి నది ఒడ్డున రామమూర్తి, మహాలక్ష్మి దంపతులకు సెప్టెంబరు 10, 1921 న జన్మించారు. తండ్రి చిత్రకళా ఉపాధ్యాయుడు కావడంతో, బొమ్మలు గీయడం ఆయన తండ్రి దగ్గరే నేర్చుకున్నారు. తండ్రి బొమ్మలు గీసేటప్పుడు చాలా శ్రద్ధగా చూసి, రంగులు కలపడం, బ్రష్‌లను శుభ్రం చేయడం వంటి పనులన్నీ సహాయం చేస్తూ నేర్చుకున్నారు. ఐదేళ్ల చిన్న వయసులోనే ఇంట్లో ఉన్న రవివర్మ గీసిన ‘‘కోదండ రామ’’ చిత్రాన్ని చూసి, దాని స్ఫూర్తితో హనుమంతుని బొమ్మ గీశారు. చిన్నతనంలో తండ్రి చెప్పిన భారత, భాగవత కథల ప్రభావం ఆయనపై చాలా ఉంది. అందుకే పాపయ్య కొత్తదానికంటే పాత విషయాల మీద, ముఖ్యంగా భారతీయ శిల్ప, చిత్ర కళల మీద ఎక్కువ ఆసక్తి పెంచుకున్నారు.
ప్రముఖ చిత్రకారుల స్ఫూర్తి: ఆయన ఊహ పెరిగిన తర్వాత, చిత్రకళా వైతాళికులుగా పేరుపొందిన రాజా రవివర్మ, దామెర్ల రామారావు వంటి వారి చిత్రకళా తపస్సును ఆదర్శంగా ఎంచుకున్నారు. అయితే, ఈ ఇద్దరు కళాకారులు తమ సృష్టికి మోడళ్లను ఆశ్రయించేవారు. పాపయ్య మాత్రం ఎలాంటి మోడల్‌ లేకుండా సృజనాత్మకంగా తన ఊహా ప్రపంచంలో నుంచి చిత్ర రచన చేసేవారు. ఆయన వేసిన వేలాది చిత్రాలు ఒకదానితో మరొక దానికి సంబంధం లేకుండా, దేనికదే ప్రత్యేకం, సృజనాత్మకం. ఆయన చేతి నైపుణ్యానికి తోడు, అడవి బాపిరాజు నుంచి గొప్ప భావాలను అందుకున్నారు. ప్రతి కళాకారుడికి తనకంటూ ఒక సొంత శైలి ఉండాలని గట్టిగా నమ్మి, ఆ ప్రకారంగానే తనను తాను మార్చుకున్నారు. ఆయన చిత్రరచన అంతా నీటిరంగుల్లో కొనసాగింది. కొన్ని సందర్భాలలో, అవసరమైన రంగులను ఆయన స్వయంగా తయారు చేసుకునేవారు. ఒక చిత్రకారునిగా 1938లో తనను తాను గుర్తించుకున్నారు. ఈ కృషి ఎన్ని కష్టాలు వచ్చినా, విజయం సాధించే వరకు ఆగలేదు. కళ మనసులోంచి పుడుతుంది అనే నమ్మకంతో ఆయన బొమ్మలు గీసేవారు. రేరాణి, అభిసారిక, భారతి పత్రికలలో ప్రచురించిన బొమ్మలతో ఒక గొప్ప చిత్రకారునిగా పత్రికా ప్రపంచానికి దగ్గరయ్యారు. తెలుగు సినీ ప్రముఖుడు చక్రపాణి తమ సంస్థ ప్రచురణలైన చందమామ, యువ పత్రికలలో బొమ్మలు వేసే ఉద్యోగం ఇచ్చారు. ఒక్క ‘‘చందమామ’’ పత్రికలోనే దాదాపు మూడు దశాబ్దాల పాటు తన సహజ శైలిలో బొమ్మలు గీస్తూ, ఒకే పత్రికలో కొనసాగటం తెలుగు పత్రికా రంగంలో ఒక పెద్ద రికార్డు. అప్పట్లో చందమామ ఎనిమిది భాషలలో వస్తుండటంతో పాపయ్య చిత్రాలు దేశవ్యాప్తంగా అందరికీ తెలిశాయి. చిత్రకళ నేర్చుకుంటున్న తొలినాళ్లలో దేశోద్ధారక కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు పాపయ్య చిత్రాలు పత్రికలలో ప్రచురించి ప్రోత్సహించారు. చందమామ, యువ తర్వాత స్వాతి వార, మాస పత్రికలలో పది సంవత్సరాల పైగా ఈయన చిత్రాలు ప్రచురితమయ్యాయి. వడ్డాది పాపయ్య గీసిన చిత్రాల క్రింద ‘వ.పా.’ అనే పొడి అక్షరాల సంతకం వారి ప్రత్యేకత. వీరి బొమ్మలకు గల మరొక గుర్తు ‘010’ అని ఉండడం. దీని గురించి ఆయన చెప్పిన వివరణ – ‘‘గతం శూన్యం, వర్తమానం శూన్యం, భవిష్యత్తులో నిలుచున్నానని’’. వ.పా. కేవలం చిత్రకారుడే కాదు, రచయిత కూడా.
వడ్డాది పాపయ్య వ్యక్తిగత జీవితం సాధారణమైనది. 1947 లో నూకరాజమ్మను, 1984లో లక్ష్మి మంగమ్మను వివాహం చేసుకున్నారు. ఆయనకు ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె. కూతురు అనూరాధ మీద ప్రేమతో కశింకోటలో ‘పావన కుటీరం’ నిర్మించుకొని అక్కడే నివాసం ఉన్నారు. సాధారణంగా చిత్రకారులు మోడల్స్‌ను చూస్తూ బొమ్మలు గీస్తుంటారు. కాని పాపయ్య మాత్రం ఏనాడూ ఆవైపు పోలేదు. తన ఆలోచనల్లో ఉన్న రూపాలనే చిత్రాలుగా గీసేవారు. ఆయన చిత్రాలలో తెలుగు సంస్కృతి, తెలుగుదనం, ఆచార వ్యవహారాలు, అలంకరణలు, పండుగలు ప్రధాన అంశాలుగా ఉంటాయి. వ.పాకు తన గురించి ప్రచారం అంటే ఇష్టం ఉండేది కాదు. తన గురించి చిన్న సినిమా తీయాలన్న దూరదర్శన్‌ ప్రతిపాదనను కూడా ఒప్పుకోలేదు. కళాకారునిగా తనను అభిమానించవద్దని, తన కళనే అభిమానించమని అభిమానులను కోరేవాడు. కేవలం స్నేహితుల ఒత్తిడి కారణంగా ఖరగ్‌పూర్‌, శ్రీకాకుళంలలో తన చిత్రాలను ప్రదర్శనకు పెట్టాడు. కళా రూపాలను అమితంగా ఇష్టపడే వ.పా. నైరూప్య చిత్రకళ అంటే ఇష్టం చూపేవారు కాదు.
పాపయ్యగారి చిత్రకళ కేవలం ఆయన జీవిత కాలానికే పరిమితం కాలేదు. ఆయన కళా వారసత్వం నేటికీ చాలా మంది కొత్త చిత్రకారులకు స్ఫూర్తినిస్తోంది. పాత భారతీయ కళను కొత్త చిత్రకళా శైలితో కలిపిన ఆయన విధానం ఒక ప్రత్యేక పాఠంగా నిలిచింది. ఆయన గీసిన సున్నితమైన గీతలు, భావాలను చూపించే రంగులు, పాత్రల ఆత్మను పట్టుకునే నైపుణ్యం నేటి చిత్రకారులకు మార్గదర్శకాలుగా నిలిచాయి. ఇప్పుడు డిజిటల్‌ ఆర్ట్‌ యుగంలో కూడా, పాపయ్య కళాఖండాలు డిజిటల్‌ మాధ్యమాలలో మళ్లీ సృష్టించబడుతు న్నాయి, ఇది ఆయన కళాశైలి ఎప్పటికీ ఉండే గొప్పతనాన్ని సూచిస్త్తోంది. ఆయన బొమ్మలు తెలుగు ప్రజల సంస్కృతిలో ఒక భాగం అయిపోయాయి. చందమామలో ఆయన వేసిన ప్రతి బొమ్మ ఒక తరానికి బాల్యం మధురమైన జ్ఞాపకం. ఆయన బొమ్మలు క్యాలెండర్లు, పోస్టర్లు, పుస్తకాలపై అచ్చై ప్రతి ఇంట్లోను ఒక పవిత్ర స్థానాన్ని పొందాయి. ఈ విధంగా, ఆయన కళాకారుడుగానే కాకుండా, ఒక సంస్కృతిని ప్రచారం చేసేవాడుగా కూడా సేవలు అందించారు. భారతీయ పురాణాలను, సంస్కృతిని, విలువలను చాలా సులభమైన, అందమైన చిత్రాల ద్వారా సాధారణ ప్రజలకు దగ్గర చేశారు.తన చిత్రాల ద్వారా ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారు వ.పా. అయితే కొందరు విమర్శకులు వ.పా. చిత్రకళా శైలిని పట చిత్రకళ అని విమర్శించేవారు.
పాపయ్యగారు కేవలం చిత్రకారుడు కాదు, ఆయన ఒక కవి. ఆయన గీసిన ప్రతి చిత్రం ఒక నిశ్శబ్ద కవిత్వం లాంటిది. ఒక సాధారణ కాగితాన్ని, కొన్ని రంగులను ఉపయోగించి, ఆయన భావోద్వేగాలను, జీవితాన్ని, చరిత్రను సృష్టించారు. పాపయ్య బొమ్మలు భవిష్యత్‌ తరాలకు ఆయన గొప్ప సృజనాత్మకతకు, కష్టానికి, భారతీయ కళా సంస్కృతి పట్ల ఆయనకున్న ప్రేమకు సాక్ష్యంగా నిలిచి ఉంటాయి. ఆయన మరణం చిత్రకళా రంగానికి ఒక తీరని లోటు అయినప్పటికీ, ఆయన చిత్రాలు, ఆయన కళ ఎప్పటికీ సజీవంగా ఉంటాయి. ఆయన గీసిన ప్రతి చిత్రం ఒక నిశ్శబ్ద కవిత్వం లాంటిది, అది ఎల్లప్పుడూ మనలో స్ఫూర్తిని నింపుతూనే ఉంటుంది. వడ్డాది పాపయ్య మన మధ్య లేకపోయినా, ఆయన కళా ప్రపంచం మాత్రం సజీవంగా, మన హృదయాలలో నిలిచి ఉంటుంది.
` సంచాలకులు, భాషా సాంస్కృతిక శాఖ

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు