ఈ పథకం ద్వారా చేనేత కుటుంబాలకు ఏటా రూ.25 వేలు
అమరావతిలో హ్యాండ్లూమ్ మ్యూజియం
రూ.5 కోట్లతో పొదుపు నిధి ఏర్పాటు
అధికారికంగా ప్రగడ కోటయ్య జయంతి
జాతీయ చేనేత దినోత్సవంలో చంద్రబాబు వరాలు
విశాలాంధ్ర-సచివాలయం: చేనేత కుటుంబాల కోసం త్వరలో నేతన్న భరోసా పథకం తీసుకురానున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. ఈ పథకం ద్వారా చేనేత కుటుంబానికి ప్రతి సంవత్సరం రూ.25 వేలు ఇస్తామని చెప్పారు. తద్వారా చేనేతలకు ఆర్థిక భరోసా లభిస్తుందన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో గురువారం ఏర్పాటు చేసిన 11వ జాతీయ చేనేత దినోత్సవంలో పాల్గొన్న నేతన్నలకు సీఎం చంద్రబాబు వరాలు ప్రకటించారు. ఈ నెల నుంచి చేనేత కుటుంబాలకు 200 యూనిట్లు, మర మగ్గాలకు 500 యూనిట్లు ఉచితంగా ఇస్తామని హామీ ఇచ్చారు. ఉచిత విద్యుత్ వల్ల రాష్ట్రవ్యాప్తంగా 93 వేల కుటుంబాలకు లబ్ధి చేకూరుతుందని పేర్కొన్నారు. దీనికోసం ప్రభుత్వానికి ఏటా రూ.190 కోట్లు ఖర్చు అవుతుందన్నారు. నేతన్నలకు 50 ఏళ్లకే పింఛన్‌ను టీడీపీయే మొదలుపెట్టిందని, దీనివల్ల 92,724 కుటుంబాలకు లబ్ధి కలుగుతోందన్నారు. సామాజిక పింఛన్లు రూ.4,000కు పెంచడం ద్వారా ఏడాదికి రూ.546 కోట్లు కేవలం చేనేత కార్మికుల పెన్షన్ కోసం ఖర్చు చేస్తున్నామన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చినట్లుగా చేనేత ఉత్పత్తులపై విధించే ఐదు శాతం జీఎస్టీని రీయింబర్స్ చేస్తామన్నారు. దీనికి ఏడాదికి రూ.15 కోట్లను ప్రభుత్వం భరిస్తుందన్నారు. రూ.5 కోట్లతో పొదుపు నిధి (థ్రిఫ్ట్ ఫండ్) ఏర్పాటు చేస్తామని, తద్వారా 5,386 మంది చేనేత కళాకారులకు ప్రయోజనం చేకూరుతుందని సీఎం వివరించారు. రాష్ట్రంలోని మాస్టర్ వీవర్లు, కళాకారులు తమ ఉత్పత్తుల ద్వారా రూ.1,375 కోట్ల టర్నోవర్ సాధించారని అభినందించారు. అమరావతిలో హ్యాండ్లూమ్ మ్యూజియం ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. చేనేత కళాకారుల ఆదాయాన్ని రెట్టింపు చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. నేతన్నలకు అండగా నిలవాలనే ఉద్దేశంతో తొలిసారి నేతన్నలకు 50 ఏళ్లకే పింఛన్ ఇచ్చామని గుర్తుచేశారు. 2014-2019 మధ్య రూ.110 కోట్లతో చేనేత కళాకారుల రుణాలు మాఫీ చేశామన్నారు. 55,500 మంది కార్మికులకు రూ.2 లక్షల చొప్పున రూ.27 కోట్ల రుణాలిచ్చామని గుర్తుచేశారు. మరమగ్గాల కొనుగోలుకు 50 శాతం రాయితీ ఇచ్చి రూ.80 కోట్లు ఖర్చు చేశామని ముఖ్యమంత్రి వివరించారు. చేనేత పరిశ్రమను ముందుకు తీసుకెళ్లాలనే తపన ఉన్న పారిశ్రామికవేత్త సుచిత్రా ఎల్లాను సలహాదారుగా పెట్టుకున్నామన్నారు. ‘ఒక ఉత్పత్తి…ఒక జిల్లా’ కింద రాష్ట్రానికి వచ్చిన 9 అవార్డుల్లో గర్వకారణంగా పేర్కొన్నారు. ఓఎన్‌డీసీ ద్వారా ఉత్పత్తుల మార్కెట్ విస్తరిస్తున్నామన్నారు. చేనేతకు చేయూత ఇచ్చేందుకు నేషనల్ రూరల్ లైవ్లీ హుడ్ మిషన్ కింద ఐదు చోట్ల కొత్త హ్యాండ్లూమ్ క్లస్టర్లు ప్రారంభిస్తున్నామని తెలిపారు. మంగళగిరి, వెంకటగిరి, ఉప్పాడ, శ్రీకాళహస్తి, రాజాంలో రూ.74 కోట్లతో ఈ క్లస్టర్ల ఏర్పాటు జరుగుతోందని, వీటి ద్వారా 11,374 మంది చేనేత మహిళలకు లబ్ధి కలుగుతుందన్నారు.
చేనేత వైభవానికి పుట్టినిల్లు తెలుగు నేల
చేనేత వైభవానికి పుట్టినిల్లు తెలుగు నేల అని, ఆంధ్ర రాష్ట్రానికి సంపద చేనేతేనంటూ చంద్రబాబు కొనియాడారు. పొందూరు ఖద్దరును గాంధీజీ మెచ్చారని, నాగరికతకు మూలం నేతన్న హరప్పా కాలం నుంచి చేనేత అభివృద్ధి చెందిందన్నారు. కాకతీయుల కాలంలో నాణాలపైన చేనేతల ముద్రలు కనిపిస్తాయన్నారు. బ్రిటిష్ వారు వ్యాపారం కోసం ఇక్కడికి వచ్చి… చేనేతల జీవితంపై ప్రభావం చూపారని పేర్కొన్నారు. అందుకే గాంధీజీ సైతం విదేశీ వస్త్రాలు బహిష్కరించి కేవలం స్వదేశీ బట్టలు మాత్రమే ఉపయోగించమని చెప్పారన్న విషయాన్ని గుర్తు చేశారు. రాష్ట్రంలో వ్యవసాయం తర్వాత ఎక్కువమంది ఆధారపడేది చేనేత పరిశ్రమ పైనేనని సీఎం ఉద్ఘాటించారు. నైపుణ్యం, సృజనాత్మకత కలయిక అయిన మన చేనేత పరిశ్రమ భారతీయ శక్తికి, సంస్కృతికి, సంప్రదాయాలకు ప్రతీక అని కొనియాడారు. చేనేతలకు తెలుగుదేశం పార్టీతో అవినాభావ సంబంధం ఉందన్నారు. చేనేతలకు మొదటగా ఉపాధి కల్పించిన నాయకుడు ఎన్టీఆర్ అని పేర్కొన్నారు. 40 సంవత్సరాల తన రాజకీయ జీవితంలో చేనేతల కోసం రాజీలేని పోరాటం చేశానని చంద్రబాబు చెప్పుకొచ్చారు. అధికారంలో ఉన్నా… లేకపోయినా తెలుగుదేశం పార్టీ చేనేత కార్మికుల కోసం పోరాటం చేసిందని గుర్తుచేశారు. రాష్ట్రం ఆర్థిక కష్టాల్లో ఉన్నప్పటికీ తనకు మొట్టమొదట గుర్తుకువచ్చేది చేనేత కార్మికులేనని సీఎం అన్నారు. రాబోయే నాలుగేళ్లలో రూ.2 లక్షల కోట్లు బీసీలకు ఖర్చు చేస్తామన్నారు. చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్లు వచ్చేవరకూ పోరాడతామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. చేనేత వర్గాల ప్రయోజనం కోసం సత్యాగ్రహం చేసిన చేనేత సూర్యుడు ప్రగడ కోటయ్య జయంతిని ప్రభుత్వం తరపున అధికారికంగా నిర్వహిస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. విజయవాడ-గుంటూరు జాతీయ రహదారిపై ఎన్నారై ఆస్పత్రి సమీపంలో ఏర్పాటు చేసిన చేనేత సర్కిల్‌లో ప్రగడ కోటయ్య కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామన్నారు.


