. చంద్రబాబు డబుల్ ఇంజిన్ సర్కారుపై రామకృష్ణ
. ప్రజాఉద్యమాల నిర్మాణానికి వేదికగా రాష్ట్ర మహాసభలు
. ట్రంప్‌తో మోదీ లాలూచీ
. 23న మహాప్రదర్శన జయప్రదానికి పిలుపు
. సీపీఐ 28వ రాష్ట్ర మహాసభల పోస్టరు ఆవిష్కరణ
విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : కేంద్రంలోను, రాష్ట్రంలోను అధికారంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వాల ప్రజావ్యతిరేక విధానాలపై భావి ప్రజా ఉద్యమాలకు ఈనెల 20 నుంచి 25 వరకు ఒంగోలులో జరగనున్న సీపీఐ రాష్ట్ర మహాసభలు వేదిక కానున్నాయని పార్టీ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ వెల్లడిరచారు. రాబోయే రోజుల్లో వామపక్ష, ప్రజాతంత్ర శక్తులను సంఘటితం చేసి…పెద్దఎత్తున ఉద్యమించేందుకు మహాసభలు కేంద్ర బిందువు కానున్నాయని, ఆ దిశగా కీలక నిర్ణయాలు తీసుకోనున్నామని చెప్పారు. విజయవాడ దాసరిభవన్‌లో సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్సీ, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జల్లి విల్సన్, పి.హరినాథ్‌రెడ్డి, డేగా ప్రభాకర్‌తో కలిసి రామకృష్ణ పార్టీ 28వ రాష్ట్ర మహాసభల పోస్టరును గురువారం ఆవిష్కరించారు. అనంతరం రామకృష్ణ విలేకరులతో మాట్లాడుతూ మహాసభలలో సాంస్కృతిక రంగానికి పెద్దపీట వేయనున్నామని, అనేక మంది కళాకారులు భాగస్వాములు కానున్నారని చెప్పారు. మహాసభల సందర్భంగా ఈ నెల 23వ తేదీ సాయంత్రం మూడు గంటలకు మహాప్రదర్శనను, అనంతరం కొత్తమార్కెట్ మైదానంలో నిర్వహించే బహిరంగ సభను జయప్రదం చేయాలని పార్టీ శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు. మహాసభలకు ముఖ్యఅతిథులుగా సీపీఐ ప్రధాన కార్యదర్శి, మాజీ ఎంపీ డి.రాజా, పార్టీ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె.నారాయణ, సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, ఏఐకేఎస్ జాతీయ ప్రధాన కార్యదర్శి రావుల వెంకయ్య తదితరులు హాజరవుతారని వివరించారు. మహాసభల సందర్భంగా 20వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్యమండలి అధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలు కొనసాగుతాయన్నారు. ఇందులో అనేకమంది కళాకారులు, సినీరంగ ప్రముఖులు, దర్శక, నిర్మాతలు, రచయితలు, కవులు పెద్దసంఖ్యలో పాల్గొంటారన్నారు. వారిలో వందేమాతరం శ్రీనివాస్, గోరటి వెంకన్న, తమ్మారెడ్డి భరద్వాజ, సుద్దాల అశోక్ తేజ, జయరాజ్, బాబ్జీ, ఏపూరి సోమన్న తదితర కళాకారులు హాజరుకానున్నారని తెలిపారు. మహాసభలలో గతం కంటే భిన్నంగా సాంస్కృంతిక రంగానికి పెద్దపీట వేయాలని పార్టీ నిర్ణయించిందన్నారు. దేశవ్యాప్తంగా మన సంస్కృతిని కించపరచడం, మత ఉన్మాదాన్ని రెచ్చగొట్టే పద్ధతులకు వ్యతిరేకంగా గొప్ప సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టనున్నామని చెప్పారు. కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ వైపే ప్రపంచమంతా చూస్తోందని, ఆయన ధైర్యవంతుడని కొద్దిమంది మేథావులు, రాజకీయ పార్టీలు, ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీ శక్తులు గొప్పలు చెప్పుకోవడాన్ని, దేశ ప్రతిష్ఠ ప్రపంచవ్యాప్తంగా పెరిగిపోయినట్లుగా అవాస్తవాలు ప్రచారం చేయడాన్ని రామకృష్ణ తప్పుపట్టారు. అయితే, తాజాగా మోదీ డొల్లతనం అందరికీ అర్థమవుతోందన్నారు. మోదీ, ట్రంప్ మంచి మిత్రులుగా చెప్పుకున్నారని, దేశాన్ని ట్రంప్ అవమానించేలా వ్యవహరిస్తున్నప్పటికీ ప్రధాని నోరు మెదపకపోవడం దారుణమని అన్నారు. భారత్ ఎవరితో వ్యాపారం చేయాలో, ఎవరితో చేయకూడదో శాసించే స్థాయికి ట్రంప్ వెళ్లడం వెనుక మోదీ డొల్లతనం కనిపిస్తోందని విమర్శించారు. రష్యాతో చమురు కొనుగోలు అంశంలో 50 శాతం పన్నులు వేస్తానని బెదిరించడంతోపాటు భారత్`పాకిస్థాన్ యుద్ధాన్ని తానే ఆపినట్లుగా పదేపదే ట్రంప్ చెప్పుకున్నారని గుర్తుచేశారు. పార్లమెంట్‌లో గంటన్నర మాట్లాడిన మోదీ… కనీసం ట్రంప్ పేరెత్తేందుకు భయపడ్డారన్నారు. గతంలో ఏనాడూ భారత్ ఇంత అవమానాలకు గురికాలేదని, మోదీ గద్దెనెక్కిన 11 ఏళ్లల్లో ఒక్క సమస్యా పరిష్కారానికి నోచుకోలేదని వివరించారు. డబుల్ ఇంజిన్ సర్కారు పేరుతో డబుల్ స్పీడ్‌తో అప్పులు చేయడం తప్ప రాష్ట్రానికి సాధించిందేమిటని నిలదీశారు. ఏడాది చంద్రబాబు ప్రభుత్వ హయాంలో లక్షా 75 వేల కోట్ల అప్పులు తెచ్చారన్నారు. వైఎస్ జగన్ తరహాలోనే ఇప్పుడు చంద్రబాబు పరిపాలన ఉందని మండిపడ్డారు. నాడు జగన్ స్మార్ట్ మీటర్ల బిగింపునకు సిద్ధమైతే… చంద్రబాబు వాటిని పగులగొట్టాలని పిలుపునిచ్చారని, ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం కూడా స్మార్ట్ మీటర్ల బిగింపునకు సిద్ధమవ్వడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యుత్ చార్జీలు తగ్గిస్తామని అధికారంలోకి వచ్చి… పెంచుతున్నారని, రూ.15,480 కోట్ల భారం ప్రజలపై మోపుతున్నారని, అదానీతో సోలార్ విద్యుత్ ఒప్పందాలపై చంద్రబాబు మాట తప్పారని దుయ్యబట్టారు. మోదీ స్నేహితుడు అదానీపై అమెరికా కోర్టులో కేసు ఉందని, అదానీ కోసమే ట్రంప్ దగ్గర మోదీ భయపడుతున్నారని అన్నారు. విద్యార్థి నాయకులు ఎవరూ పాఠశాలలు, కళాశాలలకు వెళ్లే పరిస్థితి లేకుండా ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వడాన్ని తప్పుపట్టారు. రాష్ట్రంలో మళ్లీ పోలీసు రాజ్యం తెచ్చేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని, భూములు పెద్దఎత్తున కబ్జాకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. విజయవాడ గవర్నరుపేట ఆర్టీసీ బస్టాండ్, డిపో స్థలాలను లూలూకు 99 ఏళ్లపాటు అద్దెకు ఇవ్వడం అంటే… ఉచితంగా కట్టబెట్టడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాలకుల ప్రజా వ్యతిరేక విధానాలపైన మహాసభల్లో చర్చించబోతున్నామని, ప్రత్యేకించి రాష్ట్ర అభివృద్ధి ఏ విధంగా ఉండాలన్న దానిపై తీర్మానం రూపొందించబోతున్నామని వివరించారు. మహాసభల విజయవంతానికి అందరూ సహకరించాలని, మహాప్రదర్శన, బహిరంగసభలను జయప్రదం చేయాలని పార్టీ శ్రేణులకు, ప్రజానీకానికి రామకృష్ణ విజ్ఞప్తి చేశారు.


