నాలుగు రోజుల పర్యటన` 36 కార్యక్రమాలు
ప్రపంచ ఆర్థిక సదస్సులో పారిశ్రామికవేత్తలతో వరుస భేటీలు
తొలిరోజు 20 దేశాల ఎన్నార్టీలతో తెలుగు డయాస్పోరా
23న తిరిగి భారత్‌కు సీఎం
విశాలాంధ్ర బ్యూరో`అమరావతి: ప్రపంచ ఆర్థిక ఫోరం కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రులు, అధికారుల బృందం ఆదివారం నుంచి నాలుగు రోజులు దావోస్‌లో పర్యటించనుంది. 19వ తేదీ నుంచి 22వ తేదీ వరకూ దావోస్ సదస్సులో భాగంగా వివిధ పారిశ్రామికవేత్తలతో ముఖ్యమంత్రి ముఖాముఖి భేటీలు అవుతారు. అనేక కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. సీఎం ఆదివారం రాత్రి 8.35 గంటలకు విజయవాడ నుంచి దిల్లీకి వెళతారు. 19 తేదీ రాత్రి 01.45 గంటలకు దిల్లీ నుంచి జ్యూరిక్‌కు పయనమవుతారు. జ్యూరిక్‌లోని హిల్టన్ హోటల్‌కు చేరుకొంటారు. అక్కడ స్విట్జర్లాండ్ భారతీయ రాయబారి మృదుల్ కుమార్‌తో మర్యాదపూర్వకంగా భేటీ అవుతారు. అనంతరం ఎరోస్ ఇన్నోవేషన్ వ్యవస్థాపక చైర్మన్ కిశోర్ లుల్లా, సహ అధ్యక్షులు రిథిమా లుల్లా, స్వనీత్ సింగ్ కూడా చంద్రబాబుతో సమావేశమవుతారు. భారత ఎంబసీ అధ్వర్యంలో హోటల్‌లో ఏర్పాటు చేసిన తెలుగు డయాస్పోరా కార్యక్రమానికి సీఎం హాజరవుతారు. మొత్తం 20 దేశాల నుంచి వచ్చే ఎన్‌ఆర్‌టీలతో ఈ కార్యక్రమం జరుగుతోంది. అనంతరం జ్యూరిక్ నుంచి రోడ్డు మార్గాన దావోస్‌కు చంద్రబాబు వెళ్లనున్నారు. సదస్సు తొలిరోజు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) ఆర్థిక, పర్యాటక శాఖల మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ అల్ మర్రితో వివిధ దేశాల సమావేశంలో ఆయన పాల్గొంటారు. నాపై టాటా సన్స్ చైర్మన్ ఎన్.చంద్రశేఖరన్‌ను ఏపీ ఐటీ మంత్రి నారా లోకేశ్‌తో కలిసి భేటీ కానున్నారు. సీఐఐ డైరెక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ కూడా దావోస్ వేదికగా సీఎంతో సమావేశం కానున్నారు. విదేశీ మీడియా సంస్థ పొలిటికోకు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక ఇంటర్వ్యూ కూడా ఇవ్వనున్నారు. రెండో రోజు పర్యటనలో భాగంగా హోటల్ మోరోసాని ప్రోమెనేడ్‌లో ఇండియా ఎట్ సెంటర్ జియోగ్రఫీ గ్రోత్ – ఏపీ అడ్వాంటేజ్ పేరిట సీఐఐ నిర్వహిస్తున్న బ్రేక్ ఫాస్ట్ సెషన్‌లో సీఎం పాల్గొననున్నారు. అనంతరం భారత ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇండియా లాంజ్ ప్రారంభోత్సవానికి హాజరవుతారు. దిగ్గజ ఐటీ సంస్థ ఐబీఎం చైర్మన్ సీఈఓ అరవింద్ కృష్ణతో, గూగుల్ క్లౌడ్ సీఈఓ థామస్ కురియన్‌తోనూ సమావేశమవుతారు. ముఖాముఖి భేటీల అనంతరం ఏపీ లాంజ్‌లో ‘వన్ ఫ్యామిలీ- వన్ ఎంటర్ ప్రెన్యూర్ ప్యానల్ డిస్కషన్’లో పాల్గొంటారు. ప్రముఖ అంతర్జాతీయ మీడియా సంస్థ సీఎన్ బీసీ ఇంటర్నేషనల్‌కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇస్తారు. దావోస్ కాంగ్రెస్ సెంటర్‌లో వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ ఆర్గనైజేషన్ డైరెక్టర్ జనరల్ డారెన్ టాంక్, అనిల్ మూర్తిలతో సీఎం సమావేశమవుతారు. స్విట్జర్లాండ్ ఆర్థిక వ్యవహారాల సహాయ మంత్రి హెలెన్ బడ్లిజెర్ అర్టెడా, రాయబారి ఆండ్రియా రౌబర్‌తో చంద్రబాబు చర్చలు జరుపుతారు. స్విట్జర్లాండ్ పార్లమెంటు సభ్యుడు, భారత- స్విస్ ఫ్రెండ్‌షిప్ గ్రూప్ అధ్యక్షుడు నిక్ గుగ్గర్ సహా ఇతరులతో సీఎం సమావేశం కానున్నారు. ఎన్విడియా ఉపాధ్యక్షుడు కాలిస్టా రెడ్మండ్‌తో, ఇజ్రాయిల్ ఆర్థిక పారిశ్రామిక విభాగం మంత్రి నిర్ బర్కత్, ఆ దేశ ట్రేడ్ కమిషనర్ రోయ్ ఫిషర్, స్విట్జర్లాండ్‌లో ఇజ్రాయిల్ ఎకనామిక్ ట్రేడ్ మిన్ హెడ్ షిర్ స్లడ్జ్కీ తోనూ ముఖ్యమంత్రి చర్చలు జరపనున్నారు. జేఎస్ డబ్ల్యూ గ్రూప్ చైర్మన్ ఎండీ సజ్జన్ జిందాల్, జేఎస్ డబ్ల్యూ సిమెంట్స్, పెయింట్స్ సంస్థల ఎండీ పార్ధ్ జిందాల్‌తో, అంతర్జాతీయ కంటైనర్ లాజిస్టిక్స్ సంస్థ మోలర్ మేర్క్స్ సీఈఓ విన్సెంట్ క్లెర్క్‌తో సీఎం సమావేశమవుతారు. మొత్తంగా 36 కార్యక్రమాల్లో చంద్రబాబు పాల్గొంటారు. ప్రభుత్వాల మధ్య జరిగే మూడు సమావేశాల్లో భాగస్వాములవుతారు. పారిశ్రామికవేత్తలతో 16 వన్ టు వన్ సమావేశాలు జరగనున్నాయి. తొమ్మిది రౌండ్ టేబుల్ సమావేశాలు, ప్లీనరీ సెషన్స్‌లో సీఎం పాల్గొంటారు. సీఎన్బీసీ ఇంటర్నేషనల్ సహా వివిధ అంతర్జాతీయ మీడియా సంస్థలకు ఇంటర్వ్యూలు ఇస్తారు. ఈనెల 22న దావోస్ నుంచి జ్యూరిక్‌కు చేరుకుని స్విట్జర్లాండ్ కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2.35 గంటలకు సీఎం భారత్‌కు బయల్దేరతారు. 23వ తేదీ ఉదయం 8.25 గంటలకు హైదరాబాద్ చేరుకోనున్నారు.


