. అమెరికా, ఇజ్రాయిల్‌కు ఇరాన్ స్పష్టీకరణ
. యుద్ధం ఆగాలంటే… మూడు షరతులు
. అప్ప్పుడే శాంతి స్థాపన: పెజెష్కియాన్
తెహ్రాన్: పశ్చిమాసియా యుద్ధం గురువారం 13వ రోజుకు చేరుకుంది. అమెరికాఇజ్రాయిల్ సంయుక్త దాడులతో భీకర పోరులో కొనసాగుతోంది. ఇరాన్ రాజధాని తెహ్రాన్‌తో పాటు అనేక నగరాలు వరుస దాడులతో దద్దరిల్లాయి. రెండు విదేశీ ట్యాంకర్లపై దాడులతో చమురు పోర్ట్ కార్యకలాపాలను ఇరాక్ నిలిపివేసింది. ఇరాన్ క్షిపణులు, డ్రోన్లను గల్ఫ్ దేశాలు ఎదుర్కొన్నాయి. తాను ఎప్ప్పుడంటే అప్ప్పుడే యుద్ధానికి తెర దించవచ్చని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటనను ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ తోసిపుచ్చారు. అమెరికాఇజ్రాయిల్ దిగిరావాల్సిందేనని తేల్చిచెప్పారు. యుద్ధం ఆగాలంటే మూడు షరతులు వర్తిస్తాయని స్పష్టంచేశారు. రష్యా, పాకిస్థాన్ దేశాధినేతలతో చర్చల అనంతరం ఎక్స్ మాధ్యమంగా శాంతి స్థాపనకు మార్గాన్ని ఆయన సూచించారు. యుద్ధం ఆగాలంటే తమ షరతులకు ఒప్ప్పుకోవాలన్నారు. అంతర్జాతీయ వేదికలపై ఇరాన్ సార్వభౌమాధికారాన్ని, దాని చట్టబద్ధమైన హక్కులను గుర్తించాలని… ఇప్పటివరకు జరిగిన ప్రాణ, ఆస్తి నష్టానికి అమెరికా, ఇజ్రాయిల్ భారీగా పరిహారం చెల్లించాలని… భవిష్యత్తులో ఇరాన్‌పై ఎలాంటి దాడులు జరగవని అంతర్జాతీయ సమాజం హామీ ఇవ్వాలని పెజెష్కియాన్ అన్నారు. అయితే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మొండి వైఖరితో శాంతి స్థాపన ఆశలు సన్నగిల్లుతున్నాయి.
యునెస్కో… మౌనం ఎందుకు: అరాగ్చీ
తమ దేశ వారసత్వ సందపను ఇజ్రాయిల్ లక్ష్యంగా చేసుకుంటోందని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ తెలిపారు. చారిత్రక క్షేత్రాలపై దాడులు చేస్తున్నదని ఆరోపించారు. 14వ శతాబ్దపు యునెస్కో గురించిన ప్రదేశాలపై బాంబులు కురిపిస్తోందని ఎక్స్ మాధ్యమంగా వెల్లడించారు. ఈ దాడులపై యునెస్కో స్పందనకు డిమాండ్ చేశారు. కనీసం శతాబ్దం కూడా పూర్తి చేసుకోని రాజ్యం… చరిత్ర కలిగిన దేశాలను చూసి ఓర్లలేకపోవడం సహజమే. కానీ యునెస్కో ఎక్కడున్నది? ఎందుకు మౌనం వహిస్తోంది? ఇది ఎంత మాత్రం ఆమోదయోగ్యం కాదు? అని అరాగ్చీ ఆగ్రహం వ్యక్తంచేశారు.
విద్యుత్ కేంద్రాలపై దాడి చేశారో: లారిజాని
ఇరాన్ అత్యున్నత జాతీయ భద్రతా మండలి కార్యదర్శి అలీ లారిజాని మాట్లాడుతూ అమెరికా అధ్యక్షుడు బెదిరించినట్లు ఇరాన్ విద్యుత్ నెట్‌వర్క్‌పై దాడులు చేస్తే, ఈ ప్రాంతం మొత్తం అంధకారంలో చిక్కుకుంటుందని అన్నారు. ‘ఇరాన్ విద్యుత్ సామర్థ్యాన్ని గంటలో దెబ్బతీయగలమని డొనాల్డ్ ట్రంప్ బెదిరించారు కానీ అందుకు ధైర్యంచేయలేదు. ఆయన చెప్పినట్లు చేస్తే అరగంటలో ఈ ప్రాంతం మొత్తం చీకటవుతుంది. నా వెంటనే అమెరికా సేనలను వేడాడటం చాలా సులువు అవుతుంది’ అని లారిజాని అన్నారు. అంతర్జాతీయ చమురు సరఫరాను నిలిపివేస్తే విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు లక్ష్యంగా దాడులు చేస్తామని ట్రంప్ హెచ్చరించిన విషయం విదితమే.
చమురు కష్టాలు
ఈ యుద్ధం రెండు, మూడు దేశాలకు పరిమితం కాలేదు. ఇరాన్ చమురు ట్యాంకర్లపై దాడులు, అత్యంత కీలకమైన హోర్ముజ్ జలసంధి మూతపడటంతో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు భగ్గుమన్నాయి. అనేక దేశాలపై ప్రభావం తీవ్రంగా ఉండనుంది. అంతర్జాతీయ సరఫరా గొలుసు దెబ్బతినడంతో ఇంధన సంక్షోభం తలెత్తే ప్రమాదం పొంచి ఉంది. భారత్‌కు చెందిన నౌకకు హోర్ముజ్ గుండా ప్రయాణానికి ఇరాన్ అవకాశం కల్పించింది. లిబియా జెండాతో ఉన్న ట్యాంకర్ సౌదీ చమురుతో భారత్‌లోని ముంబై పోర్టుకు చేరుకుంది. యుద్ధం మొదలైన తర్వాత సురక్షితంగా గమ్యస్థానానికి చేరుకున్న తొలి రవాణా నౌకగా నిలిచింది. హోర్ముజ్ జల సంధి సమీపంలో ఇరాన్ దాడులు పెంచింది. దీంతో ఇరాక్ జలాల్లో ఇంధన ట్యాంకర్‌పై దాడి చేసింది. అమెరికాకు చెందిన నౌక లక్ష్యంగా జరిగిన దాడిలో ఓ భారతీయుడు చనిపోయారు. మరోవైపు అంతర్జాతీయంగా బ్రెంట్ ముడి చమురు బ్యారల్ ధర 100 డాలర్లకు చేరుకుంది. అమెరికా బెంచ్‌మార్క్ ముడిచమురు బ్యారల్ 95 డాలర్లు పలికింది. ఈ యుద్ధంలో అమెరికా గెలిచినట్లు ఆ దేశాధ్యక్షుడు పదే పదే ప్రకటనలు చేసుకున్నారు. తాను ఎప్ప్పుడంటే అప్ప్పుడే యుద్ధం ఆగిపోతుందని చెప్ప్పుకున్నారు. కానీ ఇరాన్ ప్రభుత్వానికి ఢోకా లేదని, ఆ దేశ ప్రజలపై పాలక వర్గానికి పట్టు సడలలేదని అమెరికా ఇంటెలిజెన్స్ నివేదిక ఆయన ప్రకటనలను నీరుగార్చింది.
గల్ఫ్‌పై ప్రతిదాడులు
గల్ఫ్‌పై ఇరాన్ ప్రతి దాడులను కొనసాగించింది. కువైట్, యూఏఈ, సౌదీ అరేబియాపై క్షిపణులు, డ్రోన్లు ప్రయోగించింది. కువైట్ విమానాశ్రయంపై డ్రోన్ దాడి జరుగగా, శిథిలాల కారణంగా ఆ దేశ విద్యుత్ తీగలు దెబ్బతిన్నాయి. తమ చమురు క్షేత్రాలపైకి ప్రయోగించిన డ్రోన్లను అడ్డుకుంటున్నట్లు సౌదీ అరేబియా వెల్లడించింది. ఓ డ్రోన్ దాడి కారణంగా దుబాయ్‌లోని నిర్వాసిత భవనంలో స్వల్ప అగ్ని ప్రమాదం సంభవించింది. దుబాయ్, సౌదీ, ఖతార్‌లోని అమెరికా సైనిక స్థావరాలు లక్ష్యంగా ఇరాన్ విరుచుకుపడింది. దుబాయ్‌లోని డౌన్ టౌన్‌పై డ్రోన్ దాడి చేసింది. దీంతో స్వల్ప నష్టం వాటిల్లినట్లు దుబాయ్ అధికారులు వెల్లడించారు. ఇప్పటివరకు గల్ఫ్ దేశాల్లో 24 మంది ఇరాన్ దాడుల్లో మరణించారని, అనేక మంది గాయపడ్డారని తెలిపారు. మతుల్లో ఏడుగురు అమెరికన్లు ఉన్నారన్నారు. గురువారం ఉదయం దుబాయ్ తీరంలోని పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో ఒక కంటైనర్ షిప్‌పై దాడిలో నౌకా సిబ్బందికి ఎలాంటి గాయాలు కాలేదని బ్రిటీష్ మిలిటరీ అధికారులు తెలిపారు. బహ్రెయిన్‌లోని ముహర్రక్ ఐలాండ్‌పై ఇరాన్ డ్రోన్ దాడితో స్వల్ప అగ్ని ప్రమాదం జరిగింది. క”వైట్‌లోని నివాస భవనంపై ఇరాన్ దాడిలో ఇద్దరు గాయపడ్డారు. ఒక డ్రోన్‌ను రియాద్ సమీపంలో కూల్చినట్లు సౌదీ అరేబియా తెలిపింది. కాగా యుద్ధం క్రమంలో ఇప్పటివరకు 19 వాణిజ్య నౌకలపై దాడి జరిగింది.
200 రాకెట్లతో హెజ్బుల్లా దాడి: ఐడీఎఫ్
లెబనాన్‌పై ఇజ్రాయిల్ దాడులకు హెజ్బుల్లా ప్రతి కారం తీర్చుకుంటోంది. ఇజ్రాయిల్ లక్ష్యంగా అర్ధరాత్రి 200 రాకెట్లు20 డ్రోన్లతో విరుచుకుపడింది. ఒకేసారి వందకు పైగా రాకెట్లT ప్రయోగించింది. రాత్రంతా వరుసగా రాకెట్లT వదిలింది. దీంతో ఇజ్రాయిలీలు ప్రాణ భయంతో షెల్టర్లలో ఆశ్రయం పొందారు. గత వారం రోజుల్లో ఇంత భారీస్థాయిలో హెజ్బుల్లా దాడి చేయడం ఇదే మొదటిసారి. ఇరాన్ కూడా ఇజ్రాయిల్‌పై క్షిపణి దాడి చేసింది. హెజ్బుల్లా దాడి గురించి ప్రజలను అప్రమత్తం చేయడంలో విఫలమైనట్లు ఐడీఎఫ్ అంగీకరించింది. హెజ్బుల్లా దాడి మొదలైన తర్వాత ఉత్తర ఇజ్రాయిల్ ప్రజలకు సందేశాలు పంపింది. అప్పటికే ఆలస్యం జరిగింనట్లు ఐడీఎఫ్ వెల్లడించింది. అన్ని డ్రోన్లT అడ్డుక్నుట్లు, చాలా వరకు రాకెట్లను గాల్లోనే పేల్చివేసినట్లు తెలిపింది. కొన్ని రాకెట్లు నివాస ప్రాంతాల్లో పడ్డాయని ఐడీఎఫ్ పేర్కొంది. తూర్పుదక్షిణ లెబనాన్‌పై వరుస దాడులతో ఐడీఎఫ్ విరుచుకుపడింది. తూర్పు లెబనాన్‌లోని డౌరిస్ గ్రామాన్ని వీడాలని స్థానికులకు హెచ్చరికలు చేసింది.
ఇరాన్లో తలేఘాన్ అణు కేంద్రం ధ్వంసం: ఇరాన్లో అణు కేంద్రాన్ని ఇజ్రాయిల్ ధ్వంసం చేసింది. అణ్వాయుధాల తయారీ, పరీక్షలకు ఈ కేంద్రం కీలకమని, దానిపై దాడి చేశామని ఐడీఎఫ్ వెల్లడించింది. తెహ్రాన్‌కు ఆగ్నేయంగా 30 కిలోమీటర్ల దూరంలో ‘తలేఘాన’ కాంపౌండ్‌పై వైమానిక దళాలు జరిపినట్లు తెలిపింది. ఇరాన్ ఇటీవల అత్యాధునిక పేలుడు పదార్ధాలను ఇక్కడే తయారు చేసినట్లు ఐడీఎఫ్ ఆరోపించింది. ఏఎంఏడీ ప్రాజెక్టు కోసం అత్యంత సున్నితమైన పరీక్షలు చేపట్టినట్లు పేర్కొంది. ఇరాన్ అత్యంత రహస్యంగా అమద్ ప్రాజెక్టును చేపడుతున్నది. ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ ప్రకారం ఈ ప్రాజెక్టులో భాగంగా 1989 నుంచి 2003 వరకు తలేఘాన్ కేంద్రంలో ఇరాన్ అణ్వాయుధాలు తయారు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. 2024 అక్టోబర్‌లో జరిగిన దాడిలో తలేఘాన్ కాంపౌండ్ దెబ్బతిన్నది. ఈ కాంపౌండ్‌ను మళ్లీ పునర్నిర్మిస్తున్న నేపథ్యంలో ఇజ్రాయిల్ దాన్ని లక్ష్యంగా చేసుకుంది. తలేఘాన్ నుంచే ఇరాన్ అణ్వాయుధాన్ని అభివృద్ధి చేస్తున్నట్లు ఆధారాలు ఉన్నాయని పేర్కొంది.
అమెరికా నిఘా వైఫల్యంతోనే స్కూలుపై దాడి
అమెరికా నిఘా వైఫల్యం కారణంగానే స్కూల్‌పై దాడి చేసినట్లు న్యూయార్క్ టైమ్స్ వెల్లడించింది. ఫిబ్రవరి 28న మినాబ్‌లోని ఓ పాఠశాలను క్షిపణి తాకిన ఘటనలో 160 మందికి పైగా చిన్నారులు, 14 మంది టీచర్లు ప్రాణాలు కోల్పోయినట్లు ఇరాన్ మీడియా వెల్లడించింది. అమెరికా ప్రయోగించిన తొమహాక్ క్షిపణే ఇందుకు కారణమని వార్తలొచ్చాయి. పాత డేటా ఆధారంగా అమెరికా సెంట్రల్ కమాండ్ ఈ లక్ష్యాన్ని నిర్ధరించడంలో తప్ప్పు చేసినట్లు తెలుస్తోంది. 2013 నాటి శాటిలైట్ చిత్రాల ద్వారా ఈ పాఠశాల, ఐఆర్జీసీ బేస్ ఒకే ప్రాంగణంలోఉన్నట్లు తెలిసింది.
2016 నాటి ఉపగ్రహ చిత్రాలను పరిశీలిస్తే ఈ రెండింటి మధ్య కంచె ఉంది. స్కూల్ భవనానికి ప్రత్యేక ప్రవేశ మార్గం కూడా ఉంది. పాఠశాల ప్రాంగణంలో పిల్లలు ఆడుకుంటున్నట్లు గతేడాది డిసెంబరు నాటి శాటిలైట్ ఫొటోల్లో ఉంది. ఈ విషయాన్ని అమెరికా నిఘా వర్గాలు గమనించలేదు. లక్ష్యాలను నిర్దేశించడంతో జరిగిన తప్పిదంతోనే పాఠశాలపై క్షిపణి దాడి జరిగింది. ఈ ఘటనపై అమెరికా ప్రాథమిక దర్యాప్తులో ఈ విషయం వెలడైంది.


