Homeసాహిత్యంనవ వసంత నాదం-పరాభవ విజయగీతం

నవ వసంత నాదం-పరాభవ విజయగీతం

- Advertisement -

చైత్రశుద్ధ పాడ్యమి చిగురించిన వేళ
కాలచక్రం మరో పుట తిప్పిన క్షణమే ఉగాది;
ప్రకృతి పుటలపై నవ చైతన్యం రాసే పర్వదినం,
మనసుల్లో ఆశల దీపాలు వెలిగించే మంగళం.
వసంత సమీరాలు తాకిన ప్రతి కొమ్మలో
నవ పల్లవాల నవ్వులు విరుస్తుంటే,
మన బతుకు వృక్షాలలోనూ
నూతన సంకల్పాలు పచ్చగా మొలకెత్తాలి.
వేపపూత చేదు చెబుతుంది –
జీవితాన కష్టాలు సైతం అనుభవ పాఠాలేనని;
బెల్లం మాధుర్యం గుర్తుచేస్తుంది –
సహనానికి లభించే ఫలితం తీపి అని.
చింతపండు పులుపు తెలుపుతుంది –
వైఫల్యాలు సైతం మేధకు పదును పెడతాయని;
మామిడిముక్కల వగరు చెబుతుంది –
శ్రమతోనే విజయపు వసంతం సిద్ధించునని.
ఉప్పు రుచి చాటుతుంది –
సమతుల్యతే జీవన విజయ రహస్యమని;
మిరియాల ఘాటు హెచ్చరిస్తుంది –
నిర్భయమే మనిషికి అసలైన బలమని.
ఇదే ఉగాది పచ్చడి పరమార్థం –
షడ్రుచుల సమ్మేళనమే జీవన సత్యం;
ఆనందం, ఆవేదన, ఆశ, ఆత్మస్థైర్యం –
అన్నీ కలిసిన బతుకు స్వర సమ్మేళనం.

‘పరాభవ’ అనే ఈ తెలుగు వత్సర నామం –
అవమానం, తిరస్కారం, నాశనం అనిమాత్రమే కాదు;
‘పరా’అంటే శ్రేష్టమైన,
‘భవ’అంటే పుట్టుకఅని అర్థం!
శ్రేష్టమైన ఆశయాలకు జన్మనిచ్చే శుభారంభమిది,
పడినా తిరిగి లేవడమే
విజయమని చాటే సంకేతమిది.
ఈ ఉగాది వేళ –
మనలోని చీకట్లను విడిచిపెట్టి
నూతన చైతన్య కిరణాలను ఆహ్వానిద్దాం;
మానవత్వం పూయించే మహోత్సవం చేద్దాం.
మన మాటలో మాధుర్యం, చేతలో సహకారం,
అడుగుల్లో అభ్యుదయం, సమాజాన సత్సంకల్పం-
వికసించినప్పుడే ఈ ఉగాది సార్థకమవుతుంది.
కాలం మారడమే కాదు,
మనిషి మనసు మారినప్పుడే –
అది నిజమైన వసంతమై వెలుగుతుంది.
దాసశ్రీ, 9963249775

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు