Homeసాహిత్యం‘మధురకవి’ మల్లవరపు జాన్ పద్యకవిత్వంలో ప్రజాచైతన్యం

‘మధురకవి’ మల్లవరపు జాన్ పద్యకవిత్వంలో ప్రజాచైతన్యం

- Advertisement -

డా॥ ఎల్లే విజయానందరాజు

తొలితరం దళిత కవులలో ‘మధురకవి’ గా ప్రసిద్ధిపొందిన మల్లవరపు జాన్ ఈతరం కవులకు అంతగా పరిచయం లేకపోవచ్చు కానీ జాషువా నంతర పద్యకవులకు సుపరిచితులే. వీరు 22 జనవరి 1927లో ప్రకాశం జిల్లా, చీమకుర్తి అనేగ్రామంలో రత్నమ్మ, డేవిడ్ దంపతులకు జన్మించారు. తెలుగు భాషాప్రవీణ పూర్తిచేసి కర్నూల్లో తెలుగుపండిట్ ట్రైనింగ్ పొందారు. ఆ తరువాత ప్రథమ శ్రేణి తెలుగు పండితునిగా పనిచేసి, 1985 ఫిబ్రవరి మాసాంతంలో పదవీవిరమణ పొంది, 2006 ఆగస్టు 12న కీర్తిశేషులయ్యారు.
“రచనా విధానము కన్నా రచయిత యొక్క సత్తువ ప్రధానమైనది” అని (నామాటవిశ్వప్రకాశము) చెప్పిన మల్లవరపు జాన్ ‘సాంసనుడెలీలా’ (1967), విశ్వప్రకాశం (1973), అతుకుల బ్రతుకులు (1981), కాంతి రేఖలు (1987), సూక్తిశతకం(1991), సరసవినోదిని(1991), చిరస్మర ణీయుడు (1993), భావ విపంచి (1996), ఎయిడ్సు రోగి (బుiÀకథ) (2003), పుణ్యపురుషుడు (2005) మొదలగు రచనలు ఛందోబద్దమైన సరళశైలిలో రచించారు. ఇంకా వీరు ప్రబోధగీతాలు, భక్తవిజయం, పంచముడు, న్యాయం కావాలి, అక్షరజ్యోతి (గేయాలు) చైతన్య గేయాలు రచించినట్లు తెలుస్తుంది. వీటిలో కొన్ని అముద్రితాలు. మరికొన్ని అలభ్యాలు.
జాన్కవి తొలి రచన సాంసనుడెలీలా (1967). ఆంధ్రప్రదేశ్ అంతటా పౌరాణిక పద్యనాటకాలు వీరవిహారం చేస్తున్నప్పుడు దీటుగా బ్ఙైల్లోని కథను స్వీకరించి ‘సాంసనుడెలీలా’ అనే పద్యనాటకాన్ని రచించారు. ఐదు అంకాలుగా రచించిన ఈ నాటకాన్ని శేషం జీవరత్నం జాన్కు అంకితం ఇచ్చారు. ఇస్రాయలీయులకు, పలస్తీనా వారికి మధ్య ఆధిపత్యపోరు ఈ నాటకంలో ప్రధాన ఇతివృత్తం. దీనిలో ఇస్రాయలీయుల తెగకు చెందిన సమ్సోను కథానాయకుడు. పలస్తీనీయుల కుమార్తె సరోజ కథానాయిక. వేశ్య డెలీలా ఉపకథానాయిక. సమ్సోను పలస్తీనీయుల దౌర¨న్యాలను అరికట్టుట, తన స్వజనులను దాస్య విముక్తులను చేయుట ఇందులో కన్పిస్తుంది. మూలంలో పేర్లు లేని పాత్రలైన సాంసను తల్లి (మనోరమ), సాంసను భార్య (సరోజ) సేవకుడు (మీరాఖాన్) మొదలగు పాత్రలకు జాన్కవి పేర్లను సృష్టించారు. విశ్వప్రకాశము (1973) జాన్కవి రెండవ రచన. దీనిని దిరిశాల రమణారెడ్డికి అంకితమిచ్చారు. ఇందులో ఇరవై ఖండికలు ఉన్నాయి. ఇందులో ‘ఆంధ్రమాత’ మొదటి ఖండిక కాగా ‘రతనాల మాలిక’ చివరిది. పద్య, గేయాలతో కూడిన ఈ రచనలో కవి అనేక అంశాలను ప్రబోధించారు. ‘ఆంధ్రమాత’ ఖండికలో ఆంధ్రప్రదేశ్‌లోని కవితా, భాషా, సాంస్కృతిక, రాజ్య వైభవాలకు కారకులైన వారిని కీర్తించటం ప్రధానఅంశం. ‘అస్పృశ్యత’ ఖండికలో అగ్రవర’ దురహంకారాన్ని నిందించారు. ముఖంగా అణగారిన వర్ణాలను హీనంగా చూసే అగ్రవర్ణాల మనస్త్తవాన్ని నిలదీశారు. ‘త్యాగరాజు’ ఖండికలో వాగ్గేయకారుడైన త్యాగరాజును స్తుతించడమే ప్రధాన వస్తువు. ‘ఎందుకు కన్నారు?’ ఖండికలో అనేక సమస్యలు, వివక్షలకు గురౌతున్న ఈ సమాజంలో మమ్మల్ని ఎందుకు కన్నారని తల్లిదండ్రులను ప్రశ్నించడం కన్పిస్తుంది. ‘విశ్వ ప్రకాశం’ ఖండికలో క్రీస్తు జీవితాన్ని రేఖామాత్రంగా ప్రస్తావించి, ఆయనను విశ్వ ప్రకాశకుడిగా వర్ణించడం ప్రధానాంశం. ప్రత్యేకించి దళితులకు, దళిత క్రైస్తవులకు వారి హక్కులను వారికివ్వాలన్న అభ్యర్థన కన్పిస్తుంది. అలాగే, ‘గురుదక్షిణ’ ఖండికలో ఏకలవ్యుని గురించి, ‘సుప్రభాతం’ ఖండికలో క్రీస్తు ఏసుని ఏడుమాటలు, ‘తెలుగుతల్లి’ ఖండికలో ప్రముఖ తెలుగు కవుల, ప్రాంతాల గురించి వర్ణించారు.
జాన్కవి రచనలలో అతుకుల బ్రతుకులు (1981) విశిష్టమైన రచన. 1987లో మైసూరు విశ్వవిద్యాలయం వారి బి.యిడి విద్యార్థులకు పాఠ్య గ్రంథంగా ఉండటం ఈ కావ్య ప్రత్యేకతగా చెప్పవచ్చు. జాన్కవి లోకంలో తానుచూసిన, తాను అనుభవించిన, తనకుతెలిసిన సామాజిక సమస్యలను ఛందోబద్దంగా, సామాన్య పాఠకులకు అర్థమయ్యే రీతిలో “అతుకుల బ్రతుకులు” కావ్యంలో వివరించారు. ఇందులో ‘అతుకుల బ్రతుకులు, అత్యవసర పరిస్థితి, వరకట్నము, బుద్ధజయంతి, త్రాగుబోతు, తెలుగు సంస్కృతి, ఉపాధ్యాయుడు, సమానత్వము, ఉగాది, హరిజనా భ్యుదయము’ అను పదిఖండికలు తొలిముద్రణలో ఉన్నాయి. మలిముద్రణలో ‘ఎదురు తిరిగిన చెప్పులు’ అను ఖండికను అనుబంధంగా జతచేశారు. ఇందులో ‘అతుకుల బ్రతుకులు, త్రాగుబోతు’ ఖండికలు కథాఖండికలు. ఈ రెండింటిలో మొదటిది పేకాటవలన, రెండవది తాగుడు వలన కలిగే అనర్ధాలను వివరించేవి. లోకంలోని ఈ వ్యసనాలను కథారూపంలో తెలియజేస్తే పాఠకుల మనసుకు హత్తుకుంటా యని కవి భావించారు. మిగిలిన ఖండికలు భావఖండికలు. వాటిలో పేదరికం, వరకట్నం, అంట రానితనం వంటి సమస్యలతో పాటు ఉపాధ్యాయుడు, సమానత్వం, తెలుగు సంస్కృతి వంటి సామాజిక సృÎహకలిగిన అంశాలను ప్రస్తావించారు. ‘వరకట్నమ’ నే ఖండికలో ‘కన్యనడుగు పట్ల కట్నాల బేరము చేయ దగునే’ అని ప్రశ్నించారు. ‘బుద్ధ జయంతి’ ఖండికలో బుద్ధుని జీవిత చరిత్ర స్థూలంగా పరిచయంచేశారు. ‘తెలుగు సంస్కృతి’ ఖండికలో పాశ్చాత్య సంప్రదాయం వల్ల ప్రజల్లో వచ్చిన మార్పులు వివరించారు. ‘ఉపాధ్యాయుడు’ ఖండికలో పల్లెటూరిలోఉన్న ఉపాధ్యాయునికిగల కష్టాలు తెలియజేశారు. ‘సమానత్వం’ ఖండికలో అంటరానితనం మాసి పోతుందని, రాబోయేకాలంలో అందరూ సుఖిస్తారని ఆశించారు. ‘ఉగాది’ ఖండికలో నిత్యయుగాదుల వల్ల సుఖము లెన్నో గలవని తృప్తి చెందారు. ‘హరిజనాభ్యుదయం’ ఖండికలో వయోజన విద్య వలన హరిజనుల జీవన విధానం మారిందని తృప్తిచెందారు.
జాన్ రచించిన ‘సూక్తి శతకము’ (1991) లో ప్రాచీన సూక్తులు, ఆధునిక లోకరీతులు, అక్కడక్కడ ఆంగ్ల పదాలు కనబడతాయి. ముఖ్యంగా ఇందులో సమకాలీన సమాజంలోని అరాచకాలు, అన్యాయాలు,అధర్మాలు, అల్లకల్లోల పరిస్థితులు, సామాన్యుని ఆవేదన కన్పిస్తుంది. అందుకే దీనిలో సుధ ఉంది. మధన ఉంది, వ్యధ ఉంది, వేదన ఉంది. గుండెల్ని రగిలించే కుంపటి ఉంది. జాన్కవి తనను ప్రభావితంచేసిన వ్యక్తులను, తనకు ఆరాధ్యులైన మహనీయులను భావితరాలకు పరిచయంచేయాలనే ఉద్దేశంతో చిరస్మరణీయులు (1993) ఖండకావ్యాన్ని రచించారు. భావ విపంచి (1996) 19 ఖండికలున్న పద్యకావ్యం. ఇందులో అంబేద్కర్, వివేకా నందుడు, ఇందిరాగాంధీ, దివాకర్ల వేంకటావధాని, ఎర్రన, గుర్రం జాషువా మొదలగు సుప్రసిద్ధులను వివిధ ఖండికలలో ప్రశంసించారు. మిగిలన ఖండికలలో వివిధ అంశాలను ప్రస్తావించారు. ఉదాహరణకు ‘ఉగాది లక్ష్మీ’ ఖండికలో జనాకర్షణ’ పథకాల గురించి…
బియ్యమొక కిలో రెండు రూపికల వెలకు/ నమ్ము పథకము హర్షణీయమ్మె గాని/ కపð మూడు రూపాయల కాఫీ యగుల/ కేడÇనా? నవ్వనా? చెప్పవే ఉగాది” (పుట:46) అంటూ ప్రశ్నించి ప్రజల్ని ఆలోచింప చేశారు. ఒంగోలు ప్రాంతంలో నిమ్న జాతులను ఆదరించి వారిని సాంఘికంగా, ఆర్థికంగా, ఆధ్యాత్మికంగా, విద్యాపరంగా వృద్ధి చెందుటకు పాటుపడిన వ్యక్తి జాన్. ఈయనను ఆ ప్రాంతవాసులు ‘క్లౌ’ దొరగా పిలుచుకునేవారు. వారి జీవిత విశేషాలను మల్లవరపు జాన్ ‘పుణ్య పురుషుడు’ (2005) కావ్యంగా రచించారు. ఏసుక్రీస్తు జన్మరహస్యం, ఆయన త్యాగం, ప్రేమ, శాంతి దయాగుణాలు మొదలగు అంశాలను వివరించే క్రైస్తవ ఇతివృత్త పద్యకావ్యం ‘కాంతిరేఖలు’ (1987). దీనిలోని ‘యేసు నాయక సప్తకం’ ఖండికను బట్టి జాన్ కవికి సంస్కృతాంధ్ర భాషలలో ప్రావీణ్యం ఉన్నదని స్పష్టమౌతుంది. మల్లవరపు జాన్ తాను విన్న, కన్న, పూరించిన కొన్ని సమస్యలను, దత్తపదులను 116 పద్య రత్నాలుగా మార్చి సరసవినోదిని (1991) అనే పేరుతో ఒక చిరుకావ్యాన్ని పాఠకలోకానికి అందించారు. జాన్కవి రచనలను సునిశితంగా పరిశీలించినప్పుడు జాషువా ప్రభావం అధికంగాఉన్నట్లు తెలుస్తుంది. అందుకే ‘అతుకుల బ్రతుకులు’ కావ్యానికి పీఠికరాసిన పద్మశ్రీ సి.నారాయణరెడ్డి ఆయన గురించి…
ఎదుగుతున్న మీ పలుకును చూస్తూఉంటే/ ఇరుగట్టులను ఒరుసుకొని పారే/ మీ ఝరీ కవితను గమనిస్తూ ఉంటే/ ఎంత ఆనందం కలిగిందో చెప్పనా?/ ఆత్మీయుడు జాషువా వచ్చి/ నా గుండెను తడుతున్నాడా/ అనిపించింది అంటే జాషువాను, జాన్కవిని పోల్చారు.
(సెప్టెంబరు 10, 11 తేదీలలో ఆంధ్ర లొయోలా కళాశాల నిర్వహిస్తున్న ‘మల్లవరపు జాన్` సాహిత్య సమాలోచనం’ జాతీయ సదస్సు సందర్భంగా…)
సెల్: 9441088634

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు