Homeకమ్ముకున్న కరవు

కమ్ముకున్న కరవు

- Advertisement -

పెరిగిన ఉష్ణోగ్రతలు… నీటి కొరత
బీడువారిన పంట పొలాలు
ఎల్‌నినోతో అడుగంటిన భూగర్భ జలాలు

విశాలాంధ్ర బ్యూరో-విశాఖపట్నం : ఎల్ నినో ప్రభావంతో రాష్ట్రంలో కరవు ఛాయలు కమ్ముకున్నాయి. ఖరీఫ్ పంటలు ఎండిపోవడంతో రైతులు కన్నీరు మున్నీరై విలపిస్తున్నారు. తాగునీటి కోసం ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉత్తరాంధ్ర జిల్లాల్లో తీవ్ర వర్షాభావం నెలకొనడంతో కరవు కమ్మేసింది. దీంతో కూలీలు జిల్లాల నుంచి వలస బాట పడుతున్నారు. రాష్ట్రంపై ఎల్ నినో ప్రభావం అంతకంతకూ పెరుగుతుం డటంతో వేసవిని తలపించేలా సెప్టెంబరు లో కూడా ఎండలు మండిపోతున్నాయి. వాతావరణ శాఖ నివేదిక ప్రకారం… దేశంలోని 36 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో 18 చోట్ల లోటు వర్షపాతం నమోదయింది. ఆంధ్ర ప్రదేశ్‌లో 45 శాతం లోటు వర్షపాతం ఉంది. విశాఖ మహానగరంలో నీటి కోసం కోటి కష్టాలు తప్పడం లేదు. మరోపక్క ఉత్తరాంధ్ర ఆరు జిల్లాల్లో ఖరీఫ్ పంట పూర్తిగా ఎండిపోయింది. ఈ ఏడాది జూన్, జులై, ఆగస్టు నెలలో వర్షపాతం సాధారణం కంటే 45 శాతం తక్కువగాను, ఉష్ణోగ్రతలు అత్యధికంగా నమోదవుతున్నాయి. సెప్టెంబరులో గడిచిన వారం రోజుల్లో అనేక జిల్లాలో 40 డిగ్రీలు దాటి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇక రాష్ట్రంలో 653 మండలాల్లో లోటు వర్షపాతం నమోదయినట్లు అధికారులు తెలిపారు. అయితే 22 జిల్లాల్లో తీవ్ర, 6 జిల్లాల్లో అతి తీవ్ర లోటు నెలకొంది. వర్షాకాలం ముసురులతో చల్లటి వాతావరణంలో ఉండాల్సిన రోజుల్లో ఒక్కసారిగా వేసవిని తలపించేలా పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. మరోపక్క విద్యుత్ వినియోగం తారస్థాయికి చేరింది. అనేక ప్రాంతాల్లో అప్రకటిత విద్యుత్ కోతలు మొదలయ్యాయి. వ్యవసాయ, ఆక్వా రంగాల్లో గరిష్ట స్థాయిలో విద్యుత్ వినియోగం జరుగుతోంది. గృహ, పరిశ్రమకు అవసరాలకు కూడా విద్యుత్ వాడకం ఎక్కువగానే ఉంది. రాష్ట్రంలో 123 పుర, నగరపాలక సంస్థలు, నగర పంచాయతీల్లో 50 శాతం వరకు నదులు, జలాశయాల్లో నీరు అడుగంటింది. విశాఖలో ట్యాంకర్ నీరు దొరకాలంటే గగనంగా మారింది. ఇదే అదునుగా బయట నీటి వ్యాపారం చేసుకునే ట్యాంకర్లు విచ్చలవిడిగా అధిక ధరలకు అమ్ముకుంటున్నారు. గతంలో కూడా ఎల్ నినో ప్రభావం ఉన్నప్పటికీ ఈసారి నమోదయినంత తీవ్ర వర్షాభావ పరిస్థితులు గతంలో లేవు. జూన్ నుంచి బంగాళాఖాతంలో 8 అల్పపీడనాలు, తీవ్ర వాయుగుండం ఏర్పడినా, తుపానులు వచ్చినా ఎల్ నినో వల్లే విశాఖపై ప్రభావం చూపలేదు. రానున్న మూడు నెలల పాటు ఇదే పరిస్థితి కొనసాగి 2027 వేసవి ముగిసే వరకు చినుకు రాలడం కష్టమేనని నిపుణులు చెబుతున్నారు.
మధురవాడలో పాతాళానికి భూగర్భ జలాలు
మధురవాడ పరిసర ప్రాంతాల్లో వారం రోజులుగా వేసవి ఎండలు, తీవ్ర ఉక్కపోతతో ప్రజలు ఉక్కిర్ఙిక్కిరి అవుతున్నారు. సాయంత్రం మేఘావృతమైనా చినుకు పడటం లేదు. రిజర్వాయర్లు, చెరువులు ఎండిపోయి భూగర్భ జలాలు పాతాళానికి పడిపోయాయి. ఎండాడ ప్రాంతంలో భూగర్భ జలాలు 30.86 మీటర్లకు పడిపోగా… మధురవాడ,నగరంపాలెం, బొట్టవానిపాలెం, స్వతంత్రనగర్, మల్లయ్యపాలెం, మిథిలాపురి కాలనీ, పీఎంపాలెం, బక్కన్నపాలెం ప్రాంతాల్లో 27 నుంచి30 మీటర్ల లోతుకు చేరాయి. మధురవాడ పరిధిలోని దాదాపు 90 శాతం బోర్లు నుంచి నీళ్లు రాకపోవడంతో అపార్ట్‌మెంట్‌ల నివాసితులు తీవ్ర యాతన పడుతున్నారు. జీవీఎంసీలో కూడా నీటి సరఫరా రోజు విడిచి రోజు ఇస్తున్న పరిస్థితి నెలకొంది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు