
- జీవన ప్రమాణాలు అస్తవ్యస్తం
- కార్పొరే{్లకు తాయిలాలు
- సామాన్యుడి నడ్డివిరిగేలా భారం
- సంపాదనకు… ఖర్చులకు కుదరని పొంతన
- సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గం తీర్మానం
నేడు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు
విశాలాంధ్ర బ్యూరో-అమరావతి: ‘అధిక ధరలు పేద, సామాన్య, మధ్యతరగతి ప్రజానీకంపై అధిక భారాలు మోపుతున్నాయి. ప్రజల జీవన ప్రమాణాలు అస్తవ్యస్తమవుతున్నాయి. తాము అధికారంలోకొస్తే ధరలు తగ్గిస్తామంటూ హామీలు గుప్పించిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏరుదాటాక తెప్పతగలేశాయి. బడా పెట్టుబడిదారులకు, కార్పొరేట్ శక్తులకు తాయిలాలు ప్రకటిస్తూ, సామాన్యుడి నడ్డివిరుస్తున్నాయి. నిత్యావసర వస్తువులు, పెట్రోల్, డీజిల్, గ్యాస్ తదితర వస్తువుల ధరలు విపరీతంగా పెంచేశాయి. రెండు నెలల్లోనే బియ్యం 25 కిలోల బస్తాకు రూ.400 నుంచి రూ.500 వరకు పెరిగాయి’ అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సమావేశం ఆందోళన వ్యక్తం చేసింది. విజయవాడ దాసరి భవన్లో పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సమావేశం ఈ మేరకు మంగళవారం తీర్మానించింది. సమావేశానికి సీపీఐ కార్యదర్శి కె.రామకృష్ణ హాజరయ్యారు. సమావేశం ఆమోదించిన తీర్మానాన్ని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య వెల్లడించారు. ‘పేదవారికి ఆదాయం తక్కువ, ధరలు రోజురోజుకూ అధికం కావడంతో వచ్చే సంపాదనకు, పెరుగుతున్న ఖర్చులకు పొంతన లేకుండా పోతోంది. పప్పులు, వంటనూనెలు, నిత్యావసరాల ధరల పెరుగుదలతో ధరల దోపిడీ కొనసాగుతోంది. కందిపప్పు, మినపప్పు, పెసరపప్పు, శెనగపప్పు వంటి పోషక ఆహారాలు పేద, సామాన్య కుటుంబాల భోజనంలో రోజురోజుకూ తగ్గిపోతున్నాయి. బియ్యం కిలో ధర రూ.75కు ఎగబాకడంతో సామాన్యుడి కుటుంబ బడ్జెట్ మరింత భారంగా మారింది. వంటనూనెలు, పాలు, చక్కెర, ఉప్పు తదితర నిత్యావసరాల ధరల పెరుగుదల కుటుంబం నెలవారీ బడ్జెట్ను తీవ్రంగా దెబ్బతీస్తోంది. ప్రజల ఆదాయాలు పెరగకపోయినా, నిత్యావసరాల ధరలు మాత్రం అడ్డూ అదుపు లేకుండా పెరుగుతున్నాయి‘ అని తీర్మానం పేర్కొంది. ‘రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర దక్కడం లేదు. వినియోగదారుడికి సరకు అందుబాటు ధర లేదు. దళారులు, నిల్వదారులు, కార్పొరేట్ వ్యాపార వర్గాలు మాత్రం లాభాలు దండుకుంటున్నాయి. పాలకుల విధానాలు రైతుకు గిట్టుబాటు లేకుండా, వినియోగదారుడికి ఉపశమనం లేకుండా చేసి, మార్కెట్ దోపిడీకి, దళారుల లాభాలకు తోడ్పడుతున్నాయి. పెట్రోల్, డీజిల్ తదితర ఇంధన ధరల పెరుగుదలతో రవాణా ఖర్చులు, వ్యవసాయ పెట్టుబడులు, సరకు రవాణా వ్యయాలు పెరిగి… చివరకు అన్నిరకాల నిత్యావసర వస్తువుల ధరలపై ప్రభావం పడుతోంది. పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల ప్రభావం చివరకు సామాన్యుడి వంటింటికే చేరింది’ అని విచారం వ్యక్తం చేసింది. ‘అసంఘటిత రంగంలో పనిచేస్తున్న కార్మికుల పరిస్థితి మరింత దయనీయంగా మారింది. 14 ఏళ్ల క్రితం నుంచి కార్మికుల వేతనాలలో కనీస పెరుగుదల లేదు. అన్నిరకాల వస్తువుల ధరలు మాత్రం విపరీతంగా పెరిగిపోతున్నాయి. పేదవాడు మరింత పేదవాడిగా మారుతున్నాడు. నిత్యావసర వస్తువుల ధరలు వెంటనే తగ్గించాలి. బియ్యం, పప్పులు, వంటనూనెలు, పాలు, చక్కెర తదితర నిత్యావసర వస్తువులను చౌక ధరలకే ప్రజలకు అందించాలి. నల్లబజారు, అక్రమ నిల్వలు, కృత్రిమ కొరతను అరికట్టాలి. ప్రజా పంపిణీ వ్యవస్థను బలోపేతం చేయాలి. పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరలు వెంటనే తగ్గించాలి. పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలి. దళారీ వ్యవస్థ, నిల్వదారుల దోపిడీని అరికట్టాలి. ప్రజల కొనుగోలు శక్తి పెంచాలి’ అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేసింది. ధరల పెరుగుదలకు నిరసనగా ఈ నెల 9న(బుధవారం) రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల నుంచి నియోజకవర్గ, మండల కేంద్రాలు, పట్టణాలు, నగరాలు, గ్రామాల వరకు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గం పిలుపునిచ్చి ంది. ఈ నిరసనల్లో ప్రజానీకం పెద్దఎత్తున పాల్గొని జయప్రదం చేయాల కోరింది. ఎల్నినో ప్రభావంతో రాష్ట్రంలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. సాగునీరు, తాగునీటికి తీవ్ర కొరత ఏర్పడింది. ఖరీఫ్ సీజన్లో పంటలు వేసేందుకు నీరందక రైతులు ఆందోళన చెందుతున్నారు. ఎంతోకొంత ధైర్యం చేసి, అప్పులు తెచ్చి పెట్టిన పంటలు కూడా ఎండిపోవ డంతో రైతాంగం కుదేలయింది. కరవు విలయతాం డవం చేస్తోంది. చాలా ప్రాంతాల్లో తాగునీరూ లభం చడం లేదు. రైతాంగాన్ని, ప్రజానీకాన్ని ఆదుకోవాల్సి న పాలకులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. కూటమి ప్రభుత్వం తక్షణమే స్పందించి రాష్ట్రంలో కరవు మండలాలను ప్రకటించాలి. కరవు సహాయక చర్యలు చేపట్టి రైతాంగాన్ని, ప్రజలను ఆదుకోవాలి’ అని సీపీఐ డిమాండ్ చేసింది.


