Homeనిరసనల వెల్లువ

నిరసనల వెల్లువ

- Advertisement -

యూరియా కొరతపై సీపీఐ ఆందోళనలు
పాలకుల నిర్లక్ష్యంతో రైతుల ఇబ్బందులు
సీపీఐ, రైతు సంఘం నేతల ఆగ్రహం

విశాలాంధ్ర బ్యూరో` అమరావతి:యూరియా కొరతపై రాష్ట్రంలో నిరసనలు వెల్లువెత్తాయి. సీపీఐ రాష్ట్ర సమితి పిలుపు మేరకు సోమవారం రాష్ట్రవ్యాప్తంగా పార్టీ, ఆంధ్రప్రదేశ్‌ రైతుసంఘం శ్రేణులు వివిధ రూపాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. పార్టీల కతీతంగా రైతులు పెద్దసంఖ్యలో హాజరయ్యారు. ఎరువుల సరఫరాపై సరైన ప్రణాళిక లేకుండా, బ్లాక్‌ మార్కెట్‌పై నిఘా లేకుండా రైతులను తీవ్ర ఇబ్బందులకు గురి చేసిన అధికార యంత్రాంగంపై అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్లే రైతులు రోడ్డెక్కే పరిస్థితి తలెత్తిందని ఆందోళనకారులు నిప్పులు చెరిగారు. యూరియా దొరక్క దుకాణాల ముందు కిలోమీటర్ల పొడవునా బారులు తీరుతున్నా ప్రభుత్వానికి కానరావడం లేదా అని రైతులు మండిపడ్డారు. సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోకుండా… కొరత లేదంటూ మభ్యపెట్టే ప్రయత్నాలు చేయడాన్ని తీవ్రంగా విమర్శించారు. ఇకనైనా రైతులకు ఇబ్బందులు రాకుండా ఖరీఫ్‌ సీజన్‌లో అవసరమైన అన్నిరకాల రసాయన ఎరువులను, వ్యవసాయ ఇన్‌పుట్‌లను సకాలంలో పంపిణీ చేయాలని ఆంధ్రప్రదేశ్‌ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేవీవీ ప్రసాద్‌ డిమాండ్‌ చేశారు. సోమవారం మంగళగిరి పట్టణంలోని తహసీల్దార్‌ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేసి… డిప్యూటీ తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. కేవీవీ ప్రసాద్‌ మాట్లాడుతూ యేటా విత్తనాలు వేసే సమయానికి ఎరువుల కొరత ఏర్పడడం వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ముందుగానే అవసరమైన పరిమాణంలో ఎరువులను రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం పంపిణీ చేయకపోవడంతో రైతులు నల్లబజారుకు బలవుతున్నారని విమర్శించారు. రైతు అవసరాలు, సాగు ప్రాంతాల దృష్ట్యా ఎరువుల కోటాను సమయానుకూలంగా కేటాయించాలని డిమాండ్‌ చేశారు. రైతుసంఘం నియోజకవర్గ కార్యదర్శి యార్లగడ్డ వెంకటేశ్వరరావు, సీపీఐ పట్టణ కార్యదర్శి అన్నవరపు ప్రభాకర్‌, సీపీఐ మండల కార్యదర్శి జాలాది జాన్‌బాబు తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వం వక్రీకరణ: జంగాల
రాష్ట్రంలో యూరియా కొరతతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే… రాష్ట్ర ప్రభుత్వం మాత్రం సమస్య లేదన్నట్లుగా వక్రీకరిస్తోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జంగాల అజయ్‌కుమార్‌ విమర్శించారు. రైతులకు యూరియా సకాలంలో అందించాలని కోరుతూ తాడేపల్లి తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట పెద్దఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టారు. జంగాల మాట్లాడుతూ రైతు లేనిదే రాజ్యం లేదంటూ కూటమి ప్రభుత్వం మాటలు చెబుతోందని, ఆచరణలో మాత్రం విత్తనాలు, ఎరువుల సరఫరాలో ఘోర వైఫల్యం చెందిందని విమర్శించారు. యూరియా ధరలు పెంచి వ్యాపారులు బ్లాక్‌లో అమ్ముకుంటూ, ఇతర ఎరువులు తీసుకుంటేనే యూరియా ఇస్తామని బెదిరిస్తూ రైతులను ఇబ్బందులు పెడుతున్నారని ఆయన మండిపడ్డారు. రైతుసంఘం మంగళగిరి నియోజకవర్గ అధ్యక్షుడు ముసునూరు సుహాస్‌, సీపీఐ తాడేపల్లి కార్యదర్శి కంచర్ల కాశయ్య, గుంటక సాంబిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
నానో ఎరువుల కంపెనీలతో కుమ్మక్కు: డేగా
నానో ఎరువుల కంపెనీలతో రాష్ట్ర ప్రభుత్వం కుమ్మక్కు అయిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు డేగా ప్రభాకర్‌ విమర్శించారు. ఏలూరు మండల తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట నిర్వహించిన ధర్నాలో ఆయన ప్రసంగించారు. రైతుల కష్టాలు తీరుస్తామని, రైతులకు అన్ని రకాల సంక్షేమ పథకాలు అందిస్తామని కూటమి ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చి… అధికారం చేపట్టిన తర్వాత రైతుల కష్టాలను, ఇబ్బందులను తొలగించడానికి ఏమాత్రం ప్రయత్నం చేయడం లేదని విమర్శించారు. రైతాంగానికి తక్షణమే యూరియా, డీఏపీ వంటి ఎరువులు అందించాలని డిమాండ్‌ చేశారు. లేనిపక్షంలో ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. సీపీఐ ఏలూరు జిల్లా కార్యదర్శి మన్నవ కృష్ణ చైతన్య, ఏలూరు ఏరియా సమితి కార్యదర్శి ఉప్పులూరి హేమశంకర్‌, సహాయ కార్యదర్శి కురెళ్ల వరప్రసాద్‌ పాల్గొన్నారు..
తూర్పుగోదావరి జిల్లాలో
రైతులకు యూరియా అందించడంలో ప్రభుత్వం విఫలమైందని, బ్లాక్‌ మార్కెట్‌ ఆపాలని డిమాండ్‌ చేస్తూ సీపీఐ జిల్లా సమితి అధ్వర్యంలో స్థానిక సబ్‌ కలెక్టర్‌ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. సీపీఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు, జట్ల లేబర్‌ యూనియన్‌ అధ్యక్షుడు కుండ్రపు రాంబాబు, నగర కార్యదర్శి వి.కొండలరావు, సహాయ కార్యదర్శి పి.లావణ్య, రైతుసంఘం జిల్లా అధ్యక్షుడు పి.నాగేశ్వరరావు, రెడ్డి రామకృష్ణ పాల్గొన్నారు.
ఒంగోలులో
రైతాంగానికి ఎటువంటి ఇబ్బందులు రాకుండా యూరియా కొరతను నివారించేందుకు ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలని సీపీఐ ప్రకాశం జిల్లా కార్యదర్శి ఎంఎల్‌ నారాయణ డిమాండ్‌ చేశారు. సీపీఐ, రైతు సంఘం అధ్వర్యంలో ఒంగోలు కలెక్టర్‌ కార్యాలయం వద్ద యూరియా కృత్రిమ కొరతను నిరసిస్తూ ధర్నా నిర్వహించారు. రైతుసంఘం జిల్లా అధ్యక్షులు వడ్డే హనుమారెడ్డి, ప్రధాన కార్యదర్శి కె. వీరారెడ్డి, డీహెచ్‌పీఎస్‌్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కరవది సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. యర్రగొండపాలెంలో పూల సుబ్బయ్య విగ్రహం ఎదుట నిర్వహించిన ధర్నాలో కేవీ కృష్ణగౌడ్‌, బాణాల రామయ్య, సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు.
కాకినాడ జిల్లాలో
సామర్లకోటలో స్థానిక తహసీల్దార్‌ కార్యాలయం వద్ద సామర్లకోట సీపీఐ పట్టణ కార్యదర్శి పెద్దిరెడ్ల సత్యనారాయణ అధ్వర్యంలో నిరసన జరిగింది. ముఖ్య అతిథులుగా సీపీఐ జిల్లా కార్యదర్శి కామిరెడ్డి బోడకొండ, సహాయ కార్యదర్శి తోకల ప్రసాద్‌ హాజరయ్యారు.
కృష్ణా జిల్లాలో
రైతులకు అవసరమైన మేరకు యూరియా అందించాలని ఆంధ్రప్రదేశ్‌ రైతు సంఘం రాష్ట్ర నాయకులు హనుమానుల సురేంద్రనాథ్‌ బెనర్జీ డిమాండ్‌ చేశారు. యూరియా కోసం ఎన్టీఆర్‌ జిల్లా చల్లపల్లి తహసీల్దార్‌ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. అనంతరం తహసీల్దార్‌ డి.వనజాక్షికి వినతిపత్రం సమర్పించారు. గుత్తికొండ రామారావు, వేమూరి రత్నగిరిరావు, మల్లుపెద్ది బోసు, మాలెంపాటి కోటేశ్వరరావు పాల్గొన్నారు.
ఎన్టీఆర్‌ జిల్లాలో
యూరియా కొరతపై జిల్లాలోని తిరువూరు పట్టణ కమిటీ అధ్వర్యంలో తహసీల్దార్‌ కార్యాలయం వద్ద సీపీఐ, రైతుసంఘం శ్రేణులు ధర్నా నిర్వహించారు. సీపీఐ ఎన్టీఆర్‌ జిల్లా నాయకులు తూము కృష్ణయ్య, తిరువూరు పట్టణ కార్యదర్శి మాలపాటి ఉదయ్‌, ఏఐవైఎఫ్‌ ఎన్టీఆర్‌ జిల్లా కార్యదర్శి ఎస్కే సుభాని, అయినాల ముత్తయ్య, ఎస్కే హాసన్‌, బాణాల అశోక్‌ తదితర నాయకులు పాల్గొన్నారు.
నంద్యాల జిల్లాలో
యూరియా కొరతను నివారించి రైతులను ఆదుకోవాలని సీపీఐ, రైతు సంఘం అధ్వర్యంలో నంద్యాల జిల్లా కేంద్రం మార్కెట్‌ యార్డ్‌ నుంచి తహసీల్దార్‌ కార్యాలయం వరకు ర్యాలీ జరిగింది. తహసీల్దార్‌ కార్యాలయం ఎదురుగా నిరసన దీక్ష నిర్వహించారు. సీపీఐ నంద్యాల జిల్లా కార్యదర్శి ఎన్‌.రంగనాయుడు, రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షులు బొజ్జ దశరధరామిరెడ్డి, రైతుసంఘం జిల్లా కార్యదర్శి సోమన్న, భాస్కర్‌ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు