Homeనిరుద్యోగాంధ్ర

నిరుద్యోగాంధ్ర

- Advertisement -

. స్కిల్‌ ఉన్నా కొలువు నిల్‌
. కానరాని జాబ్‌ క్యాలెండర్‌ జాడ
. అందని ద్రాక్షగా నిరుద్యోగ భృతి
. నోటిఫికేషన్ల కోసం యువత ఎదురుచూపు
. నిరుద్యోగుల్లో నిరాశ నింపిన ‘కూటమి’
. 30న నిరుద్యోగ రణభేరి… కొలువుల కోసం కొట్లాడదాం: ఏఐవైఎఫ్‌

విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : నిరుద్యోగ సమస్య నానాటికీ పెరిగిపోతోంది. ఎన్నికల సమయంలో కూటమి మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలకు, అధికారంలోకి వచ్చిన పాలనకు పొంతనలేకుండా పోయింది. ‘విజయవాడ బస్‌స్టాప్‌ దగ్గర కూర్చున్న శంకర్‌ అనే నిరుద్యోగి చేతిలో ఒక ఫైల్‌. అందులో సర్టిఫికెట్లు. డిగ్రీ, పీజీ, కంప్యూటర్‌ కోర్సు, స్కిల్‌ ట్రైనింగ్‌ … కానీ ఉద్యోగం మాత్రం లేదు. శంకర్‌ ఒక్కడే కాదు. రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల నిరుద్యోగి ప్రతి ముఖం ఒక కథ. ఒకరు బీటెక్‌ చేసి రోజు వారీ కూలిగా మారతాడు. అవసరమైతే రాఫిడ్‌ పనిచేస్తుంటాడు. మరొకరు ఎంబీఏ చేసి డెలివరీ బాయ్‌ అయ్యాడు. ఇంకొకరు పీహెచ్‌డీ చేసి రైల్వే గ్యాంగ్‌మాన్‌ నోటిఫికేషన్‌ కోసం ఎదురుచూస్తుంటాడు. గత ప్రభుత్వాల నుంచి నిరుద్యోగులపై ఇదే తీరు కొనసాగుతోంది. ఒక్క డీఎస్సీ, అరకొర ప్రభుత్వ విభాగాల పోస్టుల భర్తీ మినహా…మిగిలిన ఉద్యోగాల భర్తీపై కూటమి సర్కారు దృష్టి పెట్టకపోవడంతో నిరుద్యోగ యువత నడిరోడ్డున పడుతోంది. ఒక వైపు ఉద్యోగాలు ఇవ్వక, మరోవైపు ఉన్నవి తొలగించడంతో నిరుద్యోగ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా 2025, ఫిబ్రవరిలో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు ద్వారా నిర్వహించిన ‘స్కిల్‌ సెన్సెక్స్‌ సర్వే’ 26 జిల్లాల్లో 2.67 కోట్ల మంది దగ్గర వివరాల్ని సేకరించగా… ఉపాధి లేని (ఉద్యోగాల కోసం ఎదురు చూసే) వారి సంఖ్య కోటిన్నర పైనే ఉన్నట్లు వెల్లడైంది. ఏకంగా ప్రభుత్వం నిర్వహించిన ఈ సర్వేతోనే నిరుద్యోగుల సంఖ్య ఎంతనేదీ తేటతెల్లమవుతోంది. చంద్రబాబు ప్రభుత్వం పగ్గాలు చేపట్టి… ఇప్పటికి రెండు జనవరిలు వచ్చినా జాబ్‌ క్యాలెండర్‌ ప్రస్తావనే లేదు. ఈ ఏడాది జనవరిలో మరో డీఎస్సీ ఇస్తామంటూ మంత్రి నారా లోకేశ్‌ చేసిన ప్రకటనపై ఇంతవరకు కదలికలేదు. ఉపాధ్యాయ విద్యార్హత పరీక్ష (టెట్‌) ఫలితాలు వచ్చినప్పటికీ, డీఎస్సీ నోటిఫికేషన్‌పై స్పష్టత లేకపోవడంతో నిరుద్యోగుల్లో అలజడి మొదలైంది. కొత్త డీఎస్సీ వస్తుందన్న ఆశతో లక్షలాది మంది వివిధ ప్రైవేట్‌ ఇన్‌స్టిట్యూట్లలో డీఎస్సీ శిక్షణకు చేరారు. అక్కడ వేలకొద్ది ఫీజులు చెల్లిస్తూ నోటిఫికేషన్‌ కోసం ఎదురు చూస్తున్నారు. ‘మేక్‌ ఇన్‌ ఇండియా, డిజిటల్‌ ఇండియా’ పేరుతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రచారానికే పరిమితమయ్యాయి. నిరుద్యోగ యువత జీవితంలో మాత్రం ఖాళీ జేబులు, నిండిన నిరాశ తప్ప ఏమీ మారలేదు. ‘ఇంత చదువుకుని కూడా మేము దేశానికి భారమా’ అనే ప్రశ్న ప్రతి ఉద్యోగిలో వస్తోంది. నిరుద్యోగ యువతకు నెలకి రూ.మూడు వేలు చొప్పున భృతి చెల్లిస్తామని సీఎం చంద్రబాబు ఎన్నికల ముందు హామీ ఇచ్చి అధికారం చేజిక్కించుకున్నారు. అధికారంలోకి వచ్చి దాదాపు 20 నెలల గడుస్తున్నా నిరుద్యోగ భృతి దాటవేత ధోరణి ఉంది. ఆ భృతి వస్తే పోటీ పరీక్షలకు శిక్షణ పొందుదామన్న ఆశతో ఎదురు చూస్తున్న నిరుద్యోగులను ఈ ప్రభుత్వం నట్టేట ముంచిందన్న విమర్శలున్నాయి. నిరుద్యోగ యువతకు వివిధ రంగాలలో నైపుణ్యం కలిగించేలా శిక్షణ ఇచ్చి 20 లక్షల ఉద్యోగాలు కల్పించడమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని ప్రకటనలే తప్ప, ఏడాదిలో నిరుద్యోగ యువతకు ఒరిగిందేమి లేదు. ఒకపక్క రాష్ట్ర ప్రభుత్వ శాఖలలో సుమారు 3.20 లక్షల ఖాళీలు ఉన్నట్లు ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నప్పటికీ ఖాళీ పోస్టులపై శ్వేతపత్రం విడుదలచేసే పరిస్థితుల్లో ప్రభుత్వం లేదు. ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ ఎప్పుడు విడుదల చేస్తారని ప్రశ్నించారు. ఉగాది పండుగ సందర్భంగా వలంటీర్లకు తీపి కబురు అని చెప్పిన చంద్రబాబు… 2 లక్షల 60వేల మందిని నడిరోడ్డు పడ్డారు. ఏపీ బేవరైజేషన్లో పని చేస్తున్న మరో 26 వేలమంది రోడ్డున పడ్డారు. సివిల్‌ సప్లయీస్‌ రేషన్‌ వాహనాలలో పనిచేసే 15,600 మంది ఉద్యోగాలు ఊడిపోయాయి. ఆప్కాస్‌ పేరుతో గత ప్రభుత్వం అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగాలు ఇస్తే ఈ ప్రభుత్వం వారిని తొలగించింది. పీపీపీ విధానంలో వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు కట్టబెట్టే నిర్ణయాలతో అక్కడి నుంచి వచ్చే ప్రభుత్వ ఉద్యోగాలు కనుమరుగుతాయి. కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం పూర్తిస్థాయిలో ఉద్యోగాలు ఇవ్వక… ఉన్న వాటిని తీసేస్తూ విమర్శలపాలవుతోంది. అసలు ఉద్యోగాల భర్తీ చేస్తారో తెలియక కోటి ఆశలతో ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు పోరాడితేనే భవిత అనే దిశగా ఈనెల 30న విజయవాడలో జరిగే ‘నిరుద్యోగి రణభేరికి ఏఐవైఎఫ్‌ పిలుపునిచ్చింది. చంద్రబాబు ప్రభుత్వంతో తాడోపేడో తేల్చుకునేందుకు సన్నద్ధమైంది.
నిరుద్యోగ సమస్య పెరుగుతోంది: రాజేంద్రబాబు
రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య రోజు రోజుకూ పెరుగుతోందని ఏఐవైఎఫ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పరుచూరి రాజేంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు. యువగళం పాదయాత్రలో బాబు షూరిటీ…భవిష్యత్‌ గ్యారెంటీ అంటూ సూపర్‌ సిక్స్‌ మ్యానిఫెస్టోలో యువతకు హామీలు ఇచ్చిందని గుర్తుచేశారు. తూర్పుగోదావరి జిల్లా తునిలో నిర్వహించిన…‘టీడీపీ పిలుస్తుంది…కదలిరా’ సభలో సీఎం చంద్రబాబు, నారా లోకేశ్‌ నిరుద్యోగ యువతకు రూ.మూడువేల భృతి ఇస్తామని, 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని ఇచ్చిన హామీ ఏమైందని నిలదీశారు. అధికారంలోకి వచ్చి దాదాపు 20 నెలలు అవుతున్నా నిరుద్యోగ భృతి ఇవ్వలేదని, ఉద్యోగాల భర్తీ జరగలేదన్నారు. గతేడాది ప్రభుత్వం నిర్వహించిన స్కిల్‌ సెన్సెక్స్‌ సర్వేలో రాష్ట్రంలో కోటి 55లక్షల మంది ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నట్లు గణాంకాలు చెబుతున్నాయని వివరించారు. ఎన్నికల హామీ మేరకు వలంటీర్లను కొనసాగించాలని రూ.10 వేల గౌరవ వేతనం ఇవ్వాలని, ప్రభుత్వ కళాశాలలు, విశ్వవిద్యాలయాలు… విద్యా సంస్థలలో ఖాళీగా ఉన్న టీచింగ్‌, నాన్‌-టీచింగ్‌ పోస్టులు భర్తీచేయాలని డిమాండ్‌ చేశారు. పరిశ్రమల్లో స్థానిక యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలన్నారు. రెండు జనవరిలు పూర్తయినా జాబ్‌ క్యాలెండర్లు ప్రకటించలేదుగానీ, పెట్టుబడుల ప్రవాహం సాగుతుందనే ప్రచారం మినహా, నిరుద్యోగ యువతకు ఒరిగిందేమీ లేదన్నారు. కూటమి నాయకులకు కార్పొరేషన్‌, చైర్మన్‌, డైరెక్టర్‌ తదితర పదవులతో ఉద్యోగాలు వచ్చాయేగానీ, నిరుద్యోగ యువతకు ఉద్యోగాల కల్పన లేదన్నారు. రాష్ట్రంలో యువత సమస్యలపై ఈనెల 30న విజయవాడలో ‘నిరుద్యోగ రణభేరీ…కొలువుల కోసం కొట్లాడదాం రండి’ పేరుతో తలపెట్టిన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు