Sunday, November 16, 2025
Homeవిశ్లేషణనిష్పక్షపాత జర్నలిజానికి నిలువెత్తు నిదర్శనం జార్జ్‌

నిష్పక్షపాత జర్నలిజానికి నిలువెత్తు నిదర్శనం జార్జ్‌

- Advertisement -

కృష్ణ కానూరి
భారతీయ జర్నలిజంలో ఒక శకం ముగిసింది. దేశ పత్రికా రంగాన్ని ఏడు దశాబ్దాలకు పైగా తన నిర్మొహమాటమైన, సూటి వ్యాఖ్యానంతో సుసంపన్నం చేసిన దిగ్గజ జర్నలిస్ట్‌ టీజేఎస్‌ జార్జ్‌ (97) (థయిల్‌ జేకబ్‌ సోని జార్జ్‌ ) పరమపదించారు. ఆయన మరణం భారతీయ పత్రికారంగానికి తీరని లోటు. కేవలం వార్తలను నివేదించడమే కాకుండా, తన సూక్ష్మ పరిశీలన, నిప్పులాంటి నిజాయితీతో దేశంలోని మేధావులను, సామాన్య పాఠకులను ఆలోచింపజేశారు. పాత్రికేయ వృత్తి ఒక ధర్మం’ అని నమ్మి, ‘భయం ఎరుగని’ కలంతో పాలకుల గుండెల్లో గుబులు రేపిన జార్జ్‌, తన ‘పాయింట్‌ ఆఫ్‌ వ్యూ’ కాలమ్‌తో తరాల పాఠకులను ఆలోచింపజేశారు. నిజానికి, ఆయనది కేవలం నివేదన కాదుÑ అది రాజీలేని నిబద్ధతతో కూడిన ఒక జీవనయానం. ఆయన మన మధ్య లేకపోయినా, ఆయన గీసిన ‘సరళమైన, వంగని గీత’ (ూ్‌తీaఱస్త్రష్ట్ర్‌, ఖఅపవఅసఱఅస్త్ర ూఱఅవ) భావి జర్నలిస్టులకు ఎప్పటికీ స్ఫూర్తిదాయకం.
కేరళలో 1928లో జన్మించిన జార్జ్‌, మద్రాస్‌ క్రిస్టియన్‌ కాలేజీలో ఇంగ్లీష్‌ లిటరేచర్‌లో ఆనర్స్‌తో పట్టా పొంది, 1950లో ది ఫ్రీ ప్రెస్‌ జర్నల్తో తన ప్రస్థానాన్ని మొదలుపెట్టారు. ఆ తర్వాత ది సెర్చ్‌లైట్‌, ఫార్‌ ఈస్టర్న్‌ ఎకనామిక్‌ రివ్యూ వంటి జాతీయ, అంతర్జాతీయ పత్రికల్లో పనిచేశారు. హాంకాంగ్‌ కేంద్రంగా ప్రచురితమైన ప్రముఖ ప్రాంతీయ పత్రిక ఆసియావీక్‌ స్థాపక సంపాదకుడిగా ఆయన అంతర్జాతీయంగా గుర్తింపు పొందారు. 97 ఏళ్ల దీర్ఘజీవితంలో ఆయన కేవలం రాసిన వార్తలకే కాదు, నిబద్ధతతో రాసిన వ్యాసాలు సత్యానికి కూడా ప్రతీక అయ్యారు. మాట, మౌనం రెండిరటికీ అర్థం తెలిసిన వృత్తి యోధుడు.
భారతదేశానికి తిరిగి వచ్చిన తరువాత, ది న్యూ ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌లో సంపాదకీయ సలహాదారుగా చేరిన జార్జ్‌, తన వారపు కాలమ్‌ ‘‘పాయింట్‌ ఆఫ్‌ వ్యూ’’ ద్వారా దశాబ్దాల పాటు లక్షలాది మంది పాఠకులను చేరుకున్నారు. 25 ఏళ్లకు పైగా, 1,300 కు పైగా సంచికలు విరామం లేకుండా కొనసాగిన ఈ కాలమ్‌, ఆయన నిజమైన స్వభావాన్ని ప్రతిబింబించింది. అవినీతి, సామాజిక అన్యాయం, మత అసహనం, ప్రజాస్వామ్య సంస్థలకు ఎదురయ్యే ముప్పు వంటి అంశాలపై ఆయన నిరంతరం నిర్మొహమాటంగా విమర్శలు గుప్పించారు. ‘పాయింట్‌ ఆఫ్‌ వ్యూ’ కేవలం అభిప్రాయం కాదు. అది ప్రజాస్వామ్యానికి ఒక హెచ్చరిక, పాలకులకు ఒక ప్రశ్నాస్త్రం. నరేంద్రమోదీకి అనుకూలంగా వ్యాసం రాయడానికి తిరస్కరించిన జార్జి ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌కు రాయబోనని చెప్పి విరమించు కున్నారు. మోదీ ప్రభుత్వం ఈ వ్యవహారం ఉందని అనేక మంది విశ్లేషకులు తెలిపారు.
జైలుకు వెళ్లిన సంపాదకుడు: టీజేఎస్‌. జార్జ్‌ నిర్భయ జర్నలిజానికి నిలువెత్తు నిదర్శనం. 1965 లో నాటి బీహార్‌ ముఖ్యమంత్రి కేబీ సహాయ్‌ని వ్యతిరేకిస్తూ రాసినందుకు ఆయన అరెస్టయ్యారు. స్వతంత్ర భారతదేశంలో దేశద్రోహం కేసులో జైలుకు వెళ్లిన తొలి పత్రికా సంపాదకులలో ఆయన ఒకరు. అప్పటి రక్షణ మంత్రి వీకే కృష్ణ మీనన్‌ స్వయంగా కోర్టులో ఆయన తరపున హాజరుకావడం ఆయన నిబద్ధతకు లభించిన గౌరవం. ఎమర్జెన్సీ సమయంలో కూడా ధైర్యంగా నిలబడిన ఆయన, ప్రజాస్వామ్య విలువలకు రక్షకుడిగా మిగిలారు. ‘భయం ఎరుగని’ ఈ అనుభవాలను ఆయన తన జ్ఞాపకాల పుస్తకం ఘోషయాత్రలో నమోదు చేశారు. ఆయన జీవితం, పత్రికా స్వేచ్ఛ విలువను చాటిచెప్పే ఒక పాఠం, ఒక ధైర్య ప్రదర్శన.
అద్భుతమైన గ్రంథకర్త: జర్నలిస్టుగా మాత్రమే కాకుండా, జార్జ్‌ గొప్ప రచయితగా కూడా పేరు గాంచారు. రాజకీయ వ్యాసాల సంకలనం ది ఫస్ట్‌ రెఫ్యూజ్‌ ఆఫ్‌ స్కౌండ్రల్స్‌, పాలిటిక్స్‌ ఇన్‌ మోడర్న్‌ ఇండియా, కర్నాటక సంగీత విదుషీమణి ఎం.ఎస్‌. సుబ్బులక్ష్మి జీవిత చరిత్ర ఎం.ఎస్‌.: ఎ లైఫ్‌ ఇన్‌ మ్యూజిక్‌ వంటి రచనలు ఆయన మేధో పరిధిని, లోతైన పరిశోధనా దృష్టిని తెలియజేస్తాయి. కృష్ణ మీనన్‌, నర్గిస్‌, పోతన్‌ జోసెఫ్‌ వంటి ప్రముఖుల జీవిత చరిత్రలను రాసిన ఆయన, చైనా పరిణామాలపై విస్తృతంగా రాశారు. మలయాళంలో కూడా ‘ఘోషయాత్ర’, ‘ఒట్టయాన్‌’ వంటి రచనలు చేశారు. ఆయన రచనలు సరళంగా, సూటిగా, హృదయానికి హత్తుకునేవిÑ ప్రతి వాక్యం ఒక పాఠం. జార్జ్‌కు రాజకీయ రంగులు లేవు. ఆయన పక్షం ఒకటే నిజం పక్షం. రాజకీయ నాయకుల ద్వంద్వ నీతులపై, మతం పేరుతో మోసాలపై, అవినీతిపై, ప్రజాస్వామ్యానికి ముప్పు కలిగించే ప్రతి శక్తిపై ఆయన కలం విరుచుకుపడిరది. ఆయన రచనల్లో అత్యంత ప్రాచుర్యం పొందిన ‘ది ఫస్ట్‌ రెఫ్యూజ్‌ ఆఫ్‌ స్కౌండ్రల్స్‌: పాలిటిక్స్‌ ఇన్‌ మోడర్న్‌ ఇండియా’ పుస్తకం ద్వారా భారత రాజకీయాల్లోని చీకటి కోణాలను నిర్భయంగా ఆవిష్కరించారు. దేవుడిపై విశ్వాసం లేని ఆయన, మానవత్వాన్ని దేవుడిగా చూశారు. భాషలో ఖచ్చితత్వం, విమర్శలో నిజాయితీ’’ ఆయన ప్రతి తరానికి నేర్పిన పాఠం.
గౌరవం – నిరాడంబరత: జార్జ్‌ సేవలకు గుర్తింపుగా 2011 లో భారత ప్రభుత్వం ఆయనకు ప్రతిష్టాత్మకమైన పద్మభూషణ్‌ పురస్కారాన్ని అందించింది. అయినప్పటికీ, చివరి క్షణం వరకు ఆయన నిరాడంబరంగా, తన కలంతోనే జీవించారు. ఆయన తన చివరి కాలంలో కూడా జర్నలిజం విద్యను పెంపొందించేందుకు ఏషియన్‌ కాలేజ్‌ ఆఫ్‌ జర్నలిజం వంటి సంస్థలకు స్ఫూర్తిగా నిలిచారు. 2024లో వక్కం మౌలవి అవార్డు స్వీకరించినప్పుడు ఆయన భార్య అమ్ము జార్జ్‌ మరణంతో దుఃఖంలో ఉన్నప్పటికీ, అద్భుతమైన సమాధానంతో మాట్లాడారు. ‘‘జర్నలిజం అనేది వృత్తి కాదు, ఇది ఒక కర్తవ్యం’’ అని చెప్పారు. వృద్ధాప్యంలోనూ సాహిత్యం, ఆలోచన, పరిశీలన ఆయనకు ఊపిరి లాంటివి. 2025 అక్టోబర్‌ 3 న బెంగళూరులో ఆయన తుది శ్వాస విడిచారు. కానీ ఆయన చూపిన అచంచల రేఖ ఎప్పటికీ చెరగదు. ఆయన చివరి కాలమ్‌లో రాసిన ఈ మాటలు ఆయన జీవన సారాంశాన్ని తెలియజేస్తాయి: ‘‘ఒక దేశాన్ని, దాని పాలకులను ఏ మాత్రం విమర్శించకూడదని భావించడం సరికాదు ప్రత్యేకించి ‘వార్తాపత్రికల మనుషుల’ ( అవషంజూaజూవతీషaశ్రీశ్రీaష్ట్రం ) ద్వారా విమర్శ రావడం అవసరం.’’
టీజేఎస్‌ జార్జ్‌ మన మధ్య లేకపోయినా, ఆయన నిష్పక్షపాత జర్నలిజం, సంక్షిప్తత, అపారమైన ధైర్యం అనే లక్షణాలు యువ జర్నలిస్టులకు ఎప్పటికీ మార్గదర్శకంగా నిలుస్తాయి. ఆయన కలం గీసిన గీత నిజాయితీ, కచ్చితత్వం, రాజీలేని నిబద్ధతతో కూడిన సూటి గీత భారతీయ జర్నలిజం చరిత్రలో చెరగని ముద్ర వేసింది. ఆయన మరణం ఒక యుగాన్ని ముగించినా, ఆయన ఆలోచనలు కొత్త తరాన్ని ముందుకు నడిపిస్తాయి.
సెల్‌ 7981305779

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు