Sunday, February 8, 2026
Homeవిశ్లేషణనేతలు నేర్పేదేమిటి!

నేతలు నేర్పేదేమిటి!

- Advertisement -

భారతదేశ పౌరునికి ప్రశ్నించే హక్కులేని అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం మనది. మన ప్రజాస్వామ్యం గురించి బయట గొప్పలు చెప్పుకుంటాం. కాని చివరకు చట్టసభల్లో కూడా ప్రశ్నించే హక్కు లేకుండా పోతోంది. ఏమిటి, ఎందుకు అనే ప్రశ్నలు వేయకపోతే పాలకులు నియంతలుగా మారే అవకాశం ఉంది. అందుకే పాలకులు ప్రశ్నించడం నేరంగా పరిగణించి అటువంటి వారిపై కేసులు పెట్టడం, దాడులు చేయడం జరుగుతోంది. ప్రస్తుతం ప్రజాస్వామ్యం పార్టీ స్వామ్యంగా మారి చివరకు వ్యక్తి స్వామ్యంగా మారుతోంది. కేంద్రంలోను, రాష్ట్రంలోను చివరకు మంత్రులకు కూడా ప్రశ్నించే హక్కు లేకుండా పోతోంది. ఒకవేళ హక్కు ఉన్నా ప్రశ్నించడం మాని అధినాయకునికే సర్వ హక్కులు కట్టబెట్టారు. పదవులు కాపాడుకొని పదవి ద్వారా సంపాదించుకోవడానికి అలవాటుపడి ప్రశ్నించడం మానివేశారు. ప్రజలు తమ సమస్యలు పరిష్కరించుకోవడానికి ఎన్నుకుంటే పదవులు పొందిన తరువాత మీ సమస్య లేమిటని ప్రజల వద్దకు రావడం అత్యంత శోచనీయం. ఇతర దేశాల నుంచి వచ్చి ఎన్నికయిన వారికి తెలియకపోవచ్చు గాని ప్రజల్లో తిరిగే నాయకులకు సమస్యలు తెలియకనే ప్రజలను అడుగుతున్నారా అని ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అది కూడా ముఖ్యమంత్రి ప్రజల వద్దకు వెళ్లని వారిపై చర్యలుంటాయన్న తరువాత మాత్రమే నాయకులకు ప్రజలు గుర్తుకు రావడం ఆశ్చర్యమే. కేంద్రంలో ప్రధానమంత్రి, రాష్ట్రాలలో ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయాలు శిరోధార్యంగా మంత్రులు, శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులు భావిస్తూ అమలు జరపడం తమ వంతుగా భావించి కలెక్టర్లకు ఉన్నతాధికారులకు ఫోన్లు చేసి అమలుపరచమని అడగడంతో తమ కర్తవ్యం పూర్తయినట్లుగా భావిస్తున్నారు. ఈ రకంగా ప్రజాస్వామ్య ముసుగులో నియంతల పాలన సాగుతోందని మేధావులు ఆవేదన వ్యక్త పరుస్తున్నారు.
సమాజంలో మతరహిత ప్రజాస్వామ్యం కోరేవారి మాటలకు విలువ లేదు. ప్రజలు అడగకపోయినా పుష్కరాలకు ప్రజల్ని తరలించడం ద్వారా ప్రజల సొమ్ము ఖర్చుచేసి ఆ సందర్భంగా కొంతమంది ప్రాణాలు బలిగొనడం చివరకు ఆ తప్పంతా మీడియాపైకి తోయడం గతంలో జరిగింది. అంతేకాక ప్రపంచంలోనే గొప్పగా నిర్మించే రాజధానిలో అన్ని మతాల వారికి వారు పవిత్రంగా భావించే మసీదులు, దేవాలయాలు కడతామని కూడా గతంలో నాయకులు వాగ్దానాలు చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో అన్ని మతాల వారిని సమదృష్టితో చూడమనే గాని వారికి ప్రజలందరి సొమ్ము ఖర్చుచేసి మతాలను ప్రోత్సహించడం తగని పని. మత వ్యాప్తికి ఖర్చు చేసి ప్రజలను మతం ముసుగులో మత్తులో ముంచి నాయకులు, అధికారులు ప్రజల సొమ్ము దోచుకుంటున్న సంగతి సామాన్య ప్రజలకు కూడా తెలిసినా ప్రశ్నించి జైలుకెళ్లడం దేనికని మిన్నకుంటున్నారు. తహసీల్‌దారుని, పోలీసులను నాయకులు కొట్టినా చర్యలుండవు కాని ఇదేమి అన్యాయం అని అడిగితే జైలు పాలుకాక తప్పదు . కులమతరహిత సమాజం అవసరమని, ప్రజలకు ఉపాధి కల్పించడం ద్వారా దేశాన్ని అభివృద్ధి చేయమని ప్రజలు ఎన్నుకుంటే అందుకు భిన్నంగా పాలన చేయడం ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. పండుగలకు కానుకలిచ్చి మరల తమనే ఎన్నుకోమని నేతలు అడగడం చూస్తే సమాజాన్ని వెనక్కి నెడుతున్నారని అనిపిస్తోంది. విచిత్రమేమిటంటే గతంలో చదువులేక నాయకుల్ని గుడ్డిగా నమ్మి ఆలోచించే శక్తిలేక అనుసరించేవారు. ప్రస్తుతం చదువుకుని అన్ని అర్థం చేసుకుని కూడా ఆలోచించకుండా గుడ్డిగా పదవుల కోసమో సంపాదన కోసమో నాయకుల్ని అనుసరించడం శోచనీయం.
ప్రజలు ఉపాధి అడిగారే తప్ప ఉచితాలు అడగలేదు. అడగకపోయినా ఒక పార్టీని మించి మరొక పార్టీ ఉచిత పథకాల వర్షం కురిపించారు. చివరగా స్త్రీలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం ప్రకటించి కోట్ల రూపాయిలు ఖర్చవుతోందని లోటు బడ్జెటులో సతమతమవుతున్నామని స్టేటుమెంట్లు ఇవ్వడం హాస్యాస్పదం. ముప్పయి కిలోమీటర్లలో విమానాశ్రయం ఉండగా అమరావతిలో మరల పొలాలు కొని మరో విమానాశ్రయం నిర్మిస్తాననటం మేధావులు జీర్ణించుకోలేక పోతున్నారు. సమస్తం రాజధాని నిర్మాణంలో ఉన్న పరిధిలోనే ఉండాలనుకోవడం పట్ల కూడా ఆశ్చర్యం వ్యక్తపరుస్తున్నారు. అసలు నాయకుల్ని ఎన్నుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకునేది ప్రజల కోసమో నాయకుల కోసమో అర్థం కావడంలేదు. అమరావతి ప్రాంతం భూకంపం వచ్చే ప్రదేశమని కొందరు, ముంపు ప్రాంతమని మరికొందరు చెబుతుండగా అన్ని అమరావతిలోనే కాకుండా రాయలసీమలో కొన్ని, విశాఖలో కొన్ని అమరావతిలో కొన్ని నిర్మిస్తే అందరికి సమన్యాయం చేయడంతో పాటు కీడెంచి మేలెంచమన్నట్లుగా ఏదైనా నష్టం వాటిల్లినా స్వల్పంగానే ఉంటుందని కొందరంటున్నారు.
ఇదిలా ఉండగా ప్రస్తుతం రాజకీయాలు రూపురేఖలు మారిపోతున్నాయి. ఒక పార్టీ మరొక పార్టీని తిట్టుకోవడం, తన్నుకోవడం చివరకు హతమార్చడమే రాజకీయంగా మారింది. అధికార పార్టీ వారు ప్రతిపక్ష నేతల్ని జైల్లో పెడితే తాము అధికారంలోకి వచ్చాక ఇంతకంటె ఘోరంగా మీపై ప్రతిచర్యలుంటాయని స్టేటుమెంట్లు ఇస్తున్నారు. యువతకు నేతలు నేర్పేది ఇదేనా అని విజ్ఞులు ముక్కున వేలేసుకుని ఆశ్చర్యం వ్యక్తపరుస్తున్నారు.
సెల్‌: 9885569394

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు