. జెన్‌జీ ఆమోదం
. బాధ్యతల స్వీకరణకు మాజీ న్యాయమూర్తి అంగీకారం
ఖాట్మండు: నేపాల్‌లో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడిరది. ఆ దేశ తాత్కాలిక ప్రభుత్వా ధినేతగా సర్వోన్నత న్యాయస్థానానికి మాజీ న్యాయమూర్తి సుశీలా కర్కిని ‘జెన్ జీ’ (జనరేషన్ జీ) ఆమోదించింది. దేశ పగ్గాలు చేపట్టేందుకు జస్టిస్ కర్కి కూడా అంగీకరించారు. ఈమేరకు ఆమె నేపాల్ మీడియాకు చెప్పారు. జస్టిస్ కర్కి సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైన మొదటి మహిళ. ఆమె 2016, ఫిబ్రవరిలో నేపాల్ సీజేఐగా బాధ్యతలు చేపట్టారు. తాజాగా ఐదు వేల మందికిపైగా యువతీయువకులు వర్చువల్‌గా సమావేశాన్ని నిర్వహించు కోవడం ద్వారా తాత్కాలిక ప్రభుత్వాధి నేతగా జస్టిస్ కర్కిని ఎంపిక చేసుకు న్నారు. తొలుత ఖాట్మండు బేయర్ బలేన్ షా పేరు ప్రచారంలో ఉండగా ఆయనను సంప్రదించేందుకు అనేకమార్లు ప్రయత్నించినా స్పందించ లేదని, తమ అభ్యర్థిని మార్చకున్నట్లు ‘జెన్ జీ’ ప్రతినిధి తెలిపారు. బలేన్ షా స్పందించకపోవడంతో జస్టిస్ కార్కికి అధిక మంది మద్దతు ఇచ్చారన్నారు. వాస్తవానికి జస్టిస్ కర్కికి మద్దతుగా వెయ్యి మంది సంతకాల సేకరించాలని భావించారు. అయితే లక్ష్యానికి మించి 2,500 మంది మద్దతు పలికారు. యువత మద్దతు లభించడంతో తాత్కాలికంగా ప్రభుత్వ పగ్గాలు చేపట్టేందుకుగాను సైన్యాధిపతి, అధ్యక్షుడి ఆమోదాన్ని ఆమె కోరనున్నట్లు సమాచారం.
30 మంది మృతి: కర్ఫ్యూ
విధించిన సైన్యం
నేపాల్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జెన్ జీ ఆందోళనలు మిన్నంటగా, జరిగిన హింసలో చనిపోయిన వారి సంఖ్య 30కి చేరింది. వందల మంది గాయపడ్డారు. హింసాత్మక ఘటనలు, దోపిడీలను నివారించడం కోసం ప్రజలు ఎవరూ గడప దాటవద్దంటూ ఆదేశిస్తూ నేపాల్ సైన్యం బుధవారం కర్ఫ్యూ విధించింది. పార్లమెంటుకు నిప్పు పెట్టిన ఘటన నేపథ్యంలో కీలక భవనాలు, కార్యాలయాల వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది. నేపాల్‌భారత్ సరిహద్దును సైతం మూసివేశారు. అంతర్జాతీయ విమానాశ్రయంలో విమాన సేవలను సాయంత్రానికి పునరుద్ధరించారు. ప్రధాని కేపీ శర్మ ఓలి రాజీనామా తర్వాత ఆందోళనల నెపంతో హింస చెలరేగింది. హింసాత్మక ఘటనలను నివారించేందుకుగాను గురువారం ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ ఉంటుందని సైన్యం తెలిపింది. ప్రజలను గడప దాటవద్దని ఆదేశాలివ్వడంతో నేపాల్ రాజధాని నిర్మాణుషంగా మారింది. వీధులన్నీ సైనికులు మాత్రమే కనిపించారు. అధ్యక్షుడు కార్యాలయం, ప్రధాని నివాసం, ప్రభుత్వ భవనాలు, సుప్రీం కోర్టు, రాజకీయ పార్టీల కార్యాలయాలు, సీనియర్ నాయకుల నివాసాల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అంతకుముందు రోజు పార్లమెంటుకు ఆందోళనకారులు నిప్పు పెట్టిన క్రమంలో ప్రధాన ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. లూటీలు, నిప్పుపెట్టడాలు, వినాశకర కార్యకలాపాలు చోటుచేసుకోకుండా అవసరమైన అన్ని భద్రతా చర్యలు తీసుకుంటున్నట్టు ఆర్మీ ప్రకటించింది. ప్రదర్శనలు, విధ్వంసం, దాడులకు దిగినా...ఆస్తులకు నష్టం కలిగించినా నేరంగా పరిగణించి చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. అంబులెన్సులు, ఫైర్ ఇంజిన్లు, వైద్య సిబ్బంది, భద్రతా దళాలు సహా అత్యవస సేవలందించే వారిని మాత్రమే అనుమతిస్తున్నట్లు వెల్లడిరచింది. చిక్కుకున్న విదేశీయులంతా సమీప భద్రతా పోస్టును ఆశ్రయించాలని సూచించింది. విదేశీయులకు అవసరమైన సహాయ సహకారాలు అందించాలని హోటళ్లు, పర్యాటక ఎంట్రప్రెన్యూర్లు సహా సంబంధిత ఏజెన్సీలన్నింటినీ సైన్యం వేరొక ప్రకటనలో కోరింది. తమ వద్ద ఉన్న ఆయుధాలు, తుపాకులు, బుల్లెట్లను అప్పగించాలని... చట్టవిరుద్ధంగా ఆయుధాలు కలిగివుంటే చర్యలు తప్పబోవని నేపాల్ ప్రజలకు సైన్యం స్పష్టంచేసింది. సామాన్యులు ఎవరూ ఆర్మీ దుస్తులు ధరించరాదని, అలా చేస్తే చట్టాన్ని ఉల్లంఘించినట్లేనని హెచ్చరించింది. తదుపరి ఆదేశాల వరకు ఖాట్మండులోని త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయం (టీఐఏ) మూసివేశారు. ఎయిరిండియా, ఇండిగో సహా అంతర్జాతీయ విమాన సేవలు రద్దు అయ్యాయి. దీంతో వందల మంది ప్రయాణికులు విమానాశ్రయంలో చిక్కుకుపోయారు. ఖాట్మండులోని వేర్వేరు చోట్ల లూటీలు, విధ్వంసానికి సంబంధించి 27 మందిని అరెస్టు చేశారు. చాబాహిల్, బౌద్ధా, గౌశాల నుంచి రూ.3.37 లక్షల నగదు, 31 ఆయుధాలు, బుల్లెట్లు, మ్యాగజైన్లు స్వాధీనం చేసుకున్నారు. శాంతి నెలకొల్పేందుకు, శాంతిభద్రతలు పరిరక్షించడం కోసం సహకరించాలని ప్రజలకు సైన్యం పిలుపునిచ్చింది.
ఐరాస ఆందోళన
నేపాల్ పరిస్థితిపై ఐక్యరాజ్య సమితి ఆందోళన వ్యక్తం చేసింది. ప్రధాన కార్యదర్శి గుటెర్రస్ పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నారని, ప్రాణ నష్టం జరగకుండా త్వరగా శాంతి నెలకొనాలని ఆశిస్తున్నారని ఐరాస అధికార ప్రతినిధి ఒక ప్రకటన చేశారు. నిర్మాణాత్మక పథంలో ముందుకెళ్లేందుకు చర్చలే ఉత్తమ పరిష్కారమని గుటెర్రస్ సూచించినట్లు వెల్లడిరచారు.
7వేల మందికిపైగా ఖైదీలు పరార్
పశ్చిమ నేపాల్‌లోని జైలులో భద్రతా సిబ్బందితో గొడవలో ఐదుగురు జువనైల్ ఖైదీలు ప్రాణాలు కోల్పోయారు. దేశంలోని వేర్వేరు జైళ్ల నుంచి ఏడు వేల మందికిపైగా ఖైదీలు పరారయ్యారు. హోంశాఖ వర్గాల ప్రకారం దిల్లీబజార్ జైలు నుంచి 1,100 మంది, చిట్వాన్ జైలు నుంచి 700 మంది, నఖ్కు జైలు నుంచి 1,200 మంది, రaుంపాకా (సన్‌సారి) నుంచి 1,575 మంది, కాంచన్పూర్ నుంచి 450 మంది, కైలాలీ నుంచి 612 మంది, జలేవ్వర్ నుంచి 576 మంది కాస్కీ నుంచి 773 మంది, దాంగ్ నుంచి 124 మంది, జుమ్లా నుంచి 36 మంది సంలుఖుంబా నుంచి 86 మంది, గౌర్ నుంచి 260 మంది, బల్జాంగ్ నుంచి 65 మంది చొప్పున ఖైదీలు తప్పించుకుపోయినట్లు తెలుస్తోంది. బాగ్మతి ప్రావిన్స్‌లోని సింధులీలోగల సింధులిగధి జిల్లా జైలు నుంచి 43 మంది మహిళలు సహా 471 మంది ఖైదీలు పరారయ్యారు. నావల్‌పరాసీ వెస్ట్‌లోని జిల్లా జైలు నుంచి 500 మందికిపైగా ఖైదీలు తప్పించుకు న్నారు. ‘జైలు లోపల నిప్పు పెట్టి… విడు దల కోసం నినాదాలతో సిబ్బందితో గొడవ పెట్టుకున్నారు. వారిని నియంత్రించేందుకు సిబ్బంది ప్రయత్నించినాగానీ ఖైదీలు తప్పించుకోగలిగారు’ అని ఒక అధికారి ఎక్స్‌లో పేర్కొన్నారు. ఆర్మీ, పోలీసులు, సాయుధ పోలీసులు రంగంలోకి దిగి ఖైదీల కోసం ముమ్మరంగా గాలిస్తున్నట్లు వెల్లడిరచారు. ఖైదీలు తప్పించుకోకుండా జైళ్లలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తామని అధికారులు తెలిపారు.


