బొల్లిముంత సాంబశివరావు
మొంథా తుపాను రెండు తెలుగు రాష్ట్రాలను అతలాకుతలం చేసింది. అపారంగా పంటలకు నష్టం జరిగింది. రోడ్లు, భవనాల శాఖకు, విద్యుత్ సంస్థకు అపార నష్టం జరిగింది. నదులు, వాగులు, వంకలు, చెరువులు ఉప్పొంగి అనేక చోట్ల గండ్లు పడ్డాయి. వందలాది గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. అనేక ఇళ్లు నేల కూలాయి. వేల కోట్లలో నష్టం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్, ఖమ్మం, సూర్యారావుపేట, నల్గొండ, హనుమకొండ, నాగర్‌కర్నూల్, మహబూబాబాద్, జనగాం, కరీంనగర్ మొదలైన జిల్లాల్లో 2.5 లక్షల ఎకరాల్లో వరి, 1.51 లక్షల ఎకరాల్లో పత్తితో పాటు మిర్చి, మొక్కజొన్న మొదలైన పంటలు 5 లక్షల ఎకరాల్లో దెబ్బతిన్నాయని వ్యవసాయ శాఖ ప్రాథమిక అంచనా వేసింది. క్షేత్ర స్థాయి పరిశీలనలో పంటల విస్తీర్ణత, నష్టం ఇంకా ఎక్కువగా ఉంటుంది. పంట నష్టంతో పాటు రెండు డిస్కింల పరిధిలో విద్యుత్ సంస్థకు 10 వేల కోట్ల దాకా నష్టం జరిగింది. 4,576 కిలోమీటర్ల మేర రహదార్లు దెబ్బ తిన్నాయి. 302 కల్వర్టులు ధ్వంసం అయ్యాయి. రహదారుల మరమ్మతులకు 2,713 కోట్ల అవసరమని ఆర్‌అండ్‌బి శాఖ మంత్రి పేర్కొన్నారు. తుపాను వల్ల జరిగిన మొత్తం నష్టం 5,265 కోట్లుగా అంచనా వేశారు. ఈ నష్టం ఇంకా పెరుగుతుంది. తెలంగాణలో పంట కాల్వల, మురుగు కాల్వల నిర్వహణ సరిగా లేకపోవటం, ముళ్లకంపలు, పూడికలతో కాల్వలు నిండి ఉండటం వల్ల వరదలు, భారీ వర్షాలు వచ్చినప్పుడు కాల్వలకు, చెరువులకు గండ్లుపడి పంటలు ముంపునకు గురౌతున్నాయి. రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో మురుగు నీటి కాల్వలే లేవు. తెలంగాణ ప్రభుత్వం ఎకరాకు పంట నష్ట పరిహారంగా 10 వేల రూపాయల ప్రకటించింది. ఇది రైతుకు ఊరట ఇవ్వదు. ఎకరా సేద్యానికి 35 వేలకు పైగా రైతు పెట్టుబడి పెట్టాడు. కౌలు రైతులు అదనంగా కౌలు డబ్బులు చెల్లిస్తున్నాడు. అలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ఇచ్చే పరిహారం రైతు నిలదొక్కుకోవడానికి ఉపయోగపడదు. రైతులు ఎదుర్కొంటున్న సంక్షోభం దృష్టిలో పెట్టుకుని పరిహారం పెంచాలి. సేద్యంలో కీలక పాత్ర పోషిస్తున్న కౌలు రైతులకు అసలు పరిహారమే అందడం లేదు. అసలు వారిని కౌలు రైతులుగా గుర్తించడం లేదు. ఎవరు కౌలు రైతులు అన్నది గుర్తించి వారికి పంట నష్ట పరిహారం ఇవ్వాలి.
ఆంధ్రప్రదేశ్‌లో కృష్ణా, కోనసీమ, తూర్పు గోదావరి, కాకినాడ, పశ్చిమగోదావరి, ప్రకాశం, నెల్లూరు, గుంటూరు మొదలగు జిల్లాల్లో మొంథా తుపాను వల్ల అనేక చెరువులు, వాగులకు గండ్లు పడి పంటలతో పాటు వందలాది గ్రామాలు నీట మునిగాయి. అనేక చోట్ల రాకపోకలు నిలిచిపోయాయి. ప్రజల జీవనం స్థంభించి పోయింది. కొద్ది మరణాలు సంభవించాయి. వేల కోట్ల నష్ట జరిగింది. ఆంధ్రప్రదేశ్‌లో తుపాను నష్టాలను పరిశీలించడానికి కేంద్ర బృందం ఈ నెల 10 న రాష్ట్రానికి వచ్చింది. ఈ బృందంలో పిపౌసుమి బసు, మహేష్‌కుమార్, శశాంక్, శేఖర్‌రామ్, సాయి బగీరధతో పాటు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ సభ్యులుగా ఉన్నారు. ఈ బృందానికి తుపాను వల్ల రాష్ట్రంలో లక్షా 62 వేల ఎకరాల్లో వరి, పత్తి, మినుము, మొక్కజొన్న పంటకు నష్టం జరిగిందని, 6,250 హెక్టార్లలో ఉద్యానవన పంటలు దెబ్బతిన్నాయని, 3,063 హెక్టార్లలో చేపల చెరువులు ధ్వంసమయ్యాయని, 4,794 కిలోమీటర్ల రోడ్లు, 311 వంతెనలు, 3,437 మైనర్ ఇరిగేషన్ పనులు, 2,417 మేజర్, మీడియం ఇరిగేషన్ పనులకు నష్టం జరిగిందని, 9,960 ఇళ్లు నీట మునిగాయని, 1,11,402 మంది నిరాశ్రయులయ్యారని మొత్తం నష్టం 6,384 కోట్లని, ఉదారంగా ఆదుకోవాలని కేంద్ర బృందాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. తక్షణ సహాయంగా 901 కోట్లు ఇచ్చి ఆదుకోవాల్సిన అవసరం ఉందని కేంద్ర ప్రభుత్వానికి విన్నవించింది. కేంద్ర పరిశీలక బృందాలు తుపాను, వరదల నష్టాల పరిశీలనకు ఆలస్యంగా రావడం, పై పై పరిశీలన చేయడం, కేంద్రానికి నివేదికలు ఇవ్వడం, కేంద్రం భిక్షం వేసినట్లు సహాయం ప్రకటించడం జరుగు తూనే ఉంది. ఎప్పుడూ ప్రజలకు చేయూత ఇచ్చే విధంగా రాష్ట్రానికి సహాయక నిధులు విడుదల చేయలేదు. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సహాయం కోసం యూపీఏ, ఎన్డీయే ప్రభుత్వాలపై వత్తిడి చేయలేదు. నేడు చంద్రబాబు కూడా తుపాను సహాయం కోసం మోదీ ప్రభుత్వంపై వత్తిడి చేయలేకపోతున్నారు. ఇంతకు ముందు పంపిన నివేదికలో తక్షణ సహాయంగా 2,622 కోట్లు కోరిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పుడు 901 కోట్లు కోరటమే అందుకు నిదర్శనం.
ఆంధ్రప్రదేశ్‌లో పంటల నష్టంపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. 15 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని, కూటమి ప్రభుత్వం పంట నష్టాన్ని తక్కువ చేసి చెబుతున్నదనే విమర్శలు ఉన్నాయి. జిల్లాల వారీగా జరిగిన పంట నష్టం వివరాలు, ఈ విమర్శలు వాస్తవం అని తెలియచేస్తున్నాయి. కూటమి ప్రభుత్వం పంట నష్టం తక్కువగా చెప్పడం ద్వారా రైతులకు నష్టపరిహారం కింద ఇచ్చే మొత్తాన్ని తగ్గించుకోవడం కోసమే అనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. పంటలు కోల్పోయిన రైతాంగానికి అన్ని రకాలుగా ఆదుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది. చంద్రబాబు ప్రభుత్వం ఇప్పటి వరకు ఏ విధంగాను ఆదుకోలేదు. రైతు ఇప్పటికే ఎకరాకి 35 వేలు దాకా సేద్యానికి పెట్టుబడి పెట్టాడు. కౌలు రైతులు అదనంగా మరో 15 వేలు కౌలు రూపంలో చెల్లించాడు. ప్రభుత్వం ప్రకటించిన నష్ట పరిహారం ఎకరాకు 10 వేలు. ఈ పరిహారం రైతులకు ఊరట ఇవ్వదు. కౌలు రైతులకు కూడా నష్ట పరిహారం ఇస్తామని చెబుతున్నా, మాటలకే పరిమితమై ఆచరణలో అమలు జరగడం లేదు. పంట నష్టం తక్కువ చూపి ఇచ్చే 10 వేలలో కూడా తగ్గిస్తారని గత అనుభవాలు తెలుపుతున్నాయి. గత, ఈ సంవత్సరం ఎన్టీఆర్ రైతు భరోసా కింద 40 వేలు ఇవ్వాల్సి ఉండగా, ఇచ్చింది 5 వేలు మాత్రమే. కష్ట సమయంలో మిగతా డబ్బులు ఇచ్చి ఉంటే రైతుకు ఆసరాగా ఉండేది. అది కూడా చంద్రబాబు చేయలేదు. ఇంతకు ముందు పంటల నష్ట పరిహారం కింద రైతులకు ఇవ్వాల్సిన 595 కోట్లు కూడా ఇవ్వలేదు. వైసీపీ పాలన కాలంలో పంటల బీమా పథóకానికి బీమా ప్రీమియం మొత్తం ప్రభుత్వమే చెల్లించి పంట నష్టానికి కొంత మేరకు పరిహారం అందేలా చేసింది. కారణం తెలియదు గాని చంద్రబాబు ప్రభుత్వం రైతాంగం తరపున ఈ సంవత్సరం చెల్లించాల్సిన ప్రీమియం చెల్లించలేదు. 2023-24 సంవత్సరంలో 85 లక్షల మందికి బీమా ప్రీమియం వైసీపీ ప్రభుత్వం చెల్లించింది. ఈ సంవత్సరం 19లక్షల మంది రైతులు మాత్రమే తమ బీమా ప్రీమియం చెల్లించారు. బీమా ప్రీమియం చెల్లించటం లేదని కూటమి ప్రభుత్వం చెప్పినా, రైతులైనా చెల్లించుకునేవారు. ప్రీమియం చెల్లించని ఫలితంగా బీమా సంస్థల నుంచి నష్ట పరిహారం లభించక రైతులు నష్ట పోతున్నారు. బీమా పరిహారం లభించి ఉంటే, రైతుకు నేటి పరిస్థితుల్లో ఉపయోగం ఉండేది.
పంటలు ముంపునకు గురైనప్పుడు, రైతాంగం నుంచి ఎటువంటి వంకలు పెట్టకుండా మద్దతు ఇచ్చి ప్రభుత్వ సంస్థలే కొనుగోలు చేయాలి. మొంథా తుపానుకు గురైన రైతుల నుంచి పంట కొనుగోళ్లు చేయాలంటే, పంట నష్ట పరిహారం కోసం పేర్లు నమోదు చేసుకోరాదని, చేసుకుంటే, నష్టపోగా మిగిలిన పంటను మిల్లర్లు ఇచ్చే రేటుకు అమ్ముకోవాలని, ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో కొనే అవకాశం లేదని అధికారులు రైతులకు తెగేసి చెబుతున్నారు. ముంపు బారిన పడిన ధాన్యాన్ని మద్దతు ధరకు కొనమని మిల్లర్లు ప్రకటించారు. మిల్లర్లు ఇచ్చిన రేటుకే అమ్ముకోవలసిన పరిస్థితుల్లో రైతులు బాగా నష్టపోతారు. పంట నష్టపోయిన రైతుల వివరాలు కూడా ఒక్క రోజులో పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు వెళ్లాయి. అక్టోబర్ 31 తర్వాత పంట నష్ట నమోదు జరగదని అధికారులు నోటీసులు పంపారని రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వ వైఖరిని రైతాంగం వ్యతిరేకిస్తూ, ఒక్కరోజులో పంట నమోదు ఎలా సాధ్యమని ఆవేదన చెందుతున్నారు. రాష్ట్రంలో అతివృష్టి, అనావృష్టి పరిస్థితులు ప్రతి సంవత్సరం సంభవిస్తూనే ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో వరదలు రావటానికి, పంటలు ముంపునకు గురి కావటానికి కారణమైన నదుల, వాగుల, కాల్వల, చెరువుల కర కట్టలను పటిష్ట చేయడం, పూడికలు తీయడం, డ్రైనేజీ వ్యవస్థను ఆధునికీకరణ చేయడం ద్వారా నష్టాన్ని తగ్గించవచ్చు. ఈ పనులు చేయడంలో రాష్ట్ర పాలకుల వైఫల్యం వల్ల తుపాన్ల, వరదల సందర్భంగా పంటలకు అపార నష్టం జరుగుతున్నది. రెండు రాష్ట్రాల్లో ఇప్పటికే తీవ్ర సంక్షోభంలో ఉన్న రైతాంగం, మొంథా తుపాను వల్ల పంటలు నష్టపోయి మరింత సంక్షోభంలో కూరుకుపోయే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇలాంటి పరిస్థి తుల్లో ఉన్న రైతాంగాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఉంది. ఈ బాధ్యతను ప్రభుత్వాలు గాలికి వదిలేశాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల రైతాంగ వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ, కౌలు రైతులతో సహా పూర్తిగా నష్టపోయిన రైతులకు ఎకరాకి కనీసం 25 వేలు, మిగతా పంట నష్టపోయిన రైతులకు ఎకరాకి 20 వేలు ఇవ్వాలని, ఎటువంటి ఆంక్షలు లేకుండా రైతుల నుంచి మద్దతు ధరకు కొనుగోలు చేయాలని. చిన్న, సన్న కారు రైతులకు బ్యాంకులు ఇచ్చిన పంట రుణాలు రద్దు చేయా లని, పంట కాల్వలు, డ్రైనేజీ కాల్వలను ఆధునీకరణ చేయా లని, సహాయం పొందడం పాలకుల భిక్ష కాదని, అది తమ హక్కు అని రెండు రాష్ట్రాల రైతాంగం ఉద్యమించాలి.
సెల్: 9885983526


