Homeపారిశ్రామిక వేత్తలుగా లక్షమంది మహిళలు

పారిశ్రామిక వేత్తలుగా లక్షమంది మహిళలు

- Advertisement -

ఈ లక్ష్య సాధనకు బ్యాంకర్లు సహకరించాలి
రాజధానిలో బ్యాంకుల ప్రధాన కార్యాలయాలు
అమరావతి రైతుల రిటర్న్‌బుల్‌ ప్లాట్లకు రుణాలు
ఎస్‌ఎల్బీసీ సమావేశంలో సీఎం చంద్రబాబు

విశాలాంధ్ర బ్యూరోఅమరావతి : ఒక కుటుంబం ఒక పారిశ్రామికవేత్త విధానంలో భాగంగా వచ్చే ఏడాది మార్చి 8వ తేదీన జరగబోయే మహిళా దినోత్సవం నాటికి లక్ష మంది పారిశ్రామిక వేత్తలను తయారు చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని, దీనికి బ్యాంకర్లు పూర్తిగా సహకరించాలని సీఎం చంద్రబాబు నాయుడు కోరారు. మంగళవారం రాష్ట్ర సచివాలయంలో 232వ రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశం జరిగింది. వ్యవసాయం, ప్రాథమిక రంగాలు, ఎంఎస్‌ఎంఈ, డ్వాక్రా గ్రూపులకు రుణ వితరణ లక్ష్యాలు, గ్రామీణ ప్రాంతాల్లో బ్యాంకింగ్‌ సేవలపై చర్చించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రాధాన్యతలను ముఖ్యమంత్రి వివరించారు. అలాగే ఏయే రంగాల్లో సహకారం కావాలనే అంశాన్ని సీఎం స్పష్టం చేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. బ్యాంకులు అందించే సహకారాన్ని అందుకుని ఏపీ డ్వాక్రా మహిళలు ప్రగతి పథాన నడుస్తున్నారు. ఇప్పటికే మహిళలు వివిధ రంగాల్లో వ్యాపారాలు చేస్తున్నారు. స్వయం ఉపాధి పొందుతున్నారు. వారికి మరింత తోడ్పాటు ఇచ్చే విధంగా వన్‌ ఫ్యామిలీ-వన్‌ ఎంటర్‌ పెన్యూయర్‌ విధానాన్ని వారికి వర్తింప చేసి మహిళల ఆర్థికాభివృద్ధికి కృషి చేయడం లక్ష్యంగా పెట్టుకున్నాం. ఇందులో భాగంగా 175 నియోజకవర్గాల్లో ఎంఎస్‌ఎంఈ పార్కులు ఏర్పాటు చేస్తున్నాం. వీటిల్లో వీలైనంత మేరకు మహిళలకు అవకాశం ఇస్తాం. డ్వాక్రా మహిళలకు బ్యాంకర్లు ఏ విధంగా సహకరించారో.. దీనికి కూడా బ్యాంకర్లు సహకరించాలని చంద్రబాబు కోరారు.
ఇన్నోవేషన్‌ కేంద్రాలకు… బ్యాంకర్లు అనుసంధానమవ్వాలి
యువత, మహిళ పారిశ్రామిక వేత్తలను ప్రొత్సహించేలా రాష్ట్రంలో రతన్‌ టాటా ఇన్నోవేషన్‌ హబ్‌ ప్రారంభించాం. ఇప్పటికే అమరావతిలో ప్రధాన కేంద్రం పనిచేయడం మొదలైంది. విశాఖ, రాజమండ్రి, విజయవాడ, అనంతపురం, తిరుపతి వంటి చోట్ల ఐదు ప్రాంతీయ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నాం. అలాగే వీరికి నాలెడ్జ్‌, ఎడ్యుకేషన్‌ పార్టనర్లు ఉంటారు. దీనికి బ్యాంకర్ల నుంచి సహకారం ఉండాలి. ఫలితాలు వచ్చేలా ప్రణాళికలు అమలు చేస్తున్నాం. ఐదు ప్రాంతాల్లో ఏర్పాటు చేయబోయే ఇన్నోవేషన్‌ హబ్‌ లకు ఆయా ప్రాంతాల్లో ఉండే బ్యాంకుల ప్రతినిధులను అనుసంధానించాలి. ఇది స్టార్టప్‌ లకు, నైపుణ్యాభివృద్ధికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. బ్యాంకర్లు తక్కువ వడ్డీలతో రుణాలివ్వడం.. తక్కువ మొత్తాలతో అప్పు తీర్చే వెసులుబాటు కలిగించాల్సిన అవసరం ఉంది. బ్యాంకర్ల సమావేశాలు అర్థవంతంగా జరగాలి. రోటీన్‌ సమావేశాల వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు. ఖరీఫ్‌ సీజన్లో ఇప్పటికే సగం సమయం గడిచిపోయింది. ఈ పాటికే రైతులకు రుణాలు ఇవ్వాల్సి ఉంటుంది. సీజన్‌ ఆఖరులో రుణాలు ఇవ్వటం వల్ల రైతులకు ఎలాంటి ఉపయోగం ఉండదు. బ్యాంకులు, పబ్లిక్‌ పాలసీలు ఎప్పుడూ ప్రజల్ని నియంత్రించేలా కాకుండా… ప్రొత్సహించేలా ఉండాలని సీఎం మార్గనిర్దేశనం చేశారు. అమరావతిలో బ్యాంకులు తమ ప్రధాన కార్యాలయాలను ఏర్పాటు చేసుకోవాలని, ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌ ను ఏర్పాటు చేసి క్వాంటం వ్యాలీ సేవల్ని వినియోగించుకోవాలని చంద్రబాబు సూచించారు. అమరావతిలో బ్యాంకులకు అవసరమైన భూమిని కేటాయిస్తామన్నారు. రెండేళ్లలో తమ కార్యాలయాలను నిర్మించాలన్నారు. అమరావతి రైతుల రిటర్నబుల్‌ ప్లాట్లకు రుణాలిచ్చేందుకు బ్యాంకులు ముందుకు రావాలని చెప్పారు. కౌలు రైతులకు రుణాలివ్వాలని, బడుగులకు ప్రభుత్వం అండగా ఉండడంతోపాటు.. బ్యాంకర్లు కూడా సహకరించాలని కోరారు.
కౌలు రైతులకు రూ.985 కోట్లు
మొత్తంగా వార్షిక రుణ ప్రణాళికలో భాగంగా అన్ని రంగాలకు కలిపి రూ. 2,47,919 కోట్ల మేర రుణాలను బ్యాంకులు ఇచ్చాయి. ఇందులో వ్యసాయ రంగానికి రూ.94,666 కోట్లు, ఎంఎస్‌ఎంఈ రంగానికి రూ.49,831 కోట్లు, ఇతర రంగాలకు రూ. 1,00,278 కోట్ల మేర రుణాలను ఇచ్చారు. దీంట్లో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా కౌలు రైతులకు రూ.985 కోట్ల రుణాల్ని మంజూరు చేశారని కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి నాగరాజు చెప్పారు. మచిలీపట్నంలో ఆంధ్ర బ్యాంక్‌ వ్యవస్థాపకులు భోగరాజు పట్టాభి సీతారామయ్య పేరుతో పార్కు, మెమోరియల్‌ ఏర్పాటు చేస్తామని, ప్రభుత్వం రెండెకరాల భూమి కేటాయించాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో సీఎస్‌ విజయానంద్‌, వివిధ శాఖల ఉన్నతాధికారులు, ఎస్‌ఎల్బీసీ ఛైర్మన్‌ నితీష్‌ రంజన్‌, సీడ్బీ సీఎండీ మనోజ్‌ మిట్టల్‌, ఎగ్జిమ్‌ బ్యాంక్‌ ఎండీ హర్ష బంగారి, కెనరా బ్యాంక్‌ ఎండీ సత్యనారాయణ రాజు, పంజాబ్‌ నేషనల్‌ ఎండీ అశోక్‌ చంద్ర, ఇండియన్‌ బ్యాంక్‌ ఎండీ బినోద్‌ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు