. రాష్ట్ర ప్రభుత్వం ‘సూపర్ సిక్స్’ అమలు చేయాలి
. బ్లాక్ మార్కెట్లో ఎరువులు…చోద్యం చూస్తున్న డబుల్ ఇంజన్ సర్కారు
. సీపీఐ జాతీయ మహాసభల అనంతరం రాష్ట్ర కార్యదర్శి ఎన్నిక
. రాష్ట్ర మహాసభలు విజయవంతం… అందరికీ ధన్యవాదాలు
. మీడియా సమావేశంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ
. రాష్ట్ర మహాసభలు ఆమోదించిన 62 తీర్మానాలు విడుదల
విశాలాంధ్ర – ఒంగోలు : రానున్న కాలంలో పేదల పక్షాన మరిన్ని ఉద్యమాలు ఉధృతం చేస్తామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కే రామకృష్ణ పేర్కొన్నారు. సీపీఐ 28వ రాష్ట్ర మహాసభలు విజయవంతమైన సందర్భంగా ఒంగోలులోని మల్లయ్య లింగం భవనంలో మంగళవారం పార్టీ జిల్లా సమితి ఆధ్వర్యాన నిర్వహించిన మీడియా సమావేశంలో రామకృష్ణ మాట్లాడుతూ రాష్ట్ర మహాసభలలో ప్రజలెదుర్కొంటున్న సమస్యలపై 62 తీర్మానాలను ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. ఈ 62 తీర్మానాలను రాష్ట్ర మహాసభల ప్రతినిధులు ఏకగ్రీవంగా ఆమోదించడం జరిగిందన్నారు. రానున్న కాలంలో ఆయా సమస్యలపై పోరాటాలు మరింత ఉధృతం చేసి ప్రజల పక్షాన నిలుస్తామని పేర్కొన్నారు. 32 మంది బలిదానంతో తెలుగు ప్రజల సాధించుకున్న విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రాష్ట్ర మహాసభలలో ఆమోదించడం జరిగిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు ముందు హామీ ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాలను కచ్చితంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని పేదలకు పట్టణ ప్రాంతంలో రెండు సెంట్లు, గ్రామీణ ప్రాంతంలో మూడు సెంట్లు వంతున నివేశిత స్థలాలు ఇవ్వాలని, ఇంటి నిర్మాణానికి రూ. 5 లక్షలు ఇవ్వాలని కోరారు. లేనిపక్షంలో సీపీఐ పేదలకు ఇళ్ల స్థలాలు వచ్చేంతవరకు పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు స్మార్ట్ మీటర్ల వల్ల ప్రజలు అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని విమర్శలు చేశారన్నారు. జగన్ ప్రభుత్వం చేసుకున్న సోలార్ అగ్రిమెంట్ కారణంగా 25 ఏళ్ల పాటు రాష్ట్రంలోని పేదలపై రూ. ఒక లక్ష పదివేల కోట్లు భారం పడుతుందని తెలిపారు. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు అదే అగ్రిమెంట్‌ను అనుసరిస్తూ పేదలపై విద్యుత్ భారాలు మోపుతున్నారన్నారు. దీనికి వ్యతిరేకంగా వ్యతిరేకంగా ఈనెల 28వ తేదీన కలిసిపోచ్చే అన్ని రాజకీయ పార్టీలను కలుపుకొని ప్రజా ఉద్యమం నిర్మిస్తామని హెచ్చరించారు. సుపరిపాలన, డబుల్ ఇంజన్ సర్కార్ అని పేర్కొంటున్న కూటమి ప్రభుత్వం ఖరీఫ్ సీజన్లో ఎరువులను సక్రమంగా అందించడంలో విఫలం అయిందని రామకృష్ణ విమర్శించారు. ఒకవైపు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెంనాయుడు 31 లక్షల 15 వేల మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరమవుతాయని, ప్రస్తుతం రాష్ట్రంలో 21 లక్షల 34,3ల ఎరువులే ఉన్నాయని, మిగిలిన వాటిని కోసం కూడా ఇండెంట్ పెట్టామని ప్రకటనలు చేస్తున్నారన్నారు. ఎరువులు అంత సమృద్ధిగా ఉన్నట్లయితే… నేడు బ్లాక్ మార్కెట్లో 250 రూపాయల బస్తా యూరియా రూ. 500 ఎందుకు పలుకుతుందో చెప్పాలని డిమాండ్ చేశారు. రైతులు వేకువజామునే వచ్చి లైన్లో నిలబడుతున్నప్పటికీ కనీసం బ్లాక్ మార్కెట్లో కూడా ఎరువులు దొరకట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదేనా స్మార్ట్ ప్రభుత్వం అని ప్రశ్నించారు. డబుల్ ఇంజన్ సర్కార్ లో కేంద్రం నుండి కనీసం ఎరువులు కూడా తెప్పించుకోలేరా అని ప్రశ్నించారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమైనందున యుద్ధ ప్రాతిపదిక న ప్రభుత్వం వెంటనే ఎరువుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా విలేకరులు అడిగిన ఒక ప్రశ్నకు సమాధానం చెబుతూ… సీపీఐ రాష్ట్ర మహాసభల్లో రాష్ట్ర కౌన్సిల్‌కు 101 మందిని, పదిమంది కాండేట్ సభ్యుల్ని ఎన్నుకోవడం జరిగిందన్నారు. అలాగే 31 మంది సభ్యులు, ఇద్దరు ఆహ్వానితులతో రాష్ట్ర కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగిందన్నారు. ఇక సెక్రటేరియట్, అసిస్టెంట్ సెక్రటరీ, సెక్రటరీ లను పార్టీ జాతీయ మహాసభల అనంతరం విజయవాడలో కౌన్సిల్ ఏర్పాటు చేసి జాతీయ నాయకుల సమక్షంలో ఎన్నుకోవడం జరుగుతుందని స్పష్టం చేశారు. జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా, జాతీయ కార్యదర్శి కే నారాయణ లకు అత్యవసర పనులున్న కారణంగా సెక్రెటరీ ఎన్నిక వాయిదా పడినట్లు తెలిపారు. వారి సూచనల మేరకు అప్పటివరకు సెక్రటేరియట్, అసిస్టెంట్ సెక్రటరీలు, రాష్ట్ర సెక్రటరీ ని యథాతథంగా కొనసాగించాలని సూచించారన్నారు. రాష్ట్ర మహాసభ కేవలం రాష్ట్ర కౌన్సిల్ ఎన్నుకోవడంతో ముగిసిందని రామకృష్ణ పేర్కొన్నారు. కౌన్సిల్ సమావేశంలో నూతన రాష్ట్ర కార్యవర్గాన్ని, కార్యదర్శి వర్గాన్ని, అసిస్టెంట్ సెక్రటరీలను, సెక్రటరీలను ఎన్నుకోవడం జరుగుతుందని తెలిపారు. రాష్ట్ర మహాసభ విజయవంతంలో పూర్తిస్థాయిలో సహాయ సహకారాలు అందించినందుకు మీడియాకు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే రాష్ట్ర మహాసభల విజయవంతానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు.
రాష్ట్ర మహాసభలలో ఏకగ్రీవమైన
తీర్మానాలు ఇవే…
ఈనెల 23వ తేదీ నుండి 25వ తేదీ వరకు ఒంగోలులో జరిగిన సీపీఐ రాష్ట్ర 28వ మహాసభలలో 62 తీర్మానాలను మహాసభ ప్రతినిధులు ఏకగ్రీవంగా ఆమోదించారు. అవి: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిలిపివేయాలి. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలో జరుగుతున్న ముస్లిం మైనార్టీలపై దాడులను ఖండిస్తూ, ఆచార వ్యవహారాలపై వేధింపులను ఖండిస్తూ, ఉపాధి రంగం నుండి ముస్లింలను దూరంగా పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్న తీరును విమర్శిస్తూ, ముస్లిం మైనార్టీలపై ఉన్న వివక్షను తొలగించాలని డిమాండ్ చేస్తూ ఇన్సాఫ్ ఆధ్వర్యంలో తీర్మానం ప్రవేశపెట్టడం జరిగింది.
విశాఖ సమగ్ర అభివృద్ధి ద్వారానే ఆర్థిక ప్రగతి సాధించుకోవచ్చని తెలిపే తీర్మానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ప్రాధాన్యత క్రమంలో సాగునీటి ప్రాజెక్టులను వెంటనే పూర్తి చేయాలని డిమాండ్‌తో మరో తీర్మానం ప్రవేశపెట్టడం జరిగింది. డాక్టర్ స్వామినాథన్ సిఫార్సుల మేరకు అన్ని పంటలకు మద్దతు ధరలు ప్రకటించి చట్టబద్ధత కల్పించాలన్న డిమాండ్‌తో మరో తీర్మానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ముస్లిం మైనార్టీలకు వ్యతిరేకంగా, ముస్లింలను వేధించే విధంగా తీసుకువచ్చిన చట్టాలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ మరో తీర్మానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఆర్టీసీ స్థలాలను ప్రైవేటు సంస్థకు కేటాయిస్తూ ఇచ్చిన జీవో నెంబర్ 137ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ, ఆర్టీసీలో విద్యుత్ బస్సులను ప్రభుత్వ సహకారంతో ఆర్టీసీనే నిర్వహించాలని, విద్యుత్ బస్సులను ఆర్టీసీ సిబ్బంది ద్వారా నడిపించాలని, స్త్రీ శక్తి పథకం విజయవంతంగా అమలు జరిగేందుకు తక్షణమే మూడు వేల కొత్త బస్సులు కొనుగోలు చేయాలని, 10వేల మందికి పైగా సిబ్బంది నియామకాలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ మరో తీర్మానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది.
చేనేత పరిశ్రమ పరిరక్షణ కోసం తీసుకువచ్చిన 11 రకాల రిజర్వేషన్ యాక్టులను సక్రమంగా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ మరో తీర్మానాన్ని ప్రవేశ పెట్టడం జరిగింది. ప్రభుత్వ బ్యాంకుల్లోనే ఉద్యోగ కార్మికుల ఖాతాలు ఉంచాలని డిమాండ్ చేస్తూ తీర్మానాన్ని ప్రవేశ పెట్టడం జరిగింది. ఉపాధి హామీపై కేంద్ర ప్రభుత్వం విధిస్తున్న పరిమితి పేదలకు నష్టమని ఉపాధి హామీ చట్టాన్ని కాపాడుకుందామంటూ మరో తీర్మానాన్ని రాష్ట్ర మహాసభలలో ప్రవేశపెట్టడం జరిగింది. మహిళా సాధికారత, రక్షణ, భద్రతపై ప్రభుత్వ చర్యల్ని డిమాండ్ చేస్తూ మరో తీర్మానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది.
న్యాయవాదుల రక్షణ కోసం చట్టం చేయాలని డిమాండ్ చేస్తూ మరో తీర్మానాన్ని రాష్ట్ర మహాసభ ఏకగ్రీవంగా ఆమోదించింది. వెనుకబడిన సత్యసాయి జిల్లా సమగ్రాభివృద్ధికై తీర్మానం ప్రవేశపెట్టడం జరిగింది. విద్యార్థుల హక్కులు కాలరాస్తున్న ప్రభుత్వ ఉత్తర్వులను వెనక్కి తీసుకోవాలని, విద్యార్థి, ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలను విద్యాసంస్థల్లోకి అనుమతించకపోవడాన్ని తక్షణమే విరమించుకోవాలని, మెడికల్ కళాశాల ప్రైవేటీకరణ ఆపాలని డిమాండ్ చేస్తూ మరో తీర్మానం ప్రవేశపెట్టడం జరిగింది. చిత్తూరు ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిని రాష్ట్ర ప్రభుత్వమే నిర్వహించాలని, చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిలో అన్ని విభాగాలకు సంబంధించిన నైపుణ్యం కలిగిన ప్రభుత్వ డాక్టర్లను నియమించాలని డిమాండ్ చేస్తూ, దేశంలో అత్యంత వెనుకబడిన కర్నూలు జిల్లా సమగ్ర అభివృద్ధికి రూ.50 వేల కోట్లు ప్రభుత్వ నిధులు కేటాయించాలని డిమాండ్ చేస్తూ ఉత్పత్తి పారిశ్రామికవాడలో నూతన పరిశ్రమల ఏర్పాటుకు తీర్మానాలు ప్రవేశపెట్టడం జరిగింది. ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు 58 సంవత్సరాలకు తగ్గించాలని డిమాండ్ చేస్తూ తీర్మానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. చేతి వృత్తిదారుల సమస్యలపై, కొప్పర్తి మెగా పారిశ్రామిక కేంద్రంలో కేంద్ర ప్రభుత్వం అధ్వర్యంలో ఏర్పాటైన ఎంఎస్ఎంఈ టెక్నాలజీ సెంటర్ ను అమరావతికి తరలించడాన్ని వ్యతిరేకిస్తూ తీర్మానం ప్రవేశ పెట్టడం జరిగింది.ఏపీ ఫైబర్నెట్లను ప్రైవేటు పదం చేయరాదని, ఆపరేషన్ బుడమేరును తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ తీర్మానాలు ప్రవేశపెట్టడం జరిగింది. ఇవే కాకుండా రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న మరో 10 సమస్యలపై తీర్మానాలను రాష్ట్ర మహాసభల్లో ప్రవేశ పెట్టగా… వీటికి మహాసభ ప్రతినిధులు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. ఈ మీడియా సమావేశంలో సీపీఐ ప్రకాశం జిల్లా కార్యదర్శి ఎంఎల్ నారాయణ పాల్గొన్నారు.


