Sunday, February 8, 2026
Homeవిశ్లేషణపిల్లలపై పెరుగుతున్న నేరాలు

పిల్లలపై పెరుగుతున్న నేరాలు

- Advertisement -

డా॥ జ్ఞాన్‌ పాఠక్‌
భారతదేశంలో పిల్లలపై నేరాలు విపరీతంగా పెరుగుతున్నాయి. దీనిపై ప్రభుత్వం, సమాజం ఆత్మావలోకనం చేసుకోవాలి. దేశంలో పిల్లలపై జరిగే నేరాల సంఖ్య, పిల్లల జనాభా నిష్పత్తిలో నేరాల రేటు కూడా 2015 నుంచి బాగా పెరుగుతున్నదని జాతీయ గణాంకాల కార్యాలయం విడుదల చేసిన ‘‘చిల్డ్రన్‌ ఇన్‌ ఇండియా 2025’’ అనే కొత్త నివేదిక వెల్లడిరచింది. ‘‘భారత శిక్షాస్మృతి (ఐపీసీ), ప్రత్యేక, స్థానిక చట్టాలు (ఎస్‌ఎల్‌ఎల్‌) కింద పిల్లలపై నేర సంఘటనలు 2020 లో 1,28,531 నుంచి 2022 లో 1,62,449 కి పెరిగాయని’’ ఆ నివేదిక వెల్లడిరచింది. అలాగే, 2015-2022 లో ప్రతి 1,00,000 మంది పిల్లలపై జరిగే నేరాల నిష్పత్తి కూడా పెరిగింది. 2015 లో పిల్లలపై నేరాల రేటు ప్రతి లక్ష మంది పిల్లలకు 22.6 మాత్రమేనని, 2022 నాటికి ఆ సంఖ్య 38.33 కి పెరిగిందని తాజా గణాంకాలు పేర్కొన్నాయి. నేషనల్‌ క్రైమ్‌ రికార్డ్‌ బ్యూరో (ఎన్‌సీఆర్‌బీ) డేటాను ఉటంకిస్తూ ఈ నివేదిక 2022 లో పిల్లలపై మొత్తం 93,878 ఐపీసీ నేరాలు నమోదయ్యాయని, కిడ్నాప్‌, అపహరణ అత్యధిక సంఘటనలు జరిగిన వర్గంగా ఉద్భవించాయని పేర్కొంది. ఎస్‌ఎల్‌ఎల్‌ కింద, పిల్లలపై నేరాలకు సంబంధించి 68,571 కేసులు నమోదయ్యాయి, వాటిలో 63,414 కేసులు లైంగిక నేరాల నుంచి పిల్లల రక్షణ (పోస్కో) చట్టం కిందకు వచ్చాయి, ఇవి మొత్తం నేరాలలో 39.04 శాతం.
పోక్సో చట్టం కింద 2019 లో మొత్తం 46,005 కేసులు నమోదయ్యాయి. 46,682 మంది బాధితులుగా నమోదయ్యారు. 2022 లో నమోదైన కేసులు 63,414 కి పెరిగాయి, బాధితుల సంఖ్య కూడా 64,469 కి పెరిగింది. బాలికలపై నేరాల సంఖ్య 62,095 కు పెరగగా, బాధితుల సంఖ్య 63,116. పోక్సో చట్టంలో నేరాల రేటు విషయానికొస్తే, 2019 లో 7.1 గా ఉన్నప్పటి నుంచి ఇది రెట్టింపు అయింది. ఇది 2021 లో 12.1కి, 2022 లో 14.3కి పెరిగింది. పిల్లలపై నేరాలకు సంబంధించి వయసుల వారీగా చూస్తే, 16 నుంచి 18 ఏళ్ల మధ్య వయస్కులపై అత్యధికంగా నేరాలు జరిగాయి. ఈ వయసు పిల్లలు తరచుగా విద్యా ప్రయోజనాల కోసం సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సి రావడం లేదా కొన్ని సందర్భాల్లో చిన్న వయసులోనే శ్రమశక్తిలోకి ప్రవేశించడం వల్ల ఎక్కువ బహిర్గతం, దుర్బలత్వాన్ని ఎదుర్కోవడం వీరిపై నేరాలు అధికంగా ఉండడానికి కారణమని ఆ నివేదిక పేర్కొంది. 2022 లో బాల నేరస్థులపై మొత్తం 30,555 కేసులు నమోదయ్యాయి, 2019 లో 29,768 కేసులు, 2020 లో 31,170 కేసులు నమోదయ్యాయి. 2022 లో బాల నేరాల రేటు దిల్లీలో అత్యధికంగా (42.3), ఆ తర్వాత పుదుచ్చేరి (29.6), చండీగఢ్‌ (24.7), ఛత్తీస్‌గఢ్‌ (24.2) దాదర్‌ Ê నాగర్‌ హవేలి, డామన్‌ Êడయ్యూ (22.9) ఉన్నాయి. నేరాల స్వభావానికి సంబంధించి, దొంగతనం కింద 7879 మంది బాల నేరస్తులను, దొంగతనాలకు సంబంధించి 2651 మందిని, ఎక్సైజ్‌ చట్టం కింద 209 మందిని, నార్కోటిక్స్‌ డ్రగ్స్‌ Êసైకోట్రోపిక్‌ సబ్‌స్టాన్స్‌ చట్టం కింద 464 మందిని, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ చట్టం కింద 88 మందిని అరెస్టు చేశారు.
అనాథలను దత్తత తీసుకునే విషయంలో, దేశంలో దత్తత తీసుకునే పిల్లల సంఖ్య సంవత్సరానికి 2,991 నుంచి 4,155 మంది వరకు స్థిరంగా ఉంది, అయితే దేశాల మధ్య దత్తత తీసుకునే పిల్లల సంఖ్య సంవత్సరానికి 360 నుంచి 653 మంది వరకు ఉంది. 2024-25 లో, దేశంలో 4,155 మందిని దత్తత తీసుకున్నారు, అందులో 2,336 మంది ఆడపిల్లలు, 1,819 మంది మగ పిల్లలు. లింగ ప్రాధాన్యతను ఇది సూచిస్త్తోంది, దేశీయ, అంతర్‌-దేశ దత్తతలలో మగపిల్లల కంటే ఆడపిల్లలను ఎక్కువగా దత్తత తీసుకుంటున్నారు. అత్యధిక సంఖ్యలో దత్తత తీసుకున్న రాష్ట్రం మహారాష్ట్ర, ఇక్కడ 849 మంది పిల్లలను దత్తత తీసుకున్నారు. వైకల్యం ఉన్న పిల్లల విషయానికొస్తే 2011 జనాభా లెక్కల తర్వాత కొత్త డేటా అందుబాటులో లేదు. 2011 జనాభా లెక్కల డేటాను ఉపయోగించి ఈ నివేదిక పేర్కొంది. 0-6 సంవత్సరాల వయస్సు గల వికలాంగుల జనాభాలో వికలాంగుల పిల్లల వాటా 7.62 శాతంగా, 7-18 సంవత్సరాల వయస్సు గలవారిలో 20.23 శాతంగా ఉంది. 0-6 సంవత్సరాల వయస్సు గలవారిలో, ఈ నిష్పత్తి ముఖ్యంగా ఉత్తరప్రదేశ్‌ (20.31 శాతం), బీహార్‌ (14.24 శాతం), మహారాష్ట్ర (10.64 శాతం) లలో ఎక్కువగా ఉంది, తరువాత పశ్చిమ బెంగాల్‌ (6.48 శాతం), ఆంధ్రప్రదేశ్‌ (6.22 శాతం) ఉన్నాయి, ఇది ఈ రాష్ట్రాల్లో కేసుల సంఖ్య గణనీయంగా ఉందని సూచిస్తోంది. దీనికి విరుద్ధంగా, అనేక చిన్న రాష్ట్రాలు, లక్షద్వీప్‌ (0.00 శాతం), డామన్‌, డయ్యూ (0.01 శాతం), దాద్రా, నాగర్‌ హవేలి (0.02 శాతం), అరుణాచల్‌ ప్రదేశ్‌ (0.10 శాతం) వంటి కేంద్రపాలిత ప్రాంతాలలో చాలా తక్కువ కేసులు నమోదయ్యాయి.
అయితే, గత రెండు జనాభా లెక్కలతో పోల్చితే దేశంలో బాల కార్మికుల సంఖ్య అపారమైన క్షీణతను చవిచూసింది. జనాభా లెక్కలు 2021 ని ఉటంకిస్తూ ఇచ్చిన నివేదిక ప్రకారం, 5-9 సంవత్సరాల వయస్సు గల బాల కార్మికుల నిష్పత్తి 2 శాతం, 10-14 సంవత్సరాల వయసు గల బాల కార్మికుల నిష్పత్తి 5.72 శాతం. పిల్లలపై హింసకు సంస్కృతి, తరగతి లేదా విద్య అనే సరిహద్దులు లేవని ఆ నివేదిక పేర్కొంది. ఈ హింస సంస్థలలో, పాఠశాలల్లో, ఇంట్లో పిల్లలపై ఇలా ఒక చోట అని లేకుండా అన్ని చోట్లా జరుగుతోంది. శిశువులు, చిన్న పిల్లలకు, హింస ప్రధానంగా తల్లిదండ్రులు, ఇతర అధికార వ్యక్తుల చేతుల్లో పిల్లలపై దుర్వినియోగం (అంటే శారీరక, లైంగిక,భావోద్వేగ దుర్వినియోగం, నిర్లక్ష్యం) కలిగి ఉంటుంది. బాలురు, బాలికలు శారీరక, మానసిక వేధింపులు, నిర్లక్ష్యం రెండిరటికీ సమానంగా గురవుతారు. బాలికలు లైంగిక వేధింపులకు గురయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. పిల్లలు యుక్తవయసుకు చేరుకునే కొద్దీ, పిల్లలపై వేధింపులతో పాటు, తోటివారి హింస, సన్నిహిత భాగస్వామి హింస చాలా ప్రబలంగా మారుతుందని నివేదిక పేర్కొంది. హింస అన్ని రకాల పిల్లలను ప్రభావితం చేస్తుందని నివేదిక పేర్కొంది. కానీ వైకల్యంతో జీవిస్తున్న పిల్లలు, తీవ్ర పేదరికంలో ఉన్నవారు, సంస్థాగత సంరక్షణలో ఉన్న బాలికలు, బాలురు, వారి కుటుంబాల నుంచి వేరు చేయబడిన లేదా వలసదారులు, శరణార్థులు లేదా ఆశ్రయం కోరుకునేవారిగా తరలివెళ్లే పిల్లలు అత్యంత ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నారు. లైంగిక ధోరణి, లింగ గుర్తింపు, అట్టడుగు సామాజిక లేదా జాతి సమూహానికి చెందిన వారు కూడా పిల్లలు హింసకు గురయ్యే అవకాశాన్ని పెంచుతారు. హింస, శారీరక, భావోద్వేగ, మానసిక, లైంగిక వేధింపులు, దోపిడీ, నిర్లక్ష్యం, హానికరమైన అలవాట్ల నుంచి దూరంగా పెరిగే హక్కు ప్రతి బిడ్డకు ఉందని నివేదిక నొక్కి చెప్పింది. కాబట్టి, పిల్లలను సంరక్షించడం సమిష్టి బాధ్యత.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు