Homeసంపాదకీయంపురోగమన భావాలు… తిరోగమన రాజకీయాలు

పురోగమన భావాలు… తిరోగమన రాజకీయాలు

- Advertisement -

ఇరాన్ మీద గత ఫిబ్రవరి 28న ఇస్రాయెల్, అమెరికా చేసిన అధర్మ యుద్ధంలో మొదటి రోజే అమరుడైన ఇరాన్ అగ్ర నాయకుడు సయ్యద్ అలీ హుసేనీ ఖామేనీ అంత్యక్రియలకు హాజరైన జనం కొత్త రికార్డు సృష్టించింది. అలీ ఖామేనీ ఇరాన్‌లో రెండవ అగ్రనాయకుడు. మొదటి అగ్ర నాయకుడు అయతుల్లా రొహుల్లా ఖామేనీ అంత్యక్రియలకు లక్షల సంఖ్యలో జనం హాజరై శ్రద్ధాంజలి ఘటించిన సందర్భం గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డుల్లోకి ఎక్కింది. ఇప్పుడు అయతుల్లా ఖామేనీకి నివాళులు అర్పించిన వారి సంఖ్య మునుపటి రికార్డును తిరగరాసింది. అయతుల్లా హుసేనీ ఖామేనీ వ్యక్తిత్వంలో పరస్పర విరుద్ధ ఛాయలు కనిపిస్తాయి. ఆయన భావాలు చాలా ఉదారమైనవి. రాజకీయాలు మాత్రం తిరోగమనమైనవి. ఖామేనీ అంతిమయాత్ర ఇరాన్‌లోనే కాక సరిహద్దులు దాటి ఇరాక్‌లోని నజాఫ్, కర్బలా పట్టణాలకు కూడా వెళ్లడమూ అపూర్వమైందే. ఇది ఇరాక్ కోరిక మేరకే జరిగింది. మొదటి అగ్ర నాయకుడు అయతుల్లా రొహుల్లా ఖామేనీ తరవాత 1989లో అగ్రనాయకుడైనప్పటి నుంచి ఆయన పాలనకు అపూర్వమైన ఆదరణ ఉండేదనడం సత్యదూరమే అవుతుంది. ఆయన నాయకత్వానికి వ్యతిరేకంగా 1999, 2008, 2017-2018, 2018-2019, 2022, 2023 తాజాగా ఈ సంవత్సరారంభంలోనూ ఇరాన్ ప్రజలు భారీగా నిరసన ప్రదర్శనలు చేశారు. ఈ అసంతృప్తిని ఆసరాగా చేసుకునే అమెరికా ఇరాన్‌లో ప్రభుత్వాన్ని మార్చేయాలని చూసింది. పరోక్షంగా ఆ పని చేయడం కుదరక నేరుగా యుద్ధానికి దిగింది. దానితో విభేదాలన్నీ పక్కన పెట్టి ప్రజలు నూతన నాయకత్వానికి అండగా నిలిచారు. ఖామేనీ అంత్యక్రియలకు దాదాపు రెండు కోట్ల మంది రావడం కూడా ఈ ఐక్యతా ప్రదర్శనలో భాగమే. దురాక్రమణ చేసిన వారి మీద ప్రతీకారం తీర్చుకోవాలన్న భావన అక్కడి ప్రజల్లో రగిలిపోతోంది. కోట్లాది మంది వీధుల్లోకి వచ్చి శ్రద్ధాంజలి ఘటించడం మింగుడు పడక అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అవి మొసలి కన్నీళ్లన్నారు. కోట్లాది మంది కూడబలుక్కుని దొంగ ఏడ్పులు ఏడుస్తారా? కోట్లాది మంది తరలి రావడం ఇరాన్ ప్రజల సమైక్యతకు, యుద్ధోన్మాద ఇస్రాయిల్, అమెరికా రక్తదాహాన్ని తృణీకరించడమే. అది ఆత్మ గౌరవానికి నిదర్శనం. అయతుల్లా ఖామేనీ షియాల మత గురువు కూడా. ఆయన మతం దారిన నడిచే రాజకీయాల్లోకి వచ్చారు. 1979లో ఇరాన్ రాజు షా మహమ్మద్ రెజా పహ్లవీని గద్దె దించడానికి జరిగిన ఉద్యమంలో అయతుల్లా రొహుల్లా ఖామేనితో కలిసి అలీ ఖామేనీ భుజంభుజం కలిపి నడిచి అంచెలంచెలుగా రాజకీయాల్లో ఎదిగారు. షా పతనం తరవాత ఖామేనీ ప్రభుత్వంలో అనేక కీలక బాధ్యతలు నిర్వహించారు. ఇరాన్-ఇరాక్ మధ్య యుద్ధం జరిగినప్పుడు అధ్యక్షులుగా ఉన్నదీ ఆయనే. ఇరాన్ రెవల్యూషనరి గార్డ్స్‌(ఐ.ఆర్.జి.సి.) తో ఆయనకు సన్నిహిత సంబంధాలు ఉండేవి. అయతుల్లా రోహుల్లా ఖామేనీ మరణం తరవాత అలీ ఖామేనీని అగ్రనాయకుడిగా ఎంపిక చేయాలనుకున్నప్పుడు ఆయన తనకు ఆ అర్హత లేదని వినమ్రంగా చెప్పారు. ఎందుకంటే మత నాయకుల్లోనూ ఆయన మధ్యవర్గానికి చెందిన వారే. రాజ్యాంగాన్ని సవరించి ఆయనను అగ్ర నాయకుడిగా నియమించవలసి వచ్చింది. రెజా పహ్లవీ అధికారంలో ఉన్నప్పుడు ఆయన మీద హత్యాయత్నం జరిగింది. కుడి చేయి పని చేయకుండా పోయింది. ఖామేనీ గొప్పతనం ఏమిటంటే సిరియా అంతర్యుద్ధ సమయంలో, గజా మీద ఇస్రాయెల్ దాడి సమయంలో బాధిత పక్షాననే నిలబడ్డారు. రష్యా-ఉక్రేన్ మధ్య యుద్ధంలోనూ ఆయన రష్యా పక్షాన్నే ఉన్నారు. ఇస్రాయెల్ దాష్టీకాన్ని నిరంతరం వ్యతిరేకించే వారు. పలస్తీనియన్లను సమర్థించారు. అయితే దేశాధ్యక్షుడు, ప్రధానమంత్రి ఉన్నప్పటికీ అధికారమంతా తన గుప్పెట్లోనే పెట్టుకున్నారు. ఆయన పాలన రాజకీయ అణచివేతకు, ప్రభుత్వ హింసాకాండకు, పత్రికా రచయితల గొంతు నొక్కడానికి, సామాజిక కార్యకర్తలను అణచి వేయడానికే ప్రాధాన్యం ఇచ్చారు. విమర్శకులను దైవ దూషకులు అని నిందించే వారు. ప్రత్యర్థులకు జైలు శిక్ష విధించడంతో పాటు శారీరకంగా హింసించేవాడన్న పేరు కూడా ఖామేనీకి ఉండేది. ఖామేనీ వ్యక్తిత్వానికి మరో పార్శ్వమూ ఉంది. తరచుగా సెక్యులర్ మేధావులను, దైవాన్ని విశ్వసించే సోషలిస్టులను సంప్రదించే వారు. మత పాండిత్యం కన్నా మేధోపరమైన ఆసక్తి అధికం. ఆయనకు గణితం, భూగోళ శాస్త్రం, చరిత్ర అధ్యయనం మీద అనురక్తి ఎక్కువ. యుక్త వయసు రాక ముందే సాహిత్యం విపరీతంగా చదివారు. కవిత్వం, నవలలు ఎక్కువగా చదివే వారు. పర్షియన్ భాషలో కవిత్వం కూడా రాసేవారు. తనకు అపారమైన జ్ఞాపక శక్తి ఉందని తానే చెప్పుకునే వారు. చదువుకునేప్పుడు నజాఫ్ వెళ్లడం తప్ప ఎప్పుడూ ఏ దేశానికీ వెళ్లినవారు కాదు. ఎవరైనా ఆయనను కలవాలంటే ఇరాన్ రావాల్సిందే. షా హయాంలో ఖామేనీని 1976లో మూడేళ్లు బహిష్కరించారు. ఆర్థిక విధానాల దగ్గరకు వస్తే ఆయన మితవాదే. ఇరాన్ ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటుకు అప్పగించారు. ఖామేనీలో ఉన్న మరో విశేషం ఏమిటంటే అణ్వస్త్రాలు తయారు చేయకూడదని ఫత్వా జారీ చేశారు. మరో వంక ఇరాన్‌లో ఉన్న చమురు నిల్వలను వినియోగించి ఇరాన్‌ను మహత్తర శక్తిగా రూపొందించడానికి కృషి చేశారు. అంతిమ యాత్రలో శవపేటికపై ఆయన తల పాగా ఉంచి ఇరాన్ ఆయన మీద ఉన్న అపారమైన గౌరవాన్ని చాటుకుంది. ఎక్కడి నుంచో తుపాకులు పేలొచ్చునని తెలిసినా, బాంబులు కురవొచ్చునని భావించినా ఖామేనీ ప్రార్థనలకు నాయకత్వం వహించడం మానలేదు. చివరకు మరణం ఆసన్నమైనప్పుడు సైతం సురక్షిత ప్రాంతానికి వెళ్లే ప్రయత్నం చేయలేదు. క్షిపణుల వర్షం కురుస్తున్నా తన ప్రాణాల కోసం ఆలోచించలేదు. అమెరికా బాంబు దాడుల్లో ఆయన కుటుంబంలో చాలా మంది తీవ్రంగా గాయపడ్డారు కొందరు ప్రాణ త్యాగం చేశారు. ప్రస్తుత ఇరాన్ అగ్ర నాయకుడు, ఖామేనీ కుమారుడు, మొజ్తబా కూడా ఆ దాడిలో గాయపడ్డవాడే. అలీ ఖామేనీ దేశం కోసమే పాటుపడ్డారని భావించినందు వల్లే ఆయనను జనం అమితంగా అభిమానించారు. మతం ఆధారంగానే రాజకీయాలలోకి వచ్చినా దేశం కోసం ప్రాణాలు అర్పించిన ధీరుడు ఖామేనీ. అయతుల్లా అనేది ఓ బిరుదు. దైవ చిహ్నం అని ఆ మాటకు అర్థం. ఇరాన్‌లో చాలా మంది అయతుల్లాలు ఉన్నారు. ఇప్పటికీ సజీవంగా ఉన్న అయతుల్లాలు 82 మంది ఉన్నారు. 67 మంది తెహ్రాన్‌లోనే ఉంటారు. కార్ల్ మార్క్స్, చే గువేరా, మార్షల్ టిటో లాంటి వారిని ఆయన అభిమానించే వారు. ఆయన మౌలికంగా ఇస్లాం మతానుయాయి అయినందు వల్ల ఇరాన్‌ను పురోగామి రాజకీయాల వేపు నడిపించలేదు. ఇరాన్ రాజకీయాలలో ఇది సహజమే. ఆయన మతానురక్తి ఎంతటిదంటే ఒకసారి నమాజు సమయం అయినందువల్ల నమాజు చేయడానికి నడుస్తున్న రైలులోంచి దూకేశారు. ఆయన అభ్యుదయవాది కాకపోయినా అమెరికా సామ్రాజ్యవాదాన్ని గట్టిగా వ్యతిరేకించారు. జన హృదయాల్లో గూడు కట్టుకోగలిగారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు