Thursday, January 15, 2026
Homeపెట్టుబడుల వరద

పెట్టుబడుల వరద

- Advertisement -

సీఐఐ సదస్సుకు ముందే అనూహ్య స్పందన
రూ.82,000 కోట్లతో ‘రెన్యూ పవర్‌’ ప్రాజెక్టులు
ఒక్కరోజులోనే ఐదు రంగాల్లో 35 ఎంవోయూలు
రూ.3.65 లక్షల కోట్ల పెట్టుబడులు, 1.26 లక్షల ఉద్యోగాలు
చంద్రబాబు, లోకేశ్‌ సమక్షంలో ఒప్పందాలు

విశాలాంధ్ర బ్యూరో- విశాఖపట్నం: గత ప్రభుత్వంలో రాష్ట్రం నుంచి వెళ్లిపోయిన పరిశ్రమలు భారీ పెట్టుబడులతో తిరిగి రాష్ట్రానికి వస్తున్నాయి. విశాఖలో శుక్ర, శనివారాల్లో జరిగే 30వ సీఐఐ భాగస్వామ్య సదస్సుకు ఒకరోజు ముందుగానే రాష్ట్ర ప్రభుత్వంతో వివిధ పారిశ్రామిక సంస్థలు పెద్దసంఖ్యలో ఎంవోయూలు కుదుర్చుకున్నాయి. ఉదయం నుంచి రాత్రి వరకు సీఎం సుమారు 15కి పైగా సమావేశాల్లో పాల్గొన్నారు. మొత్తంగా 35 ఎంవోయూలు కుదుర్చుకోగా, రూ.3.65 లక్షల కోట్ల పెట్టుబడులు, 1.26 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించేందుకు వివిధ కంపెనీలు ముందుకొచ్చాయి. పునరుత్పాదక విద్యుత్‌ రంగంలో దేశంలోనే ప్రముఖ సంస్థ రెన్యూ పవర్‌ రాష్ట్రంలో రూ.82,000 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చింది. ఈ మేరకు విశాఖలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్‌ సమక్షంలో రెన్యూ పవర్‌ సంస్థ రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహనా ఒప్పందం కుదుర్చుకుంది. రెన్యూ పవర్‌ చైర్మన్‌, సీఈవో సుమంత్‌ సిన్హాతో చంద్రబాబు సమావేశమయ్యారు. పునరుత్పాదక ఇంథన రంగంలో ఏపీ ముందంజలో ఉందని, పర్యావరణ పరిరక్షణతో పాటు వినియోగదారులకు విద్యుత్‌ను తక్కువ ధరకు అందించడమే తమ లక్ష్యమని ముఖ్యమంత్రి వివరించారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం పెట్టుబడుల విషయంలో అత్యుత్తమ విధానాలు అనుసరిస్తోందని, వేగవంతమైన అనుమతులు ఇస్తూ ప్రోత్సహిస్తోందని సుమంత్‌ సిన్హా కొనియాడారు. గూగుల్‌ డేటా సెంటర్‌ విశాఖకు వస్తున్న నేపథ్యంలో భారీగా తలెత్తే విద్యుత్‌ డిమాండ్‌ తీర్చేందుకు తాము సిద్ధంగా ఉన్నామని సుమంత్‌ వెల్లడిరచారు.
రూ.2 వేల కోట్లతో
కోరమండల్‌ ఎరువుల ఫ్యాక్టరీ
ప్రముఖ ఎరువులు, అగ్రి-ఇన్‌పుట్‌ సంస్థ కోరమండల్‌ ఇంటర్నేషనల్‌ లిమిటెడ్‌ ప్రతినిధులతో చంద్రబాబు సమావేశమయ్యారు. రాష్ట్రంలో ఎరువుల తయారీ విస్తరణ, గ్రీన్‌ అమోనియా, అగ్రిటెక్‌ ప్రాజెక్టులపై ఆ సంస్థ ప్రతినిధులతో చర్చించారు. మురుగప్ప గ్రూప్‌కు చెందిన కోరమండల్‌ ఇంటర్నేషనల్‌ లిమిటెడ్‌ సంస్థకు ఇప్పటికే విశాఖపట్నం, కాకినాడలో ఎరువుల ఉత్పత్తి యూనిట్లు ఉన్నాయి. దీనికి కొనసాగింపుగా మరో రూ.2,000 కోట్ల పెట్టుబడులతో రాష్ట్రంలో ఎరువుల తయారీ కేంద్రాన్ని నెలకొల్పేందుకు ఆ సంస్థ ముందుకు వచ్చింది. ఈ మేరకు ముఖ్యమంత్రి సమక్షంలో రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. గ్రీన్‌ అమోనియా – గ్రీన్‌ హైడ్రోజన్‌ తయారీ, ఎరువుల ఉత్పత్తి యూనిట్‌ విస్తరణ సహా ఇంకొన్ని ప్రాజెక్టులపై కోరమండల్‌ సంస్థ పెట్టుబడులు పెట్టనుంది. మరోవైపు ప్రముఖ ఫర్నీచర్‌ సంస్థ బాలాజీ యాక్షన్‌ బిల్డ్‌ వెల్‌ ఛైర్మన్‌ ఎన్‌కే అగర్వాల్‌తో సీఎం భేటీ అయ్యారు. కలప ఆధారిత ఇంజినీర్డ్‌ ప్యానెల్‌ తయారీ యూనిట్‌ ఏర్పాటుపై చర్చించారు. అనంతరం రాష్ట్రంలో ప్రభుత్వం నిర్వహిస్తున్న అన్నా క్యాంటీన్ల నిర్వహణకు ఎన్‌కే అగర్వాల్‌ రూ.కోటి విరాళాన్ని ముఖ్యమంత్రికి అందించారు.
రూ.15 వేల కోట్ల పెట్టుబడులతో హీరో ఫ్యూచర్‌ ఎనర్జీస్‌
నాలుగు గిగావాట్ల పునరుద్పాతక విద్యుత్‌ రంగంలో పెట్టుబడులకు హీరో ప్యూచర్‌ ఎనర్జీస్‌ సంస్థ రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. రూ.15 వేల కోట్ల వ్యయంతో అనంతపురం, కడప, కర్నూలు జిల్లాల్లో ఈ విద్యుత్‌ ప్లాంట్లు ఏర్పాటు చేసేందుకు హీరో ఫ్యూచర్‌ ఎనర్జీస్‌ సంస్థ ముందుకు వచ్చింది. ఆ సంస్థ సీఎండీ రాహుల్‌, సీఎం సమక్షంలో ఈ పెట్టుబడులకు సంబంధించిన ఒప్పందాలను హీరో ఫ్యూచర్‌ ఎనర్జీస్‌ సంస్థ -ఈడీబీ ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. గ్రీన్‌ ఎనర్జీ, హైబ్రీడ్‌ సొల్యూషన్స్‌ రంగాల్లోనూ పెట్టుబడులతో ముందుకు రావాలని ముఖ్యమంత్రి కోరారు. డెడికేటెడ్‌ గ్రీన్‌ హైడ్రోజన్‌ పార్క్‌ ఏర్పాటు చేయాలని సూచించారు. మరోవైపు రామాయపట్నం వద్ద అత్యాధునిక ఫర్నీచర్‌ తయారీ ప్లాంట్‌ ఏర్పాటుకు స్వీడన్‌కు చెందిన జూల్‌ గ్రూప్‌ ముందుకు వచ్చింది. ఆ సంస్థ ఫౌండర్‌ సీఈఓ టామ్‌ ఓలాండర్‌ ముఖ్యమంత్రితో భేటీ అయ్యారు. రూ.300 కోట్లతో యూనిట్‌ ఏర్పాటు చేయనున్నామని జూల్‌ సంస్థ తెలిపింది. నార్వే, స్వీడన్ల నుంచి భారీ దుంగలను దిగుమతి చేసుకుని డోర్లు, విండోలు లాంటి ఉత్పత్తులతో పాటు ప్రీ ఫ్యాబ్రికేషన్‌ విధానంలో ఇళ్లను రూపొందిస్తామని చంద్రబాబుకు టామ్‌ ఓలాండర్‌ వివరించారు. దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి రామాయపట్నం పోర్టు సమీపంలో 500 ఎకరాల్లో ఫర్నీచర్‌ క్లస్టర్‌ సిటీ ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాలని సూచించారు.
ఇటలీ రాయబారితో చంద్రబాబు భేటీ
ఇటాలియన్‌ కంపెనీలు ఏపీలో పెట్టుబడులు పెట్టేలా చూడాలని సీఎం చంద్రబాబు, ఆ దేశ రాయబారి ఆంటోనియో ఎన్రికో బార్టోలీని కోరారు. విశాఖపట్నంలోని సీఐఐ భాగస్వామ్య సదస్సు సందర్భంగా వివిధ దేశాల రాయబారులతో భేటీల్లో భాగంగా ఇటలీ రాయబారితో చంద్రబాబు సమావేశమయ్యారు. రాష్ట్రంలో ఏయే రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు అవకాశాలు ఉన్నాయనే విషయాన్ని బార్టోలీకి ముఖ్యమంత్రి వివరించారు. కీలక రంగాలైన ఆటోమోటివ్‌, ఆటో విడిభాగాలు, యంత్రాల తయారీ, ఇంధన, ఫ్యాషన్‌, ఆహార శుద్ధి వంటి రంగాల్లో పెట్టుబడులపై ముఖ్యమంత్రి-ఇటలీ రాయబారి మధ్య చర్చలు జరిగాయి. ఆంధ్రప్రదేశ్‌లో వ్యవసాయ యంత్రాలు, పునరుత్పాదక విద్యుత్‌ రంగం, నౌకానిర్మాణ రంగాలలో భాగస్వాములు కావాలని ఇటలీ కంపెనీలను ముఖ్యమంత్రి ఆహ్వానించారు.
పారిశ్రామిక పార్కులపై తైవాన్‌ కంపెనీల ఆసక్తి
భారత్‌లో తైపీ ఎకనామిక్‌ అండ్‌ కల్చర్‌ సెంటర్‌ ప్రతినిధి, రాయబారి ముమిన్‌ చెన్‌ నేతృతంలోని తైవాన్‌ ప్రతినిధి బృందం ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ అయింది. తైవాన్‌ కంపెనీలు ఎలక్ట్రానిక్స్‌, సెమీ కండక్టర్లు, గ్రీన్‌ఎనర్జీ, ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీ, ఈవీ బ్యాటరీ తదితర రంగాల్లో ఏపీతో కలిసి పనిచేయాలని సీఎం ఆహ్వానించారు. ఇండో-తైవాన్‌ ఇండస్ట్రియల్‌ పార్క్‌ను కుప్పంలో ఏర్పాటు చేసేందుకు ఆసక్తిగా ఉన్నట్టు తైవాన్‌ ప్రతినిధి బృందం తెలిపింది. అలీజియన్స్‌ గ్రూప్‌ రూ.400 కోట్ల వ్యయంతో ఈ పారిశ్రామిక పార్క్‌ ఏర్పాటు చేసేందుకు సిద్ధమని ముఖ్యమంత్రికి తెలిపింది. పాదరక్షల తయారీ కంపెనీ పౌచెన్‌ గ్రూప్‌ ఫుట్‌వేర్‌ యూనిట్‌ను కుప్పంలో ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చింది. ఓర్వకల్లులో ఇమేజ్‌ సెన్సార్లను ఉత్పత్తి చేసేందుకు తైవాన్‌కు చెందిన క్రియేటివ్‌ సెన్సార్‌ ఇంక్‌ సంస్థ ఆసక్తి వ్యక్తం చేసింది. 2.2 బిలియన్‌ డాలర్ల పెట్టుబడితో 23 గిగావాట్ల సామర్ధ్యంతో సాలిడ్‌ స్టేట్‌ బ్యాటరీ, కాథోడ్‌ యాక్టివ్‌ మెటీరియల్‌ తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేయనున్నట్టు సంస్థ ప్రతిపాదించింది. వీటికి సంబంధించి సీఎం చంద్రబాబు సమక్షంలో తైవాన్‌ కంపెనీల ప్రతినిధులు- ఈడీబీ ఒప్పందాలు చేసుకున్నారు.
సంజయ్‌ భల్లాతో చంద్రబాబు
ఈస్ట్రన్‌ నావల్‌ కమాండ్‌ కమాండిరగ్‌ ఇన్‌ చీఫ్‌ వైస్‌ అడ్మిరల్‌ సంజయ్‌ భల్లా సీఎంతో భేటీ అయ్యారు. విశాఖలో సీఐఐ భాగస్వామ్య సదస్సులో పాల్గొనేందుకు వచ్చిన ముఖ్యమంత్రిని సంజయ్‌ భల్లా మర్యాదపూర్వకంగా కలిశారు. నౌకాదళ కార్యకలాపాలను వైస్‌ అడ్మిరల్‌ సంజయ్‌ భల్లా ముఖ్యమంత్రికి వివరించారు. రక్షణ వ్యవస్థలో కీలకమైన భారత నౌకాదళానికి సేవలు అందించే కంపెనీలు, స్టార్టప్‌లను రాష్ట్రానికి ఆహ్వానించే అంశంపై ఇరువురి మధ్య చర్చ జరిగింది. నావీ చేపట్టే వివిధ ప్రాజెక్టులకు, కార్యకలాపాలకు అవసరమైన భూమి ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్దంగా ఉందని సీఎం తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు