హరి వెంకటరమణ
ప్రజలకు పోక్సో అంటే నిజంగా తెలుసా ? తల్లిదండ్రులకు, టీచర్లకు ముఖ్యంగా యువతకు తెలుసా ? పోలీసులు ఎలా అమలు చేస్తున్నారు ? న్యాయవ్యవస్థలో లోపాలు ఎక్కడ ఉన్నాయి ? పోక్సోపై మనకు నిజంగా ఎంత అవగాహన ఉంది ? చాలా మందికి పోక్సో అంటే ఒక కఠినమైన క్రిమినల్ చట్టం మాత్రమే. కానీ అది పిల్లల హక్కులను రక్షించే ప్రత్యేక చట్టమని, పిల్లల భద్రతకు సమాజమంతా బాధ్యత వహించాలని చెప్పే చట్టమని ఎంతమందికి తెలుసు? ఇటీవల రెండు తెలుగు రాష్ట్రాలను కలవరపరిచిన ఘటన మన అవగాహనాలోపాన్ని మరోసారి గుర్తు చేసింది. నిందితుడిపై గత మే నెలలో 17 ఏళ్ల బాలికను వెంబడించడం, లైంగిక వేధింపులకు పాల్పడినట్లు పోక్సో (పిల్లలపై లైంగిక నేరాల నుండి రక్షణ చట్టం) కేసు నమోదైంది. తనపై కేసు నమోదు చేయడానికి కారణమైన కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని బాలికతో పాటు ఆమె తల్లి, అమ్మమ్మను తన కుటుంబాన్ని కూడా హత్య చేసినట్లు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. పిల్లలపై జరుగుతున్న లైంగిక దాడులు, వేధింపులను అరికట్టడానికి చట్టపరమైన రక్షణ కల్పించడానికి భారత ప్రభుత్వం 2012లో ఈ ప్రత్యేక చట్టాన్ని తీసుకువచ్చింది. ఇది నవంబర్ 14, 2012 నుండి అమలులోకి వచ్చింది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 15(3) ప్రకారం పిల్లల కోసం ప్రత్యేక చట్టాలు చేసే అధికారం ప్రభుత్వానికి ఉంది. అలాగే ఆర్టికల్ 21, 39(ఈ), 39 (ఎఫ్) ప్రకారం పిల్లల హక్కులు, గౌరవాన్ని కాపాడటం ప్రభుత్వ బాధ్యత. ఐక్యరాజ్యసమితి 1989లో చేసిన పిల్లల హక్కుల కన్వెన్షన్ పై భారతదేశం 1992లో సంతకం చేసింది. దీని ప్రకారం పిల్లలను అన్ని రకాల లైంగిక దోపిడీల నుండి రక్షించాల్సిన బాధ్యత దేశంపై ఉంది. 18 సంవత్సరాలలోపు ప్రతి వ్యక్తి చట్టపరంగా బాలుడు లేదా బాలిక. పిల్లల సమ్మతి చట్టపరంగా సమ్మతి కాదు. సోషల్ మీడియా ద్వారా జరిగే వేధింపులు కూడా పోక్సో పరిధిలోకి వస్తాయి. టీచర్లు, వైద్యులు, అధికారులు సమాచారం దాచిపెడితే వారికి కూడా చట్టపరమైన బాధ్యత ఉంటుంది. బాధితుడు లేదా బాధితురాలు పేరు మీడియాలో ప్రచురించడం చట్టవిరుద్ధం. నేరాల తీవ్రత ఆధారంగా పోక్సో చట్టాన్ని ప్రధానంగా 6 విభాగాలుగా వర్గీకరించి, కఠినమైన శిక్షలను ఖరారు చేశారు. జననేంద్రియాల్‌లో ఏదైనా వస్తువును చొప్పించడం వంటివి చేస్తే కనీసం 10 ఏళ్ల జైలు శిక్ష నుండి జీవిత ఖెదు పడే అవకాశం. బాధితురాలి వయసు 16 ఏళ్ల లోపు ఉంటే, కనీస శిక్ష 20 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉంది. దారుణమైన చొరబడే లైంగిక దాడి సమాజంలో రక్షణ కల్పించాల్సిన వ్యక్తులు పోలీసులు, ప్రభుత్వ ఉద్యోగులు, వైద్యులు, ఉపాధ్యాయులు లేదా సొంత కుటుంబ సభ్యులే ఈ ఘాతుకానికి ఒడిగట్టడం లేదా గ్యాంగ్ రేప్ చేయడం. ఇది తీవ్రమైన నేరం. లైంగిక ఉద్దేశంతో పిల్లల రహస్య అవయవాలను తాకడం, వారిచేత బలవంతంగా తాకించడం వంటి చర్యల్లో నేర నిరూపణ అయితే 3 నుంచి 5 ఏళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. నమ్మకంగా ఉండాల్సిన ఉపాధ్యాయులు, వైద్యులు, రక్షించాల్సిన పోలీసులు లైంగిక దాడికి పాల్పడినట్లైతే కనీసం 5 నుంచి 7 ఏళ్ల వరకు కఠిన జైలు శిక్ష, జరిమానా విధిస్తారు. పిల్లలను నేరుగా తాకకుండా మాటలతో వేధించడం, అసభ్య సైగలు చేయడం, అశ్లీల చిత్రాలు చూపించడం, వెంబడించడం, వారి గోప్యతకు భంగం కలిగించడం వంటివి చేస్తే ఈ నేరానికి 3 ఏళ్ల వరకు జైలు శిక్ష పడుతుంది. చైల్డ్ పోర్నోగ్రఫీ పిల్లలను అశ్లీల చిత్రాలు, వీడియోలు, ప్రకటనలలో ఉపయోగించడం, అలాంటి కంటెంట్‌ను ఇంటర్నెట్‌లో షేర్ చేయడం లేదా ఫోన్ లేదా కంప్యూటర్లలో నిల్వ ఉంచడం. కంటెంట్ తయారు చేసి షేర్ చేస్తే కనీసం 5 ఏళ్ల జైలు శిక్ష పడుతుంది. పోక్సో కేసులను పరిశీలిస్తే బాధితుల్లో ఎక్కువ మంది నిందితులు తెలిసినవారేనని జాతీయ నేర గణాంకాల ధోరణి చెబుతోంది. 2024లో నమోదైన 69,191 పోక్సో కేసుల్లో 70,132 మంది చిన్నారులు బాధితులుగా నమోదయ్యారు. 2023తో పోలిస్తే 2024లో పోక్సో కేసులు సుమారు 5.2శాతం పెరిగాయి. జాతీయ నేర గణాంకాల (ఎన్‌సీఆర్‌బీ) ప్రకారం దేశంలో పోక్సో కేసుల నమోదు తగ్గడం లేదు. 2022లో 64,904 కేసులు, 2023లో 65,743 కేసులు, 2024లో 69,191 కేసులు నమోదయ్యాయి.
ఈ గణాంకాలు పిల్లలపై లైంగిక నేరాలు ఇంకా ఆందోళనకర స్థాయిలో కొనసాగుతున్నాయని, పోక్సో చట్టం అమలుతో పాటు సమాజంలో అవగాహన కూడా అత్యవసరమని సూచిస్తున్నాయి. నిందితుల్లో అత్యధికులు బాధితులకు తెలిసిన వ్యక్తులే. బంధువులు, పొరుగువారు, కుటుంబ స్నేహితులు, పరిచయస్తులే. అందువల్ల పిల్లలకు “తెలియని వ్యక్తుల” పట్ల మాత్రమే కాదు, వ్యక్తిగత భద్రత, హద్దులు నమ్మకమైన పెద్దలకు చెప్పడం వంటి అంశాలపై అవగాహన కల్పించడం అవసరం. “నేను నిర్వహించిన శిక్షణా కార్యక్రమాల్లో చాలామంది ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పోక్సో చట్టాన్ని కేవలం అత్యాచారానికి సంబంధించిన చట్టంగానే భావించడం గమనించాను. వాస్తవానికి పిల్లలపై జరిగే అనేక రకాల లైంగిక వేధింపులు కూడా ఈ చట్టం పరిధిలోకి వస్తాయి. నేరం వెలుగులోకి వచ్చిన తరువాత కొందరు నిందితులు పరారవడం, ఆత్మహత్యకు పాల్పడడం లేదా మరింత హింసాత్మక చర్యలకు దిగడం వంటి ఘటనలు కనిపిస్తున్నాయి. అయితే ఈ ప్రవర్తనకు చట్టం ఒక్కటే కారణమని చెప్పలేం. వ్యక్తిగత మనస్తత్వం, కుటుంబ పరిస్థితులు, సామాజిక ఒత్తిడులు వంటి అనేక అంశాలు ఇందులో పాత్ర పోషిస్తాయి . పోక్సో చట్టం కేవలం శిక్షించే చట్టం కాదు పిల్లలను రక్షించే సామాజిక ఒప్పందం. అందుకే ఈ చట్టంపై అవగాహనను పాఠశాలల నుంచి కళాశాలల వరకు, తల్లిదండ్రుల నుంచి పోలీసుల వరకు విస్తరించాలి. చట్టం ఎంత కఠినంగా ఉన్నా, అవగాహన లేని సమాజంలో పిల్లలకు పూర్తి రక్షణ కల్పించడం సాధ్యం కాదు.” సెల్ : 9866084124


