విశాలాంధ్ర – విడపనకల్లు: మండల పరిధిలోని పెంచలపాడు గ్రామ సమీపంలో మంగళవారం గుర్తుతెలియని వృద్ధుడి మృతదేహం లభ్యమైనట్లు విడపనకల్లు ఎస్ఐ ఖాజా హుస్సేన్ తెలిపారు. మృతుడి వయస్సు సుమారు 60 నుంచి 65 ఏళ్ల మధ్య ఉండవచ్చని పేర్కొన్నారు.మృతదేహం లభ్యమైన ప్రదేశం, పరిస్థితులను పరిశీలించగా సహజ మరణంగా ప్రాథమికంగా భావిస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. మృతుడి ఒంటిపై ఎలాంటి గాయాలు లేవని, వృద్ధాప్యం, అనారోగ్యం లేదా సకాలంలో అన్నపానీయాలు లభించక మృతి చెంది ఉండవచ్చని అనుమానిస్తున్నట్లు పేర్కొన్నారు. మృతుడి పేరు, స్వస్థలం తదితర వివరాలు తెలియాల్సి ఉందన్నారు.స్థానికుల సమాచారం మేరకు.. గత నాలుగు రోజులుగా సదరు వృద్ధుడు పెంచలపాడు గ్రామ పరిసరాల్లో సంచరిస్తూ రోడ్ల పక్కన పడి ఉన్న ఖాళీ నీళ్ల బాటిళ్లు, వాటి మూతలను ఏరుకుని సంచిలో వేసుకునేవాడని తెలిసింది.మృతుడికి సంబంధించిన వివరాలు లేదా ఆనవాళ్లు తెలిసిన వారు విడపనకల్లు పోలీస్ స్టేషన్లో గానీ, ఎస్ఐ ఖాజా హుస్సేన్‌కు గానీ సమాచారం అందించాలని ఆయన ప్రజలను కోరారు.


