పోప్ ఫ్రాన్సిస్ కన్నుమూత
వాటికన్ వర్గాల ధృవీకరణ
రోమ్: కేథలిక్‌ల అత్యున్నత మత గురువు పోప్ ఫ్రాన్సిస్ తుదిశ్వాస విడిచారు. పోప్ ఫ్రాన్సిస్ గత కొన్నేళ్లుగా శ్వాసకోశ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది ఫిబ్రవరిలో తీవ్రమైన శ్వాసకోస సమస్యతో ఆయన రోమ్‌లోని ఆసుపత్రిలో చేరారు. దాదాపు రెండు నెలలు అక్కడే చికిత్స తీసుకున్నారు. ఈ క్రమంలో సోమవారం ఉదయం 7.35కు (ఇటలీ కాలమానం ప్రకారం) కన్నుమూశారు.ఈ మేరకు వాటికన్ అధికారులు ప్రకటించారు. ఫ్రాన్సిస్ 1938లో అర్జెంటీనాలో జన్మించారు. ఆయన అసలు పేరు జార్జ్ మారియో బెర్గోగ్లియో. పోప్ బెనెడిక్ట్ ‘ఎక్స్‌విఐ’ రాజీనామాతో 2013 మార్చి 13న కేథలిక్ చర్చికి 266వ పోప్‌గా ఎన్నికయ్యారు. దక్షిణ అమెరికా నుంచి ఈ పదవిని అందుకొన్న తొలి వ్యక్తి ఆయనే. ఆయన్ను ప్రజల పోప్ అంటారు. తరచూ సామాజిక అంశాలపై కూడా ఆయన వ్యాఖ్యలు చేస్తుంటారు. 2016లో రోమ్ బయట అన్య మతానికి చెందిన శరణార్థుల పాదాలు కడిగారు. దీనిని ఆయన వినయం, సేవాతత్పరతకు చిహ్నంగా భావిస్తారు. పోప్ ఫ్రాన్సిస్ తన మరణానికి కొన్ని గంటల ముందు కూడా ఈస్టర్ పర్వదినాన భక్తులకు సందేశం ఇచ్చారు. వాటికన్ నగరంలోని పీటర్స్ స్క్వేర్‌లో దాదాపు 35,000 మందిని ఉద్దేశించి మాట్లాడారు. ‘బ్రదర్స్ అండ్ సిస్టర్స్, హ్యాపీ ఈస్టర్..!’ అని పోప్ స్వయంగా చెప్పారు. అనంతరం ఆయన సందేశాన్ని ఆర్చి బిషప్ డియాగో రావెలి చదివి వినిపించారు. సంక్షోభాలతో రగులుతున్న గాజా, ఉక్రెయిన్, కాంగో, మైన్మార్‌లలో శాంతి నెలకొనాలని ఆకాంక్షించారు. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, ఉష ఈస్టర్ సందర్భంగా పోప్‌ను కలిశారు. ఈ సందర్భంగా పోప్ మూడు పెద్ద చాకొలెట్ ఈస్టర్ ఎగ్స్‌ను వారికి బహూకరించారు. ఆయన అనారోగ్యానికి గురైన తర్వాత ప్రజల్లోకి రావడం ఇదే తొలిసారి. ప్రత్యేక వాహనంలో ప్రజల మధ్య నుంచి ఆయన ప్రయాణించారు. మధ్యలో ఆగి పసికందులను, చిన్నారులను ఆశీర్వదించారు.
ప్రముఖుల సంతాపం…
పోప్ ఫ్రాన్సిస్ మరణం పట్ల భారత్ సహా ప్రపంచ దేశాల నేతలు ప్రగాఢ సంతాపం తెలిపారు. ‘పోప్ మరణ వార్త ఇప్పుడే తెలిసింది. నేను ఆయన్ను నిన్నే కలిశాను. కొవిడ్ తొలినాళ్లలో ఆయన ప్రసంగాలను నేను మర్చిపోలేను. అవి చాలా అద్భుతమైనవి’ అని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ పేర్కొన్నారు. ‘నేడు పోప్ ఫ్రాన్సిస్ మరణానికి ప్రపంచం సంతాపం తెలియజేస్తోంది. విధివంచితుల విషయంలో ఆయన ప్రేమ, మానవత్వం కేథలిక్ ప్రపంచానికి వెలుపల కూడా కొన్ని లక్షల మందిని ప్రభావితం చేసింది’ ఐరోపా సమాఖ్య అధ్యక్షురాలు ఉర్సులా వాన్‌డెర్ లెయెన్ పేర్కొన్నారు.
స్త్ర పోప్ ఫ్రాన్సిస్ మరణం అత్యంత బాధాకరమని, మిలియన్ల మంది కరుణ, మానవత్వం, ఆధ్యాత్మిక ధైర్యానికి ప్రతీకగా గుర్తుండిపోతారని భారత ప్రధాని నరేంద్రమోదీ తన సంతాప సందేశంలో పేర్కొన్నారు. చిన్న వయసు నుంచే ఆయన క్రీస్తు ఆశయాల కోసం పనిచేశారని, పేదలు, విధివంచితుల కోసం ఆయన సేవలు చేశారని కొనియాడారు.
స్త్ర ‘‘పోప్ ఫ్రాన్సిస్ మరణంతో ప్రపంచం మొత్తం విచారంలో ఉంది. ఆయన శాంతి, సామరస్యాన్ని పెంపొందించడంలో మద్దతు ఇచ్చి అన్ని రకాల వివక్షతను అంతం చేయడం, ఆర్థిక అసమానతలను తగ్గించడం వంటి విషయాలపై గొప్ప ప్రభావాన్ని చూపారు. పోప్ ఫ్రాన్సిస్ నిజంగా ఒక ఐకానిక్ వ్యక్తిత్వం, మానవతావాది, చాలా విలువైన వారసత్వాన్ని వదిలి వెళ్లారు’’ అని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖడ్గే తెలిపారు.
స్త్ర పోప్ ఫ్రాన్సిస్ మరణం ప్రపంచానికి తీరని లోటని కాంగ్రెస్ ప్రధానకార్యదర్శి ప్రియాంకా గాంధీ వాద్రా పేర్కొన్నారు. శాంతియుత, దయామయ ప్రపంచాన్ని కోరుకొనే లక్షల మందికి ఆయనో స్ఫూర్తి ప్రదాత అని కొనియాడారు.
ముఖ్యమంత్రుల విచారం
పోప్ ఫ్రాన్సిస్ మరణం పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ విచారం వ్యక్తం చేశారు. పోప్ సేవలను కొనియాడారు.