బిల్ గేట్స్ ఫౌండేషన్‌పై సమీక్షలో సీఎం చంద్రబాబు
విశాలాంధ్ర బ్యూరోఅమరావతి: ప్రస్తుతం సాంకేతికత యుగం కాబట్టే పనులు త్వరగా పూర్తవుతున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా రాష్ట్ర ప్రజలకు ప్రభుత్వ సేవలు సకాలంలో అందుతున్నట్లు తెలిపారు. ఆగస్టు 15 నాటికి 9597 శాతం సేవలు ఆన్‌లైన్‌లోనే ప్రజలకు అందుతాయన్నారు. ఈ సేవలపై వారికి అవగాహన కల్పించాల్సి ఉందని చెప్పారు. ప్రజలకు ప్రయోజనం ఉన్నప్పుడే సాంకేతికతకు సార్థకత చేకూరుతుందని సీఎం అన్నారు. ఆయన బుధవారం వివిధ శాఖల్లో బిల్‌గేట్స్ ఫౌండేషన్‌తో కలిసి చేపడుతున్న కార్యక్రమాల పురోగతిపై సమీక్షించారు. ఆరోగ్య రంగాన్ని సాంకేతికతతో అనుసంధానించే అంశంపై దృష్టి పెట్టామని చంద్రబాబు చెప్పారు. ఆయుష్మాన్ భారత్ డేటా మిషన్‌తో మన దగ్గరున్న డేటాను అనుసంధానం చేసుకోవాలన్నారు. విద్యా ప్రమాణాల మెరుగుదలకు సాంకేతికత అవసరమని తెలిపారు. నాణ్యమైన విద్యను తక్కువ ఖర్చుతో అందించడంపై దృష్టి పెట్టాలని సూచించారు. రైతుకు ప్రతి అడుగులోనూ సాంకేతికత అందుబాటులో ఉండాలన్నారు. వైద్య పరికరాల తయారీకి ఏపీలోనే మెడ్ టెక్ జోన్ ఉందని, మరే రాష్ట్రాల్లోనూ లేదని చెప్పారు. ఈ జోన్‌కు సాంకేతికపరంగా హంగులు అద్దడం ద్వారా మరింత ముందుకు తీసుకెళ్లాలన్నారు. అమరావతిలో కృత్రిమ మేథ వర్సిటీ ఏర్పాటుకు బిల్‌గేట్స్ ఫౌండేషన్ సహకారాన్ని ఆశిస్తున్నట్లు చెప్పారు. ఫౌండేషన్ ప్రతినిధులతో సమావేశాలు రెండు నెలలకోసారి నిర్వహించాలన్నారు. సమావేశంలో ఉన్నతాధికారులు, ఫౌండేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు.


