అత్తిలి విమల
పర్యాటక రంగం అభివృద్ధి, ఆదాయం అనే ముసుగులు తొడిగిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 362 జీవో ద్వారా విశాఖపట్నం, సూర్యలంక బీచ్లలో ‘బీచ్ షాక్స్’ పేరుతో మద్యం అమ్మకాలకు సెప్టెంబర్ 1 నుంచి అనుమతించాలని తీసుకున్న నిర్ణయం అత్యంత ప్రమాదకరమైనది, తీవ్రంగా వ్యతిరేకించదగినది. ఏపీలోని అతిపెద్ద నగరం, తెలుగువారి సాంస్కృతిక గుండెకాయ లాంటి విశాఖలోని ప్రకృతి ఇచ్చిన బీచ్లను మద్యం మత్తులో ముంచే కుట్ర ఇందులో దాగి ఉన్నది. గోవాను ఆదర్శంగా తీసుకొని ఆ తరహా సంస్కృతిని యథాతథంగా విశాఖపై రుద్దే ఈ ప్రయత్నం వల్ల జరిగే సామాజిక అనర్థాలు అపారమైనవి. ఈ నిర్ణయం వేల కుటుంబాలను ఆర్థికంగా, మానసికంగా చితికిపోయేలా చేస్తుంది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో విశాఖ జిల్లా ఒక్కటే రూ.1,940 కోట్ల విలువైన మద్యం తాగి రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచిన వైనం ప్రభుత్వానికి ఆదాయం పెంచుకునే మార్గంలా కనిపించడంతోనే నగరాన్ని, ప్రకృతిని మద్యం మత్తులో ముంచే కుట్రకు తెగబడిందనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. మద్యం అమ్ముకుంటే తప్ప ప్రభుత్వాలు మనుగడ సాగించలేవు అని అధికార పార్టీ నేతలే బహిరంగంగా వ్యాఖ్యలు చేస్తున్నారు. ప్రభుత్వానికి మద్యం ఆదాయ వనరుగా కనిపిస్తే అదే మద్యం వేలాది పేద, మధ్య తరగతి కుటుంబాలను కన్నీటితో ముంచుతున్న వైనం కనిపిస్తున్నది. విశాఖపట్నంలో సగటు కార్మికుడు రోజుకు రూ.800 సంపాదిస్తే అందులో రూ.500 మద్యానికే ఖర్చు చేస్తున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. ఇక బీచ్లోనూ మద్యం అమ్మకాలు మొదలైతే ఇటువంటి వేలాది కుటుంబాలు మత్తు విషవలయంలో చిక్కిశల్యమవక తప్పదు. ఇక మద్యం అమ్మకాల ఈ నిర్ణయం మహిళల భద్రతను పూర్తిగా గాలికొదిలేస్తుంది. ఎన్నికల సమయంలో ‘మహిళలు భయపడకుండా జీవించే వాతావరణం కల్పిస్తాం’ అని హామీ ఇచ్చిన ప్రభుత్వమే, ఇప్పుడు మహిళలు, పిల్లలు అత్యధికంగా సంచరించే విశాఖ బీచ్‌లో మద్యం ఏరులై పారించడానికి సిద్ధమవడం బాధ్యతారాహిత్యమే. బయట ఎక్కడో మద్యం సేవించి బీచ్లోకి వచ్చే యువకులు గుంపులుగా చేరి కొట్టుకుంటున్న ఘటనలు నిత్యం చూస్తూనే ఉన్నాం. ఇక ప్రతిరోజూ బీచ్ షాక్స్ పేరున అక్కడే మద్యం అమ్మకాలు మొదలైతే సూర్యాస్తమయం చూడ్డానికి వచ్చే తల్లీకూతుళ్లు, స్నేహితురాళ్లు తాగుబోతుల ఈవ్ టీజింగ్, అసభ్య పదజాలం భరించాల్సిందే. మద్యం మత్తులో లైంగిక నేరాలు, దాడులు పెరుగుతాయని అనేక సామాజిక అధ్యయనాలు ఇప్పటికే స్పష్టం చేశాయి. అలాంటప్పుడు కుటుంబ కేంద్రక పర్యాటక ప్రదేశాన్ని ‘బార్ అండ్ రెస్టారెంట్’గా మార్చడం క్షమించరాని నేరంగానే పరిగణించాలి. ఈ తరహా నేరాలకు ప్రభుత్వమే దగ్గర ఉండి లైసెన్సులు ఇచ్చి ప్రోత్సహిస్తే రాబోయే రోజుల్లో పర్యాటక భవిష్యత్తు కూడా మసకబారిపోతుంది. విశాఖ ఒక పోర్టు నగరం. ఇక్కడ ఇప్పటికే గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాల బెడద తీవ్రంగా ఉంది. ఈ పరిస్థితుల్లో బీచ్‌లో చట్టబద్ధంగా మద్యం అమ్మకాలు మొదలుపెడితే యువతకు మద్యం మరింత చేరువవుతుంది. నగరంలో ఆంధ్రా యూనివర్సిటీతో పాటు అనేక ప్రైవేట్ యూనివర్సిటీలు, వందలాది విద్యాసంస్థలు ఉన్నాయి. చదువుల కోసం లక్షల మంది యువత నగరంలో ఉంటున్నారు. ఐటీ అభివృద్ధి జరిగితే మరిన్ని లక్షల మంది విశాఖకు వస్తారు. వీకెండ్ కల్చర్ ఇప్పటికే ప్రమాదకరంగా మారుతోంది. ఈ తరుణంలో బీచ్లలోనే మద్యం దొరికితే ‘ప్రైవేట్ పార్టీ’ల పేరుతో సాగే అనర్ధాలకు అడ్డు అదుపు లేకుండాపోతుంది. మద్యపానం ‘కూల్ కల్చర్’గా మారి యువత భవిష్యత్తును విచ్ఛిన్నం చేస్తుంది. కాబట్టి విశాఖపట్నంలో గోవా తరహా ‘నైట్ లైఫ్’ ను కోరుకోవడం అంటే మన యువత భవితను మనమే ఉరివేయడం అవుతుంది. పర్యాటకం అభివృద్ధి అంటే మద్యం అమ్మకాలే అనే స్థాయికి ప్రభుత్వం దిగజారడం అత్యంత విషాదం. ఇక్కడ ప్రభుత్వ ప్రాధాన్యతల్లోనే లోపం స్పష్టంగా కనిపిస్తోంది. విశాఖ బీచ్లలో నేటికీ సరైన మరుగుదొడ్లు లేవు, తాగునీరు దొరకదు, లైఫ్గార్డుల కొరత తీవ్రంగా ఉంది. నగరంలో పర్యాటకుల కనీస అవసరాలు తీర్చలేని పాలకులు ఏకంగా మద్యం షాపులు తెరవాలని యోచన చేయడం సిగ్గుచేటు. పర్యాటక అభివృద్ధి ముఖ్యం అనుకుంటే ముందు పారిశుధ్యం, భద్రత, మౌలిక సదుపాయాలు కల్పించాలి. కానీ తప్పతాగి ప్రభుత్వ ఆదాయం పెంచే వాళ్ల కోణంలో పర్యాటక రంగాన్ని చూడడం అత్యంత హేయమైన చర్య. విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు చేయడం అంటే తెలుగు సంస్కృతిపై జరుపుతున్న ప్రత్యక్ష దాడి. విశాఖపట్నంలోని బీచ్లు ఆహ్లాదకరమైనవి. కుటుంబాలకు సేదనిచ్చేవి. ఈ సంస్కృతిని కాలరాసి, గోవా మోడల్ను బలవంతంగా రుద్దితే విశాఖ నగరమే ‘ఓపెన్ బార్’ గా మారుతుంది. రేపటి తరానికి బీచ్ అంటే బారు, బీరు గుర్తుకు వచ్చేలా చేయడం క్షమించరాని సాంస్కృతిక విధ్వంసమే. విశాఖపట్నం ఎంపి భరత్ అన్నట్టు రాష్ట్ర ఎక్సైజ్ శాఖ ద్వారా ఏటా రూ.30 వేల కోట్లు ఆదాయం వస్తున్నా విశాఖపట్నం బీచ్లను కూడా మద్యానికి బలి చేయాలి అనుకోవడం పాలకుల మూర‰త్వమే. కాబట్టి వెంటనే 362 జీవోను రద్దు చేసి, విశాఖ బీచ్లను ‘ఆల్కహాల్ ఫ్రీ జోన్’గా ప్రకటించేదాకా ఉద్యమాలను కొనసాగిద్దాం.
ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య రాష్ట్ర అధ్యక్షురాలు


