Wednesday, February 18, 2026
Homeవిశ్లేషణభవిష్యత్తు కమ్యూనిస్టులదే

భవిష్యత్తు కమ్యూనిస్టులదే

- Advertisement -

‘భవిష్యత్తు కమ్యూనిస్టులదే. ఈ దేశానికి ప్రత్యామ్నాయం ఒక్క ఎర్ర జెండాతోనే. ఎర్ర జెండా ప్రత్యామ్నాయం కానంత వరకూ ఈ దేశ ముఖ చిత్రాన్ని మార్చడం సాధ్యం కాదు…వందేళ్ల చారిత్రాత్మకమైన కమ్యూనిస్టు పార్టీ ఉద్యమం స్ఫూర్తితో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేఖ చర్యలకు వ్యతిరేకంగా భవిష్యత్‌లో సమరశీల పోరాటాలకు శ్రీకారం చుడతాం. దేశంలో రాజ్యాంగాన్ని విచ్ఛిన్నం చేసే కుట్రలపైన, మతోన్మాద శక్తులకు వ్యతిరేకంగా మరిన్ని ఉద్యమాలు నిర్మిస్తాం. ప్రజాఉద్యమాల నిర్మాణమే లక్ష్యంగా ముందుకు కదులుతామ’ని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య మరోసారి స్పష్టం చేశారు. భారత కమ్యూనిస్టు పార్టీ(సీపీఐ) శతాబ్ధి ఉత్సవాల సందర్భంగా ‘విశాలాంధ్ర స్టేట్‌ బ్యూరో జి.బి.బాబు’కు ఆయన ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూ….

కమ్యూనిస్టు పార్టీ వందేళ్ల చరిత్ర స్ఫూర్తితో ఎలాముందుకెళ్తారు.?
ఒకటా..రెండా..ఎన్నెన్ని సమరాలో..ఎన్నో బలిదానాలు..అక్షర నుడికారానికి..సత్యం వాస్తవానికి దివిటిలా కమ్యూనిస్టుపార్టీ పోరాటాలు నిలుస్తాయి. ఆ చరిత్ర సాక్షిగా, నాటి నేతల అడుగు జాడల్లో, పార్టీ భావజాలంతో మరింతగా ముందుకు పోతాం. 1925 డిసెంబరు 26న ఉత్తరప్రదేశ్‌లోని కాన్ఫూర్‌ పట్టణంలో సీపీఐ ఆవిర్భావమైంది. గత డిసెంబరు 26, 2025 నాటికి వంద సంవత్సరాలు పార్టీ పూర్తి చేసుకుంది. తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంతో ఈనెల 18వ తేదీన ముగింపు ఉత్సవాలను కమ్యూనిస్టుల ఖిల్లా అయిన ఖమ్మం నగరం నడిబొడ్డున శతాబ్ధి ఉత్సవాలు ఒక చారిత్రాత్మక పద్ధతిలో జరుగుతున్నాయి. సీపీఐ ఆవిర్భావం నాటికి అప్పటికే ఒక వైపున భారతదేశం బ్రిటీష్‌ వారి వలస పాలన కింద మగ్గుతోంది. మరోవైపు 1917 నాటికి కమ్యూనిస్టు దిగ్గజం లెనిన్‌ నాయకత్వాన బోన్సివిప్‌ విప్లవాన్ని నడిపి, జార్‌ చక్రవర్తులను నేలకూల్చినటువంటి సందర్భం. రష్యా విప్లవం ఇచ్చిన స్ఫూర్తి..దాని ప్రభావం భారత దేశంలోని యువతపైన చూపింది. ఆ నాటి స్వాతంత్య్ర ఉద్యమంపైన, ప్రజా ఉద్యమాలపైన ఎంతో విప్లవాత్మకమైన కమ్యూనిస్టు పార్టీ ముద్ర వేసింది. దేశంతోపాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కళాకారులు ప్రధాన పాత్ర పోషించి..ఆనాటి భూస్వామ్యం పెత్తందారి వ్యవస్థకు వ్యతిరేకంగా ప్రజల్ని చైతన్యవంతుల్ని చేయడంలో అవిరామ కృషి చేశాయి. అదే స్ఫూర్తితో..అదే పోరాట తెగువతో, అదే భావజాలంతో పార్టీ, ప్రజా సంఘాలను బలోపేతంచేసి ముందుకెళ్తాం.
ప్రజల్లోకి సీపీఐ శతాబ్ధి ఉత్సవాలెలా చేరువ చేశారు ?
సీపీఐ శతాబ్ధి ఉత్సవాలను ఒక పండుగలా, ఒక భావజాలం స్ఫూర్తితో ప్రజలను మమేకం చేసేలా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర నలుమూలలా నిర్వహించాం. పార్టీ శ్రేణులు, ప్రత్యేకించి ప్రజానాట్య మండలి కళాకారుల బృందంతో కమ్యూనిస్టు పార్టీ చరిత్రను విస్తృతంగా తీసుకెళ్లాం. పార్టీ శతాబ్ధి ఉత్సవాలు ప్రారంభాన్ని పురస్కరించుకుని..గతేడాది సెప్టెంబరు నుంచి ప్రతి శాఖలో ఒక వైపు 100 జెండాలు ఎగురేసి చరిత్రను చెప్పడమే కాకుండా, మరోవైపు కార్పొరేట్‌ శక్తుల ఆధీనంలో కొనసాగున్న పర్యావరణానికి కలుగుతున్న తీవ్ర ముప్పును నిరోధించడానికిగాను పర్యావరణ పరిరక్షణకు కోసం 100 చెట్లు నాటాలన్న పిలుపునకు అత్యధిక ప్రాంతాల్లో విజయవంతంగా కృషి జరిగింది.
హలో కామ్రేడ్‌..చలో ఖమ్మానికి ప్రచారమెలా సాగింది?
గతేడాది అక్టోబరు నుంచి చాలా పెద్దఎత్తున హలో కామ్రేడ్‌..చలో ఖమ్మం నినాదంతో విభిన్న రకాల కార్యక్రమాలను, కళాజాతాలతో ప్రజల్ని చైతన్యవంతుల్ని చేశాం. అన్ని జిల్లాల్లోను ప్రత్యేక జీపు, మోటారు జాతాలతో చైతన్యవంతుల్ని చేశాం. అన్ని ప్రాంతాల్లో 3,156 శాఖల్లో విస్తృతమైన ప్రచారం నిర్వహించాం. ప్రజా పోరాటాలు, విలువలు, ప్రజా పోరాటాలు, సైద్ధాంతిక నిబద్ధత, ఆచరణ లాంటి అంశాలను నేటి తరానికి సీపీఐతోపాటు విద్యార్థి, యువజన, మహిళా, కార్మిక తదితర ప్రజా సంఘాల నేతృత్వంలో సదస్సులు, బహిరంగ సభలతో చైతన్యవంతుల్ని చేశాం. కోటి మంది చెంతకు ప్రత్యక్షంగా కమ్యూనిస్టు పార్టీ ఉద్యమ చరిత్ర, శతాబ్ధి ఉత్సవాల ఆవశక్యతను తెలియజేయాలన్న లక్ష్యంతో వివిధ రూపాల్లో ప్రచారం నిర్వహించాం. ఒక వైపు ప్రత్యక్షంగాను, మరోవైపు మీడియా, సోషల్‌ మీడియా వేదికగా కమ్యూనిస్టు పార్టీ ఘన చరిత్రతోపాటు..గత మూడు దశాబ్ధాల కాలంగా పార్టీ ఎదురీదడం, సవాళ్లు, ఒడిదుడుగులను వివరించాం.
వామపక్ష పార్టీల ఐక్యత ఎప్పటికీ..?
దేశంలోని వామపక్ష పార్టీల ఐక్యత/ఏకీకరణ చాలా ఆవసరమనేదీ మేథావులు, సమాజాన్ని హితాన్ని కాంక్షించే వారి నుంచి ఒక బలమైన నినాదం ఎంతోకాలం నుంచి ఉంది. ఆచరణలో ఆ దిశగా అడుగులు వేసి, ఈ భావజాలాన్ని వ్యాప్తింపజేయాలన్న కోరికతో ఉన్న వారికి..నేటికి అది జరగకపోవడంతో అసంతృప్తితో ఉన్నారు. దాన్ని సీపీఐ పూర్తిగా గుర్తించింది. తప్పకుండా వారి అభిప్రాయాలకు రూపం ఇవ్వాలిసిన బాధ్యత మాపై ఉంది.
ఏపీలో ప్రత్యామ్నాయ కూటమి ఉంటుందా?
నాటి సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నుంచి ప్రస్తుత సీఎం చంద్రబాబు, ఆయన కూటమిలోని నేత పవన్‌ కల్యాణ్‌ వరకు ఎవరికి వారు పేరుకు పేద ప్రజల పేరు చెప్పినా…అణగారిన వర్గాలు చెప్పినా..ఆయా వర్గాలకు రాజ్యాంగ పరంగాను, విద్యా, వైద్యపరంగాను, ఉద్యోగ, ఉపాధి అవకాశాల్లో రావాలిసిన ఫలాలు వారికి దక్కకుండా పరిపాలన ఉంది. దానికి కారణంగా కమ్యూనిస్టు పార్టీ ఉద్యమం బలహీనం పడటమూ ఓ కారణం కాగా..తమకున్న అవకాశాలను, శక్తిని, యుక్తిని, విభజించి పాలించే విధానాల్లో భాగంగా భూర్జువాల పార్టీల పాలకులు తమ అనుకున్న అంశాలను సాధించేందుకు ప్రయత్నించడం మరొక కారణం. రాబోయే రోజుల్లో…ఏపీలో వామపక్ష, లౌకిక, అభ్యుదయ శక్తులను ఏకం చేసేందుకు సీపీఐ ప్రయత్నిస్తుంది.
కూటమి ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలపై ఉద్యమ ప్రణాళిక ?
నాడు ప్రపంచ దేశాలతో పోటీపడేలా భారత దేశాన్ని తీర్చిదిద్దుదామని, జీడీపీని వృద్ధి చెబుతామని చెప్పిన ప్రధాని నరేంద్ర మోదీ..అధికారంలోకి వచ్చాక అందుకు విరుద్ధంగా పరిపాలన సాగుతోంది. అంతర్జాతీయ మార్కెట్‌లో దేశ రూపాయి విలువ దారుణంగా పడిపోయింది. దీనికి ప్రధాన కారణాలను మోదీ వైఫల్యమే అనిచెప్పకుండా..కేవలం సమర్థనీయమైన చర్యలతో, అవివేక ధోరణితో ముందుకు పోవడం గర్హణీయం. దేశం దాదాపు రూ.200 లక్షల కోట్ల పైచిలుకు అప్పులకు చేరుకుపోయింది. ఒక్క మోదీ అధికారంలోకి వచ్చాకనే రూ.185 లక్షల కోట్లకు అప్పులు చేరగా, అంతకుముందు పరిపాలించిన ప్రధాన మంత్రుల హయాంలో రూ.55 లక్షల కోట్లు అప్పులు చేశారు. మేక్‌ ఇండియా, మేడ్‌ ఇండియా అనేవీ నినాదాలకే పరిమితమయ్యాయి.
కూటమి మేనిఫెస్టో హామీలు..అమలు పరిస్థితి ?
ఏపీలో సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలుకు నోచుకోలేదు. ఐదేళ్లల్లో 20లక్షల ఉద్యోగాలిస్తామని మేనిఫెస్టోలో ఘనంగా ప్రకటించగా..ఆ లెక్కన ఈ రెండేళ్లల్లో 4లక్షల ఉద్యోగాలు ఇవ్వాలిసి ఉండగా..వాటిపై అతీగతీలేదు. పబ్లిక్‌, ప్రైవేట్‌, పార్టనర్‌షిప్‌(పీపీపీ) విధానాలతో ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేట్‌కు కట్టబెడుతూ, విద్య, వైద్యాన్ని పేదలకు అందకుండా చేస్తున్నారు. విశాఖ ఉక్కునూ నిర్వీర్యం చేస్తూ వేలాది కార్మిక, ఉద్యోగులను నడిరోడ్డుపైకి నెట్టేస్తున్నారు. అన్నింటా ప్రైవేట్‌ చేసేందుకు చంద్రబాబు కంకణం కట్టుకోగా, ప్రశ్నిస్తానన్న పవన్‌ కల్యాణ్‌ తన పదవి వచ్చాక మౌనం దాల్చారు. కేంద్రంలోను, రాష్ట్రంలోనూ కూటమి ప్రభుత్వమే అని చెబుతున్న ప్రభుత్వాలు..నదుల అనుసంధాన సమస్యలను పరిష్కరించారా?. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల్ని వ్యతిరేకిస్తూ సీపీఐ శతాబ్ధి ఉత్సవాల స్ఫూర్తితో భవిష్యత్‌లో పార్టీ, ప్రజా సంఘాలతో సమరశీల పోరాటాలకు సిద్ధమవుతాం.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు