‘ఇతడు గొప్ప విద్వాంసుడు.విజ్ఞాని .రసికుడు.ఇతడు ప్రేమ సాగరుడని చెప్పవచ్చు! ఇతని గీతములందు కనపడు గొప్ప లక్షణం ఈ ప్రేమ తరంగములే. ఈయన కవిత్వము భావ గర్భితమై, రసపూరితమై, హృదయ రంజకముగా ఉండును. ఇతడు తన సుఖదు’ఖములను గాని మనోభావములను గాని ఎంత మాత్రమూ దాచడు. ఈ కవి నిజముగా భావకవితా సామ్రాట్ అనుటకు ఎటువంటి సందేహం లేదు!’అని సాటి కవి మిత్రులచే నీరాజనాలందుకున్న బసవరాజు వెంకట అప్పారావు 1894లో డిసెంబర్ 13వ తేదీన బెజవాడ దగ్గర ఉన్న పటమట గ్రామంలో వారి మేనమాలైన గోవిందరాజుల వారి ఇంట పుట్టి పెరిగారు.
ఆరో ఫారం వరకు బెజవాడ సీఎంఎస్ హైస్కూల్‌లో చదివి, 1912లో స్కూల్ ఫైనల్ పరీక్షల్లో ఉత్తీర్ణులయ్యారు. తర్వాత చెన్నపురిలోని ప్రెసిడెన్సి కళాశాలలో చదివి, బిఏ పట్టాను తీసుకున్నారు. బిఏ చదువుతూ ఉండగానే, తన మేనమామ కుమార్తె వెంకటరాజ్యలక్షˆమ్మను పెళ్లి చేసుకున్నారు .ఈ దంపతులకు ఒక కుమార్తె, ఒక కుమారుడు పుట్టారు గానీ వాళ్లు బాల్యంలోనే మరణించారు. 1921 ప్రాంతంలో కొన్నాళ్లు ఆంధ్రపత్రికకు, కొన్నాళ్లు భారతి మాస పత్రిక కి సహాయ సంపాదకులుగా పని చేశారు. తర్వాత బిఎల్ పూర్తిచేసి, బెజవాడలో న్యాయవాద వృత్తిలో ప్రవేశించారు. 1932 సంవత్సరం చివరి వరకు న్యాయవాద వృత్తిలో ఉన్నారు.
బసవరాజు అప్పారావు వందలాది పాటలు: అడవి సీమ, ఎడబాటు, వెన్నెల రేయి, ఇంద్రకీలాద్రి మొదలైన కావ్య ఖండికలు: ప్రణయపారవశ్యము, మేలి ముసుగు, ప్రేమశక్తి, ప్రణయ గానము, వరప్రసాదము, సీతా విరహము, ప్రణయ స్మృతి మొదలైన అనువాద గీతాలు: మాగాంధీ, గాంధీ ప్రభ ,జాతీయపతాకము, రాట్నము, స్వరాజ్యలక్ష్మీ పెండ్లి, వేణునాదము మొదలైన జాతీయ గీతాలు: అన్నీ కలిపి సుమారుగా 200 వరకు పాటలు రాశారు.అర్ఙేయన్ నైట్స్ కథలు తెలుగులో అనువదించారు. ఆంధ్ర కవిత్వ చరిత్రను రచించారు. ఆయన మరణానంతరము వారి పాటలను 1934లో బెజవాడలోని అప్పారావు మెమోరియల్ కమిటీ వారు ‘బసవరాజు అప్పారావు గీతములు’ పేరుతో ఒక పుస్తకంగా తీసుకువచ్చారు.
బసవరాజు అప్పారావు, దేవులపల్లి కృష్ణశాస్త్రి, నండూరి సుబ్బారావు ….ఈ ముగ్గురిని ఆ రోజుల్లో భావకవులు అని పిలిచేవారు! అప్పారావు సరళ శైలిలో గీతాలు రాస్తే నండూరి వారు జానపద శైలిలో గీతాలు రాసేవారు. అందుకే దేవులపల్లి కృష్ణశాస్త్రి ఒక సందర్భంలో, “సుబ్బారావు పాట ‘నిభ్రృత సుందరం’, అప్పారావు పాట ‘నిసర్గ మనోహరం’ “అని పేర్కొన్నారు.
బసవరాజు అప్పారావు రాసిన”నల్ల వాడే గొల్ల పిల్లవాడే….., ఆ మబ్బు ఈ మబ్బు…, వేణు మనోహర గానము…, మనుజుల విభజన ఏలా…, కొల్లాయి గట్టి తేనేమీ…,” పాటలను గూడవల్లి రామబ్రహ్మం 1938లో తన సినిమా ‘మాలపిల్ల’లో పరిచయం చేశారు. సూరిబాబు పాడిన “కొల్లాయి గట్టితే నేమి? మా గాంధీ మాలడై తిరిగితే నేమి?” అప్పట్‌లో ప్రతి గొంతులో మారుమోగింది. కాంచనమాల, సుందరాబాళ్ పాడిన” నల్లవాడే గొల్ల పిల్లవాడే” చాలా ప్రాచుర్యం పొందిన పాట.
జీవితంలో కదిలించిన ప్రతి అనుభూతిని గీతంగా మలుచు కున్నారు బసవరాజు. ఓసారి భార్యపై తీవ్రకోపంతో అలిగారాయన . తీరా ఆమె గుత్తొంకాయ కూర వండడంతో ఆయన ఇట్టే కరిగిపోయారు. అప్పుడు రాసినదే “గుత్తొంకాయ కూరోయ్ బావ! కోరి వండినానోయ్ బావ” అనే పాట! ఈ పాటను బందా కనక లింగేశ్వర రావు అద్భుతంగా పాడారు. అప్పట్‌లో ప్రతి ఇంటా ఈ పాటే. ఆయన రాసిన లలిత గీతాలను టంగుటూరు సూర్యకుమారి, బాలమురళీకృష్ణ, రావు బాల సరస్వతి దేవి మధురంగా పాడారు.
ఆయన సందర్శించని క్షేత్రం లేదు! దర్శించని సమకాలీన ప్రముఖులు లేరు! స్పృశించని భావ కవితా శాఖ లేదు! ఆగ్రానగరంలో ఒకనాడు పత్ని సమేతంగా పండు వెన్నెలలో తాజ్ మహల్ తిలకించి పరవశించిపోయారు. రసాప్లుతమైన ఆనాటి వారి హృదయ స్పందనమే తాజ్ మహల్ గేయంగా రూపొందింది.
మామిడి చెట్టును అల్లుకున్నదీ
మాధవీలతొకటి
యేమా రెండింటి ప్రేమ సంపదా
ఇంతింతన లేమూ
చూడలేక పాపిష్టి తుఫానూ
ఊడబీకెలతనూ
మోడయిపోsమూ మామిడి చెట్టూ
మొగము తేలవేసీ…
మామిడి చెట్టూ మాధవిలతతో
మాయలో గలసింది
కామితమిచ్చే మామిడిపండూ
కవులకు మిగిలింది!
‘ముంతాజ్ బేగం అకాల మృత్యువాత పడిపోయినదని కవి హృదయం ఆక్రోశించింది. షాజహాన్ చక్రవర్తి ప్రేమ చిహ్నమే తాజ్ మహల్ గా రూపు గట్టి, సాక్ష±త్కరిస్తోంది కదా!’ అని ఊరట చెందింది.
అప్పారావు జీవితగాథకు ఈ గేయ పంక్తులకు సంబంధం ఉంది. మామిడి చెట్టును చుట్టుకున్న మాధవీలతను పాపిష్టి తుఫాను పొట్టన పెట్టుకుంటే, అప్పారావు జీవిత గాథలో మామిడి చెట్టునే కూకటి వేళ్లతో జంఝ²మారుతం పెకలించి వేసింది. ‘అసలు ప్రేమించకపోతేనే బతుకు వృధా’ అంటారాయన!
“మా కవితా కన్య చిన్న తనమున నుండియు రాగిణి. భావనోద్దీపిత గానలోల రసజీవిని.”అనటమే కాకుండా “ వలపెరుంగక బతికి కులికి మురిసే కన్నా, వలచి విఫలమ్మొంది విలపింప మేలురా…” అని పలికిన బసవరాజు వెంకట అప్పారావు 1933 జూన్ 19వ తేదీన స్వర్గస్తులయ్యారు.
“నా కవి మిత్రుడు అప్పారావు చామన చాయమనిషి. పలచని చెక్కిళ్ళు… కోల ముఖం, కోణం తీర్చిన నాసిక, కండ్లు కొంచెం లోతుగా ఉండేవి. కానీ చూపులో ఒక వాడి… ఒక నిశిత వర్చస్సు కనబడేది. ఆయన బుద్ధి అతి సూక్షˆము. ఎప్పుడూ ఏదో కూని రాగం గొంతులో మెదులుతూ ఉండేది. పద్యమైనా పాటైనా చదివితే చక్కగా వినిపించేది. పదాలలో ఉన్న పరుష సరళ స్వభావం గమనించేవాడు.” అంటూ రాయప్రోలు సుబ్బారావు నుంచి ప్రేమ పూర్వక ప్రశంసలు అందుకున్నారు బసవరాజు అప్పారావు!
సెల్: 94403 18415
భావ కవితా సామ్రాట్టు బసవరాజు
- Advertisement -


