Saturday, April 19, 2025
Homeభూ సమీకరణ సవాలే!

భూ సమీకరణ సవాలే!

. 5 వేల ఎకరాల్లో అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటు యోచన
. మెగా సిటీగా విజయవాడగుంటూరుఅమరావతి
. ఇందుకోసం మరో 30 వేల ఎకరాల కోసం యత్నం
. గతంలో ఇచ్చిన భూములే అభివృద్ధికి నోచని వైనం
. రైతుల్లో నిరాసక్తత… ఊగిసలాటలో సర్కార్‌

విశాలాంధ్ర బ్యూరోఅమరావతి : రాజధాని ప్రాంతంలో మరోసారి భూసమీకరణకు ప్రభుత్వం యత్నిస్తుండడం చర్చనీయాంశంగా మారింది. గుంటూరు, విజయవాడ నగరపాలక సంస్థలతో పాటు మంగళగిరి,తాడేపల్లి మున్సిపాలిటీలను కలిపి మెగా సిటీ ఏర్పాటు చేయాలనే ఆలోచనలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నారు. అమరావతి రాజధానికి ఔటర్‌ రింగ్‌రోడ్డు నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వడంతో మెగా సిటీ ఏర్పాటు ద్వారా అతిపెద్ద నగరంగా అమరావతి అవతరిస్తుందని భావిస్తున్నారు. దీనివల్ల పరిశ్రమలు కూడా అధికసంఖ్యలో వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అమరావతి రాజధానికి ఇప్పటికే చెన్నయ్‌కలకత్తా, ముంబై`మచిలీపట్నం హైవేలతో కనెక్ట్‌విటీ ఉంది. అలాగే దేశం నలుమూలలకు వెళ్లగల సౌకర్యం కలిగిన అతిపెద్ద రైల్వే జంక్షన్‌ విజయవాడలో ఉంది. అమరావతి రాజధానిని కూడా కొత్త రైల్వే లైనుతో అనుసంధానిస్తున్నారు. ఈ కొత్త ప్రాజెక్టుకు ప్రస్తుతం భూసేకరణ ప్రక్రియ కొనసాగుతోంది. ఇక విజయవాడ నగరానికి అతి సమీపంలో గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయం ఉండనే ఉంది. మచిలీపట్నంలో పోర్టు నిర్మాణ పనులు కూడా ప్రారంభమయ్యాయి. ఇలా అన్నిరకాలుగా రోడ్డు, రైలు, ఎయిర్‌, సీ కనెక్ట్‌విటీలు ఉన్న అమరావతి రాజధాని నగరాన్ని విజయవాడ, గుంటూరు నగరపాలక సంస్థలతో కలిపి మెగా సిటీ చేస్తే అభివృద్ధి ఊహించనంత వేగవంతమవుతుందని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. మరోవైపు పొరుగు రాష్ట్ర రాజధానులైన హైదరాబాద్‌,చెన్నయ్‌, బెంగళూరు నగరాలను అమరావతికి అనుసంధానం చేస్తూ అభివృద్ధి ప్రణాళికలు రూపొందించాలని 16వ ఆర్థిక సంఘం చైర్మన్‌ పనగారియాను సీఎం కోరారు. అతిపెద్ద తీర ప్రాంతం కల్గిన ఏపీ వికసిత్‌ భారత్‌ లక్ష్యంలో కీలకం అవుతుందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపధ్యంలోనే అమరావతి రాజధాని పరిధిలో 5వేల ఎకరాల్లో అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి యోచిస్తున్నారు. నగరం అభివృద్ధి చెందిన తర్వాత భూములు సేకరించడం కష్టమవుతుందని,
ప్రస్తుతం నిర్మాణం ప్రారంభదశలో ఉన్నందున ఇప్పుడైతే సులువు అవుతుందని భావిస్తున్నారు. దీనికి భూసేకరణ కంటే భూ సమీకరణ ద్వారా అయితే ప్రభు త్వంపై ఆర్థిక భారం పడకుండా, మరోవైపు రైతులకు కూడా భూమి విలువ పెరిగి వారికి మేలు జరుగుతుందనే యోచనలో ఉన్నారు. ఇదే విషయాన్ని మున్సిపల్‌ మంత్రి పి.నారాయణ ఇటీవల మీడియాకు స్పష్టంగా చెప్పారు. అయితే 5వేల ఎకరాలు విమానాశ్రయం కోసం భూమి కావాలంటే రైతులకు రిటర్న్‌బుల్‌ ప్లాట్లుతోపాటు, ్ల రోడ్లు, డ్రెయిన్లు, ఇతర మౌలిక వసతులన్నింటికీ కలిపి కనీసం 30వేల ఎకరాలు సేకరించాల్సి ఉంటుందని మంత్రి చెపుతున్నారు. భూసేకరణ ద్వారా అయితే రైతుకు పెద్దగా లాభం ఉండదని, మార్కెట్‌ రేటు కంటే రెండు రెట్లు మాత్రమే అదనంగా వస్తుందని, అదే భూసమీకరణ ద్వారా అయితే భూముల విలువ అనూహ్యంగా పెరుగుతుందని మంత్రి విశ్లేషిస్తున్నారు.
రైతుల్లో కానరాని ఆసక్తి
మరోసారి భూసమీకరణ జరుగబోతున్నట్లు వస్తున్న వార్తలపై రాజధాని సమీపగ్రామాల్లోని రైతులు ఆసక్తి చూపడం లేదు. ఎందుకంటే ఇప్పటికే రాజధాని చుట్టుపక్కల గ్రామాల్లోని భూముల విలువ భారీగా పెరిగింది. ఇప్పుడు భూసమీకరణ తెరపైకి వస్తే… తమ భూముల్ని ఇప్పట్లో ఎవరూ కొనరనే ఆందోళనలో రైతులు ఉన్నారు. అలాగే 2014లో భూసమీకరణ ద్వారా ప్రభుత్వానికి భూములిచ్చిన రైతుల రిటర్న్‌బుల్‌ ప్లాట్లు ఇంతవరకు ప్రభుత్వం అభివృద్ధి చేయలేదు. 2019లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడం ప్రధాన కారణమైనప్పటికీ, పదేళ్లు పూర్తి కావడంతో ఎప్పుడు ఏమవుతుందోనన్న ఆందోళన రైతుల్లో కనపడుతోంది. అమరావతిని రాజధానిగా నిర్ణయించిన తర్వాత 2015లో టీడీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన భూసమీకరణ పథకానికి అనూహ్య స్పందన లభించింది. కేవలం 58 రోజుల వ్యవధిలోనే రైతులు 34వేల ఎకరాలు స్వచ్ఛందంగా ప్రభుత్వానికి ఇచ్చారు. ఈ ఆశతోనే ముఖ్యమంత్రి చంద్రబాబు మళ్ళీ భూసమీకరణ ద్వారానే భూమిని సమీకరించాలని యోచిస్తున్నారు. ప్రభుత్వ వైఖరిని మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వర రావు తీవ్రంగా తప్పుబట్టారు. ఇప్పటికే ప్రభుత్వ భూమితో కలిపి సుమారు 54వేల ఎకరాలుండగా, ఇంకా 30వేల ఎకరాలు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారానికా అంటూ ప్రశ్నించారు. అలాగే మిగిలిన పార్టీలు కూడా మరోసారి భూసమీకరణ యత్నాన్ని వ్యతిరేకిస్తున్నాయి. దీంతో ప్రభుత్వం ప్రస్తుతం మీమాంసలో పడిరది. అయితే భూమి సేకరించాలా ? సమీకరించాలా అనే విషయంపై మరికొద్దిరోజుల్లో ప్రభుత్వం మాత్రం అధికారిక నిర్ణయం తీసుకోవడం మాత్రం ఖాయమన్న ప్రచారం జరుగుతోంది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు