అంజన్ రాయ్
ట్రంప్ ప్రపంచ దేశాలపై విధించిన సుంకాల ప్రభావం అమెరికాపైనే తీవ్ర ప్రభావం చూపనున్నది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొత్త సుంకాలు ఆగస్టు 1 నుంచి ప్రపంచ వ్యాప్తంగా అమలులోకి రావడంతో, అమెరికా ఆర్థిక వ్యవస్థ కొట్టుమిట్టాడుతోంది. దేశంలో స్టాక్‌లు విస్తృతంగా పడిపోయాయి. ఆర్థిక వ్యవస్థ మందగిస్తోందని తాజా గణాంకాలు వెల్లడిరచాయి. జులైలో విడుదల చేసిన గణాంకాల ప్రకారం తాజాగా 73,000 కొత్త ఉద్యోగాలను మాత్రమే కల్పించారు. దేశ ఆర్థిక వ్యవస్థ వేగానికి కొలమానమైన కీలక కొత్త ఉద్యోగాల సృష్టి మందగించింది. స్వేచ్ఛా ఆర్థిక వ్యవస్థ, స్వేచ్ఛా వాణిజ్యానికి నిలయంగా ఉన్న అమెరికా ఇప్పుడు రక్షణాత్మక ఆర్థిక వ్యవస్థ వైపు మొగ్గు చూపుతోంది. ట్రంప్ సుంకాల బాదుడు అత్యంత సన్నిహిత మిత్రదేశాలను నిరాశపరచడమే కాకుండా, స్వదేశీయులను కూడా నిరాశపరిచింది. అమెరికా అర్థికవ్యవస్థ ద్రవ్యోల్బణం పెరుగుదలను ఎదుర్కొంటోంది. జులై 2025 నాటికి వార్షిక ద్రవ్యోల్బణ రేటు 2.7శాతం కాగా, ప్రధాన ద్రవ్యోల్బణ రేటుకూడా పెరుగుతోంది. దిగుమతి సుంకాలు పెరగడం వల్ల రానున్న నెలల్లో ధరలు మరింత పెరగనున్నాయని విశ్లేషకుల అంచనా.
అయితే అమెరికాపై ఆధారపడిన దేశాలు ఇకపై పన్నుల భారం మోయవలసివస్తుందని ట్రంప్ చెబుతున్న దానికి విరుద్ధంగా, అమెరికన్లు వినియోగిస్తున్న అనేక ఉత్పత్తులకు అమెరికన్లే ఎక్కువ పన్నులు చెల్లించాల్సి వస్తోంది. ఫ్రాన్స్, జర్మనీ లేదా ఇటలీలోని ప్రముఖ వైన్ ఉత్పత్తిదారులు పేర్కొన్నవిధంగా సుంకాల మినహాయింపు జాబితాలో యూరోపియన్ వైన్లను చేర్చకపోవడంతో యూరోపియన్ వైన్ల ఖరీదు మునుపటి కంటే మరింత పెరిగాయి. అమెరికా తన పొరుగు దేశమైన కెనడా ఎగుమతులపై 35శాతం సుంకాన్ని ప్రకటించింది.
అత్యంత ప్రీతికరమైన వస్తువులలో ఒకటైన స్విస్ వాచీలు అత్యంత ఖరీదైనవి. అమెరికా స్విస్ వాచీలపై 39 శాతం ఎంట్రీ టారిఫ్‌ను విధించింది. యూకె, అమెరికాలలో స్విస్ వాచీల వ్యాపారాన్ని నిర్వహించిన బ్రిటిష్ ఆధారిత కంపెనీ వాచీల డిమాండ్ ఇకపై తగ్గనుంది.
అమెరికాలోకి దిగుమతయ్యే భారతదేశ వస్తువులపై అత్యధికంగా 25 శాతం టారిఫ్ ప్రకటించింది. రష్యా నుంచి భారత్ ముడి చమురు కొనుగోలు చేయడంతో ట్రంప్ విధించిన సుంకాలు భారత ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపనున్నాయి. అమెరికా ఎగుమతుల్లో ప్రధానమైన భారత్ ఎలక్ట్రానిక్ వస్తువులు తాజాగా 10% నుంచి 25% సుంకాన్ని ఎదుర్కోనుంది. మరో ప్రధాన ఎగుమతిదారు అయిన తైవాన్ వస్తువులపై 20% టారిఫ్ విధించింది. ఆటోమొబైల్ భాగాలు, జ్యుయలరీ దుస్తులు, పాదరక్షలు వంటి వాటిపై సుంకాలు పెరగడంతో భారత ఎగుమతులపై ప్రత్యక్ష ప్రభావం పడనుంది. సుంకాలు అమలు కావడానికి ముందు ఒక చిన్న వెసులుబాటు అందుబాటులో ఉంది. ఇప్పటి నుంచి అక్టోబర్ మధ్య చేసిన అన్ని ఎగుమతులపై కొత్త సుంకాలు మినహాయిస్తారు. అయితే, ఇది తాత్కాలిక వెసులుబాటు మాత్రమే. ఎందుకంటే సరుకును చాలా ముందుగానే ఎగుమతుల కోసం బుక్ చేసుకోవడం ప్రధాన కారణం.
ప్రకటించిన సుంకాలుపై వెసులుబాటు కల్పించడంలో చాలా దేశాలు ఇప్పుడు సంతృప్తి వ్యక్తం చేశాయి. ఉదాహరణకు, బంగ్లాదేశ్‌పై 37 శాతం పన్ను విధిస్తామని గతంలో ప్రకటించి ప్రస్తుతం 20% సుంకం విధించడంతో కొంతవరకు ఉపశమనంగా ఆయా దేశాలు పేర్కొంటున్నాయి. ఇండోనేషియా, పాకిస్థాన్, వియత్నాం దేశాలు ఆ కోవలోకి చెందినవే. ఎగుమతిదారులు సుంకం ప్రభావాన్ని భర్తీ చేయడానికి అంతిమంగా ధరలను తగ్గించే అవకాశం ఉందని విశ్లేషకుల అంచనా. అయితే, దీనికి స్పష్టమైన పరిమితులు ఉన్నాయి, ప్రస్తుత పరిస్థితుల్లో మార్జిన్‌లు లేకపోయినా మార్కెట్ షేర్‌ను నిలుపుకునేందుకు ధరలను తగ్గించే అవకాశం ఉంది. వాస్తవానికి, చైనా వంటి దేశాలు ఆదాయాల కోసం, ఎగుమతి ధరలను తగ్గించే అవకాశం ఉంది. కానీ దీర్ఘకాలంలో అది మార్కెట్ వాటాను నిలుపుకోవడానికి పోటీదారులతో ధరలను పెంచడం తప్పదు.
అమెరికా భారీ సుంకాల విధింపుతో విభిన్నమైన ఆలోచనలతో దేశాలు సతమతమవుతున్నాయి. పదహారు, పదిహేడవ శతాబ్ధాలలో ఆసియాలో భారత్, చైనా ఆర్థిక వ్యవస్థలు ప్రపంచ ఆర్థిక కార్యకలాపాలలో ప్రధాన పాత్ర పోషించాయి. ఆ సమయంలో అధిక సుంకాల విధింపుతో భారీ దిగుమతులు, ఎక్కువ ఎగుమతులతో ఈ సుంకాలను నిరోధించే అవకాశం ఉందని యూరప్ ఆర్థికవేత్తలు విశ్లేషించారు. ఆ కాలంలో భారత్ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారీ ఎగుమతులతో ముందంజలో ఉంది. ఔరంగజేబు మరణం తర్వాత బెంగాల్ కస్టమ్స్ హౌస్‌లో అత్యధిక మొత్తంలో దిగుమతి బంగారంగా గణాంకాలు వెల్లడిరచాయి.
బెంగాల్ ఎక్కువ ఎగుమతులతో తక్కువ దిగుమతులు నమోదు చేసింది. అంటే చెల్లింపుల సమతుల్యత బంగారం, వెండి కొలమానంగా ఉంది. పంతొమ్మిదవ శతాబ్దంలో కూడా, ఇంగ్లాండ్‌లో పారిశ్రామిక విప్లవం తర్వాత ఆర్థికవేత్తల ప్రాథమిక ఆలోచనలను మార్చిన తర్వాత. దేశాల మధ్య వాణిజ్యం ఆయా దేశ ప్రయోజనాలను పెంచిందని ఆడమ్ స్మిత్ వాదించాడు. పంతొమ్మిదవ శతాబ్దం ప్రారంభం నాటికి ఆర్థికవేత్తలు అన్ని వాణిజ్య దేశాల సంక్షేమంలో పెరుగుదలకు దారితీసే తులనాత్మక ప్రయోజన సిద్ధాంతం గురించి మాట్లాడుతున్నారు. కానీ అమెరికన్ ఒంటరివాదులు చాలా కాలం తరువాత కూడా దీనికి విరుద్ధంగా నమ్మారు. 1920 ల చివరిలో స్మూట్-హాలీ చట్టం ప్రకారం అన్ని దిగుమతులపై అధిక సుంకాలను విధించడానికి అమెరికా సంకల్పించింది. 1930 లో మహా మాంద్యానికి ప్రధాన కారణం ధరలు పెరగడానికి, డిమాండ్ తగ్గడానికి దారితీసిన సుంకాలు మొత్తం ఆర్థిక పరిస్థితి మరింత దిగజారడానికి దోహదపడ్డాయనేది నిర్వివాదాంశం. అయితే ట్రంప్ ఇప్పుడు విధించిన సుంకాలు చివరికి అమెరికా, ప్రపంచ దేశాలపై ఎలాంటి ప్రభావం చూపుతాయో ప్రస్తుతానికి స్పష్టంగా లేదు. కానీ ఈ సుంకాలు, వాటి ప్రభావాలు ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపనున్నాయి.


