ఖాళీతనం. నెర్రలు వారిన బీడు భూముల హృదయాలు. పట్టింపులు లేని బతుకులు. పలకరింపులు లేని జీవితాలు. ‘‘నేను క్షేమం. మీరంతా క్షేమమని తలుస్తాను’’ ఆనాటి ఉత్తరాల వెక్కిరింత. వాట్సాప్‌ల హాయ్‌లు… ఇదీ వీలు కాకుంటే థమ్స్ అప్ వేలి గురుతులు. ప్రపంచమొక పద్మవ్యూహం పాత మాట. ప్రపంచమంతా అరచేతిలో ఇమిడిన పెద్ద భూతం కొత్త మాట. ఎలాగైనా గెలవాలి. ఎలాగైనా నిలవాలి. ఎలాగైనా సాధించాలి. ఇదొక్కటే ఇప్పుడు కళ్ల ముందు కదలాడే నిత్య సత్యం. గెలవడం కోసం తొక్కేయాలి. నిలవడం కోసం నలిపేయాలి. సాధించడం కోసం సంపాదించాలి. ఏ రంగమైనా అవసరం లేదు వీరంగం ఆడడమే అసలు సిసలు రహస్యం. నేరుగా యుద్ధం చేయడం నేటి ఆధునిక యుగంలో పనికిరాని విద్య. వెన్నుపోటు అందరికీ ఇష్టమైన అద్భుత మాట. రాజకీయమో, కుటుంబ బంధమో, ఆర్థిక సంబంధమో, సాహిత్యమో… వెన్నుపోటు నేడొక భగవద్గీత. తొక్కుకుంటూ పైకి రావడం ఒక్కటే నేడు విరాజిల్లుతున్న వాస్తవం. నాకు తెలియదు అంటారు. నేను స్వచ్ఛమంటారు. నేను ఏ మలినమూలేని స్పటికం అంటారు.
అలా అన్నవారి మాటలకు అర్ధం వెతకాల్సిన పనిలేదు. దానికి పరమార్ధమే తస్మాత్ జాగ్రత్త శ్లోకం. ఇది తెలియని వాళ్లకి మిగిలేది నిత్య శోకం. నీ పక్కనే కూర్చుని ముఖానికి చేతుల్ని అడ్డం పెట్టుకుని ఏడుస్తున్నారంటే నిన్ను ఏడిపించడానికి సిద్ధమవుతున్నారమాట. నిన్ను చిత్రవథ చేసేందుకు ముసుగేసిన ముఖంతో యోచిస్తున్నారన్నమాట. ఎవరి కన్నీళ్లు అయినా నీకు విలువైనవి. నీ కన్నీళ్లు మాత్రం వాళ్లకి దారి చూపేవి. మనిషికి మనిషికి మధ్య ఏమీ లేని డొల్లతనం నీకు కనపడదు. కనపడనివ్వరు. నవ్వు ముఖాలకు పౌడర్లు, చర్మ సౌందర్యాలు పూసుకుని ఏడుపు ముఖాలను ప్రదర్శనకు పెడతారు. ఏ ప్రదర్శన అయినా అనుమానించా ల్సిన స్థితి నీకు గుర్తు రాదు. అసలు అలాంటి స్థితి ఉందనే స్ఫృహ నీకు కలుగకుండా చేయడమే ఆధునిక హంతకుల అసలు రహస్యం.
ఆధునిక యుగంలో హత్య చేసేందుకు మారణాయుథాలు అవసరం లేదు. మనసులో గూడు కట్టుకున్న ఈర్ష చాలు. ఇదీ నీకు కనపడదు. భుజం మీద చేతులు మెడ వరకూ వచ్చి దాన్ని ఒక్క నొక్కు నొక్కే వరకూ నువ్వు మరణిస్తావన్న ధ్యాస రాదు. రానివ్వరు. వారి జాగ్రత్తలు వారివి. నీటిలో మునిగి పోయిన వారిని రక్షిస్తున్నామని ప్రపంచానికి చూపిస్తూ వొడ్డుకు వచ్చిన తర్వాత నీ నోట్లో నీరు కక్కిస్తున్నట్లుగా నటిస్తూ నీకు మరణాన్ని ప్రసాదించడమే వారి ఉతృష్ణ చర్య. నీటిలో పడడమే తెలియని వాళ్లకి నోట్లో నీరు కక్కించడం మరణ శాసనమని ఎలా తెలుస్తుంది. ఇదీ ఆధునిక హత్యలో దాగున్న వాస్తవ ఆయుధం. ఇలాంటి పువ్వులు పుట్టగానే పరిమళించవు. అగ్నిపూలను కడుపులో దాచుకుని ఆవిర్లను కక్కుతూ మేఘాల సృష్టికర్తలం మేమే అంటూ ప్రపంచానికి నమ్మబలుకు తాయి. మేఘమన్నా, వర్షపు చినుకన్నా… నేల తడవడమన్నా… ఆకాశం ఎర్రగా మారడమన్నా…చెట్లు నవ్వడమన్నా.. నీకు చచ్చేంత ఇష్టమని వారికి నీ కంటే ముందే తెలుసు. నీకు తెలిసేలోగా పథక రచన ప్రారంభిస్తారు. పగడ్బందీగా అమలు చేస్తున్నారని వాళ్లొక్కరికే తెలుసు. నువ్వు రెండు అరచేతులు చాచి ఆకాశంకేసి చూస్తూ ఆ వర్షంలో కేరింతలు కొడతావని వారికి ముందే తెలుసు. సరిగ్గా అప్పుడే ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉన్న నీపై ఆ వర్షమే ఉధృతమై, ఉపద్రవమై, ఉన్మాదమై, ఊపిరి సలపనీయకుండా నిన్ను దారి తప్పిస్తుంది. వర్షం వెలిశాక ఏ దిక్కుకి చూసినా నీకు కనిపించేవి తెగిపడిన నీ ఖండిత అవయవాలే. నీ శరీర శఖలాల ముందు దీనంగా కూర్చుంటావు. నీ శరీర భాగాలను నువ్వు గుర్తించలేవు.
మనిషికి మనిషికి మధ్య నలిగిన జీవితపు ఖండితాంగాలు నీకు కానరావు. నువ్వు విలపించాలనుకుంటావా. నీ కళ్లు నీకు కనిపించవు. చేతుల్ని ఆసరాగా చేసుకుని నేలంతా వెతుకులాటలో పడతావు. ఓ చెయ్యి నిన్ను తాకుతుంది. అది నీదే అనే భ్రమలో ఉంటావు. ఆ చేతితో ఇతర అంగాల వెదుకులాటలో పడదామనుకుంటావు. కానీ, చిత్రంగా ఆ చేయి అచ్చం నీలాగే తన అవయవాలను వెతుక్కుంటూ… తన శరీరం దొరికిందని ఆనందిస్తుంది. ఆ శరీరానికి ఆ కాలు తనది కాదని తెలిసే లోగా నిన్ను ప్రేమగా చంపేసిన వారి చిరునవ్వు నీకు, వాళ్లకి కూడా దొరుకుతుంది. సమయం మించిపోయింది అంటాయి మీ ఇద్దరి తెగిపడిన కంఠనాళాలు. దూరంగా రైలు పట్టాల దగ్గరో, ఫ్లైవర్ చివరో, కాలువ వొడ్డు నుంచే ‘‘నేనిక్కడ ఉన్నా. నా శరీరం వచ్చి వారి చెవిని తీసుకొండి’’ అంటూ కర్ణభేరి పిలుస్తుంది. నీ భూజాలు వారిని మోస్తుంటాయని నీకు తెలియదు. నిజానికి నువ్వు పుట్టగానే నీ భుజాలు మరొకరిని మోయడానికి ఉన్నాయని నీకు తెలీదు. మనిషికి మనిషికి మధ్య ఆధిపత్యాల, కుళ్లు కుతంత్రాల, అభిజాజ్యాల, మోసాల, మోహరింపుల, మనో వైకల్యాలుంటాయని తెగిపడే వరకూ ఏ శరీరాలకు తెలీదు. నిన్ను హత్య చేయాలనుకున్న వాళ్లకో సమూహం ఉంటుంది. అక్కడందరూ మన శరీరాల ముందు నిలబడి భేతాళ నృత్యం చేస్తారు. ఆనందపరవశంలో మునిగి తేలుతారు. నువ్వు మాత్రమే ఖండితాంగాలతో వారి వైపు ప్రేమగా చూస్తూంటావు. అంతకు మునుపే నీ రక్తం నీళ్ల రంగులోకి మార్చే శక్తి వాళ్లకి ఉంటుందని నీకు తెలియదు. మనిషికి మనిషికి మధ్య రక్తం ఏరులై పారుతోందని మర్నాటి ఉదయమే పత్రికల్లో పతాక శీర్షికవుతుంది. నేను, నువ్వు వారి చేతిలో మరణిస్తున్నాం కదా… కాసేపు నిద్రపోదాం. కలలోనూ ఆ మనుషులు రాకూడదని దైవాన్ని వేడుకుందాం.
సీనియర్ జర్నలిస్టు, సెల్: 9120 19929
మనిషికి మనిషికి మధ్య
- Advertisement -


