విశాలాంధ్ర బ్యూరో`అమరావతి: రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ప్రస్తుతం అత్యంత ఆందోళనకరమైన స్థాయికి చేరుకుంది. తాజాగా ప్రభుత్వం మరో రూ.4,600 కోట్ల అప్పు చేసినట్లు సమాచారం. ఇది రాష్ట్ర ఖజానాపై మరింత భారాన్ని పెంచనుంది. గణాంకాలను పరిశీలిస్తే, గత వైసీపీ ప్రభుత్వ హయాంలో 60 నెలల్లో దాదాపు రూ. 3,32,000 కోట్ల అప్పులు చేయగా, ప్రస్తుత కూటమి ప్రభుత్వం కేవలం 23 నెలల స్వల్ప కాలంలోనే రూ.3,56,655 కోట్ల భారీ రుణాలను సమీకరించింది. అంటే గత ప్రభుత్వ ఐదేళ్ల అప్పులను ప్రస్తుత ప్రభుత్వం కేవలం రెండేళ్ల లోపే అధిగమించడం ఆర్థిక నిపుణులను సైతం విస్మయానికి గురిచేస్తోంది. ఈ రెండేళ్లలో చేసిన అప్పులను విశ్లేషిస్తే, రూ.1,98,564 కోట్ల బడ్జెటరీ అప్పులు, కార్పొరేషన్ల గ్యారెంటీ కింద రూ.1,10,704 కోట్లు, , రాజధాని నిర్మాణ వ్యయం పేరుతో రూ.47,387 కోట్లు సేకరించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రారంభంలోనే రుణాల పర్వం కొనసాగుతోంది. మొదటి నెలలోనే రూ. 9 వేల కోట్లు, ఈ నెల 7వ తేదీ నాటికి మరో రూ.4,400 కోట్లు అప్పు చేయడం రాష్ట్ర ఆర్థిక క్రమశిక్షణా రాహిత్యాన్ని సూచిస్తోంది. ఒకవైపు ఉపాధి హామీ వంటి కీలక పథకాల అమలులో వైఫల్యం చెంది గ్రామీణ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తూ… మరోవైపు అభివృద్ధి, సంక్షేమం పేరుతో మితిమీరిన అప్పులు చేయడం వల్ల రాష్ట్రం దీర్ఘకాలిక రుణ ఊబిలో కూరుకుపోయే ప్రమాదముంది.


