Homeమూడో రోజూ డీఎస్‌సీపై రభస

మూడో రోజూ డీఎస్‌సీపై రభస

- Advertisement -

మండలిలో చర్చకు పట్టుబట్టిన వైసీపీ… ఆందోళన – ప్రతిపక్ష వైఖరిపై మంత్రుల అసహనం – డీఎస్‌సీ అక్రమాలపై చర్చించాల్సిందే: బొత్స

విశాలాంధ్రబ్యూరో – అమరావతి: మెగా డీఎస్‌సీలో అక్రమాలు జరిగాయని, దీనిపై సమగ్రంగా చర్చించాలని డిమాండ్ చేస్తూ వైసీపీ సభ్యులు చేపట్టిన ఆందోళ నతో వరుసగా మూడోరోజు శాసన మండలి స్తంభించింది. వైసీపీ సభ్యుల తీరుపై మంత్రులు కొలుసు పార్థసారథి, నాదెండ్ల మనోహర్, కింజరాపు అచ్చెన్నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సభను ఆర్డర్‌లో పెట్టాలని మండలి చైర్మన్ ను మంత్రులు కోరడంతో కొద్దిసేపు వాడివేడి చర్చ జరిగింది. మూడో రోజు సమావేశాలు ప్రారంభమైన వెంటనే మెగా డీఎస్‌సీ నిర్వహణపై విచారణ జరిపించాలంటూ వైసీపీ సభ్యులు ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని చైర్మన్ తిరస్కరించారు. అనంతరం ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు ప్రకటించగానే వైసీపీ సభ్యులు నినాదాలు చేస్తూ సభా కార్యక్రమాలకు అడ్డుపడ్డారు.చైర్మన్ పోడియం వద్దకు వెళ్లి ఆందోళనకు దిగారు. ఈ సమయంలో మంత్రి పార్థసారథి జోక్యం చేసుకుని… మూడు రోజులుగా వైసీపీ సభ్యులు సభను జరగనీయడం లేదని మండిపడ్డారు. సభా కార్యక్రమాలను అడ్డుకునే సభ్యులను సస్పెండ్ చేసి బయటకు పంపించాలని కోరారు. వైసీపీ సభ్యులు సభను గౌరవించడం లేదని, చైర్మన్ టేబుల్ను కొడుతూ నినాదాలు చేస్తున్నారని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. సభను ఆర్డర్‌లో పెట్టాలని చైర్మన్‌ను కోరారు. మంత్రి మనోహర్ వ్యాఖ్యలపై చైర్మన్ మోషేను రాజు అసహనం వ్యక్తం చేశారు. సభ నిర్వహణ, నిబంధనల గురించి మంత్రికి బాగా తెలుసని పేర్కొంటూ…చర్యలు ఎలా తీసుకోవాలో నిబంధనల ప్రకారం ముందుకెళ్తామని స్పష్టం చేశారు. మంత్రి అచ్చెన్నాయుడు జోక్యం చేసుకుని గతంలో చైర్మన్‌గా ఉన్న సమయంలో ప్రతిపక్ష సభ్యులు నిర్దేశిత గీత దాటి వస్తే సస్పెండ్ చేసిన విషయాన్ని గుర్తుచేశారు. ఇప్పుడు కూడా అలాంటి చర్యలు తీసుకునే అధికారం చైర్మన్‌కు ఉందని అన్నారు. మూడు రోజులుగా సభా కార్యక్రమాలకు అంతరాయం కలిగిస్తున్న సభ్యులపై చర్యలు తీసుకోవచ్చని పేర్కొన్నారు. కూటమి సభ్యులు, మంత్రుల తీరుపై వైసీపీ శాసనసభాపక్ష నేత బొత్స సత్యనారాయణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సభా సంప్రదాయాలను అధికార పక్షం తుంగలో తొక్కుతోందని మండిపడ్డారు. డీఎస్‌సీ నియామకాల్లో అక్రమాలపై చర్చకు తాము పట్టుబడుతుంటే.. సమాధానం చెప్పలేక మంత్రులు అసహనంతో వ్యవహరిస్తున్నారని విమర్శించారు. చివరకు సభను ఎలా నిర్వహించాలో మండలి చైర్మన్కే సూచనలు చేసే స్థాయికి మంత్రుల తీరు వెళ్లిందని ధ్వజమెత్తారు. వైసీపీ సభ్యులు లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా కూటమి మంత్రులు గట్టిగా మాట్లాడటం, అసహనం వ్యక్తం చేయడం సరికాదన్నారు. సభలో మంత్రుల వ్యవహారశైలి చూస్తుంటే ప్రశ్నలకు సమాధానం చెప్పే పరిస్థితి లేకపోవడం స్పష్టమవుతోందని విమర్శించారు. సమస్యను పరిష్కరించాల్సిన ప్రభుత్వం.. ప్రతిపక్ష సభ్యులపై ఆగ్రహం వ్యక్తం చేస్తోందని మండిపడ్డారు. చైర్మన్ కొయ్యే మోషేను రాజుపై మంత్రి నాదెండ్ల మనోహర్ అసహనం వ్యక్తం చేయడాన్ని బొత్స తప్పుబట్టారు. “మండలిని ఎలా నిర్వహించాలో మీకు తెలియదా?” అంటూ మంత్రి చేసిన వ్యాఖ్యలను ఆయన ప్రస్తావించారు. చైర్మన్ స్థానాన్ని మంత్రులు గౌరవించాలని హితవు పలికారు. నాదెండ్ల మనోహర్ వ్యవహారశైలిని తాను చాలాసార్లు గమనించానని, చైర్మన్ పట్ల ఆయన వ్యవహరించిన తీరు సరికాదన్నారు. ప్రొసీజర్ బుక్ తీసుకొచ్చి తానేమీ తప్పుగా మాట్లా డలేదని సమర్థించుకోవడం వల్ల సమస్య పరిష్కారం కాదని అన్నారు. పొరపాటు జరిగితే అంగీకరించాలి కానీ..ఛైర్మన్కే హితబోధ చేసేలా వ్యవహరించడం ఏమిటని ప్రశ్నించారు. సభ్యుల ఆందోళన కొనసాగ డంతో సభను నిర్వహించడం సాధ్యం కాకపోవడంతో మండలి కార్యక లాపాలను వాయిదా వేస్తున్నట్లు చైర్మన్ మోషేను రాజు ప్రకటించారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు