. మూసీ ప్రక్షాళన పునరుజ్జీవనం కోసం ఎస్టీపీ ప్రాజెక్టు
. కొత్త ఎస్టీపీల పనులు సందర్శించిన జలమండలి ఎండీ అశోక్ రెడ్డి
విశాలాంధ్ర, హైదరాబాద్ : హైదరాబాద్ నగరాన్ని పరిశుభ్రంగా ఉంచడంతో పాటు కాలుష్య రహితంగా మార్చేందుకు మూసీ ప్రక్షాళన.. పునరుజ్జీవనం కోసం నిర్మాణ తలపెట్టిన మురుగు నీటి శుద్ధి కేంద్రాల ప్రారంభ పనులల్లో వేగం పెంచాలని ఎండీ అశోక్ రెడ్డి ఆదేశించారు. నూతనంగా అమృత్- 2.0 పథకంలో భాగంగా నిర్మించే 39 ఎస్టీపీల ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న నార్సింగిలో నిర్మిస్తున్న 34.5 ఎమ్మెల్డీల సామర్థ్యం కలిగిన ఎస్టీపీ పనులను బుధవారం ఆయన పరిశీలిం చారు. ప్యాకేజ్-1లో భాగంగా నార్సింగిలో నిర్మిస్తున్న ఎస్టీపీ పనుల పురోగతిని ఆయన అధికారులు, నిర్మాణ సంస్థ ప్రతినిధులను అడిగి తెలుసుకున్నారు. మూసీ పరిసర ప్రాంతాలను ఎండీ పరిశీలించి, ఎస్టీపీ నిర్మాణం జరుగుతున్న సమయంలో పక్కనే ఉన్న మూసీకి ఎలాంటి నష్టం లేకుండా చూడాలని సూచించారు. సమీప కాలనీల నుంచి మూసీలోకి మురుగు చేరే పాయింట్లను గుర్తించాలని అధికారులను ఆదేశించారు. ఈ మురుగు మూసీలో చేరకుండా, నది ఇరువైపు ఉన్న పైపు లైన్లను అనుసంధానం చేసి కొత్తగా నిర్మిస్తున్న ఎస్టీపీలోకి మళ్లించాలని ఆదేశించారు. అలాగే ఎస్టీపీ క్యాచ్ మెంట్ ప్రాంతాలైన కోకాపేట, నార్సింగిలతో పాటు ఎగువన, సమీప ప్రాంతాల్లో ఉత్పన్నం అయ్యే మురుగును కొత్తగా నిర్మిస్తున్న ఎస్టీపీలోకి మళ్లించడానికి ఆయా ప్రాంతాల్లో సీవరేజ్ ట్రంక్ మెయిన్స్, సబ్ మెయిన్స్ నిర్మాణం కోసం ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు. ఈ మళ్లింపు పనుల కోసం జీహెచఎంసీ, నీటిపారుదల శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటూ పనులు పూర్తి చేయాలన్నారు. అలాగే ఎస్టీపీ పనులు నిరంతం పాటు జరిగేలా చూడాలని ఆయన ఆదేశించారు. ఇందుకు తగ్గట్లుగా కార్మికులు, యంత్రాలు, నిర్మాణ సామాగ్రిని సమకూర్చుకోవాలని ఆయన సూచించారు. నిర్మాణం జరుగుతున్న ప్రాంతంలో తగు రక్షణచర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. నిర్ణీత సమయంలో పనులు 100 శాతం పూర్తి చేసి ఈ ఏడాది చివరి కల్లా ఎస్టీపీల నిర్మాణం పూర్తి చేసే లక్ష్యంతో వేగంగా పనులు జరపాలని సూచించారు. ఎస్టీపీల నిర్మాణంలో రక్షణ చర్యలు కచ్చితంగా పాటించేలా చూడాలని ఆదేశించారు. కార్మికులు తప్పనిసరిగా రక్షణ పరికరాలు ఉపయోగించాలన్నారు. నిర్మాణాలు జరుగుతున్న ప్రాంగణాల చుట్టూ బారీకేడ్లు ఏర్పాటుచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జలమండలి ప్రాజెక్ట్ డైరెక్టర్ టీవీ శ్రీధర్, సీజీఎంలు పద్మజ, వాస సత్యనారాయణ, జీఎం, నిర్మాణ సంస్థల ప్రతినిధులు, సైట్ ఇంజనీర్లు పాల్గొన్నారు. ఓఆరఆర్ పరిధిలోని మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొషన్ ప్రాంతాల్లో ప్రభుత్వం అమృత్-2.0 పథకంలో భాగంగా రూ.3,849.10 కోట్ల వ్యయంతో మురుగు శుద్ధి కేంద్రాల నిర్మాణానికి పనులు ప్రారంభించింది.
ఎస్టీపీ ప్రాజెక్టు స్వరూపం
మొత్తం ఎస్టీపీల సంఖ్య: 39 ఉండగా మొత్తం సామర్థ్యం : 972 ఎమ్మెల్డీలు, దీనికి వ్యయం రూ.3,849.10 కోట్లు.
ఎస్టీపీల నిర్మాణ ప్రాంతం సామర్థ్యాలు
మొత్తం 39 ఎస్టీపీలు అమీన్‌పూర్, తెల్లాపూర్, ఐక్రిసాట్, ఉష్కేబావి, బాచుగూడ, తిమక్క చెరువు, గాంధీ గూడెం, పీర్జాదిగూడ, నాగారం, నర్సింగి (ఓఆరఆర్), సాంగం (బాపూఘాట్), హైదర్‌షాహ్‌కోట, ఫతే నగర్, చిట్రాపురి కాలనీ, హైదరాబాదు పబ్లిక్ స్కూల్, మీర్‌పేట్, మసాబ్ చెరువు, కాప్రా, రవిర్యాల్, బొంగులూరు వంటి ప్రాంతాలలో నిర్మాణం చేపట్టనున్నారు.
ప్యాకేజీ`1 : మొత్తం ఎస్టీపీల సంఖ్య : 16, మొత్తం సామర్థ్యం : 493.50 ఎమ్మెల్డిలు, వ్యయం రూ.1878.55 కోట్లు
ప్యాకేజీ-2 : మొత్తం ఎస్టీపీల సంఖ్య : 22, మొత్తం సామర్థ్యం : 471.50 ఎమ్మెల్డిలు, వ్యయం రూ.1906.44 కోట్లు, మరో ఎస్టీపీ పిపీపీ మోడ్ (పటేల్ చెరువు):
వ్యయం రూ.64.11 కోట్లు, మొత్తం ఎస్టీపీల సంఖ్య : 1


