విశాలాంధ్ర, హైదరాబాద్ : రామచంద్రాపురం డివిజన్‌లో మొత్తం రూ.40.70 కోట్ల వ్యయంతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి, పట్టభద్రుల ఎమ్మెల్సీ అంజిరెడ్డిలు బుధవారం శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు నిర్వహించారు. మొదట శ్రీనివాస్‌నగర్‌లో కమ్యూనిటీ హాల్, రామచం ద్రాపురంలో సీసీ రోడ్లు, అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ, డివిజన్ అభివృద్ధికి నూతన నిధులు మంజూరైన పనులకు శంకుస్థాపనలు చేశారు. అదేవిధంగా శ్రీనివాస్‌నగర్‌లో హిందూ స్మశానవాటిక, గాంధీ బాలవిహార్ పార్క్, ఓల్డ్ రామచంద్రాపురంలో మీట్ మార్కెట్, రాయసముద్రం చెరువు సుందరీకరణ, చెరువులో మురికినీటి మళ్లింపు పనులు, పలు కాలనీల్లో సీసీ రోడ్లు, అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ, ఓపెన్ డ్రెయిన్లు, కమ్యూనిటీ హాళ్లు, మహిళా సమాఖ్య భవనం, థీమ్ పార్క్ వంటి అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఈ అభివృద్ధి కార్యక్రమాల ద్వారా రామచంద్రాపురం డివిజన్‌లో మౌలిక సదుపాయాలు గణనీయంగా మెరుగుపడతాయని ప్రజాప్రతినిధులు పేర్కొన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు పుష్ప నాగేష్, సింధు ఆదర్శ్ రెడ్డి, జోనల్ కమిషనర్ హేమంత్ , అధికారులు పాల్గొన్నారు.


