సీఎం విజయ్, సినీ ప్రముఖుల నివాళి
చెన్నై: చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ తమిళ దర్శకుడు భారతీరాజా (84) కన్నుమూశారు. గత కొంతకాలంగా వృద్ధాప్య సమస్యలు, అనారోగ్యంతో చికిత్స పొందుతున్న ఆయన బుధవారం చెన్నైలోని తన నివాసంలో కన్నుమూశారు. ఆయన అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించనున్నారు. 1941 జులై 17న జన్మించిన భారతీరాజా 1977లో వచ్చిన తమిళ మూవీ ‘16 వయథినిలే’ (తెలుగులో పదహారేళ్ల వయసు) తో దర్శకుడిగా మారారు. ‘కొత్త జీవితాలు’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. తెలుగులోనూ పలు క్లాసిక్ సినిమాలను తెరకెక్కించి లెజెండరీ డైరెక్టర్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన దర్శకత్వం వహించిన సీతాకోకచిలుక, ఆరాధన, జమదగ్ని సినిమాలు ఇండస్ట్రీలో బ్లాక్ బస్టర్లుగా నిలిచాయి. ఆరు జాతీయ అవార్డులు, నాలుగు ఫిల్మ్‌ఫేర్ పురస్కారాలు అందుకున్నారు. ‘సీతాకోకచిలుక’కు నేషనల్ అవార్డుతో పాటు, ఉత్తమ దర్శకుడిగా నంది పురస్కారాన్ని అందుకున్నారు. ‘మంగమ్మగారి మనవడు’కు కథను, ‘పల్నాటి పౌరుషం’ చిత్రానికి స్క్రీన్‌ప్లేను అందించారు. ఇటీవల మోహన్‌లాల్ నటించిన ‘తుడురమ’ సినిమాలో భారతీరాజా చివరిసారిగా సిల్వర్ స్క్రీన్‌పై కనిపించారు. ఆయన చేసిన సేవలను గుర్తించిన భారత ప్రభుత్వం 2004లో పద్మశ్రీ పురస్కారంతో గౌరవించింది. కడవరకు ఆయన సినిమా కోసమే జీవించారు. సినీ కళామతల్లికి ఎనలేని సేవలందించారు.
కుమారుడి మరణంతో మనస్థాపం…
గతేడాదిలో ఆయన తనయుడు, నటుడు మనోజ్ భారతీరాజా (48) గుండెపోటుతో మృతి చెందారు. దీంతో ఆయన కుంగిపోయారు. ఈ విషాదం తర్వాత చాలామంది ప్రముఖులు ఆయనను కలిసి పరామర్శించారు. ఇటీవల నటి రాధిక కూడా ఆయన్ని కలవగా… ఆమె నటించిన ‘తాయ్‌కిళవి’కి నేషనల్ అవార్డు వస్తుందని ప్రోత్సహించారు. ‘వస్తే మీ పాదాల దగ్గర పెడతాను’ అని ఆమె అన్నారు.
భారతీరాజా ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు రూపొందించిన ఆయన మృతి పరిశ్రమకు తీరని లోటు అంటూ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెడుతున్నారు. తమిళనాడు సీఎం జోసెఫ్ విజయ్ చెన్నైలోని భారతీ రాజా నివాసానికి వెళ్లె ఆయన భౌతిక కాయానికి నివాళులర్పించారు. ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ‘ప్రముఖ దర్శకులు భారతీరాజా కన్నుమూశారని తెలిసి చింతించాను. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. తమిళ, తెలుగు చిత్రాలపై భారతీరాజా తనదైన ముద్ర వేశారు. గ్రామీణ నేపథ్యం, పల్లె ప్రజల జీవనం, ప్రేమానుబంధాలను చూపించడంలో ఆయన శైలి ప్రత్యేకమైనది. అన్నయ్య చిరంజీవితో ‘ఆరాధన’ చిత్రం రూపొందించారు. భారతీరాజా కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను’ అని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. ‘మనందరికీ ఎంతో ఇష్టమైన దర్శకుడు భారతీరాజా ఇక మన మధ్య లేరని తెలిసి తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాను. ఆయన మరణం తమిళ చిత్రసీమకు తీరని లోటు. నన్ను రెండు జడలతో చూపిస్తూ ఒక సినిమా చేద్దామని ఆయన ఎప్ప్పుడూ అనేవారు. ఆ కల ఇక తీరని కలగానే మిగిలిపోయింది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నా’ అంటూ నటి ఖుష్బూ తెలిపారు.
దర్శకుడు ‘భారతీరాజా’ కన్నుమూత
- Advertisement -
RELATED ARTICLES


